వీరాజీయం

‘సమాఖ్య’ కడదామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మొట్టమొదటిసారి 1951 అక్టోబర్ 25 నుంచీ 1952 ఫిబ్రవరి 21వరకు- మొత్తం అరవై ఎనిమిది దశలలో ఎన్నికలు నిర్వహించారు. కానీ అటు తర్వాత ఎన్నడూ 36 రోజులకు మించి పోలింగ్ ప్రక్రియ జరుగలేదు. సుదీర్ఘ కాలం పోలింగ్ దశలు కొనసాగిన ఎన్నికలలో యిప్పుడు జరుగుతున్న ఎన్నికలు రెండో స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయి. అప్పుడు 36 రోజులు- అనగా తొలిదశ పోలింగ్ మొదలైనప్పటి నుంచి చివరగా పోలింగ్ జరిగిన రోజుదాకా మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం. ఇప్పుడు రుూ ప్రక్రియ 39 రోజులు కొనసాగుతుంది.
ఏప్రిల్ పదకొండున వోటింగ్‌లో పాల్గొని ఈవీఎంలపై మీట ‘నొక్కిన’వాళ్లు ఫలితాల కోసం నలభై రెండు రోజులు ఎదురుచూడాలి. ఇందుకు కారణం శాంతి భద్రతల పరిరక్షణ ఒకటి, రెండోది ఎన్నికల భద్రతల ఏర్పాటు చేస్తున్న పారామిలటరీ దళాలను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం అని ఎన్నికల సంఘం వారు చెబుతున్నారు. ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినా ప్రపంచంలో ఎక్కడా రెండు రోజులకు మించి పోలింగ్ ప్రక్రియ దాటడం లేదు. మన దేశంలో అలాంటి అదృష్టం 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ పోలింగ్- కేవలం 4 రోజులలో జరిగిందీ అంటే యివాళ్టి పౌరుడు నమ్మలేడు. 7వ లోక్‌సభ ఎలక్షన్ల తర్వాత మళ్లీ అటువంటి అవకాశం రాలేదు. 1990 దాకా పారామిలటరీ బలగాలను ఎన్నికల తంతులో వినియోగించడం జరగలేదు.
1990లో శేషన్ టి.ఎస్. ఎన్నికల ‘బాస్’గా పగ్గాలు చేపట్టిన తర్వాత పటిష్టమైన మార్పులు చాలానే చేశాడు. అప్పుడే సుప్రీం కోర్టు కూడా ఎన్నికల కమిషన్ విజ్ఞప్తిని అనుసరించింది. పారామిలటరీ దళాలను మోహరించవలసిందిగా కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ బలగాల ప్రయాణాలకు వీలుగా ఎన్నికల ప్రక్రియని అడ్జస్ట్ చేస్తున్నాం అని మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషీ గతంలో వివరణ కూడా యిచ్చారు. పోయినసారి ఎన్నికలలో లక్షా యిరవై వేల మంది పారా మిలటరీ యోధులు ‘పహరా’ యిచ్చారు. కాకపోతే ప్రతీసారీ ఆయా రాష్ట్రాల ఎన్నికల కార్యక్రమాన్ని కేంద్రం విడుదల చేయగానే చాలా రాష్ట్రాలలో ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ పాలనలో లేని ప్రాంతాలలో తీవ్రమైన అసంతృప్తి వెలువడుతుంది. ఈసారి ఓం ప్రథమంగా తెలుగు రాష్ట్రాలలోనే ఎన్నికల సం‘గరం’, సంబరం రెండూ కూడా ఒకే విడతలో పెట్టేశారు.
