విశాఖపట్నం

సముద్రమంత సహాయం! (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాపం అతనికి ఎలా ఉందో! 3నిన్న జరిగింది2 ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను. 3ఇది సినిమా కాదు. నిజంగా నిజం. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంటివైపు వస్తుంటే అదే సమయంలో రోడ్డు పక్కన జన సందోహం నాకంట బడింది. వెళ్లి చూసేసరికి రామచంద్రగారు. చాలా పెద్దాయన డబ్బులోగాని, హోదాలో గాని తిరుగులేని వ్యక్తి. మా కాలనీ చివరలో పెద్ద భవంతి, కార్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ ఆయన మోటారు సైకిల్‌పైనే వస్తూ పోతూంటారు. అటువంటి వ్యక్తి నిస్సహాయంగా పడున్నారు. మోటారుసైకిల్ రోడ్డువైపు ఒరిగి ఉంది.
‘‘అరెరే ఎంత పనైంది. చిన్న పిల్లాడు బండికి అడ్డంగా రావడంతో భయంవల్ల బిపి డౌనయింది. దాంతో రామచంద్ర పడిపోయారు’’ అక్కడికి చేరినవారి ద్వారా ప్రమాదానికి కారణం తెలిసింది. అందులో రామచంద్ర గురించి తెలిసింది నాకు ఒక్కడికే. వెంటనే సహాయక చర్యలు చేపట్టాను. రక్తం కారుతున్న మోకాలికి కట్టుకట్టి- జనాన్ని పక్కకి తప్పించి కాస్త గాలి ఆడేటట్లు చేశాను. అతడు ఎవరన్నది కొంత మందికి చెప్పడంతో తలో చెయ్యి వేసి రామచంద్రను లేవనెత్తి- మంచినీళ్లు తాగించి ముఖం కడగడంతో ఆయన స్పృహలోకి వచ్చారు. బలంగా గాలి తగిలే ఏర్పాట్లు చేయడంతో అరగంటలో మామూలు స్థితికి వచ్చారు రామచంద్ర. జేబులో ఉన్న మొబైల్ నుండి తమ వారికి కబురు చెయ్యమని చేతి సంజ్ఞ ద్వారా తెలియ జేయడంతో ఫోన్ ద్వారా రామచంద్ర బంధువులకు సమాచారమందింది. క్షణంలో అంబులెన్స్ రావడంతో రామచంద్రను అందులో ఆసుపత్రికి తరలించారు. ‘హమ్మయ్యా గండం గడిచింది’ అనుకుంటుండగానే అంబులెన్స్ నుండి రామచంద్ర నన్ను చేతులు ఊపుతూ పిలవడంతో అంబులెన్స్ అద్దం దగ్గరకి వెళ్లాను. డోరు పక్కకి తొలగించి కృతజ్ఞతాపూర్వకమైన చూపుతో ‘‘బాబూ నీ పేరేంటి’’? అని రామచంద్ర అడిగేసరికి ‘‘సార్ నేను మీ ఏరియా వాడినేనండి- నా పేరు శీను’’ అని చెప్పాను.
‘‘మంచిపేరు ఎప్పుడైనా కలుద్దాం’’ అన్నారు ఆయన. అంబులెన్స్ కదిలిపోయింది. శీనుకి మనస్సు కరిగిపోయింది. ఆయన తనపేరు ఎందుకు అడిగారో అర్థం కాలేదు.
* * *
