విశాఖపట్నం

సంఘమిత్ర (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీస్ క్లబ్ ఆవరణ అంతా మహా సందడిగా ఉంది. అసలే శీతాకాలం ఆరు గంటలు అవకుండానే సంధ్య చీకట్లు తరుముకొస్తున్నాయి. ఆ చీకట్లను తరిమికొడుతూ ఆ ప్రాంతమంతా విద్యుత్ కాంతులు మిరిమిట్లుగొలుపుతున్నాయి.
రకరకాల వేషధారణతో సింగారించుకుని ఆ పరిసరాలలో సంచరిస్తున్న నారీమణులు బాబ్డ్‌హెయిర్ గాలికి ఎగురుతుంటే ముందుకు సాగుతున్న వాళ్ళు కొందరైతే జడ వేసుకోకుండా జుత్తు విరగబోసుకుని, ఆ జుత్తు నుదుటిమీద పడ్తుంటే వెనక్కి తోసుకుంటూ, లిఫ్‌స్టిక్ పెదవుల మధ్య నుండి చిరునవ్వులు చిందిస్తున్న ఆధునిక యువతులు కొందరైతే పట్టుచీరల పెరపెరల మాటున రకరకాల ముడుల్తో హూందాగా ముందుకు సాగుతున్న స్ర్తిలు మరికొందరు. పంజాబీ డ్రెస్‌తో ముందుకు సాగుతున్న అమ్మాయిలు కొందరు.
ఆ ప్రాంతమంతా ఇంత ఇలా సందడిగా ఉండడానికి కారణం ఆ లేడీస్ క్లబ్ వార్షికోత్సవం. ఆ సందర్భంలో క్లబ్ ప్రెసిడెంట్ సంఘమిత్రకి సన్మానం. ఆ సన్మాన సమయంలో భర్త లోకనాథ్‌ని కూడా సంఘమిత్రతో పాటు సన్మానిస్తున్నారు క్లబ్ మెంబర్సు.
‘‘నిజంగా ఈ దంపతులకి ఆ పేరు అన్ని విధాలా తగిన పేర్లు. ఇక లోకనాథ్ గారి గురించి చెప్పాలంటే అతను నిజంగా సార్థక నామధేయుడు. లోకానికన్నిటికి నాథుడు కాకపోయినా సమాజానికి నిజంగా అతను నాథుడే. సమాజానికి సేవ చేయడానికి అతను ముందుంటారు. మరి అతని భార్య, మన క్లబ్ ప్రెసిడెంట్ సంఘమిత్రగారి విషయం తీసుకుంటే నిజంగా ఆవిడ ఈమానవ సంఘానికి మిత్రురాలే. అందరి కష్టాలు తనవే అన్నట్టు అహర్నిశలు ఆమె సంఘసేవకే తన జీవితం సార్థకం చేసుకుంటున్నారు’’ ఆ దంపతుల్ని పొగడ్తల్లో మంచెత్తుతూ స్టేజ్‌మీద ఉపన్యాసాలు అలా సాగిపోతున్నాయి.
లోకనాథం దృష్టి మాత్రం వీటి వేటిమీదా లేదు. మనసులో అనేక భావాలు. ‘ఈ పొగడ్తలకి నిజంగా తామిద్దరరం అర్హులా?’ ఇలా ఆలోచిస్తున్నాడు అతను.
మనిషి తను స్వేచ్ఛగా ఉన్నాననుకుంటాడు. స్వతంత్రంగా ఉన్నాననుకుంటాడు. తను నిజంగా స్వేచ్ఛగా ఉన్నానా, స్వతంత్రంగా ఉన్నానా, నిజాయితీగా ఉన్నానా అని నిజాయితీగా ఆలోచిస్తే దానిలోని డొల్లతనం బయటపడుతుంది. అయితే అతడు ఈ సత్యాన్ని తెలుసుకోలేడు. తెలుసుకోవాలన్న కోరిక కూడా ఉండదు. మొదట మనిషి తనకి స్వేచ్ఛ లేదని గుర్తించాలి. తన భానిసత్వానికి కారణం తన మెతకతనం అని గుర్తించాలి. అలా చేసిననాడు అటువేపు దృష్టి పెడ్తాడు. ఇంతవరకూ తను ఎంత భానిసత్వంతో ఉన్నాడో అనుకుని ఆందోళన చెందుతాడు. తన బానిసత్వాన్ని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్ననాడు తను ఇన్నాళ్ళూ ఎందుకు భానిసత్వంలో బంధింపబడ్డాడో అతనికి తెలుస్తుంది. ఆ భానిసత్వం నుండి విముక్తి పొందే మార్గం కోసం అనే్వషిస్తాడు. లోకనాథ్ విషయం అదే అయింది. తను పని