వీరాజీయం

‘పోస్టర్ల పోరు’కు ఇది సమయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాయుధ శస్త్ర చికిత్స’ జరిగి, తత్ఫలితంగా మనం అనకపోయినా- తనని తాను మన ‘శత్రుదేశం’గానే పరిగణించుకుంటున్న పాకిస్తాన్- అంతర్జాతయంగా ‘్ఛ’త్కారాలు అందుకుంటూ, ఏకాకిగా మిగిలిపోతానని ఇపుడు అల్లాడుతోంది. ‘అక్కడ ప్రజాపాలకులకీ, సైనిక నియంతలకీ మధ్య లుకలుకలు బయలుదేరాయా?’ అంటూ పాకిస్తాన్‌కు చెందిన ‘డాన్’ పత్రికలో- అంత పెద్ద వాస్తవిక గాథను సిరిల్ అత్మిదా అనే జర్నలిస్టు ‘ఎక్స్‌పోజ్’ చేస్తే- అతణ్ణి దేశం వదిలిపోవద్దు అన్న ఆంక్ష పెట్టడం మినహా, జైల్లోకి పంపలేకపోయిన దయనీయ స్థితిలో నవాజ్ షరీఫ్ గవర్నమెంటు చతికిలబడుతూ ఉంది. ఇదీ పాకిస్తాన్‌లో తాజా దృశ్యం.
ఐతే- మంచికో, చెడుకో- కొంత ప్రలోభానికి లోనై అధికార పార్టీ వారు ఓ నాలుగు పోస్టర్‌లు వేసి, సర్జికల్ దాడుల విషయంలో తమ పార్టీని ఆకాశానికి ఎత్తేసిన నేరానికి- ‘నేరమేనా?’ అంటే.. అలానే అనుకుందాం. దీనికి చిన్నాచితకా ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అయిపోయి- ‘అసలు సర్జికల్ స్ట్రయిక్స్ జరగలేదూ? మాకెందుకు చెప్పలేదూ? ఉగ్రవాదుల శవాలు మాకెందుకు ప్రత్యక్షంగా చూపెట్టలేదు?’ అంటూ, ఊడిపోకుండా వున్న ఆ ఒక్క తర్జనని వూపేయడం చూస్తే- ఓ వైపు దుఃఖం, మరోవైపు జాలి కూడా కలుగుతున్నాయి.
దీనికంతటికీ అసలు కారణం- అవతల సమీపిస్తున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల అసెంబ్లీ ఎన్నికలు. దిక్కుమాలిన ఓట్లకోసం- మీడియా వున్నదిగా- ‘ఆవుకు తోక ముఖ్యమా? మూతి ముఖ్యమా?’ అంటూ ఓ చర్చ పెట్టి- ‘తోక ముఖ్యం’ అనేసరికి- ‘‘అమ్మో! ఆవు అతి పవిత్రం ఒక వర్గానికి కనుక’’- దాని మూతిని కించపరిచావు. ‘రెలిజియస్ సెంటిమెంట్స్ దెబ్బతీస్తున్నావ్’ అని మరొకడు అంటూ వుంటే- అసలు విషయాన్నొదిలేసి గవర్నమెంట్ ‘క్రెడిట్’ తీసుకుంటే- గవర్నమెంట్‌లో వున్న పార్టీకి వోట్లు పడతాయి కనుక అంటూ మొగసాలకెక్కిన ప్రతిపక్షాల విన్యాసాలు- ‘వడ్డించిన’ విస్తరి ముందు కూర్చున్నవాళ్లకి కూడా పదార్థాలు తినలేనంత - ‘యిది’ కలుగుతున్నది.
దేశ సార్వభౌమాధిపత్యపు ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత- అధికారంలో వున్న పార్టీది మాత్రమేనా? అందరిదీ కాదా? దేశ భద్రతను, బోర్డర్‌ని పరిరక్షించవలసిన ‘చేతులు’ జవాన్‌లవి అయితే- అందరికీ పేరు పేరునా- ఫోన్‌లమీద కూడా జేజేలు పలికాడుగా- ప్రధానమంత్రి మోదీ గారూ. నిన్నగాక మొన్న పార్లమెంటరీ స్థారుూ సంఘానికి కూడా సైన్యాధికారి నేరుగా నివేదికనందించాడుగా? అలా కాదు, ‘అదంతా ప్రెస్ రిలీజ్‌లోపెట్టి, విడుదల చేయండి’- అంటే?- దేశభక్తి ముఖ్యం కామ్రేడ్స్!
ఒక ఉదంతం- జమ్మూ కాశ్మీర్‌లో తన్వీనర్ అహమ్మద్ అనే డిఎస్‌పి మన శత్రువుల కమాండర్‌లకి- ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తులు, ‘వ్యూహకట్లు’ ఉన్నాయో యించక్కా ‘వాట్సప్’ ద్వారా మెసేజీ ఇచ్చేశాడట. ఏమంటే- ‘కంట్రోల్ రూమ్‌కి ఫోన్ వచ్చిందండీ! కమాండర్లం మాట్లాడుతున్నాం. వివరాలు ఇయ్యి భారుూ’ అన్నారుట. అంటే, అడిగేవాళ్లు మన కమాండర్లో- కాదో తెలుసుకోవద్దా? ఇలా ఇంటిగుట్టు లంకకు చేటుగా కొంతమంది మాట్లాడటాన్ని మనం ఎలా హర్షిస్తాం?
