విశాఖపట్నం

మాస్టారి ఆత్మాభిమానం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సుబ్బారావు మాస్టారు అనాథాశ్రమంలో ఉండడమేంటి? ఆయనకంత ఖర్మేం పట్టింది?’’
‘‘ ఏం చేస్తాం... మాస్టారి మంచితనమే అతన్ని ఈ స్థితికి దిగజార్చింది’’
‘‘అయినా అతనికి ముగ్గురు కొడకులు, ఒక కూతురు ఉన్నారు. అంత మంది కుటుంబం ఉండగా ఇదేం దుస్థితి?’’
‘‘అమ్మగారు చనిపోయిన తరువాత మాస్టారి పరిస్థితి మరీ దారుణమయిందటరా. అతని పిల్లలే వీధిలో పడేశారట’’
‘‘మనం ఒకసారి వెళ్లి మాస్టారిని కలుద్దాం. వీలైతే కొంత డబ్బు కూడా ఇద్దాం’’
‘‘అలాగే’’
‘‘మనమే కాదు మన వాళ్లని కొందరిని కూడగట్టుకుని వెళదాం’’
‘‘వద్దురా బాబూ! అతను ఆ స్థితిలో ఉన్నాడని ఎవరికీ తెలీకూడదని ఆశ్రమంలోనే ఉంటూ బయటికి రాకుండా ఉంటున్నారు. ఆశ్రమం గుమస్తా వల్ల తెలిసింది. మనకి తెలిసిందన్న సంగతి అతనికి తెలియదు. తెలిస్తే మరింత కుమిలిపోతారు. మన బాధ్యతగా అతన్ని కలవక తప్పదు’’
రవి, రాజు సుబ్బారావు మాస్టారి శిష్యులు. ఒకటి నుండి అయిదవ తరగతి వరకు మాస్టారి దగ్గరే చదువుకున్నారు. మాస్టారిని దేవుడిగా భావించేవారు. మాస్టారు వాళ్లని సొంత బిడ్డల్లా ఆదరించేవారు.
* * *
సుబ్బారావు మాస్టారి తండ్రికి అతను ఏడవ సంతానం. పిల్లలందరూ ప్రయోజకులే. దాదాపు అందరు ప్రభుత్వ ఉద్యోగులే. సుబ్బారావు మాస్టారే అందరి కంటే చిన్నవాడు. ‘నా కళ్ల ముందే తల్లిదండ్రులు చనిపోయారు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు కూడా చనిపోతున్నారు’ అని బోరున విలపించడం చూసి అతని భార్య నీలకంఠమ్మ ఎక్కడా చూడలేదు ఇలాంటి మనిషిని అనుకునేది. భర్తని పట్టుకుని ఆమె కూడా ఏడ్చేసేది. అంత సున్నితమైన మనసు గల వారు ఆ దంపతులు.
సుబ్బారావు మాస్టారు పిల్లల్ని అపురూపంగా పెంచుకొచ్చారు. తన తాహతుకు మించి అప్పులు చేసి మరీ వారిని చదివించారు. పెద్దవాడు రామేశం ఇస్రోలో సైంటిస్టుగా పని చేస్తున్నాడు. అతని భార్య అదే సంస్థలో క్లర్క్‌గా పని చేస్తోంది. రెండవ వాడు అవధాని అమెరికాలో గూగుల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరు, అతని భార్య కూడా ఇంజనీరే. మూడవ వాడు స్కూల్ మాస్టారు. సుబ్బారావుగారి అమ్మాయి పద్మలత టీచర్. అల్లుడూ టీచరే.