చేస్తున్నది విశాఖ మహానగరంలో అయితే నివాసముంటున్నది మాత్రం విజయనగరంలో. తను అక్కడ విధులు నిర్వహిస్తూ అక్కడే ఎందుకు ఉండాలి. ఇలా రోజూ విజయనగరం నుండి విశాఖకి తిరిగి అక్కడ నుండి ఇక్కడికి కారులో తిరగడమెందుకు? విధులు నిర్వహిస్తున్న చోటే ఉండొచ్చు కదా కుటుంబంతో అని అనుకుంటాడు అతను ఒక్కొక్క పర్యాయం. విజయనగరంలో ఉన్న ఇల్లు అద్దెకిచ్చేసి విశాఖలో అద్దెకిచ్చిన ఇంటిని ఖాళీ చేయించి విశాఖలోనే ఎందుకు ఉండకూడదు అని అప్పుడప్పుడు ఆలోచిస్తాడు అతను. అతని ఆలోచన్లు బాగానే ఉన్నాయి కాని అతని ఆలోచన్లని సాగనీయదు అతని భార్య సంఘమిత్ర. అతని బలహీనత భార్యకి ఎదురు చెప్పలేకపోవడం. ఛీ... ఛీ... ఎందుకొచ్చిన భానిసబతుకు తనది అని తనని తానే తిట్టుకుంటాడు ఒక్కొక్క పర్యాయం.
ఇక సంఘమిత్ర విషయానికొస్తే ఆమె స్వేచ్ఛకి అలవాటుపడింది. సంఘ సంస్కర్త. సమాజోద్ధరకురాలని ముద్రపడింది ఆమెకి. ఆ ముసుగులో తను ఓ సంఘ సంస్కర్తగా చెలామణి అయిపోతోంది ఆమె. ఆమె లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ హోదాలో భర్తను నానా తిప్పలు పెడుతూ ఉంటే ఇక్కడ ఆ హోదాలో వెలిగిపోతోంది. సమాజ సేవ పేరుతో తిరుగుళ్ళకి అలవాటుపడింది సంఘమిత్ర. ఆఫీసులో తనకింద వర్కర్ల దగ్గర పులిలా విధులు నిర్వహిస్తున్న లోకనాథం ఇంట్లో భార్య దగ్గర పిల్లే అని అతడ్ని తెలిసిన అందరూ అనుకుంటారు.
స్టేజ్ మీద ఎవరో ఉపన్యాసమిస్తున్నారు. అందరూ చప్పట్లు కొడ్తున్నారు. ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డ లోకనాథ్ పరిసరాలను పరికించాడు. సంఘమిత్ర మాట్లాడ్డానికి లేచింది. ఆమె చెప్పేది వినడానికి అందరూ ఉత్సుకత చూపిస్తున్నారు. తిరిగి లోకనాథ్‌ని ఆలోచన్లు చుట్టుముడ్తున్నాయి.
ఆ రోజు ఆదివారం లోకనాథం ఇంట్లోనే ఉన్నాడు. భార్య కూడా ఇంట్లోనే ఉంది. భార్య ఆజ్ఞకి బద్దుడై అతను తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అతని తల్లి కూడా సమాజంలోనున్న ఓ వ్యక్తే. పైగా వృద్ధాప్యంతో బాధపడ్తున్నది. సమాజ సేవ చేస్తాను అని చెప్పుకుంటున్న ఆ కోడలికి సమాజంలో ముసలితనంతో బాధపడుతున్న అత్తగారు గుర్తుకు రాలేదు. గుర్తుకు వచ్చినా ముసలి అత్త అందుకే అత్తగారిని వృద్ధాశ్రమంలో చేర్పించింది.
తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించడం లోకనాథ్‌కి ఇష్టం లేదు. ఎక్కడో మనసు అడుగు పొరల్లో తల్లి మీద మమతానురాగాలు అతనిలో మిగిలి ఉన్నాయి. అయితే అవి భార్య దగ్గర భయం చేత మరుగున పడిపోయాయి.
మనం మానవులం. ప్రేమతత్వం లేకుండా జీవితం గడపడం కష్టం. ఈ ప్రేమ భావమే సకల జీవరాసుల్లో అగుపడుతుంది. అయితే ఈ ప్రేమతత్వం మానవ మాత్రురాలయిన సంఘమిత్రలో ఎందుకు అగుపించడం లేదు అని అతను బాధపడ్తూ ఉంటాడు.