‘‘వోట్’’ల నొక్కుడు అయినాకా ఆరువారాలు- మే 23దాకా నిరీక్షిస్తే తప్ప ఫలితాలు తేలవు. ‘‘ఇది అన్యాయం’’ అంటున్న వాళ్లల్లో ఆంధ్రప్రదేశ్ టి.డి.పి. ముందున్నది. అలాగే పొరుగునున్న ఒడిశా రాష్ట్రంలో మాత్రం పోలింగు నాలుగు విడతలలో పెట్టారు. ‘‘ఇది అన్యాయం’’ అంటూ స్వరాజ్ ఇండియా పార్టీ నేత యోగేంద్ర యాదవ్ విమర్శిస్తున్నాడు. కాగా దీనివల్ల భాజపాకి అడ్వాంటేజ్ అన్నవారికి- ఆమాటకొస్తే- ‘ఆలిండియా నాయకత్వం వహిస్తాం’ అంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు- అందునా నారా చంద్రబాబుకి- దేశమంతా చుట్టి- బోలెడు ప్రచారం చెయ్యడానికి అవకాశం వస్తుంది కదా? అంటున్నారు మోదీ భక్తజనం. ఇలాకాకుండా ఆంధ్రాకి చివర ఎన్నికలు పెడితే ‘కింగ్ మేకర్’లు రాష్ట్రానికే అంటిపెట్టుకుపోయి వుండేవారు అన్నది వాళ్ల వాదన. ఏది ఏమయినా రుూ ‘గోల’(ఒక వోటర్ మాట యిది- నాది కాదు) ఒక్క రోజుతో అంతమయితే హాయిగా వుంటుంది అంటున్న వాళ్లూ వున్నారు.
ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో- తెలంగాణలో ప్రాంతీయ పాలనకి అసలు కీలకమయిన అసెంబ్లీ ఎన్నికలు పూర్తిఅయినందున- ‘‘బేఫికర్’’గా వున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ యిప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలలోకి దూకుతానంటూ- ‘కొత్త దూకుడు’ను స్పష్టంగా ప్రకటించడం ఈ వారం కొసమెరుపు. అయితే, యిది వూహించిన సంగతే. కేసీఆర్ దీనికి పునాదులు వేసే పనిని ఎప్పుడో ప్రారంభించాడు. దేశంలో సమాఖ్య ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్, భాజపాలు రెండూ లేని ప్రాంతీయ పార్టీల హుకుం, హయాం చలాయింపబడితే తప్ప రుూ దుస్థితి పోదన్నది శ్రీమాన్ చంద్రశేఖరరావు వాదన. ఇలాగ, యిక్కడ కత్తులు దూసుకుంటున్న రుూ యిద్దరు ‘చంద్ర’నామధేయులు దేశ రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తారూ- అన్నది ఆలోచించడం అన్నది ఒక రకంగా ఒక రిలీఫ్.. అన్నాడు ఓ సామాన్య పౌరుడు. ఎందుకంటే, యివాళ ఎన్నికల రణరంగంలో- హింసా రాజకీయాలూ, హత్యా రాజకీయాలూ ‘తార’స్థాయికి చేరే ప్రమాదం వున్నది, మన ఒక్క ప్రాంతంలోనే అంటున్నారు పరిశీలకులు. ఒక రకంగా యిద్దరి ‘గోల్’ ఒకటేగానీ ప్రస్తుతం ఆ యిద్దరూ భిన్నధ్రువాలు కావడం ఆబాలగోపాలం ఎరుగును.
దేశంలో యిప్పుడు ఏడే ఏడు జాతీయ పార్టీలున్నాయి. లోగడ ఎన్‌టిఆర్ ‘్భరత దేశం’కానీ, ఎమ్‌జిఆర్ ‘అఖిల భారత’ అన్నా డిఎమ్‌కెలు ‘ఆలిండియా’ పేరు తగిలించుకున్నాయి. గాని ఫలితం హుళక్కి. ఎన్నో ప్రాంతీయ పార్టీలు కంగుతిన్నాయి. ఐతే, ఎన్నికల కమిషన్ నిర్ధారించిన నిబంధనలను అందుకోలేక అవి చతికిలబడ్డాయి. కె.సి.ఆర్. స్థాపించినా- దీదీ మమతా స్థాపించినా- లేదా మరొకరెవరైనా పెట్టినా- జాతీయ పార్టీగా నమోదు కావడం అన్నది ఒక పెద్ద తంతు. దీదీ పార్టీకి ఆలిండియా గుర్తింపు లభించింది.
