వీరాజీయం

కాలుష్యం కోరల్లో ఢిల్లీ విలవిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇంతకన్నా నరకం బెటర్.. ఇదొక గ్యాస్ చాంబర్..’ అని మన దేశ రాజధాని ఢిల్లీ మహానగరం గురించి ఆవేదనతో వ్యాఖ్యానించింది మరెవ్వరో కాదు- సాక్షాత్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం. కాలుష్యం కో రల్లో, పొరుగు రాష్ట్రాలు పెడుతున్న చొప్పదంటు పొగలో పంచేంద్రియాలు అల్లాడిపోతూ వుంటే హస్తిన ప్రజల దారుణ మారణ భీషణ యమ యాతనలను చూడలేక- న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, దీపక్‌గుప్తాలు కేసు విచారణ మొదలుపెడుతూనే కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ మొట్టికాయలు వేశారు.
ఇది దీర్ఘకాలిక సమస్య, ముదిరిన వ్యాధి అయిపోయింది. రెండేళ్ళ క్రితం ఒక విదేశ రాయబారి అమ్మడు- పొల్యూషన్ దెబ్బకి బెంగళూరు స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకుని ఢిల్లీ నుంచి వెళ్లిపోయింది. కోర్టువారు- ‘మన రాజధాని దీనావస్థకు విదేశాల్లో జనం నవ్వుతున్నారు తెలుసా?’ అని ప్రశ్నించారు. బడిపిల్లలకి ‘మాస్కులు’ పంచడం లేదా స్కూళ్లు మూసెయ్యడం వంటివి తాత్కాలిక ఉపశమనాలే గాని వ్యాధి నివారణోపాయాలు కావు. ‘పొగ’ జాస్తిగా వున్నదని సెలవులు ప్రకటించడం, ఇళ్లలో ఉండమనడం ఇదేనా పరిష్కార మార్గం? ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా విషయాల్లో స్వేచ్ఛ, సమర్ధత కొరవడి వున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టువారే మిగతా రాష్ట్రాలలో కాలుష్య రక్కసి ఆగడాలను పరిశీలించాలని అనుకోడం సామాన్యుడికి ఎంతో ఊరట. ‘స్వచ్ఛ భారత్’లాగే కాలుష్య రహిత పర్యావరణం అనే ఉద్యమం రావాలి. రాజధానిలో సాధారణ జనం సైతం తాము కూడబెట్టుకున్న ప్యాకెట్ మనీని రకరకాల మాస్క్‌ల మీద, వాసన పరికరాల మీద పోగొట్టుకుంటున్నారు. నగరంలో ఆక్సిజన్ బార్‌లు- ఆమ్లజని సరఫరా షాపులు లేచాయి. ప్రాణవాయువు చాలక ఆక్సిజెన్ బార్లవైపుజనం ఎగబడుతున్నారు. ఓ పావుగంట ఆక్సిజన్ పీల్చుకోడానికి ఈ దుకాణాల వాళ్ళు మూడువందల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. గాలిలో ఆమ్లజని చాలినంత లేదని ఎవరన్నారు? వేరే విషవాయువులు, ఊపిరి ఆడకుండా చేసే పొగమంచు ఇవీ శత్రువులు. ఈ మాదిరి చిట్కాలు కంటితుడుపులేనని వైద్యులు ఎందరో చెబుతున్నారు. అసలు సమస్య పొరుగు రాష్ట్రాలు పెట్టే మారణ ధూమ దాడి. వారిని బుజ్జగించుతూ ఏవేవో ధన వస్తు సహాయాలు ప్రకటించినా ఈ ఏడాది ఇప్పటికే గత ఏడాదికన్నా ఈ దహనకాండ ఎక్కువైంది. పరస్పర నిందారోపణలతో అధికార యంత్రాంగాలు తప్పించుకు తిరగాలని చూస్తున్నాయి.
