విశాఖపట్నం

పెళ్లయిన పదేళ్లకి...! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాపతిశర్మ హుషారైన కుర్రాడు. ఊర్లో మంచిపేరు, పలుకుబడి ఉన్న యువకుడు. మంచి మాటకారి, స్నేహశీలి. అతనికి ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడమంటేనే ఇష్టం. ఎప్పటికైనా బిజినెస్‌లో వెల్‌సెటిల్డ్ పర్సన్‌గా పేరు, పైసలు సంపాదించుకోవాలని కలలు కంటూ ఉండేవాడు. అగ్రవర్ణానికి చెందిన శర్మని అందరూ అనుకోకుండానే గౌరవిస్తుండేవారు. శర్మ చిన్నచిన్న వ్యాపారాలు మొదలుపెట్టాడు. కొన్నాళ్లు అన్ని వ్యాపారాలు చక్కగా నడిచాయి. తండ్రి జ్యూట్ ఫ్యాక్టరీ రిటైర్డ్ ఉద్యోగి. పెన్షన్ పెద్దగా రాదు. అంతా వందల్లోనే ఉంటుంది. తల్లి గృహిణి. అన్నదమ్ములెవరూ లేరు. ఒక అక్క ఉండేది. అక్కకు పెళ్లయి ఆకస్మికంగా మరణించింది. బావ కూడా కొద్ది రోజులకే చనిపోయాడు. అక్క, ఇద్దరు మగపిల్లల్ని కూడా శర్మే చేరదీసి చదివించి, పెద్దవాళ్లను చేశాడు. శర్మను అందరూ మెచ్చుకున్నారు. ఒకప్పుడు శర్మ కుటుంబీకులే ఆ గ్రామపెద్దలు. అందుకే అందరూ శర్మను మునసబుగారి మనవడు అనేవారు. కాలం నడుస్తుంది. శర్మ పిఠాపురం దగ్గర్లో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. అంతా సక్రమంగా ఉంది. అందుకే శర్మ పెళ్లి వైపు మొగ్గాడు. వరసకు మామ కూతురు అనూష, చాలా అందగత్తె, చురుకైనది. శర్మ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉంటే భర్త మరింత రాణించి వ్యాపారంలో లాభాలు ఆర్జించవచ్చని ఓర్పు, సహనంతో భర్తకు సాయపడేది. అలా కొన్నాళ్ల పాటు చక్కగా సాగిపోయింది. ఆ తర్వాత అనుకోని నష్టాలు వచ్చాయి. శర్మ చేసిన రకరకాల వ్యాపారాలు దివాలా తీసాయి. దాంతో శర్మ తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అమ్మేశాడు. అప్పులు తీర్చేశాడు. తర్వాత తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో స్థానిక మండల కార్యాలయంలో కంప్యూటర్ అసిస్టెంట్‌గా చేరాడు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగంలో చేరిన శర్మ, తనకున్న వ్యాపార లక్ష్యం వేధించి వెంటాడంతో ఉద్యోగాన్ని వదిలేయడానికి నిర్ణయించుకున్నాడు. అనూష శర్మని సరైన దారిలో పెట్టడానికి మంచి మాటలతో అతన్ని ఒప్పించి అతను ఉద్యోగం మానేయకుండా అడ్డుపడి ‘‘నేను కూడా మీకు సాయపడతాను’’ అని చెప్పి స్థానికంగా ఉన్న ఒక స్కూల్లో కంప్యూటర్ టీచర్‌గా చేరింది. కొన్నాళ్లు గడిచాక శర్మకు దగ్గరలో ఉన్న ఒక కెమికల్ కంపెనీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం రావడంతో అతను అక్కడ చేరాడు. అనూష చాలా సంతోషించింది. స్కూల్లో కంప్యూటర్ టీచర్‌గా పని చేసే కంటే, గవర్నమెంట్ ఆఫీసులో కంప్యూటర్ అసిస్టెంట్‌గా పని చేస్తే కొంత భవిష్యత్ ఉంటుందని ఆశిస్తూ, కంప్యూటర్ టీచర్ పోస్టు