వీరాజీయం

రాలిన జుట్టూ సంపదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అబ్బా.. బోడిగుండా..?’’ అని అంటారు. కానీ అమూల్యమైన సంపదగా పెంచుకున్న శిరోజ పుంజాల్ని- నీలాద్రి కొండ మీదుగాపోయి, శ్రీవారి కళ్యాణకట్ట దగ్గర, నారుూబ్రాహ్మడి ముందు అతి వినయంగా తలవొంచి- ‘గోవిందార్పణం’ అయినాక- ‘‘యింతకన్నా ఏడువారాల నగలు నిలువుదోపిడీగా యిచ్చేసుకున్నా బాగుండేది..’’అనుకుంటారు- మహిళామణులు.
ఔను..! మీ అమూల్యమైన తల వెంట్రుకల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, బంగారం కన్నా ‘బెటర్’గా ఉపయోగపడతాయి! తిరుమల దేవస్థానం వారు తలనీలాలను విక్రయిస్తూ ఏడాదికి నాలుగువందల కోట్ల రూపాయల విలువయిన విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించుకుంటున్నారు. తిరుమల కొండపై స్వామివారు బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా చేయించుకుంటున్నాడు. ఇది కానేకాదు- వార్త. ‘కాదేదీ నైవేద్యానికి అనర్హం’ అన్నట్లు తలనీనాలు యిచ్చేసుకుంటున్న భక్తజనాలకి వాళ్ల కేశ రాజములు- చైనాలోనో, అమెరికాలోనో ఏ అందాల భామ శిరసును కురుల కిరీటమై- భాసిస్తున్నాయో తెలియదు. అది అట్లుండనిండు. ఇండియా మొత్తం మీద యిప్పుడు ఏటా ముప్ఫైవేల కోట్ల రూపాయల శిరోజాల వ్యాపారం సాగుతోంది. నిత్యం బర్మామీదుగా దక్షిణ భారత్‌కు చెందిన శ్రేష్టమైన తలవెంట్రుకలు చైనాకి- వేరే మార్గాల గుండా బంగ్లాదేశ్ మీదుగా దొంగతనంగా కూడా ఇవి ఎగుమతి అయిపోతున్నాయి. కాకపోతే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ వెంట్రుకలకి గిరాకీ జాస్తీ. తిరుపతి కేశములకు మరింత ఎక్కువ డిమాండ్ ఉందట!
‘‘నఖములు, కేశములు, స్ర్తిలు స్థానభ్రంశము పొందిరేని రాణించవు’’-అన్న ఆర్యోక్తి అబద్ధం అయిపోయింది. నఖముల సంగతి ఏమోగానీ- స్ర్తిలు, శిరోజములు కూడా స్వస్థానం నుంచి దూరం అయినా కానే గొప్పగా రాణిస్తున్న కాలమిది. కొండమీది దేవుడి సొత్తుగా మారిన జుత్తుకి- అది ఏలిమి వెంట్రుకల సంపుటం.. కనుక కిలోకి ఎనిమిద వందల నుంచి- నాలుగు వేల దాకా ధర పలుకుతోందిట! పైగా, రాలిన జుట్టుకు విలువ ఎక్కువట. ఈ జుట్టును రాలిన బట్ట తలకి అతికించడం తేలికట. చైనాలో అయితే రుూ శుద్ధ నీలాలకి- అక్కడి ముతక కురులను కలిపి ట్రాన్స్‌ప్లాంటేషన్ దగ్గర్నుంచి రకరకాల విగ్గుల దాకా అద్భుతంగా తయారుచేసి- ఎగుమతి చేసి- చైనీయులు డాలర్ల వర్షం కురిపించుకుంటున్నారు.
కొండమీది నీలాల సంగతి అటుంచండి. మన వాళ్లు ప్రక్కింటి బాల్కనీ దగ్గిరసా నిలబడి, పేల దువ్వెనలెట్టి తమ నితంబ చుంబిత కేశ రాజముల చిక్కులు విడదీసుకుంటూ- తెగిన వెంట్రుకల్ని యిలా తీసి- వాటి నిడివి కొలుస్తున్నట్లు దీర్ఘదృష్టి సారించి, ఆనక వేలికి చాకచక్యంగా మెలివేసి- సదరు చిక్కని చిక్కును గాలికి ప్రక్కింటిమీదికి వదిలిపెడ్తారే- అదీ అసలు ‘సవరాల’కి పనికివచ్చే జుట్టు.
