వీరాజీయం

వార్తయందు సంచలనము వర్థిల్లుచునుండు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలనం అంటూ ఉంటారు మా వాళ్లు. ఇదో ఊత పదమే కాదు- వార్తకి వూతం కూడాను. అదే లేకపోతే, అది ఏ మీడియా అయినా దానికి పలుకుబడి ఉండదు. ఈ వారంలో- వార్తల్లో ఈ ముగ్గురు ముగ్గురే గాని వాళ్లు ఒకే మాదిరి దినుసు కాదు- ఎరక్కపోయి పోయి ఇరుక్కున్నదొకరైతే, ఇరుక్కుపోయి తప్పించుకోవాలనుకుంటున్నది ఇంకొకరు అయితే ఎరిగి ఎరిగి కావాలనే కూర్చుని పోలీసు కుర్చీలో ఇరుక్కుపోయింది మరో ‘గాడ్‌లేడీ’- ఏది ఏమైనా, సంచలనాత్మకమైతేనే మన దృష్టిలో అది మార్కెట్ వాల్యూ ఉన్న వార్త. నన్నయ్య గారి కాలంలో వార్తయందు జగము వర్ధిల్లుతుంది అనుకున్నాడా బ్రాహ్మడు కానీ వార్తయందు జగడము మాత్రమే వర్ధిల్లు అన్నాడు విలేఖరుల ఆదిగురుడు ‘కలహప్రియుడు’ నారద మహర్షి. సదరు కలహం లోక కళ్యాణం కోసమే అయినా సంచలనం ఒక ‘కెటలిస్టు’ అనుకోండి. సరే, ఈ ముగ్గురు ఎవరన్నది మీ కెరుకే. నాన్న కూచిగా చెప్పుకుంటున్న దేవాంతకురాలు ఒకతి అయితే- కుర్చీ చూడంగానే అది నాకే అనుకుని ‘కూరుచున్నా’ నంటూ ఢిల్లీ పోలీసు స్టేషన్లో పోలీసు అధికారి కుర్చీలో విరాజమానురాలై సదరు పోలీసు అధికారి మెడలో తన వోణీ తీసి వేసిన లీలామోహిని ‘రాధామా’ కథ వేరు. డైలాగులొగ్గితే చాలు మనం - చప్పట్లే చప్పట్లు అనుకొని పప్పులో కాలేసిన సినిమాస్టార్ ప్రకాష్రాజ్ - కథ నేరుగా- రీల్ లైఫుకీ రియల్ లైఫుకీ తేడా చూపెట్టింది.
పేరు ఎలా వస్తుందిరా? పేరిశాస్ర్తీ అంటే పేరున్న వాణ్ణి తిట్టరా సూరి శాస్ర్తి! అన్నాడట అల్లగా, నిన్న కమలహాసన్, మొన్న రజనీకాంత్ డైలాగులు పేల్చగా లేనిది తనకేమీ తక్కువ? విలన్గా కొండకొచో హీరోగా మరకచో హాస్యాగాడిగా సరేసరి ప్రజల హృదయాలను చూరగొన్న ప్రకాష్‌రాజ్ అంటే ఐదు నేషనల్ అవార్డులు సాధించుకున్న మహానటుడు. కానీ, వెండితెర (మీద) వేరు వేదిక వేరు. నేను ప్రధానమంత్రి మోదీ కన్నా, డబుల్ (యుపిలో) రోల్ చేస్తున్న యోగి కన్నా దొడ్డ నటుడ్ని అనుకున్నాడు. అనుకుంటే తప్పులేదు కానీ - గట్టిగా అనేశాడు. మోదీగారి వౌన నటన చూస్తూ ఉంటే - వొళ్లు మండిపోతోంది - నా జాతీయ అవార్డులు అయిదు వాపస్ ఇచ్చేద్దామనిపిస్తోంది అని కూడా అన్నాడు. సమయం సందర్భం కూడా కలిసి వచ్చినట్టు లేదు పాపం! యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీటింగుకి వెళ్లి అక్కడ జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్యమీద కన్నడంలో గంభీర కంఠీరవుడై గవర్నమెంటుని ఏకేశాడు. దాన్ని మీడియ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు తర్జుమా చేసి గుద్దేశారు. ఇరుకున