‘‘మిత్రా!’’ పిల్చాడు ఆ భర్త భార్యని. అతను అలా మార్దవంగా పిలిచాడంటే ఆమెవల్ల ఏదో పని చేయించుకోవాలి లేకపోతే అతను ఆమెకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని సంఘమిత్రకి బాగా తెలుసు.
‘‘ఏంటి?’’ విసుగ్గా అడిగింది సంఘమిత్ర. ‘‘రేపు నా పుట్టినరోజుకదా. ఎలాగూ వృద్ధాశ్రమానికి వెళ్ళి ప్రతి సంవత్సరం పండ్లు ఇచ్చి వస్తూ ఉంటాము కదా! ఆ చేత్తోనే మా అమ్మని కూడా ఈ ఒక్కరోజుకి మనింటికి తీసుకువద్దాం’’ భయపడ్తూనే భార్య ముఖం వేపు చూస్తూ అన్నాడు లోకనాథం. భర్త మాటలు వినగానే ఏదో వినరాని మాటలు వింటున్నట్లు ముఖం చిట్లించింది సంఘమిత్ర. ఒక్కమారు తిరిగి మామూలు పరిస్థితికి వచ్చింది.
‘‘ప్లీజ్ మిత్రా! ఈ ఒక్క పర్యాయం నా మాట కాదనకు అతను ఆమెను ప్రాధేయపడ్తున్నాడు. అతడ్ని చూస్తే ఆమెకి జాలి కలిగింది. ఏ మూడ్‌లో ఉందో భర్త కోరిక ఎందుకు కాదనాలి అనుకుని ఉంటుంది. ‘‘సరే!’’ అంది సంఘమిత్ర. దానికే పొంగిపోయాడు ఆ అల్పసంతోషి.
మర్నాడు వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధులకి రొట్టెలు, పండ్లు పంచిపెట్టి తల్లిని వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరాడు లోకనాథం.
అతని తల్లి సత్యవతమ్మకి ఇదంతా కలా లేక నిజమేనా అనిపించింది. ఎందుకంటే కోడలికి తన పొడంటేనే గిట్టదు. తను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఎప్పుడూ దుమదమలాడుతూ ఉండేది. తనని కొడుకు వృద్ధాశ్రమంలో చేర్పించేవరకూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా తెగ పోరుపెట్టింది. ఇంట్లో శాంతి కరువై తన కొడుకు బాధపడ్డం ఆ తల్లికి మనస్థాపం కలిగించింది.
కోడలు మాత్రం లేడీస్ క్లబ్‌లో, మహిళా సంఘ మీటింగుల్లో ‘మనం వృద్ధుల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్లని ఆదరించాలి. చిన్నప్పటి నుండి ఈ వృద్ధులు తమ పిల్లల్ని ఎంతో కష్టనష్టాల్కి ఓర్చుకుని పెంచి పెద్ద చేస్తారు. పిల్లల్ని యోగ్యులుగా తీర్చిదిద్ది వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేటట్టు ఎవరిమీదా ఆధారపడకుండా చేస్తారు. అటువంటి తల్లిదండ్రులు తమ జీవిత చరమాంకంలో పిల్లల దగ్గర కాకపోతే ఎక్కడికి వెళ్తారు?
మానవత్వంతో వృద్ధుల్ని వాళ్ళ పిల్లలు తమ ఉన్నతికి కారకులైన వాళ్ళని కృతజ్ఞత చూపిస్తూ ఆదరించాలి, అక్కున చేర్చుకోవాలి. వాళ్ళని చేరదీయాలి, ఆదరించాలి. మానవత్వం అంటే ఇదే’ అంటూ ఉపన్యాసం ఇస్తుంది. అంతేకాని తను మాత్రం పాటించదు. కేవలం ఉపన్యాసాల వరకే పరిమితం.
‘‘అబ్బాయ్! నన్ను వృద్ధాశ్రమంలో ఉండనీకుండా ఇంటికి తీసుకువెళ్తూ నీవు చాలా తప్పు చేస్తున్నావేమోనని నాకు అనిపిస్తోంది. కోడలి స్వభావం తెలిసిన నాకు ఇలా అనడంలో తప్పు లేదు. అయితే మనది రక్తసంబంధం, ప్రేగుబంధం, అందుచేత నీవు నా మీదున్న ప్రేమతో ఇంటికి తీసుకువచ్చి ఉండచ్చు కాని కోడలికి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేనట్లుంది ఆమె ప్రవర్తన చూస్తుంటే’’ ఇంటికి వచ్చిన తరువాత సత్యవతమ్మ కొడుకుతో అంది.