మాస్టారు రిటైర్ అయిపోయారు. పెన్షన్ కూడా వస్తోంది. అయినా అతనికి దానగుణం అధికం కావడం వల్ల తనకొచ్చే దాంట్లో నుండి ప్రేమ సమాజానికి, అనాథాశ్రమాలకు విరాళంగా ఇస్తుండేవారు. రిటైరయ్యాక వచ్చిన దాంట్లో ఆడపిల్లకి కొంత, చిన్న కొడుక్కి కొంత ఇచ్చేసి మిగతాది అనాథాశ్రమానికి, తన తోబుట్టుల కుటుంబాలకి ఇచ్చేసారు.
అతని భార్య నీలకంఠమ్మ క్యాన్సర్ సోకినప్పుడు పిల్లలు పెద్దగా పట్టించుకోలేదు. ఉపాధ్యాయుడైన చిన్న కొడుకు, కూతురు కొంత ఆదరించినా, ముక్కుతూ, మూలుగుతూ ఉండేవారు. పెద్ద చదువులు చదివించారు. దేశ విదేశ కంపెనీల్లో కోట్లాది రూపాయల జీతానికి పని చేస్తున్నారు. ఆ పెద్దవాళ్ల మీద భారం పెట్టొచ్చు కదా’ అనేవారు. వైద్యానికి ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తన శిష్యుడు షేక్ మస్తాన్ ఆలీ అనే వడ్డీ వ్యాపారి వద్ద అప్పు చేశారు మాస్టారు. మాస్టారి మీద నమ్మకంతో హామీలేమీ అడక్కుండానే అప్పుడు ఇచ్చాడు అతను. వైద్యం చేయించినా మాస్టారి భార్య బతకలేదు. ఆపరేషన్ అయినా పది నెలలకే కన్ను మూసింది.
మాస్టారి పిల్లలు తల్లి కర్మకాండలు తూతూ మంత్రంగా జరిపించారు. ఎవరి దారిని వాళ్లు వెళ్లిపోయారు. ఇల్లు ఉంది. పెన్షన్‌లో పది శాతం అంటే మూడు నాలుగు వేలు వస్తుంది. అవసరం అయితే మేమేన్నాం అంటూ మాస్టారిని ఇంట్లో వదిలేసి అంతా వెళ్లిపోయారు. ఒకసారి షేక్ మస్తాన్ ఆలీ వచ్చి ‘‘మాస్టారు ఇరవై లక్షలు అప్పు తీర్చాలంటే మీకు జన్మలో అయ్యే పని కాదు. కనుక మీ పిల్లల సాయం అడగండి’’ అన్నాడు. దానికి మాస్టారు మాట్లాడుతూ నీకంతగా డౌట్ ఉంటే ఈ ఇంటిని తీసుకో. ఇది నేను సంపాదించింది. దీని మీద వాళ్లకి హక్కు లేదు. ఎవరూ అడ్డుపడరు. అంతే గానీ వాళ్లని సాయమడగమని సలహాలివ్వకు’’ అన్నారు మాస్టారు ఆత్మాభిమానంతో.
తర్వాత తన ఇంటిని ఆలీ పేరిట రాయించేశారు.
ఆటుపోటులకు తట్టుకున్న మనిషి కనుక బాధపడక అనాథాశ్రమంలో చేరిపోయారు. అక్కడ పురాణ పఠనం, కథావాచకం, కవితలు, పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అక్కడున్న వారిని సంతోషపెడుతూ కాలం నెట్టుకొస్తున్నారు.