పడ్డాడు. రీ టేకుల్లేని రంగస్థలమిది పాపం! గౌరీ లంకేశ్ ఏ భావ జాలానికి సంబంధించినది అన్నది ఎవరు ఆలోచించినా అది వేరు కానీ జర్నలిస్టు జాతి యావత్తు ఆమె పట్ల జరిగిన పిరికి హత్యాకాండకు ఒకలాగే కుమిలి ప్రతీకారం ఆ హంతకులకు మరణశిక్ష పడాలనే తపిస్తున్నారు. ఆమె కలం ఆయుధంగా ప్రయోగించిన వీరనారి- ఒక్క సెంటీమీటరు ప్రకటనకి కూడా దేబరించకుండా- పదిహేను సంవత్సరాలు గౌరీలంకేశ్ పత్రికను ప్రత్యర్ధుల గుండెల్లో మరఫిరంగిలాగ పేల్చిన ‘సాగా’ ఆమె జీవితం. కానీ ట్వీట్స్‌లో ఆమె హత్యను ఎవరో ఎంజాయి చేస్తున్నారని- నువ్వు ప్రధానమంత్రిని తప్పుపట్టడం వివేకవంతమయిన పనేనా? ట్వీట్స్‌ఇవ్వడమే కానీ జవాబులు ఇస్తో కూర్చుంటే ప్రధాని పరిపాలనా చక్రం ఎలా తిరుగుతుందీ? ట్వీట్స్‌లో నిన్ను తిడుతున్నారన్న ఆరోపణ కన్నా ముఖ్యం ఈ కిరాతక హత్యమీద జరిగే దర్యాప్తు కదా? వాళ్లు ప్రధాని అనుయాయులే నువ్వనట్టు అయినంత మాత్రాన వాళ్లని మనం హంతకులకు బాసట ఇచ్చిన వారు అనుకుంటే? పోనీ అలా నేరుగా అదే ట్విట్టర్‌మీద రీపాటీ ఇవ్వాలి. శ్రీమతి గౌరీలంకేశ్ వెనుకటికి ఒకసారి డిఫమేషన్ కేసులో ఆరుమాసాల జైలు శిక్ష పడ్డ ఆమె మనోధైర్యం ‘కలం-చేవ’ చెక్కు చెదరలేదు. పంచ్ డైలాగు వేశాడు శ్రీ ప్రకాశ్- నేను మహా నటుడ్ని కనుక ఎవరు నటిస్తున్నారో ఎవరు నటించడం లేదో నాకు తెలుస్తుంది అన్న ప్రకాశ్‌రాజ్ నోరు జారాడు. ‘నా అవార్డులు తిరిగి ఒక ప్రొటెస్టుగా వాపసు ఇచ్చేస్తాననిమాట వరసకి అన్నానే గానీ- అమ్మో! నా కష్టార్జితం నేనివ్వ నేనివ్వనంటూ నాలిక్కరుచుకుంటున్నాడు ఇప్పుడు. అతనొక టీవీ ప్రకటన ఇస్తూ ఉంటాడు తెలుసుగా- ‘ముందు చూడు, ఆనక పరిశీలించు అప్పుడు ఒక నిర్ణయం తీసుకో’ అంటూ కారుమీద-అల్లాగే, గౌరీ సోదరుడు ఇంద్రజిత్ చెప్పినట్టు జర్నలిస్టులందరి మనసులను కలవరపరిచిన ఈ హత్యని రాజకీయం చెయ్యవద్దు అన్న ఇంద్రజిత్ మాట ప్రకాష్‌రాజ్‌లాంటి వెండితెర తారలకి కూడా వర్తిస్తుంది. ప్రధాని వౌనం ఒక మహా నటన అనుకుంటే- యూత్ ఫెడరేషన్ వేదికమీద ప్రకాష్‌రాజ్ ప్రదర్శించిన హిస్ట్రోయానిక్స్-కూడా ఒక నటన అనుకునే ప్రమాదం లేదా? డేరాసింగ్ బాబా విషయంలో ప్రధాని నేరుగా ట్వీట్ సంధించి -వాణ్ని మూసెయ్యండి- అని నేరుగా ట్వీట్ చెయ్యలేదుగా. చెయ్యకూడదు అట్ల... అంచేత, ప్రధానితోపాటు డేరాచీపురు పట్టి రోడ్డెక్కాడు కదాని- మోడీ డేరా కొమ్ము కాస్తున్నాడు అంటామా? గౌరీ హత్యని ఒక్క షబ్నఅజిమ్ నందితా దాస్ లాంటివాళ్లు తప్ప ఫిలిం ఇండస్ట్రీ ఒక్క మాటగా ఖండించలేదుగా? అన్న ప్రశ్న ప్రకాష్‌రాజ్ లాంటి నటులు వేసుకోవాలి.. అది వాళ్ల ‘కన్సర్న్’ కాదు కనుక రోడ్డుకెక్కలేదు అనుకోవాలి.
