వీరాజీయం

వానా వానా వల్లప్పా.. ఇక దయచెయ్యి చెల్లప్పా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏనుగు తొండం ధారలు- కుండపోతగా వానలు- దారిగాసి వీరబాదుడు బాదిన వర్షం- లాంటి మాటలు మజాగానే వుంటాయి. కాని అనుభవంలో ఇవి ఎంతగా హింసిస్తున్నాయో అనే మాటలతో దసరా పం డుగ ముందుదాకా దేశవ్యాప్తంగా జనాలు దీనాతిదీనంగా బాధలు పడుతున్నారు. యూపీ, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు- ముఖ్యంగా హైదరాబాద్, లక్నో, కలకత్తా, పాట్నా లాంటి నగరాలు కడగండ్లపాలైనాయి. శరదృతువు వచ్చింది.. అమ్మవారి పండుగలు.. జనావళికి పండగ సెలవులు.. అన్నీ నీరుగారిపోయాయి.
ఇదెక్కడి వానలురా బాబూ! ఋతుపవనాలు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయినా- ఇంకా ఊరుమీద చూరు కింద ఒక్కలాగే ఎడాపెడా వాయించేస్తున్నాయి. అక్టోబర్ 7 దాకా ‘మాకు ఎక్స్‌టెన్షన్’ ఇప్పించండి’ అన్నాడట వానదేవుడు. ‘వానదేవుడా నా బొంద..! వాన రాక్షసుడు, వాన దెయ్యం ఇంటా బయటా సెప్టెంబర్ నెలంతా నీట, కన్నీట మునిగి ఉన్నాం’’ అన్నది ఓ ఇల్లాలు. సాయంకాలం అయ్యేసరికి తగులుకుంటోంది. పిల్లలకి సెలవులు యిచ్చారు కనుక బతికిపోయాం కాని, లేకపోతే వాన పేరున కురుస్తున్న వరదలకి పిల్లలు వాళ్ళ ఆటోలతో పాటు కొట్టుకుపోయేవారేమోనని ఒక్క హైద్రాబాద్‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏమీ చేసేది లేక తెగ తిట్టుకుంటున్నారు.
ఆలస్యంగా వచ్చింది రుూ ఏడాది ‘మాన్‌సూన్’. ‘కమ్‌సూన్’ అన్నారు జనాలు. ఓ.కే.. వచ్చాను కాసుకోండిరా! అంది. ఆలస్యానికి వడ్డీతో పాటు బాకీ తీరుస్తోంది. నగరాల వీధులు బొరియలు కుంటలు, ఎగుడు దిగుడు పల్లాలు మాయాబజారులు. ఇప్పుడవి జలగర్భస్థ నరకకూపాలు అయినాయి. వ్యాపారం గోవిందా! పని పాటలు వినోద కాలక్షేపాలు జలార్పణం అంటూ ప్రజలు గోలపెట్టడం ఒక ఎత్తు అయితే, చేతికందిన కాయగూరలు, పంటలు కుళ్ళిపోతున్నాయని రైతుల వేదన. క్యాబేజీ, బీన్సు, బఠానీలు, టమాటోలు సరేసరి కుళ్ళిపోతున్నాయన్న గోల ఒక పక్క, ఆలస్యంగా వచ్చిపోయినా- గత నెలలో ఋతుపవనాలు కొట్టిన దెబ్బకి ఉల్లిపాయల ధరలకి రెక్కలొచ్చాయని మరోవైపు దుఃఖం. ఇరవై రూపాయలకు అమ్మిన ఉల్లిపాయలు ఎనభై పెట్టినా దొరకడం లేదుట.
ఉప్పువాడు ఉప్పు కరిగిపోయిందని ఏడిచాడు. పప్పువాడు పప్పు తడిసిపోయిందని ఏడిచాడు.. అన్నది వాన బీభత్సానికి ఓ సామెత. అది బాగానే వుంది. కాని బొండాలవాడు పొర్లిపొర్లి ఏడిచాడట. కాని కొబ్బరి బొండాలు ఏమి అవుతాయి? అవి వానకు కొట్టుకుపోయాయి. ఈసారి అవే కాదు. వాటి చెట్లుకూడా కొట్టుకుపోయాయి వానలకి. దసరా దశమికి వానలు తగ్గవుట.
దేశవ్యాప్తంగా రావణాసుర దహనం చేసేటందుకు మేడలు మిద్దెలు అంత ఎత్తు రావణుని బొమ్మలు రుూసారి మండవు. వానలో అవి తడుస్తాయి. పేపరుతోను, వెదురు బొంగులతోను చేస్తారేమో.. అవి కూడా తడిసిపోతాయి. ఎవరి గోల వారిది. కాని ఈ అతివృష్టి పంటచేలమీద, పరిశ్రమల మీద తీసే దెబ్బ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు కూడా కోలుకోదు.
ఈ దేశం మొత్తం మీద ఏటా కురిసే వానకన్నా యిప్పటికి ముప్ఫయి ఏడు శాతం ఎక్కువ వర్షాలుపడ్డాయి. వానలకి వాగులు, వంకలు చెలరేగిపోయాయి. నదీ నదాలు పొంగిపొర్లి వరదలై గ్రామాలమీద పడ్డాయి. ఈసారి హైద్రాబాదుకి మామూలుకన్నా నూటపదహారు శాతం వానలు ఎక్కువగా కురిశాయి. కురిసింది వాన నా గుండెలోన కాదు.. గుచ్చింది వాన గునపాలు నా గుండెలోన- అంటూ వాపోతున్నది జనావళి. ఆంధ్రాలో గోదావరి నదిలో కొట్టుకుపోయిన బోటు యింకా తేల లేదు. కన్నీటి మంటలు ఇంకా చల్లారలేదు. బిహార్‌లో వానల బీభత్సానికి నూటనలభై మందితో బోటు గల్లంతు అన్నారు. యూపీలో అధికారికంగా వరుణదేవుడికి నూట పాతిక మంది బలి. ఇలా దేశమంతటా సుదీర్ఘంగా వానలుపడుతూ వుంటే గవర్నమెంట్లు మాత్రం ఏం చెయ్యాలి?
