వినమరుగైన

చిల్లరదేవుళ్ళు-దాశరథి రంగాచార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణం జన్మనిచ్చిన గొప్ప సాహితీమూర్తులలో గణనీయులు ఈ అన్నదమ్ములు..
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలవరించి ఆ గడ్డనేలిన నవాబు నెదిరించి పోరాడి, ఉద్యమాలలో పాల్గొని అనేక పాట్లు పడిన మహాకవి పద్య దాశరథి అన్నగారయితే, ఆ అన్నకు తగిన తమ్ముడీ గద్య దాశరథి రంగాచార్యులు. తెలుగు నవలా సాహితీ విహాయసంలో తళుకులీనే నవలా నక్షత్రాలను పొదిగిన ఉత్తమ రచయిత. ఉత్తమ రచయితకు- ముఖ్యంగా సామాజిక నవలా రచయితకు- తన సమకాలీన సమాజ జీవితమే- సమకాలీన చరిత్ర మాత్రమే- సమకాలీన సంఘటనా సముచ్ఛయమే- కథా వస్తువు. సామాజిక వాస్తవికత నవలా శరీరానికి ప్రాణవాయువు. రచయిత తన జీవలక్షణం కొద్దీ ఆ వాస్తవ ఇతివృత్తానికి నవలారూపం ఇస్తాడు. కొందరి రచనలలో నిర్మాణచాతురి ముఖ్యంగా కానవస్తుంది. ఈ లక్షణం మాలపల్లి వంటి నవలల్లో గమనించగలం. వాటిలో నిర్మాణచాతురి పాఠకులను అబ్బురపరుస్తుంది. మరొకరి రచనలలో కొంత కల్పనా చాతురి గమనించగలం. నోరి నరసింహశాస్ర్తీ, అడవి బాపిరాజు వంటి రచయితలలో ఈ కల్పనా చతురి పాఠకులను ఆకర్షిస్తుంది. మరికొందరు రచయితలు కథనక్రమంలో అక్కడక్కడ అందాలు అద్ది పాఠకులను అలరిస్తారు. పిలకా గణపతి శాస్ర్తీ వంటి వారీ కోకు చెందుతారు.
ఆధునిక కాలంలో రాజకీయ నవల అనీ, వాస్తతవిక రాజకీయ నవల అనీ కొందరు పేర్కొంటున్న నవలల కోవకు చెందిన వాటిలో ఉత్తమశ్రేణికి చెందిన నవల దాశరధి రంగాచార్య రచించిన చిల్లరదేవుళ్లు. ఈ కోవకు చెందిన రచయితలకు వాస్తవమే- ఏ మాత్రమూ కల్తీలేని వాస్తవమే-అది ఎంత నిష్ఠురమైనదైనా సరే ఎంత కఠోరమైనదైనా సరే ఎంత ఆబాధాకరమైనదైనా సరే- అత్యంత ముఖ్యం. ఫక్తు వాస్తవ చరిత్రనే ఆధారంగా చేసుకుని ఇతివృత్తంగా గ్రహించి నవలా రూపం ఇస్తారు. నిజానికి ఇది కత్తిమీద సాము వంటి సాహస ప్రక్రియ. ఇందులో రచయిత కల్పన చాటున దాక్కునేందుకు వీలేలేదు. రచనాక్రమంలో అక్కడక్కడ సొంత గొంతు వినిపించకపోదు కాని మొత్తంమీద ఈకోవకు చెందిన రచనలలో త్రాటిమీద నడక వంటి అమిత జాగ్రత్త తప్పనిసరి.
ఉన్నవ వారి మాలపల్లి, అడవి బాపిరాజు గారి నారాయణరావు, కోనంగి, విశ్వనాథ వారి వేయిపడగలు వంటి నవలలో కూడా ఆనాటి సమకాలీన రాజకీయాలు సామాజిక సమస్యలు చోటుచేసుకోవడం చూడవచ్చు. కాని అవే అందులో ఇతివృత్తం కాదు. వాటిలో రచయితల దృష్టి స్పష్టం. కాని చిల్లరదేవుళ్లు నవలలో రచయిత సాధించింది వేరు. అందులో ఇతివృత్తమే ఆనాటి ఒక ప్రాంతపు జన జీవితం. దేశంలో ఆనాడు సాగుతున్న జాతీయోద్యమం, సంఘ సంస్కరణోద్యమం, స్వాతంత్య్రోద్యమం. అన్ని భాషలలోని కవులనూ రచితలనూ కుదిపివేశాయి. వాటి నుంచి బాధ్యత నెరిగిన రచయితలెవరూ తప్పించుకోలేదు. అద్భుతమైన స్పృహతో స్ఫూర్తితో అక్షరోపాసన చేసి అమూల్య రచనలు సృష్టించారు. సరిగ్గా అప్పుడే రాజకీయ నవల లేక సమకాలీన వాస్తవిక నవల జన్మించిందని చెప్పాలి.
అప్పుడు తెలంగాణ ప్రసక్తి ప్రత్యేకంగా వస్తుంది. ఇది దేశంలోని అనేక ఇతర ప్రాంతాలవలె కాదు. అనేక ఇతర ప్రాంతాలలో బ్రిటిష్‌వారి పెత్తనం ఉండేది. ఇంకా అనేక సంస్థానాలలో రాజుల జమీందారుల పెత్తనం ఉండేది. కాని తెలంగాణ చరిత్రే వేరు. ఆ సంస్థానానికి సంబంధించిన వ్యవహారమే వేరు. అక్కడి ప్రజలు ఒక స్వాతంత్య్ర పోరాటమే కాక మరో పోరాటం చేయవలసిన పరిస్థితి. తెలంగాణకు అదొక బీభత్సకాలం. నిజాం క్రూర నిరంకుశ పద ఘట్టనల క్రింద నలుగుతున్న జన జీవితం వెలుతురులేని బ్రతుకులు.. తల ఎత్తేందుకు వీలులేని పరిస్థితులు. ఇక నోరెత్తడమే ఘోర నేరం. అటువంటి క్రూర పరిపాలనకు వ్యతిరేకంగానూ, తమ సొంత భాషా సంస్కృతుల పరిరక్షణ నిమిత్తమూ, రైతాంగ సమస్యల పరిష్కారం కోసమూ బహుముఖంగా జరిగిన పోరాటం యావద్భారత దేశాన్నీ ఆకర్షించింది. అక్షరాలా విప్లవమనదగిన పోరాటం అది. యావద్భారతంలోని మేధావులనూ, కవులనూ, రచయితలనూ ఆకర్షించిన పోరాటం అది. అపుడు తెలంగాణలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. ఎంతో రక్తం చిందింది. ఎందరో కటకటాలపాలై బాధలుపడ్డారు. అయితే ఎల్లప్పుడూ ఇటువంటి పోరాటాలలో అంతిమ విజయం ప్రజా సమూహానిదే అనే సత్యం ఇక్కడ కూడా నిరూపించబడింది.
- సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పెద్ద్భిట్ల సుబ్బరామయ్య