‘అతన్ని కదిపితే మన పరువు అనాథాశ్రమం గేటుకు వేళాడదీస్తారు’ అనుకుంటూ అతని పిల్లలు మిన్నకుండిపోయారు. శిష్యులకి కూడా ఎవరికీ చెప్పలేదు మాస్టారు. మాస్టారి గురించి తెలిసిన రవి, రాజు ఆ విషయాలు నెమరు వేసుకుంటూ రాత్రి గడిపారు.
* * *
మర్నాడు ఉదయం పది గంటలకల్లా అనాథాశ్రమానికి వెళ్లారు రవి, రాజు. వాళ్లని చూడగానే మాస్టారు ఆశ్చర్యపోయారు. శిష్యులిద్దరు మాస్టారి కాళ్లకి దండం పెట్టారు. కుశల ప్రశ్నల తర్వాత విషయానికి వచ్చారు రవి, రాజు.
‘‘సార్ మేము ఇద్దరం బిజినెస్‌లో మంచి స్థితికి చేరుకున్నాం. మీరు మా అకౌంట్స్ రాయండి. మీకు నెలకి పదివేలు ఇస్తాం. ఒక రూము తీసుకుందాము. అందులో మీరు ఉందురు గానీ’’ అన్నారు.
‘‘మీ అభిమానానికి ధన్యవాదాలురా. నేను కోరుకుంటే నా చేత పని చేయించుకోకుండానే మీరు నన్ను పోషించగలరు. కంటికి రెప్పలా కాపాడగలరు. నిజానికి నా సంతానమూ చెడ్డవాళ్లు కాదు. నేనే తాహతుకి మించి అప్పులు చేసి వాళ్లకి ఏమీ ఇవ్వలేకపోయాను. అయినా నేను చేసిందల్లా సబబే అన్న సంతృప్తి నాకు ఉంది కాబట్టి నిశ్చింతగా ఉంటున్నాను. నా గురించి దిగులు పడకుండా పిల్లాపాపలతో హాయిగా ఉండండి. నేను నా మానస పుత్రుడు ప్రభాకర్ ఇంట్లో ఉన్నానని మీరు తృప్తి పడండి. వచ్చేటప్పుడు కాస్త ముక్కుపొడుం డబ్బాలు తెండి చాలు’’ అన్నారు మాస్టారు.
రవి, రాజు కళ్లు చెమ్మగిల్లాయి. నోట మాట రాలేదు. మాస్టారి ఆత్మాభిమానం, పట్టుదల తెలిసినవాళ్లు, అతన్ని ఎంత ఒప్పించినా లాభం లేదని గ్రహించి ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టకుండా ‘‘సార్ మేము వెళ్లి వస్తాం. ఆరోగ్యం జాగ్రత్త సార్. ఏ అవసరం వచ్చినా మాకు కబురు చెయ్యండి సార్’’ అంటూ మరోసారి మాస్టారి పాదాలు తాకారు.
అంతలో అక్కడికి ప్రభాకరరావు వచ్చాడు. అందరూ కలసి కొంత సేపు మాట్లాడుకున్నారు. రవి, రాజు వీడ్కోలు తీసుకున్నారు.
శిష్యులని చూసి మాస్టారు మురిసిపోయారు. ‘నాది వసుధైక కుటుంబం. నాకీ గౌరవాన్ని ఇచ్చిన అక్షరమాతకి వందనం. సలక్షణ సరస్వతీ పాదాభివందనం’ అంటూ మనసులోనే చదువుల తల్లికి ప్రణామాలు అర్పించారు మాస్టారు.
అనాథాశ్రమం ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బు అయింది. ‘నా ఒడిలో కూడా తండ్రి బిడ్డల ప్రేమానుబంధాలా’ అనుకుంటూ .

