వీరాజీయం

సంజూబాబా బ్యాంగ్! బ్యాంగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు మారాయ్...రోజులు మారాయ్! అంటూ ఎవరూ పాడక్కరలేదు ఈ రోజుల్లో. నాయకుడి కన్నా ఖల్‌నాయకుడికే ఎక్కువ గ్లామర్- అన్న సంగతి అన్ని సంఘటనలు రుజూ చేశాయి-చేస్తూనే ఉన్నాయ్. అట్టి తరి మన సునీల్‌దత్, నర్గీస్ దత్‌ల పుత్రరత్నం-సంజయ్‌దత్ అలియాస్ మున్నాభాయ్-పోయిన గురువారం పూణెలోని యార్వాడా జైలునుంచి -ఎండెక్కుతూండగా -ఉదయం పావుతక్కువ తొమ్మిది గంటలకి కటకటాల తలుపు తీసుకుని ఇనబింబ సదృశంగా-వెలుపలికొచ్చాడు.
23 సంవత్సరాల తర్వాత గ్రహణం విడిచింది అన్నట్టుగా -జీన్ ప్యాంటూ, నీలం షర్టూ ధరించిన ఈ ‘సంజూబాబా’కి హీరో వెల్‌కమ్ లభించింది. స్క్రిప్టూ స్క్రీన్‌ప్లే అన్నీ ముందే రెడీ చేసుకున్న సెట్టింగులా వున్నదా దృశ్యం. యాభై ఆరు సంవత్సరాల వయోభారాన్ని మోస్తున్నట్టుగా లేడు. వెనుకటిలాగే కమ్మెచ్చులు తీసిన భుజాలు, తిరగలి దిమ్మలాంటి ఛాతితో అతని టిపికల్ నడక చూసిన మీడియాలో సందడి ఇనుమడించింది.
డ్రమెటిక్‌గా వచ్చిన సంజూబాబా మొదట గుండెలనిండా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాడు. భారీ కాయాన్ని వంచి, క్రిందికి వొంగి, ధర్తీమాతకి నమస్కరించి ఆ ధూళి కళ్లకు అద్దుకున్నాడు. టక్కున వెనుదిరిగి-జైలునెత్తిమీద రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకానికి సెల్యూట్ కొట్టాడు. వెంటనే భార్య ‘మాన్యత’నీ కవల పిల్లలిద్దర్నీ అక్కున అదుముకున్నాడు.
అతనికోసం సినిమావాళ్లు అభిమానులు మెరిసే కన్నులతో చూస్తుండగా-జైలులో కాగితం సంచులు తయారుచేసి, తాను సంపాదించిన కష్టార్జితం-440 రూపాయల్ని మాన్యత చేతిలో పెట్టి ఆప్యాయంగా నొక్కాడు. ‘‘23 సంవత్సరాలు మానసికంగా యాతన పడ్డాను బ్రదర్! అంత సులువుగా నాకీ స్వేచ్ఛ లభించలేదు’’-అన్నాడు. తెల్లని ‘సువ్’లో పోలీసు తయినాతీ వెంటరాగా-ఎయిర్ పోర్టుకు పోయి-ప్రయివేట్ విమానంలో ఎక్కి ముంబయికి ఎగిరి-నేరుగా సిద్ధివినాయక్ గుడికి వెళ్లి పూజలు చేయించాడు. అక్కడినుంచి -‘బడా కబ్రిస్థాన్’లోని తల్లి సమాధిని సందర్శించాడు. అభిమానుల, సినీ నిర్మాతల ఆశాదీపంలాగా-పత్రికా ప్రతినిధుల ఎదుట నిలిచి భావోద్రేకంతో సొంత డైలాగులు చెప్పాడు.
మరో పదిరోజుల్లోరంగులు అద్దుకుని షూటింగ్‌కి రెడీ అవుతాడని-అతనితో సినిమా తీస్తున్న నిర్మాత-హిరాణీగారు చెప్పాడు. ఎందుకైనా మంచిదని సంజూబాబా కొత్త సినిమాలో హీరోగా రణబీర్‌ని కూడ పెట్టుకున్నాడుట. ఖల్ నాయకుడిగా తెరమీదనే కాదు తెర వెనుక కూడా వాసికెక్కిన సంజయ్‌దత్ 2013 మే 16న జైలుకి-ఐదు సంవత్సరాల శిక్ష అనుభవించడానికి ముందు 25 వేల రూపాయల జరిమానా కూడా కట్టి మరీ వెళ్లాడు.