ఈ సమస్యను రాజకీయం చెయ్యొద్దని అత్యున్నత న్యాయస్థానం కోరిందంటే- అలసత్వం ఎంతగా ప్రబలిందో గ్రహించవచ్చు. నీ వేళ్లను నీ ప్రత్యర్థి వైపు ఎక్కుపెడితే- అవతలివాడు కూడా మూడు వేళ్ళు నీ మీద ఎక్కుపెట్టడా? నగరంలో కాలుష్య శుద్ధి కేంద్రాలను తక్షణం స్థాపించాలని ధర్మాసనం ఆవేదనగా అభ్యర్థించింది. చైనాలో సాంకేతికపరంగా కాలుష్యశుద్ధి కేంద్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. 2014లో ఆ దేశం మనకన్నా దయనీయ స్థితిలో వుండేది- కోలుకోలేదా? అని కోర్టు సూటిగా అడిగింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి- ‘ఓ పదమూడు చర్యలు మేము తీసుకున్నాము సార్..’ అంటూ ఏకరువు పెట్టాడు. కానీ ఫలితం ముఖ్యం కదా? అసలు లోపం ద్వంద్వ పెత్తనంలోనే వున్నది అని అధికారి చెప్పడం సంబంధిత శాఖలవారు గమనించాలి. ఇప్పుడైనా కమిటీ వేసుకుని చర్చించి వచ్చేనెల మూడు నాటికి నివేదిక ఇవ్వమన్నది ధర్మాసనం. కోర్టు ఆర్డర్లు అమలు చెయ్యకపోతే చర్య తీసుకునే యంత్రాంగం లేదు కనుక అధికారులు బతికిపోయారని అన్నాడో చిరుకప్ప లాయరు.. కాని కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించే అధికారులను కటకటాల వెనక్కి పంపించే అధికారం న్యాయస్థానాలకు ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాయుకాలుష్యం విషయంలో చాలా ప్రయోగాలు చేశాడు. రోజువిడిచి రోజు మీ ఇంధన శకటాలని రోడ్డుమీదకి తీసుకుని రండి అన్నాడు. అన్ని పార్టీల వారూ ఈ బాధని ఒకేలాగా అనుభవిస్తున్నారు. అంతా ఉమ్మడి పోరాటం చెయ్యాలి. కాగా రాజకీయానికి అతీతంగా కేంద్రం పూనుకొని రంగంలోకి దూకవచ్చు.
అవతల రోడ్డుమీద ఓ ఊరేగింపో, ప్రొటెస్టు యాత్రో కనబడితే చాలు- అసెంబ్లీలో, పార్లమెంటులో స్పీకరు పీఠం దాకా వీరావేశంతో దూసుకుపోయే మాన్య మెంబర్ల ముక్కులకు విషవాయువులు తాకడం లేదా? రిమోట్ పట్టుకొని కర్నాటకం మహాసంకటం వగైరాలను పరిష్కరించ పూనుకొంటున్న మోదీ, అమిత్ షాలు వుంటున్నదెక్కడ? పంట వ్యర్థాలను రాజధాని గుండెల్లో మండించడం ఒప్పు అని ఏ మానవ సంక్షేమ చట్టంలో ఉంది? మన చెత్తను ఎదుటివాడి గుమ్మంలో పోస్తేనే కర్రుచ్చుకుంటాడు! ఈ పంట వ్యర్థాల పొగ నుంచి హస్తినను కాపాడవలసిన బాధ్యత అందరిదీ. ఈ కర్తవ్యం నిర్వహిస్తే కొంతైనా కాలుష్యం తగ్గుతుంది. ప్రమాద స్థాయిని మించి వందల రెట్లు గాలిలో కాలుష్య పిశాచాలు ఏళ్ల తరబడి వీరవిహారం చెయ్యడం సమర్ధనీయం కాదు. సుప్రీం కోర్టు జనహితం కోరి ఢిల్లీలోని కాలుష్యం సమస్యను ‘సూమోటో’గా తీసుకుంది. ఢిల్లీలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఓ వార్నింగుగా తీసుకోవాలి.
ఇట్సే నేషనల్ ఎమర్జెన్సీ.. సెంటర్ షుడ్ ఇన్వాల్వ్!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512