వదులుకుని తన భర్త మానేసిన ఉద్యోగంలో మండల పరిషత్ ఆఫీసులో చేరింది. భర్తకి కెమికల్ కంపెనీలో పని, తనకి కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం, మామ పెన్షన్, ప్రభుత్వ రాయితీ పథకాలు అండగా ఉండగా అనూష చాకచక్యంగా కుటుంబాన్ని చక్కగా నడుపుతుండేది. పిక్నిక్‌లు, పార్టీలు, సినీమాలు, క్యాంపులు ఎక్కువగా వుండేవి కాదు, వారంలో ఏడు రోజులూ నిరంతరం పని, పని, కృషి, కృషి అనుకుంటూ రుూ యువజంట డబ్బు సంపాదనలో తలమునకలై సాధారణ సరదాలకు కూడా దూరంగా వుండేవారు, అనూషకి మెడలో పుస్తెలతాడు తప్ప, నగానట్రా వుండేవి కావు, వున్నవన్నీ భర్త ఆర్థిక యిబ్బందులు సరిచేయడానికి అమ్మేసింది. తల్లిదండ్రుల నుండి రావలసిన కట్నకానుకలు పిల్లల భవిష్యత్ గురించి వుంచింది. ముందు జాగ్రత్తతో... భర్త తొందరపాటుతో వ్యాపారంలో డబ్బులు పెట్టేసి యిబ్బందులు పడుతుంటారని ఆమె భయం, డబ్బు వున్నా లేకున్నా యిద్దరూ చిలకా గోరింకల్లా వుండేవారు, యిద్దరిదీ ఒకే మాట, ఒకటేబాట, అనూషకి భర్త తప్ప మరో ప్రపంచమే లేదు, ఆణిముత్యాలు లాంటి యిద్దరు మగబిడ్డలే ఆమెకు సర్వస్వం, తాను పని చేస్తున్న ఆఫీసులో ఎంతో పంచిపేరు సంపాదించుకుంది. కష్టపడి పనిచేసే మంచి అమ్మాయిగా పేరు పొందింది. తన వృత్తిలో మంచి పట్టు సంపాదించుకుంది.
***
నారాయణదొర పాఠశాల టీచర్. అభ్యుదయ భావాలున్న మంచి యువకుడు, తన పనేదో తాను సిన్సియర్‌గా చేసుకుపోవడంతప్ప మరో వ్యాపకం లేని మంచి టీచర్. పరిచయాలు, ఫ్రెండ్స్ చాలా తక్కువ, సెన్సాఫ్ హ్యూమర్, నాలెడ్జ్ వుంది కానీ గృహపక్షి, వీధిలోకి పోయేరకం కాదు, అతని భార్య చారుశీల, అందంగా నాజూకుగా, చూడముచ్చటగా వుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె గొంతు హస్కీగా వుంటుంది. అందుకే ఆమెను చూసి వెంటనే ఎవరైనా ఆకర్షణలో పడతారు. ఆమె ఆధునిక భావాలు కల అమ్మాయి. పెళ్లై పదేళ్లు దాటినా, యిద్దరు పిల్లల తల్లయనా ఇంటర్, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్‌లా మోడ్రన్ డ్రెస్‌లు వేసుకుంటూ చాలా జోవియల్‌గా వుండే అమ్మాయి ఆమె. దొర, చారుశీలకు యిద్దరు పిల్లలు అనుకున్నాము కదా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి యిద్దరు పిల్లలు, మంచి కుటుంబం, కుటుంబంలో వుండే వాళ్లే అందుకే దొర, చారుశీల కుటుంబం వెల్‌సెటిల్డ్ ఫ్యామిలీగా గుర్తింపు పొందింది.
***
శర్మ, అనూష కుటుంబం దొర చారుశీల వుంటున్న వీధిలోనే అద్దెకు దిగింది. అనూష అయితే మంచి గృహిణి, ఆఫీసు, యిల్లు తప్ప యిరుగూ పొరుగూ పరిచయాలు అంతగా పెంచుకోవడాలు యిష్టములేని స్వాతిముత్యం, తక్కువ వయసులో ఎక్కువ వయసున్న వారి మనసుతత్వంతో వుండే మనిషి, 30 సంవత్సరాలు వయసు రాకపోయినా పంజాబీ డ్రెస్సులు కూడా వేసుకోవడానికి భయపడి, సిగ్గుపడి, ఎప్పుడూ చీరలే కట్టుకుంటూ, సాంప్రదాయానికి నిలువెత్తు సాక్షిగా వుండేరకం, శర్మ కొంచెం మోడ్రన్ టచ్‌వున్న మనిషి, వీధిలో వుంటున్న వారు కాబట్టి చారుశీలకు శర్మకు పరిచయం ఏర్పడింది. దొర కూడా మంచి భావాలున్న వ్యక్తే కావడంతో శర్మతో స్నేహానికి సిద్దమయ్యాడు.