- ఎం.వి. స్వామి,
దుర్గాలమ్మి కాలనీ, చోడవరం,
విశాఖపట్నం, సెల్ : 9441571505.

మినీకథ

పరిమళం

ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నేను పరిమళనే ఎందుకు ప్రేమించాను. అసలు నేను ఆ అమ్మాయి కోసం ఎందుకిలా బాధపడుతున్నాను. ఆ పరిమళ కాకపోతే మరో అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది కదా అని నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను.
నా పేరు సూర్య. రెండు సంతవ్సరాల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. నెలకు నలభైవేలకి పైగా జీతం. అంతకుమించి ఏం కావాలి. తర్వాత మరో కంపెనీలో అడుగుపెట్టా జీతం రెట్టింపయింది. వీకెండ్స్ వచ్చిందంటే ఫుల్ హ్యాపీ.
ఒకరోజు నా స్నేహితుడు వాళ్ల నాన్నకి ఏదో అవార్డు ఇస్తున్నారని తెలిసి పబ్లిక్ గ్రంథాలయానికి రమ్మన్నాడు. అక్కడ ఒక అమ్మాయికి దండవేసి పూలమాలలు బహూకరించి ఏదో అవార్డు ఇచ్చారు. అక్కడున్న పెద్ద మనిషితో ఆ అమ్మాయికి అందరూ ఎందుకలా దండలు వేస్తున్నారు అనడిగా.
ఆ అమ్మాయికి సన్మానం చేస్తున్నారు అని చెప్పాడు.
‘‘ఎందుకు?’’ అని అడిగా.
‘‘చిన్న వయస్సులోనే తెలుగులో అనేక కవితలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ అవార్డు, అలాగే కొన్ని సంస్థలు తెలుగు అమ్మాయి, తెలుగు కోకిల, తెలుగు మయూరి అని అనేక అవార్డులు కూడా ఇచ్చాయి. ఇప్పుడు తన కవితలన్నీ ఒక పుస్తకంగా అచ్చు వేయించింది. ఇప్పుడు మంత్రిగారు వచ్చి విడుదల చేస్తారు’’ అనేలోపే... ఆంధ్రప్రదేశ్ మంత్రి వచ్చి బుక్ రిలీజ్ చేశారు. ఆ పుస్తకం పేరు ‘నా పాతిక పరిమళాలు’ అని వుంది. వెంటనే ఒకటి కొన్నా.
పుస్తకం తీసుకెళ్లాను కానీ ఒక కవిత కూడా చదవలేకపోయా ఎందుకంటే నాకు తెలుగు రాదు.
తనని మొదటిసారి చూసినప్పుడు ప్రేమించా! సన్మానం చేసినప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమించా, అడ్రస్ తెలుసుకున్నాను, తను చదివే కాలేజ్‌కి వెళ్లాను.
కాలేజ్ నుండి వస్తుంటే హాయి అని పలకరించి, ‘‘మీరు కవితలు బాగా రాస్తారు’’ అని అభినందించా.
ధన్యవాదాలు తెలిపింది.
వెంటనే నేను నవ్వి ‘‘మీరు చాలా అందంగా ఉన్నారు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నాను’’ అని చెప్పాను.
‘‘సరే ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు?’’ అంది.
‘‘ఎందుకంటే ఐ లవ్ యూ కనుక’’
పరిమళ ఒక్కసారిగా షాకయ్యింది. నా వంక కోపంగా చూసింది.
తర్వాత రెండు, మూడు నెలల పాటు తనని చూస్తూనే ఉన్నా పలకరించలేదు. లాభం లేదనుకుని లవ్‌లెటర్ రాసిచ్చా ఇంగ్లీష్‌లో! చదివి తర్వాత ‘‘ఒక నిమిషం మాట్లాడాలి’’ అని చెప్పింది. ఎగిరి గెంతేశా.
‘‘సూర్యగారు నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు’’. తెలుగు పిహెచ్‌డి చేయాలి, అలాగే తెలుగు భాషపై నాకు మక్కువ ఎక్కువ కాబట్టి నాలాగే తెలుగులో పరిశోధన చేసిన వారినే ప్రేమిస్తా. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అసలు ప్రేమించను క్షమించండి’’ అని చెప్పేసి వెళ్లిపోయింది.
తెలుగు నేర్చుకోవాలని పుస్తకాలతో కుస్తీ పట్టా, కానీ సాధ్యం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసిన తెలుగు నన్ను ఇలా మార్చేస్తుంది అని అనుకోలేదు. అక్షరాలు నేర్చుకోవడానికే నెల పట్టింది.
ఫ్రెండ్స్ అందరూ సరదాలతో గడుపుతుంటే పరిమళ ప్రేమ కోసం తెలుగు నేర్చుకుంటున్నాను.
కొంత తెలుగులో పట్టు సంపాదించాక పరిమళను కలిశా. ఎప్పటిలానే తలతిప్పుకుంది.
అప్పుడే నేను ఆముక్తమాల్యదలో ఉన్న పద్యం చదివి వినిపించా. తను ఆశ్చర్యపోయింది. తన కోసం పడిన పాట్లు, చదివిన సాహిత్యం అన్నీ వివరించా.
పరిమళ నన్ను అర్థం చేసుకుంది. నా ఫోన్ నెంబర్ తీసుకుంది. ఆ ఆనందానికి తెలుగులో ఎన్నో మాటలుంటాయి.
నా నెంబర్ తీసుకుంది కానీ ఫోన్ చెయ్యలేదు. నెల, రెండో నెల దాటింది. కాలేజ్ అయిపోయింది. ఇంక మర్చిపోవాలి తను కాకపోతే మరొకరు అనుకున్నాను. చాలా బాధపడ్డాను.
తనకి తప్పని పరిస్థితిలో పెళ్లి అయిందని, నీ జీవితంలోకి నేను రాలేనని చెప్పింది. తనవల్లే తెలుగు పరిమళాలను చూడగలిగాను, బాధపడ్డాను.
తన కలం నా గళమైంది.
తన రూపం నా మాటైంది.
తనని మర్చిపోయినా తన పేరును వాడుకుంటూ గడిపేస్తా నవ్వులు పరిమళాలతో తెలుగు సాహిత్యం వైపు అడుగులు వేస్తూ.