ఆ సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు కావొస్తోంది. కేర్ ఆసుపత్రిలోనే చేర్చారట. తెలిసిన ఆయనే కదా! ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లి చూసి వస్తేసరి. ఆటోలో కేర్ ఆసుపత్రికి చేరుకున్నాను. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఏ వార్డులో ఉన్నారో ఏమో! రిసెప్షన్ దగ్గర రామచంద్ర అడ్రస్ అడుగుతుండగా నడివయసులో ఉన్న ఒకామె గిరుక్కున తిరిగి నావైపు చూసింది.
‘‘ఎవరయ్యా నువ్వు? ఆయనతో నీకేం పని’’ అని సీరియస్‌గా అడిగింది.
‘‘అమ్మా మొన్న బైకు నుండి పడిపోయారు కదా! ఆ రోజు నేనే వారి ఇంటికి చేర్చాను. ఎలా ఉందో ఒకసారి చూసి పోదామని వచ్చాను’’ అని చెప్పాను.
అప్పటి వరకు సీరియస్‌గా ఉన్న ఆమె ముఖం వికసించింది. ‘‘శీను అంటే నువ్వేనా?’’ అంది.
‘‘అవునమ్మా’’ అనేసరికి ‘‘పద పద. నీ గురించే అన్నయ్య ఒకటికి పదిసార్లు చెబుతున్నారు’’ అని చెప్పి రామచంద్ర ఉన్న గదిలోకి తీసుకెళ్లింది. నన్ను చూడగానే రామచంద్ర పెద్దరికం పక్కనపెట్టి ‘‘ఇలా రావోయ్’’ అంటూ బెడ్‌మీద చోటిచ్చి చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టారు. ‘‘ఆ రోజు మంచి హెల్ప్ చేశావు. సమయానికి నువ్వు లేకపోతే ఈసరికి నన్ను మా వారు మరచిపోదురు’’ అంటూనే కాఫీ అందించారు. బెరుకుతోనే కాఫీ తీసుకున్నాను. ‘‘ఇప్పుడు చెప్పు ఎంటిలా వచ్చావు. ఏమైనా సాయం కావాలా! డబ్బులు ఏమైనా అవసరమా! మొగమాటపడకు’’ రామచంద్రగారు గుక్క తిప్పుకోకుండా చెబుతున్న మాటలకు నేను సిగ్గుపడ్డాను. ‘‘లేదుసార్ ఆ రోజు తరువాత మిమ్మల్ని కలవలేదు. ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని ఇలా వచ్చాను’’ అంటూ నమస్కారం పెట్టి వెళ్లబోతున్న నన్ను పిలిచి ‘‘ఎప్పుడైనా అవసరం ఉంటే తప్పక రావాలి సుమా’’ అంటూ నవ్వుతూ చెయ్యి ఊపారు. అక్కడి నుండి సంతృప్తితో బయటపడ్డాను.
* * *
ఇది జరిగి సంవత్సరం గడిచింది. ఈ మధ్య కాలంలో రామచంద్ర తారసపడడంగాని, అతనిని కలవడం గాని జరగలేదు. టైలరింగ్ వృత్తిలోనే ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాను. పెద్దవాడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్నవాడు మురళి పదవ తరగతిలో పదికి పది పాయింట్లు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించాడు. నారాయణ, చైతన్య కళాశాలల ప్రతినిధులు మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని ఉచితంగా చదివిస్తామని ఆఫర్లు ఇచ్చారు. స్థానిక పారిశ్రామికవేత్త నడుపుతున్న కార్పొరేట్ కళాశాల సిబ్బంది కూడా వచ్చి మురళికి రెండేళ్లు ఇంటర్‌లో ఉచిత విద్య అందిస్తామని ఆఫర్ ఇచ్చారు. మురళి చైతన్యలో చదివేందుకు ఇష్టపడుతున్నాడు. లోకల్ కళాశాల అయితే మరింత సౌలభ్యంగా ఉంటుందని నా ఆశ. ఇలా తర్జన భర్జన పడుతుండగా రెండు రోజుల్లో ఏ విషయం చెప్పనందున ఆఫర్ వేరొకరికి ఇచ్చామని చెప్పడంతో లోకల్ కార్పొరేట్ కళాశాలకు వెళ్లగా ఇక్కడ కూడా సీటు వేరేవారితో భర్తీ చేశామని చెప్పడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. మురళి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక రకంగా మనోవ్యాధికి గురయ్యే పరిస్థితి. రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఏం చేయాలి. ఉచితంగా వచ్చిన అవకాశం చేజారింది. ఈ సమయంలో రామచంద్ర గుర్తుకు వచ్చారు. ఆయన చెవిలో ఒకసారి ఈ విషయం వేస్తే పోయిందేమీ లేదుకదా! అనుకొని మురళిని తీసుకొని సాయంత్రం రామచంద్ర ఇంటికి వెళ్లాను. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కారు డ్రైవర్ కాబోలు- అతని దగ్గరికి వెళ్లి నా పేరుతో కూడిన చీటీ ఇచ్చి రామచంద్రగారికి ఇమ్మన్నాను. చీటీ తీసుకొని లోపలికెళ్లిన డ్రైవర్ ఒక్క నిమిషంలోనే తిరిగివచ్చి ‘‘సార్ రమ్మంటున్నారు’’ అని చెప్పి తలుపుతీసి నన్ను, మురళిని లోనికి పంపాడు. నన్ను చూడగానే చిరునవ్వుతో ‘‘రావోయ్ శీనూ కూర్చో, ఈ అబ్బాయి ఎవరు?’’ అని అడిగారు. విషయం చెప్పగానే- ‘‘సరే’’ అని టీ తెప్పించారు.
‘‘సార్ మా అబ్బాయి మురళికి పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. లోకల్ కార్పొరేట్ కళాశాలవారు ఆఫర్ ఇచ్చారు. అయితే సకాలంలో నిర్ణయం చెప్పకపోవడంతో మాకు ఇచ్చిన ఆఫర్ రద్దుచేసి వేరేవారితో భర్తీ చేశారు. ఎలాగైనా ఆ కళాశాలలో ఉచిత సీటు ఇప్పించండి’’ అన్నాను.
రామచంద్ర నవ్వుకున్నారు. ‘‘ఓస్ ఇంతేనా- రేపు ఉదయం మీవాడిని కోరుకున్న గ్రూప్‌లో పావలా ఖర్చు లేకుండా చేర్చు. అని వెంటనే ఫోన్ అందుకుని ‘‘నాయుడూ నేను రామచంద్రని. మురళి అనే అబ్బాయి జిల్లా ర్యాంకరు. వాడు కోరుకున్న గ్రూపులో రేపు సీటివ్వులే’’ అని చెప్పారు. అట్నుంచి ‘‘సార్ సార్... అలాగే సార్’’ అంటూ వినయంగా ఒక గొంతు వినబడింది. మురళి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. నాకు ఏనుగు ఎక్కినంత సంబరం. మరునాడు కళాశాలలో మురళికి బ్రహ్మరథం పట్టారు. పావలా ఖర్చు లేకుండా జాయిన్ అయ్యాడు మురళి. ఇంతకీ రామచంద్ర మాటకి ప్రిన్సిపాల్ నాయుడు ఎందుకంత విలువ ఇచ్చారో తరువాత తెలిసింది. ఆ కళాశాల యజమానులలో రామచంద్ర ఒకరట. ఏది ఏమైనా నేను చేసిన సహాయం చీమంత. ఆయన అందించిన సాయం సముద్రమంత.