శర్మ, దొర, చారుశీల స్నేహం పెరిగింది. గుడి, గోపురాలకు, సినిమాలకు, షికార్లకు, క్యాంపులకు, టూర్లుకు దొర, శర్మ ప్లాన్ చేసుకునేవారు, చారుశీల కలుపుగోలుగా వుంటూ దొర, శర్మ టూర్ ప్రోగ్రామ్స్‌కి సిద్ధమయ్యేది, అనూషకి యివన్నీ కొత్త, తాను తన పిల్లలు, కుటుంబం తప్ప సరదాలు, షికార్లు, కొన్నాళ్లు వద్దు అనుకున్న ఆమెకు దొర గారి కుటుంబంతో తన భర్త స్నేహం కొంచెం యిబ్బంది అనిపించినా భర్త యిష్టం కాదనలేక, తన తీరు మార్చుకుంది. చారుశీలతో స్నేహంగా వుండటం అలవాటు చేసుకుంది, అనూష కూడా హుందాగా వుండే పంజాబీ డ్రెస్సులు వేసుకోవడం అలవాటు చేసుకుంది. శర్మలో చాలా మార్పు వచ్చింది. 24 గంటలు వ్యాపారం గురించే ఆలోచించే శర్మ, చారుశీల, దొర కుటుంబ పరిచయంతో వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మోడ్రన్ డ్రెస్సెస్ వేయడం, ఎక్కువ సమయం సరదాలకి, షికార్లకి, సినీమాలకే కేటాయించడం, వ్యాపారం కన్నా దొరగారి కుటుంబంతో స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యత యివ్వడం మొదలుపెట్టాడు. అనూష ఎంత అమాయకురాలు అంటే భర్త ఏది చేసినా నవ్వుతూ ఆమోదించే వ్యక్తి. భర్త చారుశీల ఆకర్షణలో పడినా గమనించనట్లే కనిపిస్తుంది. కాలం గడుస్తుంది. శర్మ ఎంతో కొంత చారుశీల ఆకర్షణలో పడే వుంటాడు. ఖచ్చితంగా పడ్డాడు అనేయవచ్చు. యిక చారుశీల మనసులో ఏముందో తెలీదు. సరదాగా చిలిపిగా చలాకీగా వుంటుంది. శర్మతో కలుపుగోలుగా వుంటుంది. అంతమాత్రాన తప్పుపట్టలేము, అనుమానించలేము. వారి మధ్య స్వచ్ఛమైన స్నేహమే వుండవచ్చు. దొరకూడా ఎప్పుడూ అనుమానించలేదు. భార్యని కాని, శర్మని కానీ తప్పుడు భావంతో చూడలేదు. పైగా శర్మతో వ్యాపారంలో పార్టనర్‌గా చేరాడు. సంతోషంగా మాస్‌వద్ద మాస్‌లా, క్లాస్ వద్ద క్లాస్‌గా వుండే శర్మ చిన్న చిన్న వ్యసనాలు అలవాట్లు వున్నవాడే. అయినా దొరకు ఏ అలవాట్లు లేవు, వారిద్దరి మధ్య స్నేహమే. సూర్యుడు, చంద్రుడు స్నేహంలా వుంటుంది. ఇక చారుశీల, అనూష బంధం, లేటెస్ట్ సినిమా హీరోయిన్, బ్లాక్ అండ్ వైట్ సినిమా హీరోయిన్ కనిపిస్తే వుండే బంధంలా వుంటుంది చూద్దాం. చారుశీల, శర్మ బంధం పవిత్రంగా స్వచ్ఛమైన స్నేహంగా వుంటుందా! లేదా ఏదైనా విపరీత పరిణామాలకు దారితీస్తుందో వేచి చూద్దాం! కానీ వారి స్నేహం స్వచ్ఛంగా పవిత్రంగా వుండాలని కోరుకుందాం, దొర, అనూష ప్రేక్షక పాత్ర వహించకుండా, వారి వారి జంట పక్షుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిరక్షించుకోవాలని కోరుకుందాం.