ఎన్నికల సంఘం ఎన్నో షరతులు విధించి వుంది. 1968 నిబంధన ప్రకారం- చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు లేదా అసెంబ్లీలో నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలలో అభ్యర్థులను పెట్టి- పోటీచెయ్యాలి. పోలైన వోట్లు, చెల్లిన వోట్లనే పరిగణనలోకి తీసుకుంటే, కనీసం ఆరు శాతం వోట్లు పోలుచేసుకుని వుండాలి. అలాగే మరికొన్ని షరతులుంటాయి. ఈ నియమాలు మారుతూ వుంటాయి. కాకపోతే ఈ ‘దిశ’లో ప్రయత్నం చేయగల సత్తా మనవాళ్లకు - లేదు, రాదు’ అనడానికి వీలులేదు. కానీ, 4 రాష్ట్రాలలో రుూ పార్టీలు- ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపుపొందడం జరగాలిగా. అయితే, అదేమంత అసాధ్యం కాదు. ప్రస్తుతానికి, ఆ ఏడు పార్టీలు యివి: 1) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2) భా.జ.పా. 3) సి.పి.ఐ 4) సి.పి.ఐ. మార్క్సిస్టుపార్టీ అనగా సి.పి.ఎమ్. 5) ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ 6) బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి.) 7) నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అనగా- అమ్మలు యిద్దరు దీదీ, బహన్‌జీలు- ఆలిండియా లెవెల్లో వున్నారన్నమాట.
మనవాళ్లకి మొట్టమొదటే తొలి విడతలోనే జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమై, గట్టి భద్రతావలయంలో ‘కునుకు’ తీస్తూ వుంటాయి కనుక- మిగతా ప్రాంతాలకిపోయి- యాంటీ భాజపా, యాంటీ కాంగ్రెస్‌ల మీద ప్రచారం ఒకరు -కేవలం మోదీపార్టీ మీద మరొకరు ‘దుమ్ము’లేపెయ్య వచ్చును. ‘‘మరి యిది అడ్వాంటేజేగా?- షెడ్యూలు బాలేదని- కేంద్రాన్ని ఎందుకు మరి నిందిస్తారు?’’ అంటూ ముక్కుపుటాలు ఎగరేశాడో మోదీ భక్తుడు. సరే, ప్రాంతీయ పార్టీల సమాఖ్య ఎర్రకోట మీద జెండా ఎగురవేయాలీ అంటే- యిప్పుడు ఏ రెండు పార్టీలూ లేని- అనగా కాంగ్రెస్, భాజపా విముక్త పార్టీలకు మూడొందలు సీట్లుదాటకపోయినా- రెండొందల యాభై లోక్‌సభ సీట్లురావాలి. అసలు ఒక తాటిమీదకు రాని ప్రాంతీయ పార్టీలతో యిది తక్షణం సాధ్యం కాకపోవచ్చును కానీ- ఫెడరల్ ప్రభుత్వం అన్నది ‘గగన కుసుమం’ కాదు అనేవాళ్లూ వున్నారు. ఆశ చెడ్డది.
ప్రస్తుతానికి రెండే ఫ్రంట్‌లు. ఒకటి భాజపా కొమ్ముకాసేది. రెండోది దాన్ని వ్యతిరేకించే ‘సంఘటన్’లు. ఇవి బులబులాగ్గా వున్నాయి. బ.స.పా అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌తో ఛస్తేకలవను అనేసింది. ఇక ‘‘దీదీ’’తో కలవడం కాంగ్రెస్‌కి అగ్నిపరీక్షలాగే వుంది. అయితే యివి యిలాగే సాగుతూ వుంటాయి- చివరి దాకా... ఏప్రియల్ పదకొండు వస్తుంది. దశలవారీగా ఎన్నికలైపోతాయ్! మే 23 కూడా రానే వస్తుంది. ఎవరు ‘వోట్లకుండ’లో- ఎవరు ‘వోటికుండ’లో తేలిపోతుంది...
‘కమ్ జూన్! న్యూ గవర్నమెంట్ కమ్స్!’

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512