గౌరీ హంతకుల విషయంలో కర్నాటక ప్రభుత్వం ఐజి లెవెల్ ‘సిట్’ని ఏర్పాటు చేసింది. అవసరమైతే సిబిఐ దర్యాప్తును పెడతాము అని కూడా ముఖ్యమంత్రిగారు చెప్పాడు-మరో సంగతి-‘దేఖో, పరఖో, ఔర్ డిసైడ్ కరో’ ప్రకాష్‌రాజ్-అంతేనా/హంతకుని ఆచూకికి నగదు బహుమతి కూడా ప్రకటించారు. కేంద్ర హోమ్ శాఖామాత్యుడు దీనిమీద రియాక్టై ఈ ఘాతుకం మీద నివేదిక పంపమని తన శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేసాడు. ప్రకాష్‌రాజ్ లాంటి వారు ఈ దిశలో సహకరిస్తే గౌరీపట్ల తన స్నేహ ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్లు అవుతారు అని అతని అభిమానులే అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మన అభిప్రాయం చెప్పడానికి-రాజ్యాంగ యుతమైన చట్టబద్ధమైన హక్కు ఉంది.దానికి నటన అనే ఊతం అక్కర్లేదు. నేరుగా, ప్రెస్‌మీట్ పెట్టి ప్రకాష్‌రాజ్ లాంటి సెలబ్రిటీ చెప్పవచ్చు-పోతే, ఎవరు బెటర్ నటులు అన్న మీమాంస మీద ఎవ్వరికి ఇంటరెస్టు లేదు. ప్రయోజనము లేదు. కత్తిమీద సాముగా జీవితాన్ని తృణప్రాయంగా సాగించిన గౌరీపట్ల తనది మాత్రమే ప్రేమ మిగతావాళ్లది నటన అనుకోవడం చాలదు-కార్యరూపం దాల్చాలి-దేఖో పరఖో-ఆనక అవార్డులు భద్రం అన్నా!