- మీగడ వీరభద్రస్వామి,
చోడవరం,
విశాఖ జిల్లా-531036.
సెల్ : 9441571505.

మినీకథ

ఆలనలో... లాలనలో!

రాత్రి రెండు గంటలప్పడు దిగ్గున ఉలిక్కిపడి లేచింది పరిమళ. లేచిన వెంటనే లైట్ వేసింది. ఆమె ముఖం నిండా చెమటలు. ధారగా కారుతున్నాయి. గదిలో ఏసి చల్లదనాన్ని పంచుతున్నా పరిమళకి ఉక్కపోతగా అనిపిస్తోంది. లైటు వెలుగుతో ఆమె భర్త సూర్యం కూడా నిద్రలేచాడు.
‘‘పరిమళా! ఏమైంది? ఆ చెమటలు ఏమిటి?’’ ఆమెని ప్రశ్నించాడు.
ఆమె సమాధానం చెప్పలేదు.
టవల్ తీసి ఆమెకి అందించాడు సూర్యం.
అతను ఆమె దగ్గరకి వెళ్లి ఒంటిపై చెయ్యి వేశాడు.
అంతే...
ఆమె కళ్ల నుండి నీళ్లు ధారల్లా కారిపోవడం మొదలయింది.
అతనికి ఆమె పరిస్థితి ఏమిటో అర్ధం కాలేదు.
అతను మాట్లాడలేదు.
కొద్దిసేపటికి ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది.
‘‘మన కిశోర్ అమెరికా వెళ్లడం నాకు ఇష్టం లేదు’’ అంది.
‘‘దీనికి నువ్వు ఒప్పుకున్న తర్వాతే కదా వాడు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. పైగా ఉద

- జి. కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం.
9441567395.యమే ప్రయాణం. పడుకునే ముందు బాగానే ఉన్నావు కదా. ఇంతలో ఏమైంది?’’ ఆందోళనగా అడిగాడు సూర్యం.
‘‘ఏమైందా? నేను ఒంటరినయ్యాను. ఇక ఒంటరిగానే మిగిలిపోతానేమోనని భయంగా ఉంది. అందుకే వాడిని అమెరికా వెళ్లొద్దని అంటున్నాను’’
‘‘నువ్వు ఒంటరేమిటి? అసలేం మాట్లాడుతున్నావు? కిశోర్ మన వారసుడు. వాడు పుట్టినప్పుడు ఎంతో ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం కొంత కాలమే అనుభవించాను. కారణం నేను చేసే ఉద్యోగం. ఆ ఉద్యోగం వల్ల వాడిని బేబీకేర్ సెంటర్‌లో ఉంచాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్లేస్కూల్, అటు తర్వాత హాస్టల్లో చదువు. టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్ అంటూ వాడు నా దగ్గర గడిపింది ఎక్కడ? ఇప్పుడు నేను రిటైరయ్యాను. వాడు ఎంటెక్ కోసం అమెరికా వెళుతున్నాడు. అక్కడే ఉద్యోగం సంపాదిస్తాడు. అక్కడే పెళ్లి చేసుకుని సెటిలైపోతాడు. ఇక వాడు నా దగ్గర ఉండేది ఎప్పుడు? ఒద్దు... మనం కూడా వాడితో అమెరికా వెళ్లిపోదాం’’ అంది.
‘‘సరే అలాగే వెళ్లిపోదాం. అక్కడికి వెళ్లి మనం చేసేదేముంది?’’ అన్నాడు సూర్యం.
‘‘ఏమో నాకు తెలియదు. నాకు మన బాబు కావాలి. వాడికి చిన్నప్పుడు పాలివ్వలేదు, లాల పోయలేదు. లాలించలేదు. అందుకే ఇప్పుడు వాడికేమేం కావాలో అన్నీ చేయాలని ఉంది. వాడు అమెరికా వెళితే నాకు దూరమైపోతాడు. అందుకే వాడు ఇక్కడే ఉండాలి. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. మనవడో మనవరాలో పుడితే వాళ్లను ఎత్తుకుని ఆడించాలి. లేకపోతే ఈ జన్మ వృథా’’ దు:ఖంతో బాధగా అంది పరిమళ.
సూర్యం భార్యని చూస్తుండిపోయాడు. ఆమెలో ఉన్న ఈ ప్రేమ ఇన్నాళ్లూ ఏమైపోయిందో అనుకున్నాడు.
‘‘పరిమళా వెళ్లు! కిశోర్‌కి చెప్పు. ఇప్పటి వరకు నువ్వు ఏం కోల్పోయావో వాడికి చెప్పు. మళ్లీ తెల్లవారితే వాడు మనకి కనిపించడు. విదేశాలకి ఎగిరిపోతాడు’’ అని సూర్యం అనగానే పరిమళ గబగబా కిశోర్ గదికి వెళ్లింది చెప్పలేనంత ఆనందంగా, ఉప్పొంగుతున్న ప్రేమతో...
- నల్లపాటి సురేంద్ర,
కొత్త గాజువాక,
విశాఖపట్నం.
సెల్ : 9490792553.