ఈ ‘శిరోజ లడాయిలు’ అపార్ట్‌మెంట్లలో సాధారణంగా అగుపడుతుంటాయి. ‘‘ఏమమ్మా.. మీ దిక్కుమాలిన చిక్కులు మా పడగ్గదిలోకి వచ్చి పడి బీరువా మీదున్న పుష్పగుచ్ఛ కలశం మీద కూర్చుంటున్నాయి. ఛీ! పాడు,’’ అంటుంది క్రిందింటి యిల్లాలు.
‘‘తలెంట్రుకలు కొంటాం,’’ అంటూ జిప్సీలు, లంబాడీలు వస్తూంటారు. వాళ్లకి రుూ చిక్కుల్ని, ఓ డబ్బాలో పెట్టి దాచి అమ్మేస్తే- నీ కళ్లముందే, ‘నిజం జడ’లాంటి సవరాన్ని కట్టేస్తారు. ‘‘పోనిద్దురూ! అంత ఓపిక ఎవరికి చచ్చిందీ?’’ అంటారా? కానీ యిలాంటి చిక్కులకి కూడా డిమాండు చాలా వుంది. ఈమధ్య ఆడ పిల్లలంతా జీన్స్, బాబ్డ్ హెయిర్‌లే కదా- దీంతో వెంట్రుకలు- ఆడా-మగా యిద్దరివీ కూడా ఒకే నిడివి గలవి దొరుకుతున్నాయి. అందుకే ఎగుమతి చేసే వాళ్లు ద.్భ.- అనగా సౌత్ ఇండియా మీద నుంచి పాకిస్తాన్ మీదికి తమ దృష్టిని మరల్చారు. అక్కడ రుూ ‘కురుల’ వ్యాపారం, డాలర్‌ల కోసం జోరుగానే వుందిట. మొన్న మొన్న పాకిస్థాన్ పార్లమెంటు దిగువ సభలో ఈ - ‘బాల్ ఔర్ జుల్ఫోం’- అనగా సీదా మరియు ఉంగరాల ముంగురుల శిరోజాల ఎగుమతి గురించి ప్రసక్తి వచ్చింది. వాణిజ్య మంత్రిగారు- ‘సదన్’కి గత అయిదు సంవత్సరాల వెంట్రుకల ఎగుమతి ఆదాయ వివరాలను నివేదిస్తూ- పాకిస్తానీయుల తల వెంట్రుకలు ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల అమెరికన్ డాలర్లు సంపాదించాయని వివరించాడు. వాళ్ల తల వెంట్రుకలకీ చైనాలోనే డిమాండ్. మనవాళ్లు ఉడుక్కొని, రూపాయలలోనైతే రుూ మొత్తం ఎంతో- కాలుక్యులేటర్‌తో మదింపు చేశారు. పదకొండు కోట్ల నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలు అని తేలింది. ‘‘వామ్మో!’’ అని గుండె బాదుకున్నారు.
ప్రపంచంలో జపాన్, ఆఫ్రికా దేశాలలో కూడా మనోరంజన క్షేత్రంలోను, సౌందర్య వేషధారణలోనూ ‘విగ్గు’లకి- ఇబ్బడి ముబ్బడిగా వ్యాపారం వస్తోంది- యిప్పుడు. మన దేశంలో చెన్నై, బెంగళూరు, ఆంధ్రా ప్రాంత నగరాలలో విదేశీ వ్యాపారస్థులు ఆఫీసులు తెరిచి దేవాలయాలు మొదలు- బార్బర్ సెలూన్ల దాకా తిరిగి వెంట్రుకల్ని సేకరించి వాటిని ప్యాక్ చేసి, విమానాలు ఎక్కిస్తున్నారు. ఐతే, రుూమధ్య వీటి స్మగ్లింగ్ ఎక్కువ అయిందిట. హెయిర్ స్మగ్లింగ్- బర్మా, బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా ‘ఈజీ’గా వుంది అంటూ అఖిల భారత తల వెంట్రుకల ఎగుమతి వ్యాపారస్థుల సంఘం చైర్మన్ చెరియన్ గారు గోలెట్టేస్తున్నాడు.
