వీరాజీయం

విక్రమ్.. పరాక్రమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అబ్బో! ఇవాల్టిదా? నిన్నటిదా?? మనకి, చందమామకి అంటే- చంద్రగ్రహానికి ఉన్న అవినాభావ సంబంధం.. అసలు చంద్రుడు భూమికి సొంత బిడ్డ. మన భూమికి ఉపగ్రహం అయిన చందమామ ఆది కాలంలో గిర్రున తిరిగే భూమి గ్రహం నుంచి విడిపోయిన ఒక పెద్ద శకలం! అదే ఉపగ్రహం అయింది. అది మాతృగర్భాన్ని చీల్చుకుని బయటపడ్డ అఖాతమే. శాంత మహా సముద్రం అయింది. అబ్బో! అట్లతదియ నోముకి, చంద్రుడికి లంకె ఏర్పడడానికి ముందే- అపుడెప్పుడో కృతయుగంలోనే శ్రీరామచంద్రుడు గోరుముద్దలు తింటూ- ఆకాశంలో వెండి పూలకాంతులు వెదజల్లుతున్న ‘చందమామ నాక్కావాలి..’ తెచ్చి యిమ్మన్నాట్ట. అదృష్టవశాత్తూ అప్పటికే అద్దం అంటే ‘మిర్రర్’లున్నాయి. ఓ అద్దం తెచ్చి చంద్రుడి ప్రతిబింబం పడేటట్లు పెట్టి, ‘ఆడుకోవయ్యా! కౌసల్యాతనయా?’ అన్నదట కైకేయమ్మ. ‘చందమామ రావే, జాబిల్లి రావే- కొండెక్కి రావే గోగుపూలు తేవే’’ అన్న అన్నమాచార్య కీర్తనను ఆమె ఆలపించకపోయి వుండవచ్చు గాని, యుగయుగాలుగా మన జనాన్ని వూగిస్తున్న, ఉర్రూత లూగిస్తున్న చందమామ నిజానికి మన భూమితో ఎంతో సంబంధం ఉన్నవాడే.
ఈ భూమీద మూడొంతులు ఉప్పు నీళ్ళు ఉన్నాయి. చందమామ మీద జలములేల ఉండరాదు? అన్న కుతూహలం మనిషికి సహజమే? మూడు లక్షల ఎనభైవేల కిలోమీటర్ల దూరాన వున్న- ఈ అందాల గోళం మీదనే మనకి అంతులేని సంఖ్యలో కథలు చెప్పిన పేదరాశి పెద్దమ్మ కూర్చున్నది. మన తెలుగువాళ్లకి చంద్రుడితో మరీ ఎక్కువ సంబంధం! మన కాలానికి ఆ ‘ఉపగ్రహం’ ఆధారం. మనదంతా చాంద్రమానం. పంచాంగాలను గణించింది, రాసింది మన వాళ్ళు చంద్రుడిని ఆధారం చేసుకునే. చంద్రుడికి యిరవై ఏడు మంది భార్యలంటూ అశ్వనీ నుంచి రేవతి దాకా ఉన్న అతి ప్రముఖ నక్షత్రాలను అనుసంధానం చేసి, గోచార, గ్రహచార, ఆచార, ఆహార సదుపాయాలన్నీ మనవాళ్ళు ఘడియ, విఘడియలలో బంధించేశారు. ఇరవై ఏడు కార్తెలతో ముడిపడి మనకి- సామెతలున్నాయి. అవి నిజానికీ రైతన్నకి పెద్ద బాలశిక్షలు. ఈ నేపథ్యంలో ‘చంద్రయాన్-2’ మనకీ, మన రైతన్నకీ కూడా ముఖ్యమే- మన ‘ఇస్రో’ అంతా దేశవాళీ పరిజ్ఞానంతో, పరికరాలతో ప్రయోగించిన చంద్రయాన్-2 యేరంతా రుూది వొడ్డున మునిగినట్లు- చందమామ ఉపరితలానికి రెండు కిలోమీటర్ల దూరాన ‘మాయమయింది’. ఉన్నదో లేదో సంకేతాలు వస్తే కదా తెలిసేది? అందాకా అంతా వెనె్నల జలతారు వాన కాస్తా అమావాస్య కారు చీకట్లపాలైనట్లయింది.
కాని అంతలో కోలుకున్న మన శాస్తవ్రేత్తలు చంద్రయాన్-2 ప్రయోగం 90 నుంచి 95 శాతం వరకూ ఫలప్రదం అయింది అన్నారు. ‘‘విక్రమ్’’ ల్యాండర్ చిన్నాభిన్నమై శకలమై అంతరిక్షంలో వేలాడలేదు. అది చంద్ర మండలం మీద దక్షిణ ధ్రువ ప్రాంతంలో భద్రంగానే దిగింది. కాకపోతే సంకేతాలను ‘‘ఆర్బిటర్’’ అందుకుని వాటిని భూమికి- నెల్లూరు శ్రీహరికోటలోని ‘ఇస్రో’ పరిశోధక కేంద్రానికి పంపాలి. ఆ కార్యక్రమం ఏ క్షణంలోనైనా జరుగుతుందనే ఆశాభావాన్ని యిప్పుడు సైంటిస్టులు వ్యక్తపరుస్తున్నారు.