‘‘నీ కోడలు తీసుకురావడానికి అంగీకరించిన తరువాతే నిన్ను ఇంటికి తీసుకువెళ్తున్నానమ్మా, అయినా నీ కోడలు స్వభావం నీకు తెలుసుకదమ్మా! సంఘ సంస్కర్తగా, సమాజ సేవకురాల్లా ఉపన్యాసాలు ఇచ్చినంత విధంగా ఆమె ఔదార్యం ప్రదర్శించలేని మనిషి. అయినా నీ కోడలి ముఖం చూసి నీవు ఇంటికి రావటం లేదు. నా ముఖం చూసి ఇంటికి వస్తున్నావు’’ అన్నాడు లోకనాథం. అతను అలా అన్నాడే కాని అతని గుండెలు పీచుపీచుమని అంటున్నాయి. కొడుకు బలహీనత తెలిసిన ఆ తల్లి గాఢంగా నిట్టూర్పు విడిచింది.
ఎంతైనా తనదీ, కొడుకుది రక్తసంబంధం. అందుకే అలా అంటున్నాడు. మొదట్నించి కోడలికి మాత్రం తన పొడ గిట్టదు అనుకుంది సత్యవతమ్మ. మన నుదుటి రాత బాగులేనప్పుడు కర్మ మనకి అనుకూలంగా లేనప్పుడు తాడే పామై కరుస్తుంది అని అంటారు.
లోకనాథం దురదృష్టమో లేక సత్యవతమ్మ దురదృష్టమో చెప్పలేము కాని భోజనం చేస్తున్న సమయంలో పొలబారడం వలన సత్యవతమ్మ వాంతి చేసుకుంది. ఆమె మొదటే భయపడ్తూనే ఉంది. ఆ భయం ప్రకారమే జరిగింది. బితుకు బితుకులాడ్తూ వెర్రిచూపులు చూస్తోంది ఆమె.
ఈ సంఘటన సంఘమిత్రకి వెగటు కలిగించింది. అగ్గిమీద గుగ్గిలంలా విరుచుకుపడింది భర్త మీద. ‘‘అందుకే నేను ఈవిడ్ని తీసుకురావద్దన్నాను. ఈ ముసలివాళ్ళంటే నాకు అసలే ఎలర్జీ. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడుండాలి. కాని అందన్నీ అందలం ఎక్కిస్తామంటే ఎలా? తొందరగా శుభ్రం చేయండి’’ భర్తకి హుకుం జారీ చేసింది.
పాపం లోకనాథం ఏం చేయగలడు? ఏం మాట్లాడగలడు? సమాజంలో రక్త సంబంధాలకి విలువ లేకుండా పోయింది. అనుకుంటూ వాంతి చేసుకున్న తల్లిని పంపు దగ్గరికి తీసుకెళ్ళి శుభ్రపరిచాడు ఆ కొడుకు.
‘‘ఇక్కడ ఒక్క క్షణం కూడా మీ అమ్మని ఉంచడానికి వీల్లేదు. వెంటనే ఆశ్రమానికి తీసుకెళ్ళి దింపిరండి’’ భర్తకి పురమాయించింది సంఘమిత్ర. ఇంటిచుట్టుపక్కలవారు అందరూ ఆమె అరుపులకి బయటికి వచ్చేసి చోద్యం చూస్తున్నారు. సిగ్గుతో చితికిపోయాడు లోకనాథం. బాధతో కుమిలిపోయింది సత్యవతమ్మ.
ఉపన్యాసాలు అయిపోయాయి. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభం కాబోతున్నాయని ఎనౌన్స్‌మెంట్ మైకులో వినిపించింది. స్టేజి మీదున్న వాళ్ళు కిందకు దిగుతున్నారు. పెళ్ళి రోజున సంఘమిత్ర లోకనాథం వెనక ఉండి అతని అడుగుల్లో అడుగులు కలిపి ఏడడుగులు వేసింది. ఈనాడు లోకనాథం ఆమె వెనక నుండి ఆమె ముందుకు అడుగులు వేస్తుంటే ఆమె అడుగులో అడుగులు వేస్తూ స్టేజ్ దిగుతున్నాడు.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి,
విజయనగరం.
ఫోన్ : 0892231605.