పుస్తక పరిచయం

రైతు వేదనకు అక్షరరూపం వెన్ను విరిగిన కంకులు
సామాజిక బాధ్యతను కవులు నెత్తికెత్తుకున్నాక సమస్యల తీరుతెన్నులను, వాటి పరిష్కారాలను తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రక్రియపరమైన వాదనలటుంచితే పద్య సామీప్య లక్షణాలున్న గేయం అనుప్రాసలతో అంత్యప్రాసలతో నాలుగు పాదాల ప్రమాణంతో రాయగలగడంలో కొందరు నేర్పరులు. అలాంటి వారిలో డాక్టర్ మక్కెన శ్రీను ఒకరు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి దాని అనుబంధ శాఖలాంటి పశు సంవర్ధకశాఖలో ఆచార్యకత్వం వహిస్తూ, రైతు కష్టాలను నాలుగు ఉపశీర్షికల కింద ముక్త లక్షణమైన గీతికలను రాసి కవిత్వాన్ని ‘రాశి’బోసి రైతన్నను ఆవిష్కరించారు. రైతుకు ఈ కవి అభివాదం చేస్తూ పలికిన పలుకులు చదవండి. ‘నిరాశ నిస్పృహ ఎరుగని నేలరేడు/ ఆత్మస్థైర్యమే ఆయుధమైన సేద్యకాడు/క్షామం తీర్చుటయే కర్తవ్యమనేవాడు/క్షేమం కోరుటయే అభిమతమైనవాడు’. ఆకలిని హరించే హలం పాడే గాత్రంగా మానవత మిళిత ఆకుపచ్చ చిత్రంగా ఈ రచయిత క్షామ నివారణా కంకణ బద్ధుడని చెప్పడం ఆర్ద్రతగా ఉంది కదూ. ఇక శ్రమ వేదంలోని కవితావాదమేమిటో గమనిద్దాం. ‘కంకుల సంజ్ఞలే సంకేతాలు/ ఆకుల ఊగిసలు గెలుపుకేతనాలు/ ఎదిగిన పైరుని కాంచి సంతసాలు/ ఒదిగిన తీరును చూసి సంబరాలు’. పచ్చకేతనాలెత్తిన ఈ స్వచ్ఛమైన కర్షక కవి అందమైన అంత్యప్రాసలతో బలమైన కవిత్వాన్ని రాసే నేర్పు అభినందించాల్సిందే. ఉత్తరలో ఊడ్చుటకంటే ఏడ్చుట మేలని, కృత్తికలో నాటితే కుత్తిక నిండదని కార్తెల లక్షణాలను లిఖిస్తాడు ఈ కవి. రైతు పెట్టే ఆర్తనాదం మన గుండెను దొలిచేదిగా, పేగుల్ని తెంచేదిగా ఉంది. ‘మట్టి నోట మింగని జలధారలు/నోట మట్టి కొట్టే నకిలీ విత్తనాలు/ ఏటా పెరిగే రసయనాల ధరలు/రైతుకు మిగిలేది కన్నీళ్ల పొరలు’. ఆకాశం నిరాశను మిగిల్చితే, నకిలీ విత్తనాలు రైతు జీవితాన్ని