- నల్లపాటి సురేంద్ర
విశాఖపట్నం,
మొబైల్: 9490792553

పుస్తక సమీక్ష

పాత్రికేయ నానీలు

కవిత్వం రాయడంలో కలం కదపాలనుకున్నవారికి కొండంత ఆలంబనాన్ని ఇచ్చింది ‘నానీ’ల రచన. సుమారు రెండు దశాబ్దాల కిందట డాక్టర్ ఎన్ గోపీ నానీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నానీల రచన విలక్షణమైనది. అత్యల్ప అక్షరాలలో అనంతమైన భావాన్ని తెలియజెప్పేవి. మూడు, నాలుగు లైన్లలో (చిన్న వాక్యాలలో) రచయిత అంతరంగాన్ని ఆవిష్కరిస్తాయి. ఇవి నవ్విస్తాయి, ఏడిపిస్తాయి. ఆత్మీయతను అందిస్తాయి. అనురాగాన్ని పంచుతాయి. ప్రశంసిస్తాయి. అభినందిస్తాయి. జ్ఞాపకాల తెరలను తొలగిస్తాయి. వ్యక్తులపట్ల, సంఘాల పట్ల తన మనోభావాలను ప్రకటిస్తాయి. నానీలకు ఇంతటి శక్తి ఉంది. అలా రాయగలిగిన వారిలో దిమిలి అచ్యుతరావు ఒకరు. వీరు ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు. ఐజెయు జాతీయ కార్యవర్గ సభ్యులు. 1982లో పాత్రికేయునిగా జీవనయానం ప్రారంభించి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ వంటి ప్రముఖ దినపత్రికల్లో, టీవీ చానెళ్లలో పని చేయడమే కాకుండా పలు పత్రికలకు, వెబ్‌సైట్లకు కాలమిస్టుగా పత్రికా రంగంలో విశేషమైన అనుభవాన్ని గడించారు. ఆయన కలం నుండి వచ్చినవే ఈ ‘పాత్రికేయ నానీలు’. ఈ పుస్తకంలో మొత్తం నూట ఎనిమిది నానీలున్నాయి. నానీలను ఐదు శీర్షికల్లో - ‘అచ్చు’తల, కచ్చితం, చరితం, స్వగతం, మనోగతంగా విభజించారు. తమ జీవనయానంలో చూసిన చిత్రాలను, వ్యక్తులను స్పృశిస్తూ అక్షరబద్ధం చేశారు. నానీలకు సమీక్ష అవసరం లేదు. ఎందుకంటే తేలికైన పదాలతో కూర్చిన ఈ నానీలు తెలుగు చదవగలిగే వారందరినీ అలరిస్తాయి. పోతే నానీల ఆంతర్యాన్ని అవగాహన చేసుకోవడానికి కొంచెం బుద్ధికి పని కల్పించక తప్పదు. ఈ కోణంలో కొన్ని నానీలను గురించి చెప్పుకుందాం. జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నవారికి మరో రంగంలో పని చేయాలని ఉండదు. ఉన్నా తృప్తి ఉండదు. ఆర్థికంగా ఏ కొద్దిమందో ఉన్నత స్థానాలందుకున్నా, జర్నలిస్టులకు పేరు ప్రతిష్ఠలు లభించినా నిత్యం జీవిత పోరాటమే! ఈ విషయానే్న తొలి నానీలో ‘జర్నలిజమా- అదేం చిత్రమో! జీవితాంతం నన్ను ఉద్యోగార్థిని చేసావ్ అంటారు మరోచోట. విలేఖరులంటే పిల్లనివ్వరు నికరాదాయం లేదని వివరణక్కర్లేదు. ఈ నాని పత్రికల గురించి చెబుతూ ‘పత్రికలు ఫోర్త్ ఎస్టేట్- నేడు రియల్ ఎస్టేట్ అంటారు. విలేఖరికంటే ఎడిటరవ్వడమే తేలిక. అందుకే అసంఖ్యాక చిన్న పత్రికలు. ఇవి చిన్నవే అయినా కొరికి చూడు మిరపలా చురుక్కుమంటుంది. తనకు స్ఫూర్తినిచ్చిన పతంజలి, రాగతి పండరి, రావిశాస్ర్తీ ఇలా ఎందరినో స్మరించుకున్నారు నానీల్లో రావు. తెలుగు భాషకు వనె్నతెచ్చినవారిని తలచుకుంటూనే యాంకర్ నోట్లో వంకర పోయింది భాష’’ అంటూ ఘోషించారు.
అయితే చివరగా విలేఖరులకు, పాత్రికేయులకు చక్కని సందేశం అందించారు. అది- ‘చెప్పుడు మాటల్తో- తప్పుడు వార్తలొద్దు- గుప్పెడు గుండెల్లో- చప్పుడు గమనించు’ అని కవికి గల భావుకతకు, నిబద్ధతకు, ఆదర్శానికి అర్ధం చెప్పారు.