దీనికి తార్కాణమా? అన్నట్లు బెంగళూరులో- ‘‘బాబోయ్, నా వెంట్రుకలు, పదకొండు కేజీలు- దొంగలు ఎత్తుకుపోయారు..!’’ అంటూ మిస్టర్ ఇగ్వే బాసిల్ అనే దక్షిణాఫ్రికా వెంట్రుకల వ్యాపారి అక్కడి సంజయ్‌నగర్ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. మొదట పగలబడి నవ్విన పోలీసులు- ఇతను నిజమైన శిరోజాల వ్యాపారి అని తెల్సుకుని, ఆరా తీస్తే, దర్యాప్తు కొనసాగిస్తే, గుండెలు బాదుకునేటంత భయంకర విశేషాలు తెలిశాయి.
జనవరి ఐదో తారీఖున నలభై కేజీల శిరోజ సంపదను ఒక గోతాంలో పెట్టి- తన యింటి డాబా మీద దాచి పెట్టి- హోటల్‌కిపోయి తిని, తాగి వచ్చేసరికి- వెంట్రుకల బ్యాగ్- ‘గాయబ్!’. పోలీసులు సీరియస్‌గా వెంట్రుకల దొంగతనాన్ని పరిశోధించగా- కథ ఒక ఆటో డ్రయివర్ అస్లామ్ భాయ్ దగ్గర మలుపు తిరిగింది. అస్లాం ఆటోవాలా- ‘‘నేను అదంతా పార్వతమ్మకిచ్చేశాను సార్. ఆమె యిలాగ చాలా తల వెంట్రుకల్ని కొంటుంది సార్..’’ అన్నాడు. ‘‘ఊరికే తీసుకోలేదు- లక్ష రూపాయలు యిచ్చాను సామీ, రుూ సచ్చినాడికి’’ అంటూ ఆమె పోలీసులకి చెప్పుకొచ్చింది.
అబ్బా! రాలిపోయిన వెంట్రులకి యింత ధరా? బంగారం స్మగ్లింగా యేమి? పో.. అవతలికి.. అనుకున్నాం గానీ, వారి నాయనోయ్.. ఇది కోట్లలో జరిగే దొంగ రవాణా వ్యాపారం అన్నమాట. తిరుపతికి చెందిన తల నీనాలకి వాటి నిడివిని బట్టి, నాణ్యతని బట్టీ 25వేలు- 15వేలు- కనీస పక్షం అయిదు వేల రూపాయలు దేనికి? ఒక కేజీ శిరోజాల మూటకి మాత్రమే యింత రేటుట! అందుకనే బార్బర్లు ఎవ్వరూ కత్తిరించిన వెంట్రుకల్ని భద్రం చేసి అమ్మేస్తారు గానీ, రోడ్డుమీదికి కాకా హోటల్ వాడు నీళ్లు విసిరిపోసేసినట్లు విసిరెయ్యరు.
బై ది బై.. మరో కొసరు వార్త. తల వెంట్రుకలలో గుజరాత్ నుంచి ఎగుమతి అయ్యే శిరోజాలు గొప్ప నాణ్యత గలిగి, అతి మృదువుగా, నిగనిగలాడుతూ వుంటాయిట. వీటినే దొంగ రవాణా చేస్తున్నారు ఎక్కువగా. కలకత్తాలో రుూ వెంట్రుకల దొంగ రవాణా ముఠాలు హాయిగా- ఫైవ్‌స్టార్ సుఖాలు అనుభవిస్తూ, రాలిన జుట్టును సేకరించి, లక్షాధికార్లు అవుతున్నారుట! మూడు వేల నుంచి నాలుగు వేల కేజీల దాకా యిలా దొంగ రవాణా అయిపోతున్నాయి. వందల మందికి దొంగ వెంట్రుకలు కూడా ‘దొంగ ఉపాధి’ కల్పిస్తున్నాయట! దీంతో కోటి ఇరవై లక్షల రూపాయల దాకా వ్యాపారానికి నష్టం వస్తోందని అంచనా. అందుకే- ఎవరి ‘తల చిక్కులు’ వాళ్లే దాచుకోండి... వాటిని చరాస్తిగా భావించండి!
హెన్స్ హెయిర్ ఈజ్ ఆల్సో ఏ మూవబుల్ అస్సెట్!

సెల్: 92900 99512