కకావికలం చేస్తే, పచ్చని పైరు హారతులు ఎలా ఇస్తాడు, కాసుల రాశులనెలా మోస్తాడు? ఆశావహ దృక్పథంతో కవి తెలుపుతున్న సమ్మోదంలో మనం గమనిస్తే ‘రైతు తలగుడ్డవ్వాలి జాతి పతాకం/ ఎర్రకోటపై ఎగరాలి సేద్య కపోతం/రైతు రంగా ఆశయాలే రైతుకు భోజ్యం/గాంధీజీ కన్న కలలే గ్రామ స్వరాజ్యం’.
రైతు వేదనా వేదం నుండి ఈ దృశ్యాలన్నీ పంట భూముల వేదికగా రైతు జీవన దృశ్యాలను అంత్యప్రాశల విన్యాసంతో, ఆరాధనా భావంతో, దిగులు పడుతున్న రైతునే, వెన్ను విరిగిన కంకిగా, ప్రతీకను చేస్తూ నాలుగు వేళ్లు నోటికందించే ఈ అన్నదాత మన్ను పాలవుతున్నాడన్న ఆవేదన, నలుదిశలా అతనికి కమ్ముతున్న నిరాశా మేఘాలను, నీరుగారిన బతుకును అక్షరబద్ధం చేసి కర్షక లోకపు ఘర్షణలన్నీ పరామర్శించిన ఆచార్య మక్కెన శ్రీను నిజమైన రైతు కవి. అక్షరం అక్షరంలో కృషీవలుని విషాదగాథను, రుషిలాంటివాని దీనస్థితిని రైతు కవిత్వమై చెప్పగలిగిన వీరికి అభినందనలు.

- కిలపర్తి దాలినాయుడు,
వెల్లంకి వీధి, సాలూరు-535591,
విజయనగరం (జిల్లా).
సెల్ : 9491763261.

మనోగీతికలు

వీరసైనిక వందనము
జోహారు జోహారు వీరుడా
వెన్నుచూపని ధీరుడా
మరువలేమురా వీరుడా
నీ సేవ, త్యాగము ధీరుడా
జోహారు వీరుడా జోహారు
నీకు సలాము ధీరుడా
తల్లి రుణము తీర్చ ధీరుడా
బ్రతుకు బాటలో వీరుడా
నీవు బలి అయిపోయావు ధీరుడా
జోహారు జోహారు వీరుడా
నీకు సలాము ధీరుడా
గుండె నిండుగా వీరుడా
నీవు గుర్తుండిపోతావు ధీరుడా
జన్మభూమి రుణము వీరుడా
నీవు తీర్చుకున్నావయ్యా ధీరుడా
జోహారు జోహారు వీరుడా
నీకు నా సలాము ధీరుడా
సియాచిన్ వంటి సైనిక స్థావరాలలో
మంచుకొండల నడుమ
నిరంతరం మృత్యువుతో
పోరాటం చేస్తూ భరతమాత
రుణం తీర్చనెంచి
సరిహద్దుల్లో పహారా కాస్తూ
తమ ప్రాణాలు
సైతం పణంగా పెడుతున్న వీర జవానులారా సలాం మీకు సలాం!

- మండా శ్రీ్ధర్, శ్రీకాకుళం,
సెల్ : 9493309030.