1993 ముంబయి పేలుళ్ల కేసులో-ఎ.కె.47 తుపాకీని దగ్గర ‘పెట్టుకున్న’ నేరం మీద అరెస్టు అయిన సంజయ్‌దత్-జైలుకి పోయే ముందు నటించిన చివరి చిత్రం ‘పోలీసు గిరీ’. ఐతే జైల్లో సంజయ్‌దత్ ‘గాంధీగిరీ’ పాత్రని-అందరి మెప్పు పొందేలాగ నిభాయించాడు. మొత్తంమీద జైలులో మూడు సంవత్సరాల 11 మాసాల 14 రోజులు శిక్ష అనుభవించి-సత్ప్రవర్తన ప్రాతిపదికన కొంచెం ముందే బయటపడ్డాడు.
‘నేను టెర్రరిస్టును కాదు. నేనీ దేశాన్ని ప్రేమిస్తున్నాను. గౌరవిస్తాను’ అన్నాడు. ‘ఫ్రీ’గా ఇలా బయటకు రాగానే నువ్వేం చేశావ్? అంటే, చూశారుగా ఇలా వచ్చాను. ఆనక ఓ కప్పు చాయ్ తాగాను. అంతే!’ నన్నాడు. ఇక్కడ సందర్భవశాత్తూ ఒక విషయం చెప్పాలి. 1982లో తల్లి నర్గీస్ మరణానంతరం మన సంజూబాబా మాదక ద్రవ్యాలకు బానిస అయి, బతికున్న తండ్రిని కూడా క్షోభపెట్టి ఐదు మాసాల జైలు శిక్ష తర్వాత పూర్తిగా సంస్కరింపబడి బయటపడ్డాడు.
‘మగసిరి’ గల నటుడిగా, స్క్రీన్ బ్యాడ్‌బోయ్‌గా-ఓ హీరోగా, ‘మున్నాభాయ్’లో కామెడీ కింగ్‌గా కూడా బాక్సాఫీసును దోచేసుకుని-నిర్మాతలకు ఇప్పటికీ గ్యారంటీ నటుడిగానే ఆశపెడుతున్నాడు. తాను తయారుచేసిన పేపర్‌బ్యాగ్స్‌ని జైలులో ఓ షోరూంలో పెట్టారనీ, బయటకు ఇవ్వం- అన్నారనీ చెప్పాడు. కాగా ఎవర్నయినా పంపి వాటిని కొనుగోలు చేస్తానన్నాడు.
1981లో ‘రాకీ’గా వెండి తెరకి ‘బ్యాంగ్’మంటూ ఎక్కిన ఈ సునీల్‌దత్ తనయుడు ఏడాది తిరిగేసరికి తల్లి మరణంతో ‘బ్యాడ్‌బోయ్’ అయినా తిరిగి వెండి తెరమీదకి వచ్చి 1993 ‘ఖల్‌నాయక్’ దాకా అన్ని చిత్రాలను బాక్సాఫీసు దగ్గర కనకవర్షమే కురిపించుకున్నాడు. అతని జీవితం అంతా ఎ.కె.47 కేసుతో-కష్టాల, కన్నీళ్ల పాట్లయే అయిపోయింది. కానీ నిర్మాతలను, ప్రేక్షకులను సంతోషపెట్టడమే తన ధ్యేయం అన్నట్టుగా -గ్లామర్‌నీ, ఆకర్షణనీ కాపాడుకుంటునే వున్నాడు.
ఇవాళ భార్య మాన్యత తీస్తున్న సినిమాకి జైలులోనే పేపర్‌వర్క్ అంతా చూసుకున్నాడు కనుక ఇక సెట్స్‌కి వెళ్లాలి-అనుకుంటున్నాడు. ఈ చిత్రానికి ప్రభుదేవా డైరక్టర్. ‘టఫ్‌గై’-‘గాంగ్‌స్టర్’ ‘ఖల్‌నాయక్- వేషాలకి ఇప్పుడు ‘సూట్’ అవుతాడా? లేక పిల్లలతండ్రిగా-మధ్యతరగతి సున్నిత మనస్కుడిగా పెద్ద వేషంలో-రిషీకపూర్, అనిల్‌కపూర్ వాళ్లలాగా తన వయసుకి తగ్గ రోల్సే ఎంచుకుంటాడా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి ‘రజనీకాంత్‌లాగా యంగ్ హీరో వేషాలు వేయగలడు మనవాడు’ అంటున్న నిర్మాతలూ ఉన్నారు. కాగా-ముగ్గురు ‘ఖాన్’ల కాలం ఇది. ఆ పోటీకి మనవాడు తట్టుకుంటాడా? అంటున్నారు మన సినీ క్రిటిక్స్. ఏది ఏమైనా ‘సంజూబాయ్’ విడుదల అతని సినిమాల విడుదలలాగే అట్టహాసంగా సాగింది. దానే్న ‘హైప్’గా వాడుకుంటున్నాడు. గడుసువాడు కనుక సంజూబాబా ఈజ్ బ్యాక్ విత్ బిగ్ బ్యాంగ్!