మినీకథ

స్వచ్ఛ్భారత్

‘‘ఏం? ఎందుకలా నన్ను చూసి నవ్వుతున్నావు?’’ అంది రాధ ఓరకంటితో మధును చూస్తూ.
‘‘ఏం లేదా? నేనెవ్వరో నీకు తెలియదా? నిన్ను ఆ రౌడీల నుంచి రక్షించానని నన్ను నమ్మి నా వెనకే వచ్చేశావు, అందుకని’’ అన్నాడు మధు. ఏదో చేయాలని నిశ్చయముగా ‘‘నవ్వొచ్చింది, ఆ రౌడీల నుంచి రక్షించినప్పుడే నీ వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకున్నాను. అందుకే నిన్ను నమ్మాను’’ అంది రాధ ధృడనిశ్చయముగా.
‘‘అందరినీ అలా గుడ్డిగా నమ్మేయకు. నేను నీవు అనుకున్నంత మంచివాడ్ని కాను. నాతోనే కలసే వస్తానంటే ముందు ముందు నా గురించి చాలా తెలుసుకుంటావు నేనంత మంచివాడ్ని కానని’’ అన్నాడు మధు స్థిరనిశ్చయముగా.
‘‘నా మనస్సు మీరు మంచివారని చెబుతుంది. మీరు చెడ్డవారు కాదని. అయినా నేను ఇంటి గుమ్మము బయట అడుగుపెట్టినప్పుడే అనుకున్నాను. ఆ ఇంటిలో ఉండి రోజూ నరకం అనుభవించలేనని, ఆ నరకం ముందు మీరు పెట్టే నరకం ఏపాటిది?’’ అంటూ దృఢంగా అంది రాధ. ‘‘్భలేదానివే. నేను ఆ రౌడీల్లాగే నీ ఒంటి మీదున్న బంగారము, నీ అవయవ సొంపులకు ఆశపడి నిన్ను నేను రక్షించానని అనుకోవచ్చుగా’’ అన్నాడు ఆమెవైపు ఓరగా చూస్తూ మధు.
‘‘ఓ! అయితే మీరూ అందరి మగాళ్లలా మీరూ చేస్తారు. ఎంతవరకు చేయగలరు. నావంటిమీద బంగారము తీసుకోగలరు. నా మేని అందాలే కదా! ఎప్పటికైనా ఓ మగాడికి అర్పించవలసిందేగా. అది మీరైతే నేను సంతోషంగా అర్పిస్తాను’’ అంది రాధ.
‘‘హు! నీవు చాలా మొండిదానివిలాగా వున్నావు. పద పద ఈ చోటు మంచిది కాదు’’. అంటూ ఆమెను తన గదికి తీసుకొని వెళ్లాడు మధు.
ఆ కాలనీలో అందరూ మధుతో వచ్చిన రాధను చూసి మధుగాడి ‘కొత్తపెళ్లాము’ అంటూ అందరూ వచ్చి పలకరించసాగారు రాధను.