- ఎ సీతారామారావు, విజయనగరం, ఫోన్: 08922-237122.

రచనలకు ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది...
కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా, మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి... నిస్తేజంగా ఉన్న
భావుకతను మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు
తళుకులీనండి. మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

వౌనం
మిగిల్చిన కాలం
వడలిన కాలంలో
వేలాడిన క్షణాలెన్నో
వౌనం దాల్చిన పోరాటాలెన్నో
ఓటమిని వేధించిన సందర్భాలెన్నో
మొలకెత్తని ఆశల విత్తులు
వెలికి తీయలేని నిస్సహాయత
మొలిచిన మొలకల్లోనూ
పలుకురిస్తున్న దైన్యాలే
సత్తువ కోల్పోయి
ఎదుగుతున్నా సమస్యల చీకటులే
కొన్ని ఆశయాల కోసం
కష్టంగా చిగుళ్లని వెలికి తీస్తున్నా
వేర్లలో దాగున్న
వెలికి చూపలేని గాయాలెన్నో
అడుగుల కంటే ముందే
నల్లని వస్త్రాన్ని
కప్పుకుని పరిగెడుతూ
నిరాశల నీడల ప్రయాణం
అభివ్యక్తిలో ఉలికిపాటులెన్నో
చిరునవ్వు తోడు రాకున్నా
చింతను చెరిపేసి
భావాలను తోడు తీసుకుని
గతం గాయాలకి
లేపనాలనద్దుతూ
ఆనందపు అంకురాలు
నావే క్షణాలకై వేచి చూస్తూ...

- కొరటమద్ది వాణీ వెంకట్,
సెల్ : 9866275655.

వందనాలు
అడవి హృదయం అమ్మలాంటిది
ఆకలి తీరుస్తుంది నిరాశను దూరం చేస్తుంది
అక్కడ పూసిన పువ్వులు మనకు నేస్తాలు
అక్కడ పరిమళించే సుగంధాలు
అడవి అందించే అందాలు అనుబంధాలు
అడవితల్లి భరతమాత ఖ్యాతిని మోస్తుంది
ఆవేశవాదులను, అభ్యుదయాలను దాస్తుంది
జాతి సామ్రాజ్యవాద గుప్పిట్లో నలిగినప్పుడు
అట్టడుగువర్గాలు ఆకలో రామచంద్రా అన్నప్పుడు
పేదోళ్ల గుండెలు రగిలినప్పుడు
ప్రజాస్వామ్యం పెత్తందార్లకు సొంతమైనప్పుడు
పెను ఉప్పెనలా పేలుతుంది అడవి
ప్రేరణ రగిలిస్తూ ప్రశ్నలను కదిలిస్తూ
పెట్టుబడి వర్గాలను వెంటాడుతూ...
అందుకే నా అడవమ్మకి వందనాలు
గుండెలని గండ్రగొడ్డళ్లుగా చేసేది అడవి
ప్రపంచ సౌందర్య శిఖరాగ్రం అడవి!

- కె. సతీష్, శ్రీకాకుళం. సెల్ : 7675924944.

విజ్ఞాన చంద్రికలు
నేను సైతం ప్రపంజోజ్వల
ప్రబల భవితకు తొలియడుగు
వెలుగునవుతాను
నేను సైతం నిత్య యవ్వన చైతన్య
ప్రజ్ఞా పల్లకీకి బోరుూనై
సమస్త మానవాళిని
వికాసవంతమైన ప్రపంచానికి
తీసుకుపోతాను
నేను సైతం హిమగిరి శిఖర
శివతాండవ మృదంగ ధ్వనీ
ప్రవాహ కేళీ తరంగ పదనిసనై
జగతి జనుల జవసత్వాలలో
జీవాన్ని మేల్కొలిపే
విశిష్ట వైదుష్య వైభవోపేత
విజ్ఞాన చంద్రికలను
ప్రసరింపజేస్తాను

- గగనం శ్రీనుకుమార్,
పాతవీధి, యలమంచిలి.
సెల్ : 8008262514.
email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- ఎం.వి. స్వామి