- టంకాల సత్యంనాయుడు,
సారధి, రాజానగర పంచాయితీ.
సెల్: 9395355952.

మినీ కథ

కలయా... నిజమా?

రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం చుట్టూ పోలీసులు, మీడియా, భారీగా బందోబస్తు. ఒక పక్క విద్యార్థి సంఘాలు, మరో పక్క ప్రజలు అందరూ కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. పదకొండు గంటలకు కోర్టు తీర్పును వెల్లడించింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతం ద్వారా, వస్తువుల ద్వారా, భద్రతా రూపేణా, వివిధ మార్గాల్లో ప్రత్యక్షంగా ఆదాయం పొందుతున్నవారు, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపవలెను, లేనిచో వారు ఏ విధానం ద్వారా ఆదాయము పొందుతున్నారో దానిలో 50 శాతం కోత విధించబడును’ అని ప్రకటించింది. ఇక విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నాయి. టీవీలలో ఈ ప్రకటన రాష్టవ్య్రాప్త సంచలనమయింది. రాష్ట్ర మంత్రివర్గ కార్యదర్శి నుండి ప్రభుత్వ ఆఫీసులో అటెండరు వరకూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించవలసినదే. సాయంత్రం నాటికి రాష్ట్రంలో ప్రముఖ కార్పొరేట్ పాఠశాలల యజమానులు వార్తా చానెల్‌లో చర్చా వేదికలు చేయసాగారు. ఈ ప్రక్రియ ద్వారా కార్పొరేట్ పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది ఆర్థికంగా నష్టపోతారని, ప్రభుత్వ ఉద్యోగాలు లేక తమ పాఠశాలలో పనిచేసే నిరుద్యోగులు ఆర్థికంగా దెబ్బతింటారని వాదించసాగారు. వీటన్నింటినీ టీ కప్పులో తుపానులా కోర్టు తీసిపారేసింది.
మరునాడు రాష్ట్ర ప్రభుత్వం, న్యాయస్థానం తీర్పును ఉత్తర్వులుగా జారీ చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. ఇక ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మొదలయింది. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. డిఎడ్, బిఇడి పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ ప్రభుత్వం తమను ఆర్థికంగా దెబ్బతీసిందంటూ ధర్నాలకు దిగారు. కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విజేతలే కాక రేషన్ సరుకులు, పింఛను, ప్రజాప్రతినిధుల నెలసరి జీతం, ఔట్‌సోర్సింగ్‌లకు ఇచ్చే జీతం ఇవన్నీ ప్రభుత్వ ఖజానావే. మరి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించవలసినదే. అన్ని కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గి, డ్రాపౌట్స్ పెరిగాయి. లక్షలు పెట్టి కోట్లు సంపాదించాలనుకునేవారంతా తెల్లముఖం వేశారు. ఏడాదికి వేల రూపాయలు కట్టి తమ పిల్లల్ని చదివించేవారు అసలు ఒక్క రూపాయి ఇవ్వకుండానే తమ పిల్లల్ని చదివించడంతో కొంత చులకనగా భావింపబడ్డారు. ఈ విధానం ప్రారంభమై ఏడాది కాలం గడచింది. కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులు లేక మూసివేశారు. కొంత మంది పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించి వేల రూపాయలను పాఠశాలలకు కేటాయించారు. తమ సొంత డబ్బుతో పాఠశాలలను అభివృద్ధిపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉపాధ్యాయ, ఇతర సిబ్బంది ఉద్యోగాలు వేల సంఖ్యలో భర్తీ చేసింది. ఏడాది క్రితం చాలీచాలని జీతంతో పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ కోసం వేలకోట్ల నిధులు కేటాయించింది. అభివృద్ధికి ఇచ్చిన డబ్బు దానికన్నా అయిదింతలు ఎక్కువగా ఉంది. ఒకవేళ రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వం పట్టంగడితే ముందుగా విద్యా సంస్థలు నడిపించేది అంబానీలు మాత్రమే. టెక్నో, ఒలింపియాడ్, కానె్సప్ట్ వంటి తోకలు గల పాఠశాలల చిరునామా గల్లంతయింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులు విద్యార్థులతో నిండి ఉన్నాయి. ఒకప్పుడు డబ్బున్నవారి పిల్లలు ప్రత్యేక బస్సుల్లో పాఠశాలలకు వెళ్తుంటే లేనివారు కేవలం నడిచి లేదా సైకిల్‌పై వెళుతూ వీరిని చూసేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది.
ప్రభుత్వ పాఠశాలల ముందు ఖరీదైన కార్లు ఆగుతున్నాయి. అందులోంచి బయటికి వచ్చే విద్యార్థులు తమ పక్క నుండి నడిచివెళ్తున్న వారితో సమానంగా తరగతి గదిలో కూర్చుంటున్నారు. ఈ క్షణం కోసం వేల సంఖ్యలో ఎదురుచూపులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ విధానం అమలు విజయవంతమయింది. మరి మన ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

- చందన రవీంద్ర
శ్రీకాకుళం జిల్లా
సెల్ : 9492118960.

పుస్తక సమీక్ష

అంతరంగం
అభివ్యక్తీకరణం ‘అక్షరహారతి’