రాధను పరాభవించబోయిన ఆ నలుగురు రౌడీలు దూరంగా ఉండి వాళ్లను వెంబడించి మధు ఇంటి దగ్గర తచ్చాడసాగారు. చాలా మంది ఆ కాలనీవాళ్ళు వచ్చి రాధను, మధును పలకరించడం వలన వాళ్ళు ఆ ఇంటిలోకి వెళ్లలేకపోయారు. జనం కొంత సర్దుమణిగాక ఆ నలుగురు మధు దగ్గరకి వెళ్ళి ‘‘అన్నా! మమ్మల్ని క్షమించు. మేమేదో బుద్ధి గడ్డితిని మా స్వలాభము కోసం ఈ ఆడకూతురి దగ్గర ఉన్న బంగారం కోసం ఏడిపించి లాక్కుని వెళ్దామని అనుకున్నాం. కాని నీవు దేవుడిలా వచ్చి ఈ అమ్మాయిని మా బారి నుంచి కాపాడావు. మీ కాలనీ చేత తన్నులు తిన్న తర్వాత జ్ఞానోదయం అయింది. మేమూ నీతోనే ఉంటాము. కష్టపడి కూలి పని చేసి బతుకుతాం’’ అంటూ మధు కాళ్ళు పట్టుకొని వదల్లేదు.
మధు, రాధ దిగ్భ్రాంతులయ్యారు. అంత పెద్ద రౌడీలు కాళ్ళ బేరానికి వచ్చి ప్రాధేయపడుతుంటే ‘‘లేవండీ లేవండీ మీలో పరివర్తన నాకు నచ్చింది. ఇక్కడే ఉండండి. ఏదో పని చేసుకుని బ్రతుకుదాం!’’ అని మధు వాళ్లలో మార్పు చూసి ఆనందపడ్డాడు.
ఆ కాలనీ పేరు వివేకానంద కాలనీ. మొత్తం అంతా అయిదు వందల గడప దగ్గర ఉంటుంది. సరైన రోడ్డు వసతి లేదు. కుళాయిలు అసలు లేవు. ఎక్కడో దూరం నుంచి ఓ నూతిలో నీరు తెచ్చుకుని గడపవలసిందే. ప్రధానమంత్రి ‘స్వచ్ఛ్భారత్’ అంటూంటే ప్రజా నాయకులు గాని పరిపాలనా అధికారులు గాని ఈ కాలనీవైపు ఒంగి తొంగి చూసిన రోజు లేదు.
పంచపాండవుల్లా ఆ అయిదుగురు పంచె కట్టి నడుం బిగించి ‘స్వచ్ఛ్భారత్ ఎలా ఉంటుందో ఆ కాలనీలో అందరికీ చూపించారు. ముందు కాలువల్లో పూడికలు తీశారు. వీరి స్ఫూర్తితో ఆ కాలనీలో ఒక్కొక్కరు వారితో కలవసాగారు. గతకలు పడ్డ రోడ్లకు పక్కనున్న మట్టి పోసి వాటిని పూడ్చారు. నీటి కోసం జలయజ్ఞంలా ఆ కాలనీలోని చిన్నా పెద్దా అంతా కలెక్టర్ ఆఫీసుకెళ్లి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చారు. వీరు చెప్పినదంతా విని కలెక్టర్‌గారు స్పందించి ఆ కాలనీకి మంచినీటి కుళాయిలు మంజూరు చేశారు. మరుగుదొడ్ల కోసం ప్రతి ఒక్కరూ అర్జీలు పెట్టగా కలెక్టర్ మరుగుదొడ్లు కూడా మంజూరు చేశారు. ఆర్నెల్లు తిరగ్గానే ఆ కాలనీ తీరే మారిపోయింది.
ఇలా ప్రతి ఒక్కరూ మన ప్రధానమంత్రి మోదీగారి ఆదేశాలను గౌరవించి కృషి చేస్తే ప్రతి వీధి, ప్రతి ఊరు స్వచ్ఛ భారత్ అవుతుంది.