అంచాత.. అయినదేమో అయినదీ అనుకుని, నోర్మూసుకుని అవతల చైనా బాణాసంచాని బోయ్‌కాట్ చేసే పోస్టర్‌ల ఉద్యమాలు తియ్యొచ్చునుగా! ప్రతిపక్షాలు!
ఇంతకీ, రుూ ‘పోస్టర్’లకి మభ్యపడి, తమ ‘మూల్య’ (అవునండీ! అక్షరాలా మూల్యం) మయిన వోట్లు వేసే వోటర్లు మన రాష్ట్రాలలో ఎక్కడైనా వుంటారా? అంచేత, దేశ భద్రత- ప్రతిష్ఠకి చెందిన విషయాలలో ‘సంయమనం’ అవసరమైతే వాగ్ధాటిని కూడా తగ్గించాలి.
అవతల అమెరికా 2009లోనే ఇండియాతో చేసుకున్న ‘టెర్రరిస్టు అణచివేత ఉద్యమంలో సహకరిస్తాం’ అని మనతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవిస్తూ పాకిస్తాన్‌ని ముక్క చీవాట్లు పెడుతున్నది. అది గమనించాలి. దురాక్రమణకు లోనై డెబ్భై సంవత్సరాలుగా మగ్గుతున్న మన కాశ్మీర్ భూభాగంలో- అందాకా ఏర్పాటుచేసుకున్న సోకాల్డ్ వాస్తవాధీన రేఖన దాటి- టెర్రరిజం స్థావరాల్ని ‘కొట్ట’డాన్ని అందరూ హర్షిస్తున్నారు.
చివరికి కడుపు మండిపోయి, అమెరికాలో వున్న పాకిస్తాన్ దౌత్యాధికారి అమెరికా అధ్యక్షుడు ఒబామాని ఆడిపోసుకుంటూ- ‘ఇక నాలుగు రోజుల భాగ్యమే- వైట్ హౌవుస్‌లో ‘గెస్ట్‌గిరీ’ ముగుస్తుంది.. ఒబామా బారాక్‌కి’ అంటూ ఎద్దేవా చేశాడు.
‘నా నెత్తిమీద కోటి డాలర్ల బహుమతి వున్నది. అయినా ననే్నం చెయ్యగలిగారు?’ అని అమెరికాని వేళాకోళం చేస్తున్న అజర్ అనే టెర్రరిస్ట్ పాకిస్తాన్ గొంతులో మరో బిన్ లాడిన్ అవుతాడు. ‘మీకు చేతగాకపోతే మేం నేరుగా రంగంలోకి దిగుతాం’ అంటోంది అమెరికా.
మనవాళ్లకి ముంబయి దాడులు జ్ఞాపకానికి రావడం లేదా? పోస్టర్‌ల విషయంలో ప్రభుత్వ, పక్షాలదీ ఇద్దరిదీ తప్పే-
‘నేనూ, బావగారూ కలిసి యిరవై ఒక్క రోజులు ఉపోషం వున్నాం’’ అన్నదట వెనకటికో మరదలు. తాను చేసింది ‘ఒక్క రోజు’, బావగారు చేసింది ఇరవై రోజులూ ఉపవాసం. అలాగ క్షణక్షణం ప్రాణగండం గల దుర్భర స్థితిలో సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన ఆర్మీకి ‘జై’ అనకుండా, అదంతా మా వీరత్వమేనంటూ రాజకీయ పార్టీలు గోడలకెక్కడం- పైగా పోస్టర్లకంటే చాలా సెన్సిటివ్‌గా వున్న మన దేశంలో తప్పే! వెనకటికి తమిళనాడు గొప్పదనం అంతా జయలలితదేనంటూ- దుర్గగా, మేరీమాతగా పోస్టర్లు అచ్చోయించారు అన్నాడిఎమ్‌కె వాళ్లు. మైనారిటీల తరఫున కొందరు తగుల్కొని ‘‘హైం! మేరీమాతతో పోలికా’’ అంటూ పోస్టర్లు పీకించేశారు.
అంతర్జాతీయంగా ‘ఏకాకి’ అవుతున్న పాకిస్తాన్‌ను రక్తపాతరహితంగా సంస్కరించుకొనే అవకాశాన్ని ‘నీరుగార్చ’వద్దని మాత్రమే ప్రతిపక్ష యోధుల్ని దేశ ప్రజలు కోరేది. ఐనా రేపు పార్లమెంట్‌లో ఎంత గొడవ చేస్తారోనంటున్న సామాన్యుడి ఆవేదన కూడా ఒకటుంది. అది అలా పెట్టండి..
దిసీజ్ నాట్ ద టైమ్ ఫర్ పోస్టర్ వార్! *