ఈ చంద్రయాత్రకు మన ‘ఆర్బిటర్’ మొత్తం ఎనిమిది పరికరాలు మోసుకుపోయింది. లాండర్, రోవర్‌లు భద్రంగా వుంటే అది 90 నుంచి 95 శాతం విజయమేనన్న అంశం మీద మన సైంటిస్టులు మల్లగుల్లాలు అవుతున్నారు. గవర్నమెంట్ వారి నిధులతో నడిచే ‘‘ఇస్రో’’ 1975లో మొదలుపెట్టి మొత్తం 115 ‘మిషన్’లు రోదసీ ప్రయోగాలు చేసింది. అందులో 17 ‘మిషన్స్’ ప్రయోగాలు మాత్రం విఫలమైనాయి. విజయాల అంకె అమెరికా, రష్యా, చైనాలతో పోల్చినా కూడా చాలా ఎక్కువే. అంచేత మన వాళ్ళు కూలబడి ‘‘విషాదయోగం’’లోకి పోనక్కరలేదు అన్నది ప్రపంచ వ్యాప్తంగా వినవస్తున్న మాట. గొప్ప ఓదార్పు మాత్రమే కాదు. ప్రోత్సాహకరమైన అభినందన కూడా.
విక్రమ్ పరాక్రమం ఏ క్షణంలోనైనా సంకేతాల రూపంలో రావొచ్చును. ఈ మాట ‘‘ఇస్రో’’బాస్ శివన్ స్వయంగా చెప్పాడు. కనుక అతని చిత్తశుద్ధిని శంకించకూడదు.. మనం హర్షించాలి. ఇదేమీ రహస్య పరిశోధన కాదు. ప్రపంచ వ్యాప్తంగా దీని మీద సైంటిస్టులు, ఆయా దేశాల గవర్నమెంట్‌లు కనే్నసి వున్నాయి. ఎవరి దాకా ఎందుకు? ‘‘నాసా’’ నేరుగా రుూ ప్రయోగాన్ని హర్షిస్తూ ‘‘ట్వీట్’’చేసింది. భవిష్యత్తులో మీతో కలసి చంద్ర మండల పరిశోధనా యాత్రలు చేయడానికి మేము సిద్ధం అని ‘నాసా’ ప్రకటించింది.
మన శత్రుదేశంలో కొంతమంది అధికార, అనధికార ప్రబుద్ధులు ‘‘తుస్సుమన్నదా?’’ అంటూ వేళాకోళం చేసినా, పాకిస్థానీ రోదసీ మహిళ నమీరా సలీం మాత్రం రుూ ప్రయోగాన్ని వేనోళ్ళ ప్రశంసించింది. ఇది దక్షిణ ఆసియాకే గర్వకారణం అన్నది. గొప్ప ప్రయోగం అంటూ కితాబు నిచ్చింది. ఆమెయేమీ తక్కువది కాదు. దుబాయిలో వుంటున్నదిప్పుడు. కానీ కరాచీ వాళ్ళ వూరు. 2017లో ఉత్తర ధ్రువం మీద కాలుపెట్టిన ధీర మహిళ. ఎవరెస్టును కూడా ఆమె దర్శించింది.
చంద్రయాన్ ఆర్బిటర్‌లో మొత్తం అయిదు ఇంజన్లు వుంటాయి. వాటిలో ఒకటి విఫలమైపోవడమో, మొరాయించడమో చేసి వుండవచ్చును అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ ఒక్కరూ యిది వైఫల్యం అని, పరాభవం అని గాని అనడం లేదు. అసలు సౌర వ్యవస్థలో ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్న అభిప్రాయం వున్నది. అటువంటి మార్పులు మన ‘‘చంద్రయాన్’’కి తటస్ఠ పడవచ్చును గదా! చంద్ర ఉపరితలంమీద వాతా (గాలి)వరణం లేదు. చంద్ర గురుత్వాకర్షణ శక్తి ధ్రువ మండలంలో మారితే అంచనాలు కేవలం శూన్యంలో నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ సంకేతాల ద్వారా మాత్రం తెలుసుకోవాలి.
