వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తరువాత సారళ్యం సాధించిన టెక్నిక్ ప్రయోగానికి సినీవాలి కావ్యం ఒక ఉదాహరణ. కాగా తెలుగు కవితా రంగంలో ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. గురజాడ ముత్యలసరానికి ధీటు అనిపించే తీరులో కూనలమ్మ పదాలు రచించారు. ఛందోలాక్షణికులు గుర్తించిన ఉదాహరణ కావ్య భేదాల్లో ఒకటయిన పద్ధతి రచించారు. తన శ్రీమతిని సంబోధిస్తూ ఆయన రచించిన మూడు వందల కందాలు కేరాత్రిశతి వచనకవితకు సాటిగా వాక్య కవితను ప్రయోగించారు. గాయాలు - గేయాలు వంటి వచన కవితా సంకలనాలు, ఎంచిన పద్యాలువంటి పద్య కవితా సంకలనాలూ మొదలయినవన్నీ ఆయన ప్రయోగాసక్తికి నిదర్శనాలే. రామాయణగాథ నేపథ్యంగా గ్రామాయణం అనే పెద్దకథరాసినా, సినిమా పాటలలో అన్నమయ్య పలుకుబడికి వ్యాప్తి తెచ్చినా సర్వత్రా ఆయన ప్రయోగశీలమే వ్యక్తమవుతుంది. గురజాడ గూర్చి ఆయన రాసిన విమర్శవ్యాసాలు ఆయన పరిశోధనాసక్తికి నిదర్శనాలు. ఆ పరిశోధనాసక్తి విస్తరించి ఆయన చేసిన చివరి బృహత్ ప్రయోగం బహుశః సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచనే కావచ్చు. కాగా, ఆయనమిగతా సాహిత్య కృషి అంతా ఒకెత్తయితే, ఈ సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచన మరొక ఎత్తు.
నిజానికి సాహిత్య చరిత్ర రచించటమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. గురజాడ, శ్రీరామమూర్తిగారు, కందుకూరి వీరేశలింగం గారి వంటివారు మొదలుకొని సాగిన సాహిత్య చరిత్ర రచనా కృషిని, గ్రంథాలను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం స్పష్టపడుతూనే వుంది. దేశ చరిత్ర రచనకన్నా సాహిత్య చరిత్ర రచన క్లిష్టమైన వ్యవహారం. ఆరుద్రగారే రెండవ ముద్రణ మనవి మాటలలో అన్నట్టు ఒక భాష మాట్లాడే ప్రజల దేశ చరిత్ర, సాంఘిక చరిత్ర, సాహిత్య చరిత్ర ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. అయితే ఈ పెనవేసుకొనే తీరేమిటి? ఈ పెనవేసుకోవటాన్ని ఏ విధంగా సమన్వయించుకోవలసి ఉంటుంది? ఎంతవరకు సమన్వయం కుదురుతుంది? వంటి అంశాలను నిశితంగా అనుశీలించుకోవటం ఒక పెద్ద సమస్య. దీనితోబాటు సాహిత్య చరిత్ర రచనాప్రణాళికలో కాల విభజన, లేదా యుగ విభజన వంటి వౌలిక సమస్యలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. దేశ చరిత్ర, సాంఘిక చరిత్రల రచనా విషయం ప్రస్తుతానికి అట్లా ఉంచితే, సాహిత్య చరిత్రల రచనలో యుగ విభజనకు వౌలిక సూత్రమేమిటన్నది మొట్టమొదట నిర్థారించుకోవలసిన అంశం.
కొందరు ఆదిమకవులు, మధ్యయుగకవులు, ఆధునిక కవులు అని విభజించారు. ఇట్లాంటి సందర్భంలో రాస్తున్నది కవుల చరిత్రనా? లేక సాహిత్య చరిత్రనా? అన్న అంశం స్పష్టపరచుకోవలసి వుంటుంది. కొందరు రాజులనూ, రాజ వంశాలనూ బట్టి యుగ విభజన చేస్తే, మరికొందరు నన్నయ యుగం, తిక్కనయుగం లేదా కవిత్రయ యుగం, శ్రీనాథ యుగం ఇత్యాదిగా విశిష్టులయిన కవుల పేరుమీద యుగ విభజన చేశారు. ఇంకొందరు ప్రక్రియాపరంగా అంటే పురాణ యుగం, ప్రబంధ యుగం అంటూ యుగ విభజన చేశారు. కాగా, ఏ విధమైన విభజన చేసినా, అట్లా ఎందుకని యుగ విభజన చేయవలసి వచ్చిందో నిరూపించుకోవటం అవసరం.
*
సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కోవెల సంపత్కుమారాచార్య