డేరాభారం నిందలు గట్రా మోస్తున్నది నంగనాచి హనీ ప్రీత్ దొరికింది. డేరా తెర తీసే శక్తియుక్తులు ఆమెకే ఉన్నాయన్నది ఎంతోమంది నమ్మకం. రామ్‌నగర్ పోలీస్ లాకప్లో-ఆమె వేలుపెడితే కొరకలేను వెన్న పెడితే మింగలేను అన్న తీరున కూర్చున్నది. 40 ప్రశ్నలకి నాలుగు జవాబులైనా రాబట్టలేకపోయారు పోలీసులు. ఆమె మకాం వేసిన తరంతరాన్ గ్రామానికి, ఆమె తిరిగినది అని తెలిసిన ప్రతి ఊరుకి ఆమె డ్రైవర్ సుఖ్దీప్‌ని కూడా లాక్కుపోయారు. ఈ ఇద్దరు ప్రమాదకర అతివలను తీసుకుని పాపం పో.లు-‘ఈగా ఈగా! నీ ఇంటి పేరేమిటి? అన్నట్టు దర్యాప్తు యాత్ర చేసారు. నిజానికి, పంచకూల యూనిట్ ఇంచార్జి చంకార్సింగ్ పోలీసుల చేతిలోనే ఉన్నాడు. ‘నాకు కేవలం నూట పాతిక కోట్లే-గుండా ఏర్పాట్లకోసం ఇచ్చారు సార్’ అంటున్నాడు అతగాడు. ఇవిగో సాబ్ పాతిక లక్షలు మిగిలాయి అని ఇచ్చేసాడు కూడాను. పైగా, డేరాలో వెనుకటి దాడులలో అధికారులకి - సరస డేరాకి సంబంధించిన అరవై మూడు హార్డ్ డిస్కులు దొరికేయి.. అవన్నీ విశే్లషించాలి. ఒకటి తెరిచి చూస్తేనే 700కోట్ల రూపాయల లావాదేవీలు బయటపడ్డాయి.
ఇవాళ సుఖదీప్‌కౌర్- తన యజమానురాలికి తల్లీ తోడూ కాని- అమ్మగారు వెనుకసీట్లో కూర్చుని ముందు సీటు అడ్డంగా తువ్వాలు కప్పేసింది అని చెబుతోంది. ఈ తువ్వాలు తీయడమే కష్టంగా ఉంది పోలీసులకి. ఇక డేరా తేరా చీల్చడం ఎవరి తరం అంటున్నారు డేరా భక్తులు. అత్యధిక సర్కులేషన్ గల చానెల్‌కి పత్రికకి తీరిగ్గా ఇంటర్వ్యూ ఇచ్చిన హనీ ప్రీత్ పోలీసులకి జాలి కబుర్లు తప్ప ఏమీ చెప్పనంటున్నది. బహుశా ఓ చెయ్యి తిరిగిన నోరున్న పెద్ద లాయరు ఆమె తరఫున రావాలని ఎదురు చూస్తున్నారేమో మన పోలీసులు. అయితే, డ్రైవర్ శ్రీమతి సుఖదీప్ పరారీలో వున్న ఆదిత్య ఇన్సాన్‌తో హనీప్రీతమ్మ టచ్‌లో ఉన్నట్టు చెప్పింది. వారసత్వం ఇప్పుడు ఆదిత్య ఇన్సాన్‌కి, హనీ ప్రీత్ ఇన్సాన్‌కి మధ్య నలుగుతోంది. కటకటాల లెక్క రాసిపెట్టి వుంటే నో అంటే నోప్రాబ్లం. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు అవుతుంది. ఇక పోలీసులు.. సర్కారు సొమ్ములు దండిగా వున్నాయి కనుక రాజస్థాన్ పంజాబ్ టూర్‌కూడా చేస్తామంటున్నారు. హార్డ్ డిస్కులను సమాచార వివరాలను ఎన్ఫోర్సు డైరెక్టరేట్‌కి అప్పచెప్పాలి అన్నది కోర్టు. ఇదో పుష్కర కాలం ప ట్టినా ఆశ్చర్యపడొద్దు. ఈలోగా డేరాసింగ్‌కి షరతులతో కూడిన బెయిల్ ఇస్తే మనం ముక్కున వేలేసుకోము. వాళ్లావిడకి సుస్తీ చెయ్యదా? జనాలకి కావాల్సినన్ని కాలక్షేప అమృత గుళికలు దొరుకుతాయి.