అంతరిక్షంలో శతకోటి సౌరగోళాలు వున్న రోదసీలో మన సూర్యుడెంత? ఆ సూర్యుడి ప్రభావంతో బతికే చంద్రగోళం ఎంత? సంచలనాత్మక పరిణామాలు కొన్ని మన కర్మకాలి ‘మన రోవర్’ దిగే ముందే సంభవించాయేమోనన్నది ఓ సైంటిస్ట్ మహిళ. ఇద్దరు మహిళలు అజమాయిషీ చేసిన రుూ చంద్రయాన్-2 మన మహిళా లోకానికి మరి గొప్పగా కనపడుతున్నది. చంద్రుడు మనకి స్నేహితుడు, దేవుడు కూడా. మన సంప్రదాయాలు అమావాస్యకి, పౌర్ణమికి చెలరేగి పోతుంటాయి. సముద్రంలో నుంచి పుట్టాడు చంద్రుడు అని వెనుకటి ‘సాగర మథనం’ కథ వూహించింది. చేపల వేటకి, చంద్రుడికి సంబంధం వుంటుంది యింకా మున్ముందు. అత్యంత సమీపంగా మన భూమిమీద ప్రభావం చూపెట్టే చంద్రుడి ఉపరితలం అక్కడి దక్షిణ ధ్రువం రూపురేఖా గుణగణాలు అంచనా వేయడానికి రుూ ‘ప్రయోగం’ సూక్ష్మంలో మోక్షంగా చేస్తున్న అతి తక్కువ ఖర్చుతో అవుతున్న ప్రయోగం. ఇది మన ప్రేమకి, ఆరాధనకి కూడా ప్రతీక. ‘శశిబాబూ.. వెండి కంచాలలో వేడి బువ్వ ఉందోయ్. పసిడి కంచాలలో పాల బువ్వుందోయ్’ అని పాడింది ఒక తెలుగు కంఠం. అలా చంద్రుడికో నూలుపోగు అన్నట్లుగా చేసిన రుూ చంద్రయాన్ వ్రతం అద్యతన భావిలో మనవాళ్ళు ప్లాన్ చేసుకున్న ‘‘గగనయాన్’’, ‘‘శుక్రయాన్’’ వగైరా ‘‘యాన్’’ (యాత్రలకు) లకు సోపానాలు కడుతుందే తప్ప నిస్పృహకిక్కడ చోటు ఉండదు.
కేవలం 980 కోట్ల రూపాయల ఖర్చుతో యిటువంటి ప్రయోగం జరగటం ప్రపంచం హర్షిస్తున్నది. 2012లో అనుకున్నట్లు ఇండియా చేసిన ఆర్బిటర్, రోవర్‌ల మీద రష్యా చేసిన ల్యాండర్‌ను మనం లాంచ్ చేస్తే రుూ ‘‘థ్రిల్’’, రుూ ‘‘క్రెడిట్’’ వుండేవి కావు. రష్యా అప్పుడు మనవాళ్ళకి ‘చెయ్యి’ యిచ్చింది. ఇవాళ చంద్రయాన్-2 మూడు భాగాలు పూర్తిగా భారతీయంగా ప్రయోగం జరిగింది. చంద్రయాన్-2లోని ‘‘విక్రమ్’’ అనుకున్నట్లు సున్నితంగా గాక దభీమని చంద్రోపరితలాన్ని తాకింది. ప్రజ్ఞాన్ ‘‘రోవర్’’లోని ‘‘ప్రజ్ఞాన్’’ పనిచేయడం మొదలుపెట్టే అవకాశాలున్నాయి. అనుకున్నచోటుకి ఐదొందల మీటర్ల దూరంలో మన ‘‘మందసం’’ పడ్డది కనుక ఆశ వున్నది. ఏతావతా చెప్పొచ్చేది ఏమిటంటే హార్డ్‌వేర్ కొంత దెబ్బలు తిన్నా, లోపలి ‘సాఫ్ట్‌వేర్’ పనిచేయగలదు అన్న సంకేతాలున్నాయి. మరో సంగతి.. మన భూమీద పధ్నాలుగు రోజులు అయితే చంద్రుడు మీద ఒక్కరోజు. మరో సంగతి చంద్రుడు మనకు ఒకే ‘‘మొహాన్ని’’ ప్రదర్శిస్తాడు. ఆ టైములో ‘‘ప్రజ్ఞాన్’’ ఆర్బిటర్‌కి యిచ్చే సంకేతాలు మనకి చాలా ముఖ్యం. చంద్రయాన్-2ని అగ్రరాజ్యాలే మెచ్చుకుంటున్నాయి.
ఇంతవరకు చంద్రోపరితలం మీద ‘‘జల బిళాలు’’ ఉన్నాయన్న ‘‘హోప్’’ని యిచ్చింది మన ‘చంద్రయాన్-1’ అని గ్రహించాలి. హీలియం ఉనికి కూడా మన ప్రజ్ఞాన్ యివాళో రేపో యిస్తుందన్న ఆశతో ‘‘ఇస్రో ట్రాకింగ్’’ వేపు మనసు లగ్నం చెయ్యాలి.
ఇస్రో టీమ్ డిజర్వ్‌స్ క్యూడోస్!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512