తెలంగాణలో మామూలుగా 759 మిల్లీమీటర్ల చిల్లర వాన పడాలి. కాని ఈపాటికి 806మి.మీ. వానలు నమోదు అయినవి. అంటే యిరవైమూడు శాతం అధికం. సెప్టెంబర్ నెలలోనే తెలంగాణలో 241 మి.మీ. వర్షం కురిసింది. ఎవ్వరూ హర్షించలేకపోయారు. ఎందుకంటే యిది మామూలు వానకంటే యాభై శాతం ఎక్కువ. అలాగే ఆంధ్రాలో కూడా సెప్టెంబర్‌లో 230 మి.మీ వాన పడ్డదట. మామూలుగా అయితే ఈ టైముకి పడే వాన 152 మి.మీ. చిల్లర. ఇది కూడా యాభై శాతం ఎక్కువ.
ఇంకా రెండు రోజులు హైద్రాబాద్‌లో వానలు అన్నది గోడమీద రాత అయిపోయింది. ఖగోళ యానాలు ఎన్నిచేసినా, అంతరిక్ష కెమెరాలు ఎన్ని పెట్టినా- రేపటి మేఘం ఏ రాష్ట్రం మీద, ఏ వూరి మీద, ఏ వీధిలో కురిసి మొంచెత్తుతుందో చెప్పలేని స్థితి. అంతరిక్షాన్ని జయించాం. అడవుల్ని శాసించామని బీరాలు పలికే మనిషికి, ప్రకృతి వాన రూపంలోను, ఎండ రూపంలోనే వచ్చి సైజుకి కత్తిరించేస్తూ వుంది. సెప్టెంబరు 9నాటి వార్తలు జ్ఞాపకం పెట్టుకోండి. వానలు ధాటిగా లేవు. కాని ఎగువ ప్రాంతంలో ప్రధాన నదులు పొంగి యిలా తలాన్ని ముంచెత్తివేశాయి. మన రాష్ట్రాలలో ఆంధ్రా పరిస్థితి విచిత్రంగా మారింది. పైన కురిసిన వానలకి నదీనదాలు పొంగి గ్రామాలమీద పడి ముంచెత్తేయి. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు లాంటి ఉపనదులు సైతం వరదలై పారేయి. కృష్ణానదికి రెండోసారి వరదలు రాగా, వానలు వద్దుమొర్రో అన్న ఆర్తనాదాలు నలుదెసలా వెలిశాయి. ఇలా మనకి కడగండ్లు డబుల్ డోసులో తగిలాయి. సందట్లో సడేమియా అంటూ క్రికెట్ ప్రియులు అంతా తెగ ఉబలాట పడిపోతుంటే రాకరాక విజయనగరం దాకా వచ్చిన అంతర్జాతీయ క్రికెట్ పోటీ కొట్టుకుపోయింది.
బిహార్‌లో వానలు చూసి మనం ‘‘బెటర్’’అనుకోవాలి. వంద మంది మరణం అన్న రికార్డు అక్కడితో ఆగటం లేదు. వాన చావులు అంతటా ఎక్కువైనాయి. మామూలు వానలకే చేతులెత్తేసే మన యంత్రాంగం యింత చేటు వానలకు ఎలా తట్టుకుంది? కురిసిన వానలో పది శాతం నీటిని మాత్రం దాహార్తి అయిన ధరిత్రి పీల్చుకుంటుంది. మిగతాది వీధుల్లో, యిండ్ల గదులలో చాపకింద నీరులా చేరుతుంది.
1994 తరువాత మన దేశంలో యింత చేటు ఋతుపవనాలు వీచలేదు అని వాతావరణ పరిశోధనాసంస్థ భోగట్టా. పాట్నా పరిస్థితి హైదరాబాదు కన్నా దారుణం. అక్కడ హెలికాప్టర్ల నుంచి ఆహార పదార్థాల పొట్లాలు జారవిడుస్తున్నారు. హెలికాఫ్టర్‌ల సహాయంతో యిండ్లపై కప్పులమీద, అల్లాడుతున్న జనాన్ని కాపాడుతున్నారు. మన రాష్ట్రాలలో వానలు వెలిశాక, చావుదెబ్బతిన్న జనాల్ని ఎలా మళ్ళీ బతుకు రోడ్డుపైకి ఎక్కించాలి? అన్నదానిమీద కూడా ఉభయ ప్రాంతాల పాలకులు కలిసి ఆలోచించాలి. ముందస్తు జాగ్రత్తలమీద గట్టిగా ఆలోచించాలని ఓ బడ్డింగ్ జర్నలిస్టు అన్నాడు.
వానా వానా వల్లప్ప మా వాకిలి కాదు మా బ్రతుకులే తిరుగుతున్నాయి. ఇక వెళ్ళప్పా, చెల్లప్పా అంటున్నారు జనాలు.
రెయిన్ రెయిన్ గో ఎవే.. లెట్ దేర్ బి రెయిన్‌బోస్

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512