ఇక, అపురూప స్వరూప దారులలో ‘రాధేమా’తది స్పెషల్ రూటు. ఆమె తీరేవేరు-డాన్సింగ్ గాడెస్స్ ఆమె. ఆమె అక్టోబర్ 3న ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేరుగా పోలీసు ఇంచార్జి సీటులో విరాజమానమై తన రంగు రంగుల వోణీని సంజయ్‌శర్మని (ఇన్స్‌పెక్టర్ని) అనుగ్రహిస్తూ అతని మెడలో వేసింది. కర్మం చాలక దాన్ని వీడియో తీసుకున్నారు వాళ్లు. అక్కణ్ణుంచి ఆమె రామ్‌లీలా మైదానం వేదిక మీదకి వెళ్లింది. రాధేమా స్టేజిమీదకి అవతరించి-చక్కని డాన్సులు తన్మయంగా చేసింది. అక్కడి పోలీసు స్టేషన్ సిబ్బంది ఆమెకి బ్రహ్మరథం పట్టారు. ఇన్స్‌పెక్టర్లు రాజ్‌భూషణ్, రాధాకృష్ణులు, హెడ్డు ప్రమోదకుమార్, కానిస్టేబుల్స్ హేతేష్, రమేశ్‌లు కమ్మని రామకీర్తనలు గొంతెత్తి తన్మయంగా పాడారు. ఆహా! ఇది రామరాజ్యం, ఇదే కృష్ణ లీలామృతం అనుకుంటూ జనం ఎంజాయ్‌చేసిన ఈ దృశ్యాలని రికార్డు చేసారు. అన్నిచోట్లా గల రాధేమా అనుయాయులు చూడ వీలుగా వీడియో తీసి ఫేస్‌బుక్ మీదకి ఎక్కించారు. మొత్తంమీద ఈ ఆరుగురు పోలీసోళ్లని కూడా దర్యాప్తుకు రండర్రా అని పోలీసు పై అధికారులుపిలిచారు. ఎందుకు మిమ్మల్ని పీకిపారేయ కూడదు? అంటూ మెమోలు కొట్టారు. డ్యూటీ మీద వున్న పోలీసు అధికారి తన కుర్చీలో సినిమా అయితే వేరేమో కానీ, నిజ జీవితంలో ఎవర్నీ కూర్చోబెట్టరాదు. దీనికి సదరు అధికారి ‘సర్ నేను వారించాను సార్! రాధేమా వినలేదు’ అంటూ మొరపెట్టుకున్నాడు. అతని పేరు సంజయ్ శర్మ. రాధేమా కాలకృత్యాల అవసరం కోసం పోలీసు ఠానాకి విచ్చేసారు-కాదనగలమా? టాయ్లెట్ నుంచి నేరుగా ‘అమ్మగారు’ వచ్చి నా కుర్చీలో అనుగ్రహించారు అంటాడు ఖాకీ. రాధేమాకి ఈ కబురు తెలిసింది. ‘అయ్యయ్యో నా భక్తుడి నేరం కాదు, నేనే కుర్చీ కనబడగానే కూర్చోవాలి అనిపించి ఆసీనురాలినయ్యాను.. అంటూ కబురు పెట్టింది. కానీ వీడియోల రోజుల్లో ఇటువంటి సంజాయిషీలు చెల్లుతాయా? పైగా అంత పవిత్రమూర్తికి పోలీసోల్ల వాష్ రూమే కావాల్సి వచ్చిందా? పోలీసోళ్ల కర్మ కాకపోతే? ఈ మూడు రసవత్తర సన్నివేశాల్లోను ప్రెస్సు వారి కన్నా సోషల్ మీడియా అంటారుమీరు దానిదే ప్రధాన పాత్ర. హనీప్రీత్, రాధేమా, ఇక అంతకన్నా ముందే వెండితెర స్పెషల్ సెలబ్రిటీ ప్రకాష్‌రాజ్ వీళ్లంతా ‘ట్వీట్స్’ ఇవ్వొచ్చు. మోదీజీ నేర్పించిన కొత్త విద్యలలో అదొకటి. కానీ ఇదేదో కొత్త ప్రతిపాదన. ‘సైలన్స్’గా వుంటే యాక్షన్-ట్వీట్ చేస్తే రియాక్షన్ అంటున్నారు కొందరు.
గో టు యువర్ ట్విట్టర్ డాట్ కాం, అండ్ ట్వీట్ ట్వీట్!

veeraji.columnist@gmail.com