ఆధ్యాత్మికతకు అద్దంపడుతూ మానవత్వం కనుమరుగవుతున్న సందర్భాలలో అన్యాయాన్ని, అవినీతిని, అరాచకాల్ని అవలోకించిన వేళల్లో ప్రకృతి బీభత్సాన్ని కళ్లారా చూసినప్పుడు కవి ఎంతో ఆర్ద్రత చెంది ఆక్రోశించి కన్నీళ్లపరివృతమై అక్షర హారతులనిచ్చి మార్పును ఆ దైవమే చేయాలని వేడుకుంటూ అభివ్యక్తమైన సహజ సుందర సరళ కవితా సంపుటి, అక్షర హారతిని డాక్టర్ ఈటెల సమ్మన్న కమలాపూర్, కరీంనగర్‌వాసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకత్వం వహిస్తూన్న విలువలున్న విజ్ఞాని రచన. 42 కవితల సమాహారం.
కవిలో ఆర్ద్రత ఉంది. ఉన్నత ఆశయాలున్నాయి. వాటిని సంపూర్ణంగా ఆచరించి చూపే సత్తా ఉంది. ఆత్మవిశ్వాసం, నిబద్ధత, నీతి, నిజాయితీలు ఒకదానివెంట ఒకటి పరుగులు తీస్తూ వీరినాశ్రయించాయి. కవితలలో వస్తు వైవిధ్యముంది. భావ వ్యక్తీకరణలో సూటిదనం, నిర్మొహమాటం, నిక్కచ్చిలు చోటు చేసుకున్నాయి.
అమోఘ అనిర్వచనీయ అద్భుత అదృశ్య శక్తికి రుూ కావ్యాన్ని అంకితమీయడంలోనే కవి ఆధ్యాత్మికతను, అంతర్వాణిని, నవ్యతను, నిశిత దృష్టిని కవి ఆత్మావలోకనాన్ని ఆవిష్కరిస్తాయి.
ప్రముఖ కవివరేణ్యులు సినారెతో పాటు ప్రొఫెసర్ శ్రీనివాసశాస్ర్తీ, డాక్టర్ కె రమాదేవి, ప్రొఫెసర్ పరమాజీ, లలితా సూర్యప్రకాశ్, డాక్టర్ సాంబయ్యల ఆశీరభినందనలు పుష్టిని, దృష్టిని, దృక్పథాన్ని ఈ కావ్యానికి చేకూర్చాయి.
‘నేనో శృంఖలాలు లేని, స్వేచ్ఛా విహంగాన్నై అంతర్నేత్రాన్ని తెరుచుకొని, నా నిశ్చల మానసమున అనంతాత్ముడుకి, నన్ను నేను సమర్పించుకొని, మమేకమైపోతున్నాన’ంటూన్న పంక్తులు విశ్వకవి రవీంద్రుని వారి ‘గీతాంజలి’ని కళ్లముందు సాక్షాత్కరింపజేస్తాయి.
‘అంతుపట్టని రహస్యం’ ఖండికలో ‘జీవన నవరసాల్ని చవిచూసా, అపురూప ప్రాణుల్ని, పదార్థాల్ని నిశితంగా పరిశీలించా, నిత్యానిత్య సత్యానే్వషణలో, నీ అస్తిత్వం, అంతుపట్టదనే, పరమ సత్యాన్ని గ్రహించి, వౌనముద్రను దాల్చా’. ఈ పంక్తులు రవీంద్రుని భావజాలాన్ని తలపోస్తాయి. ‘కాలుష్యంకన్నా, అణుబాంబుకన్నా, మతదురభిమానం ప్రమాదకరమ’న్న కవి చింతన, మానవత్వాన్ని పరిరక్షించండి అంటూ నినదించిన తీరు గోకుల్‌చాట్ బాంబు పేలుళ్లకి కవి చలించిపోయి వ్యక్తీకరించిన హృదయ ఘోష అతని మానవతావాదాన్ని వ్యక్తీకరిస్తాయి.
విలువల మూలలపై ఆధారపడాలన్న సందేశం కొన్ని కవితల్లో కానవస్తుంది. కవి కల్పనాశక్తి, ఆసక్తి, రచనాశక్తి ఒకదానితో ఒకటి పోటీపడి రచనను కదం తొక్కించాయని చెప్పవచ్చును. చాలా కవితల్లో కవి మనోవేదన ఆక్రందన, ఆవేదన, ఆందోళన, ఆరాటం అగుపిస్తాయి. వాటితో అక్షర పోరాటం, అక్షర నినాదం, అక్షరవాదం, వేదం, అక్షర హారతి అన్నీ కలసి సమసమాజ స్థాపనాకాంక్ష, మానవతావాదం వెల్లివిరిసి పరిమళిస్తాయి.
కవి మున్ముందు, మంచి పాకాన కవిత్వం రాయగలడన్న ప్రగాఢ విశ్వాసంతో కవి సమ్మన్నను అభినందిస్తూ, వారికాదేవదేవుని కృపాకటాక్షవీక్షణాలు కలుగజేయాలని కోరుకుందాం. ప్రతులకు 9885238654లో సంప్రదించగలరు.

- చెళ్ళపిళ్ళ సన్యాసిరావు
సెల్: 9293327394.