- వేగి నూకరాజు, బుచ్చిరాజుపాలెం,
విశాఖపట్నం. సెల్: 7702141014.

పుస్తక సమీక్ష

తల్లివేరు బంధం విడదీయలేనిది

ప్రకృతిని చదవలేనివాడు కవి కాలేడు. పరిస్థితుల్ని అధ్యయనం చేయని వాడు రచయిత అవలేడు. ప్రస్తుత సమాజంలో ఎందరో కవులు, ఎందరో రచయితలు పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తున్నారు. అయితే అవి ఎంత వరకు సమాజాన్ని మార్చగలుగుతున్నాయి? అన్న విషయానికి వస్తే కచ్చితంగా ఎవరూ సమాధానం చెప్పలేరు. అయితే మహేంద్రాడ సింహాచలాచార్య రచించిన తల్లివేరు గేయ శతకం మాత్రం పాఠకులను ఆలోచింపజేస్తుంది. ఇదొక వినూత్న ప్రయోగమని చెప్పవచ్చు. తల్లివేరుని ఏ ప్రాణీ మరచిపోదు. అన్ని బంధాల కంటే పేగు బంధం గొప్పది. అందులో తల్లివేరు మరీ గొప్పది. ఈ విషయాలను ప్రతిబింబిస్తూ ఈ గేయ శతకం సాగుతుంది.
ఇందులో కొన్ని గేయాలు మాతృభాష ఔన్నత్యాన్ని చెప్పే పంచదార చిలకలు. మరికొన్ని రసగుళికలు. ఇంకొన్ని మామిడి పండ్ల రసాలు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. భూమీద పడ్డాక మనమంతా పలికిన తొలిపదం ‘అమ్మ’ అని. ఊహ వచ్చి రాసిన తొలి మాట ‘ఓంకారం’. అక్షరాలు వచ్చి చూసిన మొదటి పుస్తకం తెలుగు వాచకం. అందుకే తెలుగన్నా, తెలుగు భాషన్నా అంతా ఇష్టపడతారు. ఏమైపోతుంది మన మాతృభాష తెలుగు అనే సందేహం కలుగుతున్న ఈ రోజుల్లో మహేంద్రాడ సింహాచలాచార్య రచించిన తల్లివేరు తెలుగు గేయ శతకం భాషకిచ్చే గౌరవాన్ని గుర్తు చేస్తుంది. మాతృమూర్తిని, మాతృభాషని, మాతృదేశాన్ని మరువకూడదన్నారు. ఇది అక్షర సత్యం. అందుకే కవి ఒక గేయంలో ఇలా అంటారు. ‘మాతృభాష భాషా తరువు నిలిపే తల్లివేరే శాశ్వతంబై పచ్చదనముల, చల్లగాలుల తెలుగు మనదోయి’. అలాగే మరొక గేయంలో ‘సిపి బ్రౌన్ దొరగారె నుడివెను ఇటాలియనాఫ్ ద ఈస్టుగాను వసుథ జనులే పొగిడినారోయ్ తెలుగు ఘనమోయి’ అంటారు. తెలుగు భాషను కించపరచవద్దని, అలా చేయడం కన్నతల్లిని మరచినట్లేనని హెచ్చరిస్తూ మరొక గేయంలో ‘తెలుగు భాషను కించపరచిన కన్నతల్లిని మరచినట్లే తల్లివేరే ప్రాణమిచ్చును తెలుగు తరువోయి’ అంటారు.
ఇలా ఈ గేయశతకంలో ఆది నుండి అన్నీ తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి తెలిపేవే. తల్లివేరు గేయశతకానికి తొలిపలుకు అందించిన ప్రజాసాహితి నాగరాజు, బొంగు సూర్యనారాయణ కవిని ప్రశంసల్లో ముంచెత్తారు. జొన్నవిత్తుల అక్షర సరస్వతి గీతంతో హృదయాన్ని హత్తుకున్నారు. తెలుగు భాష ఔన్నత్యం కోసం చేసిన ఈ కృషిని అభినందించాల్సిందే.