ఊహాగానాలు
మనిషి మనోభావాలు
ఊహలకందవు
తనకే తెలియనంతగా
చిత్ర విచిత్రం
తన భావనలు తానే
ఎరుగని తనంతో
ఎప్పటికప్పుడు ప్రకటించడము
తనకి నచ్చని విషయాల్ని
ఇతరుల అయిష్టాలుగా
సంభాషించడం అలవాటుగా
ఎవరో ఏదో తనను అన్నారనో
అంటారనో అంతులేని ఊహలు
ఈ ఊహాగానాలు ఎప్పటికీ
తెగవు ముడిపడవు కడదాకా
తనంటే ఎరుక లేనితనం
తన అవసరం తెలియనితనం
నిత్యం ప్రపంచంతో వ్యవహారం
ఊహాగానానాలతో అయోమయం
పరిస్థితిని యథాతథంగా
పరిసరానికి తగురీతిలో
ఇతరులతో అనుగుణ్యం
మనిషిలో ఎప్పటికి వచ్చేను?
కుటుంబ వ్యక్తులపై రాగద్వేషాలు
స్నేహితులలో అపోహలు
ఆధిపత్యం ఎక్కడైనా తనదవాలని
అలుపెరుగని ఆరాట, పోరాటాలు
ఉన్న సత్యం ఒకటైతే ఎప్పుడూ
తలచేది ఊహించేది వేరొకటి
సత్య దర్శనం కడు దుర్లభం
అనునిత్యం ఊహాల్లో జీవనం!
మనిషి జీవిత పర్యంతం
తన ధోరణిలో తానుంటూ
సత్యశోధనకై ప్రయత్నపడక
అవాస్తవికతలో ఊహాగానాలు
మనిషికి మిత్రుడైనా శుత్రువైనా
తనకి తానే అన్నది గీతాబోధ
దీనిని అంగీకరించని అజ్ఞానం
లోపల గుర్తించకయే వెలుపల వెతుకులాట!
- జి. కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం.
9441567395.

మనసంతా నువ్వే
నీవు నీ రూపంతో
అలా గాలిని మీటి
నల్లపూసవైపోతే
ఆ గాలి సోకిన నా మానసవీణ
ఎందుకనో నిత్యం
నీ రాగానే్న ఆలపిస్తుంది
నిన్ను మరచిపొమ్మన్నది
సామ, దాన, దండోపాయాలతో
మనసుని హెచ్చరించి
నీ జ్ఞాపకాలన్నింటిని
ముక్కముక్కలు చేసినా
ఆ పగిలిన నా మనసులోని
ప్రతి ముక్కలోనా
నీ రూపమే కనిపిస్తుంది
ఎంత ప్రయత్నించినా
నీ జ్ఞాపకం
నిన్ను నాలో నింపేస్తుంది
నన్ను నీవుగా మార్చేస్తుంది

- గగనం శ్రీనుకుమార్,
పాతవీధి, యలమంచిలి.
సెల్ : 8008262514.

ఆమె
ఆమె మాతృమూర్తి
మనసును ఉర్రూతలూగించు
ఆనంద ప్రదీప్తి
కవోష్ట సుధారస మధురమూర్తి
మధురభవనామయ స్ఫూర్తి
జన్మనిచ్చి కనిపెంచిన ఆ తల్లి
ఆశల పాలవెల్లి మమతల కల్పవల్లి
ఆమె ఆశలు ఆనందవీచికలు
ఆమె బాధలు విషాద సూచికలు
ఆమె నిట్టూర్పులు
నిరాశామయ నివేదనలు
అందుకే నా మాతృమూర్తి
మనసును ఉర్రూతలూగించు
ఆనంద ప్రదీప్తి
మధుర భావనామయ స్ఫూర్తి
నాదు భవితవ్యానికి రసమయ భావనకు
రసావలంబనకు ఆ మాతృమూర్తి
వెలలేని తులలేని మణికీర్తి

- యలమంచిలి శివాజీ, పోస్టుకాలనీ,
పినగాడీ రోడ్డు, పెందుర్తి మండలం, పెందుర్తి,
విశాఖపట్నం-530047.
email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- మీగడ వీరభద్రస్వామి