మనోగీతికలు

మా పల్లెలు
అమ్మ ఆదరణను
నాన్న భద్రతతో జతకలిపి
అన్న అనుబంధాన్ని
అక్క ఆప్యాయతను కలగలిపి
స్వచ్ఛమైన తెలుగింటి
కుటుంబంలా
ఊరంతా
కలసికట్టుగా ఉండేవి!
ఒకేమాట పలుకుతో
ప్రపంచ జన జీవనానికి
స్నేహపూరక సందేశాన్నిస్తూ
చిరంజీవిగా చిరస్థాయిగా
నిలుస్తూ
దేశ బంగారు భవిష్యత్
బాటకు నాంది పలుకుతూ
ముందుకు సాగుతున్నాయి
మా పల్లెలు!

- పెయ్యల శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా-532185.
సెల్: 8886423116

నేతన్నా నీకిది తగదన్నా!
చావొక్కటే సమస్యలకు
పరిష్కారం కాదు!
మనిషి ఆశాజీవి!
బతకడానికి మార్గాలెన్నో!
ఆలోచిస్తే బతుకు పూలపాన్పు
ఆత్మవిశ్వాసమొక్కటే
కొసమెరుపు!
అప్పుడే విజయం
మిమ్మల్ని వరిస్తుంది
భావి జీవితం
మూడు పువ్వులు- ఆరు కాయలుగా
విరాజిల్లుతుంది!!

- కాళ్ల గోవిందరావు, శ్రీకాకుళం, సెల్ : 9550443449.

నా తెలుగు- జీవనది
అదిగదిగో ప్రవాహం!
ఉత్తుంగ తరంగాలతో ఉవ్వెత్తుకెగసి..
ఉరకలేస్తూ సాగుతోంది..
కాలం వేసిన అడ్డుకట్టలకు ఎదురీదుతూ
ఎక్కడికక్కడ దారులు వెతుక్కుంటూ-
సెలయేరులా ముందుకు పోతోంది
వేద నాదాల్ని వింటూ.. దేవ భాషతో సరితూగుతూ
సాహిత్యాభిలాషుల మెప్పుతో రాజభాషగా,
కావ్యభాషగా వెలుగొంది
ప్రాచీన భాషగా తన ఉనికిని చాటుతూ ప్రవహిస్తోంది..
భావాలను వివరిస్తూ భాషోన్నతిని చాటిచెప్తూ
భావోద్వేగాలను భాషతోనే శాసిస్తూ
మానవ మనుగడను తనలో ఇముడ్చుకుంటూ..
గ్రాంథికమై ఛందోలంకారాలతో శోభిల్లుతూ
ప్రాంతీయమైన యాసతో పరిమళిస్తూ
వ్యవహారికమై బతుకు చిత్రాన్ని ప్రతిబింబిస్తూ
జీవన శ్వాసగా పరిఢవిల్లుతోంది..
విదేశీ పదకోశాలను విచిత్రంగా తనలో కలుపుకొని
షడ్రుచులను మేళవించిన ఉగాది పచ్చడిలా
అమృత మాధుర్యాన్నందిస్తూ
వింతైన రీతులతో వయ్యారాలొలికిస్తోంది...
ఏ రాగమైనా సంగీతమేనన్నట్లుగా-
ఏ భాషనైనా తన సొంతం చేసుకుంటూ
ఎప్పటికప్పుడు తన గమనాన్ని మార్చుకుంటూ
నవ్య పదజాల నూత్న తరంగాలతో- ‘మన్మథ’ వసంతోత్సవ వేడుకలో
ప్రవహిస్తోందదిగో... నా తెలుగు... ఓ జీవనది!!
అమ్మ ప్రేమ ఉన్నంతకాలం- అడ్డులేదు మమకారానికి!
అమ్మ భాషను ప్రేమించేవారున్నంతవరకు- అంతంలేదు తెలుగుతరానికి!
రాష్ట్రాలెన్నున్నా- విశ్వవ్యాప్తంగా తెలుగుజాతి ఒక్కటేనని నినదిస్తూ-
తెలుగువారిమని గర్విస్తూ- తెలుగు మాటలను పలికేస్తూ-
తెలుగు తల్లిని గౌరవిస్తూ- తెలుగుదనాన్ని పంచేస్తూ ఉంటే...
కాగలదు మన తెలుగుజాతికి ప్రగతి!!

- కొల్లూరు పద్మజా శంకర్, సెల్ : 9494916420.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- టంకాల సత్యంనాయుడు