- శృంగారం ప్రసాద్,
న్యూకాలనీ, శ్రీకాకుళం.
సెల్ : 9985828323.

మనోగీతికలు

కనువిప్పు
పురస్కారాలను తిరస్కరించడం
కాదు పరిష్కారం
కళాకారులకు మేల్కొలుపు
నిజమైన కనువిప్పు
ఉత్తమ కానుకల కోసం
కలమెత్తి గళమెత్తి
మూఢ నమ్మకాలను
కూకటివేళ్లతో నరికి
కదన రంగమొకటి సృష్టించాలి
గురుద్వారాలు గ్రంథాలు చింపి
దేవుడి గుడి తలుపులు మూసి
ఉత్పత్తి శక్తులను నిషేధించి
నిరసించిన వాళ్ల కోసం ఈ పోరాటం
పొట్ట కూటి కోసం
జంతు హింస చేస్తున్న వాళ్లపైనా ఈ డాడి
మతం రంగు పులుముకుంటూ
పొరుగు వాడిపై తీర్చుకునే పగ
దేశ సమైక్యతకు, సమగ్రత్తకు నిజమైన ముప్పు!

- పోతనపల్లి పాపయ్య (పాపరాజు),
సెల్ : 9392289409.

ఓ గురజాడా
దేశమును ప్రేమించమంటివి ఓ గురజాడా
కానీ నేడెక్కడా కానరాదు ఆ జాడ
స్ర్తిల బతుకు నేడు మాంధులకు ఓ క్రీడ
అందరిలో చైతన్యం రగిలించాలని నీ ఆశయం
కానీ స్వార్ధం ఉన్నంత వరకు తీరదు నీ ఆశ
సుపరిపాలన కావాలని కాంక్షిస్తుంటే
అవినీతి అందలమెక్కుతోంది
మన దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో జాతులు
కానీ ఇది నేడు ఏకత్వం నశించిన నేల

- నాగాస్త్రం నాగు, వడ్లపూడి, విశాఖపట్నం.
సెల్ : 9966023970.

కాలుష్యం
భూమి, ఆకాశం, సముద్రం నడి
పల్లె, పట్నం
ఏదీ వదలకుండా కాలుష్యం చేసేసి
దానిని అరికట్టాలని
శపథాలు చెయ్యకండి
కనీసం మదిలో
గూడు కట్టిన కాలుష్యాన్ని
తొలగించుకోండి
అన్నీ బాగుపడతాయి!

- జి.జి.కె. రావు, శ్రీకాకుళం

శుద్ధి
నగరానికి జబ్బు రాకుండా
చూడాలంటే శుద్ధి చేయాలి
డ్రైనేజీలు శుభ్రపరచాలి
కాలుష్యాన్ని తరిమికొట్టాలి
అన్నింటికన్నా ముందు
మనుషుల మనసులు బావుండాలి!

- గుడిమెట్ల గోపాలకృష్ణ,
అరసవిల్లి.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి