విశాఖపట్నం

నాన్న మాట! (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మా నాన్న చనిపోయే ముందు మీ నాన్నకి ఏం చెప్పారు?’’ అడిగాడు రాంప్రసాద్ భార్య కౌసల్యని.
‘‘నేను విన్నానా’’ అంది కౌసల్య.
‘‘నాకు తెలియాలి అది’’
‘‘అయితే మా నాన్నని అడగండి’’
‘‘మీ నాన్న నిజం చెబుతాడని అనుకోను’’
‘‘అయితే ఊరుకోండి’’
‘‘నీ జవాబేం బాలేదు’’ కోపంగా అన్నాడు రాంప్రసాద్.
‘‘నాకు తెలియని విషయం అడిగితే జవాబిలాగే ఉంటుంది మరి’’
‘‘మీ నాన్నో నెంబర్‌వన్...’’ అంటూ ఆగాడు.
‘‘అది పెళ్లికి ముందే అడగాల్సింది’’
‘‘అప్పుడు తెలియదు’’
‘‘మా నాన్నా అలాగే అనుకుంటున్నాడు’’
‘‘మాటలు నేర్చావ్’’
కౌసల్య ఆవేదనంతా క్షణాల్లో పెల్లుబుకింది.
‘‘మాటకీ మా నాన్నని అంటారు. ప్రేమించానన్నారు. మీరు ఇష్టపడి చేసుకుంటానని అనడంతో మా నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించకుండా టీచర్ ట్రైనింగ్ చేయించాడు. మరీ పెద్ద చదువులు చదివితే మీరు చేసుకుంటారో8 లేదో అన్న భయంతో. మీరూ బియిడి చేస్తే సంతోషించారు. ఉన్నంతలో ఏ లోటూ లేకుండా పెళ్లి చేశారు. అప్పట్లో మీ ఉద్యోగం పోయినా పెళ్లయ్యే వరకూ అది బయటికి పొక్కుకండా గుంభనంగా ఉంచింది మీరు. అది తెలిస్తే పెళ్లి కొన్నాళ్లు వాయిదా పడుద్దని మీ భయం. ఆడపిల్లనే అయినా నిశ్చితార్థం జరిగే వరకు నన్నూ, అన్నయ్యని కంటికి రెప్పలా చూశారు నాన్న. మీకో విషయం తెలుసా తనతో మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్లు, ఎక్కువ సేపు మాట్లాడేవాళ్లు లేక మీరంటే ఎంత ఇష్టపడ్డారో’’
‘‘మీ పుట్టింటి గొప్పలు చెప్పనక్కరలేదు’’ ఎకసెక్కంగా అన్నాడు రాంప్రసాద్.
‘‘అవేం గొప్పలు కాదు నిజాలే’’ అంది కౌసల్య.
‘‘ఏమైనా మీ నాన్న...’’
‘‘మా నాన్న గురించి ఎక్కువ మాట్లాడకండి. చదువు, సంస్కారం ఉన్నవాడు గనుక మీరు ఇష్టపడ్డారని నన్ను ఒప్పించి వివాహానికి తొందరపెట్టారు. మీరు మాత్రం పెళ్లయిన రెండేళ్లే నాతో ఆప్యాయంగా ఉన్నారు. తర్వాత మరేం అయిందో ఒక్కోసారి ఎడమొహం పెడమొహంగా ఉండడం మొదలుపెట్టారు. మా నాన్న ఈనాటికీ మా అమ్మని ఒక్క మాట అని ఎరగరు. వాళ్లది పాతికేళ్ల అనుబంధం. అమ్మ ఇష్టానిష్టాలను నాన్న గౌరవిస్తారు. బయట ఏమీ తినరు. ఏదైనా తెస్తే భార్యాపిల్లలు తినకుండా తినరు. గట్టిగా, కోపంగా మాట్లాడడం కూడా చేయరు’’ అంది కౌసల్య.
రాంప్రసాద్‌కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది.
ఎందుకంటే అతను స్నేహితులతో కలసి బయట తినేసి ఇంటికి వస్తుంటాడు చాలాసార్లు.
ఈ టాపిక్ రావడంతో అతనికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
‘‘ఏమైనా మొగుడికన్నా మీ నాన్ననే ఎక్కువ సమర్థిస్తున్నావు. నా కన్నా మంచి సంబంధం చూసుకోవలసింది’’ వాదనలో ఓడిపోతూ కసిగా అన్నాడు.
‘‘మీకు తెలియదు మా అన్నయ్య కన్నా నాకే ఎక్కువ మార్కులు వచ్చేవి. నన్నూ ఇంజనీరింగ్ చదివిద్దామని అనుకున్నారు. ఒక్క క్షణం డబ్బు గురించి ఆలోచించి... మరో క్షణం అంత చదువు చదివితే నన్ను మీరు వివాహం చేసుకోనని అంటారేమోనని ఎంత మధనపడ్డారో’’
‘‘నాకన్నా ఆప్యాయంగా నిన్ను ఎవరు చూస్తారు?’’
‘‘అవునవును... భార్య ఏదైనా మాట చెబితే ఆలోచించకపోవడం, రోజుల తరబడి భార్యతో మాట్లాడకపోవడం గొప్పనుకోవడం, పిల్లలతో సరిగ్గా గడపకపోవడం, భవిష్యత్ గురించి ఆలోచించకపోవడం, భార్య తిన్నదా లేదా, తనూ ఒక మనిషే అని ఆలోచించకపోవడం... ఎన్నని చెప్పను మీ సుగుణాలు?’’ బాధగా అంది కౌసల్య.
‘‘ఏం పెళ్లికి ముందు మీ నాన్నకి నా గురించి తెలియదా?’’ అన్నాడు రాంప్రసాద్.
‘‘నిజం చెప్పాలంటే అసలు తెలియదు. మీ కుటుంబం గురించి గొప్పగా విని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు’’
‘‘నేను కట్నకానుకలు అడిగానా?’’
‘‘మా నానే్నమైనా ఇచ్చానని చెప్పాడా ఎవరికైనా? మీకు తెలుసో లేదో మీ నాన్నగారు అంటే మామయ్యగారు కేవలం లాంఛనాలుగా అయిదువేలు మాత్రం అడిగారని ఎంత మురిసిపోయారో’’
‘‘మీ గొప్పలు చెప్పుకోవడం మానవు’’
‘‘ఇవి గొప్పలు కావు నిజాలు. పెళ్లయింది మొదలు మా నాన్న అమ్మతో కష్టసుఖాలు పంచుకునేవారు. సర్దుకుపోయే మనస్థత్వం కూడా నాన్నకు ఎక్కువే. లేకపోతే అప్పట్నుండి ఇరవై అయిదు సంవత్సరాలు ఏ పొరపొచ్చాలు లేకుండా ఎలా గడుపుతారు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇది మా అమ్మ చెప్పింది. అమ్మ, నాన్న పెళ్లయి రెండేళ్లు గడిచాక నాలుగైదు సార్లు చెప్పిన మాట వినకపోయే సరికి సరదాగా మీ అన్నయ్యో, తమ్ముడో ఎవరో ఒకరి ఇంటికి వెళ్లి నాలుగు రోజులు ఉండి రా. నీకూ, నాకూ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడుండి ప్రతిదానికీ విసుక్కోకు అని పంపించారు. అమ్మ వాళ్ల అన్నయ్య దగ్గరకి వెళుతుండగానే ఫోన్ చేసి ఒరేయ్ మీ చెల్లెలు ఇంటికి వస్తోందిరా. ఇక్కడ పనిపాట్లు చేసి అలసిపోయింది. అక్కడేం పని చెప్పకండి. ఉన్నన్ని రోజులు కష్టపెట్టకుండా చూసుకోండి అన్నారట. మరి మీరో నన్ను మా ఇంటికి దిగబెట్టాక రోడ్డు మీద నుండే వెళ్లిపోతూ అందరి దృష్టిలో మా నాన్నకు విలువ లేకుండా చేశారు. ఇదీ తేడా ఇద్దరికీ’’
‘‘మీ నాన్నదే తప్పు. మొన్న నీ ఆరోగ్యం విషయంలో నేను నిర్లక్ష్యం చేశానని, తానైతే శ్రద్ధగా చూసుకుంటానని అన్నారు. అది తప్పు కాదా? అయినా నువ్వు చెప్పేది ఇంత ఓపిగ్గా వినడం నాదే తప్పు’’ విసుగ్గా అన్నాడు రాంప్రసాద్.
‘‘అలా అనకండి. ఎదుటి వారు చెప్పేది వినండి. మా నాన్న అయితే చెప్పాల్సింది చెప్పి ఆలోచించమనే వారు. మా మాటలో ఎక్కడ తప్పుందో సలహా ఇచ్చేవారు. తాను కోల్పోయిన ఆప్యాయతల్ని మాకు పంచేవారు. మరి మీరో ఎప్పుడు కోపగించుకుంటారో, ఎప్పుడు నవ్వుతారో తెలియదు. నేనూ, పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉంటాం’’
‘‘ఎంతసేపూ నీ గురించి, మీ నాన్న గురించేనా చెప్పడం’’
‘‘కాదండీ! మన గురించి మనం మాట్లాడుకోవడం. పిల్లల పట్ల మీరు ఏమాత్రం ప్రేమ చూపించడంలేదు. మా నాన్న అలా కాదు. పిల్లల కోసం ఎంత కష్టమైనా పడతారు. మొన్న ఇంటికి వెళ్లాను. అప్పుడు నాన్న, అమ్మ బాబుగాడిని తీసుకుని ఎగ్జిబిషన్‌కి వెళ్లారు. నేను వెళ్లలేదు. అక్కడ బాబుగాడు నాన్నగారి కళ్లద్దాలు విరగ్గొట్టేస్తే వాడిని ఏమీ అనలేదు. అమ్మని, బాబుగాడిని ఆటోలో ఇంటికి పంపించి, ఆయన తెలిసిన వాళ్ల షాపులో కళ్లద్దాలు బాగు చేయించుకుని రాత్రి పదకొండుకి ఇంటికి వచ్చారు. మళ్లీ అప్పుడు డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి పదోన్నతి పొందడానికి పరీక్షకు చదివారు. అంత ఓపిక ఆయనకి’’
‘‘మీ నాన్న చాలా గొప్పవాడు. నేనే చెడ్డవాడిని. ఇక ఆపు నీ సోది’’ విసుక్కున్నాడు రాంప్రసాద్.
టై, బూట్లు విప్పి స్నానానికి వెళ్లాడు.
ముగించుకుని వస్తూనే ‘‘అయితే మా నాన్న మీ నాన్నకి ఏం చెప్పి ఉంటాడంటావ్’’ అంటూ ప్రశ్నించాడు.
‘‘చెబుతాను బాబూ చెబుతాను’’ అప్పుడే అక్కడికి వచ్చిన కౌసల్య తండ్రి అన్నాడు.
అతన్ని చూడగానే రాంప్రసాద్ ముఖం చిట్టిస్తే, కౌసల్య మాత్రం సంతోషంగా అతనికి ఎదురెళ్లింది.
మంచినీళ్లు తెచ్చి తండ్రికి ఇచ్చింది.
‘‘నాన్న ఇదేనా రావడం?’’ అంది.
‘‘అవునమ్మా! ఊర్లో చిన్న పనుండి వచ్చాను. ఎలాగూ వచ్చాను కదా నిన్ను, అల్లుడిని, బాబుగాడిని చూసి పోదామని వచ్చాను’’ కౌసల్య చూపించిన కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
రాంప్రసాద్ వౌనంగా ఉండిపోయాడు.
‘‘ద్వేషంతో కాదు ప్రేమతో ఎదుటి వారిని జయించాలి. పరుషంగా మాట్లాడి, దండించడం ద్వారా ఎదుటి వారిలో మనం కోరుకునే మార్పు గానీ, మంచి గానూ చూడడం అనేది జరగదు. ప్రేమతోను, ఓర్పుతోను, సహనంతోను ఇది సాధ్యమవుతుంది. అలా తన కొడుకు ఇంటిని కోడలు శాంతిమయంగా చేయాలని, అదే తాను కోరుకుంటున్నట్లు మీ నాన్నగారు నాతో మరణానికి ముందు చెప్పారు బాబూ. ఆ మాటే నేను నా కూతురు... అదే నీ భార్య కౌసల్యతో చెప్పాను. అందుకే అది నీవెన్ని బాధలు పెడుతున్నా సహించింది. నీపై ప్రేమ, అనురాగాలనే కురిపించింది’’ చెప్పి వచ్చిన పని అయిపోయినట్లు లేచి నిలబడ్డాడు కౌసల్య తండ్రి.
‘‘నాన్న వెళ్లిపోతారా? ఉండండి భోజనం చేసి వెళుదురు’’ అంది కౌసల్య.
‘‘ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా భోంచేస్తానమ్మా. వస్తాను అల్లుడుగారూ’’ అంటూ బయటికి నడిచాడు అతను.
‘‘మీరు మాతో గడపకుండా కోల్పోయిన క్షణాలు, రోజులు, ఆప్యాయతలు తిరిగి రమ్మన్నా మళ్లీ రావు. మనిషి బాల్యం పదేళ్లు, యవ్వనం ఇరవై ఏళ్లు. తర్వాత బాధ్యతలు, ముసలితనం. ఈ కాలంలోనే నిద్ర, పని ఇలాంటి వాటన్నటికీ కాలం పోతే నిజంగా ఎనభై ఏళ్ల జీవితంలో గడిపేది ఇరవై ఏళ్లే. తిరిగి చూసుకుంటే గతం మిమ్మల్ని వెక్కిరించకమానదు. మీ నాన్న అయినా, మా నాన్న అయిన పిల్లలకి చెప్పేది ఇదే’’ అంది కౌసల్య.
రాంప్రసాద్ మాట్లాడలేదు.
ఎన్నడూ లేని విధంగా పిల్లాడితో ఎక్కువ సేపు ఆడుకోవడం, భార్యతో సాయంత్రం లేదా రాత్రి కొంత సమయం గడపడం, సుఖమయ సంసారం అలవాటు చేసుకున్నాడు మర్నాటి నుండి.
- శ్రీనివాసభారతి,
శ్రీకాకుళం.

కథ
దృష్టి

రామారావు, వెంకటరావు అన్నదమ్ములు. పెళ్లిఅయిన తరువాత కూడా ఒకే యింట్లో ఉంటున్నారు. ఇద్దరికి చెరొక కుమారుడు ఉన్నారు. ఇంట్లో అందరూ ఒకరంటే ఒకరికి మంచి అభిమానం ఆప్యాయతతో ఉంటారు. ఇద్దరు పిల్లలూ (రాజేష్, గణేష్‌లు) ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో ప్రక్క ప్రక్కన కూర్చుంటారు. యిద్దరికీ అన్నీ సమానంగా అందుతాయి. గణేష్‌కి అన్ని పరీక్షలలో ఎక్కువ మార్కులు, గ్రేడులు వస్తాయి. రాజేష్‌కి మాత్రం చాలా తక్కువగా వస్తుంటాయి. వయసు తల్లిదండ్రుల ప్రేమ, సౌకర్యాలు, బహుమతులు, పాఠశాల, తిండి, బట్టలూ అన్నీ సమానంగా ఉన్నాయి. వచ్చే మార్కులే అసమానంగా ఉన్నాయి. ఒకరోజు వీళ్ల మావయ్య ఇంటికి వచ్చాడు. ఆరోజు ఆదివారం కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వాళ్లతో కాసేపు ఆడుకుని తరువాత ఒరేయ్! అబ్బాయిలూ పుస్తకాలు తీయండ్రా! అన్నాడు. గణితంలోను, సామాన్య శాస్త్రంలోను, ఆంగ్లంలోను ప్రశ్నలు వేసాడు. మార్కులు కూడా అడిగి తెలుసుకున్నాడు. అదేమిట్రా! యిద్దరూ ఓకే పాఠశాలలో ఒకే తరగతిలో కూర్చుంటున్నారు. ఏమిటి ఈ తేడా? అంటూ ఒరేయ్ గణేష్ నువ్ వెళ్లి ఈ న్యూస్‌పేపర్ కొనుక్కునిరా అని డబ్బిచ్చి బయటికి పంపాడు.
ఒరేయ్ రాజేష్! మీకు లెక్కలు ఎవరు చెపుతార్రా? అని అడిగాడు కృష్ణమూర్తి మాష్టారు మావయ్యా! ఆయన చాలా పిసినారి సైకిల్ మీద వస్తారు. ఆయన ఊతపదం ఏమిటో తెలుసా, అర్థమైందా అర్థమైందా అంటూనేంటారు అని నవ్వుకుంటూ చెప్పాడు రాజేష్. సరేరా రాజేష్! మీకు సైన్స్ ఎవరు చెబుతున్నారు? అని అడిగాడు మావయ్య
అయ్యప్ప మాస్టారు మావయ్యా! ఆయనికి పట్టబుర్ర, సన్నంగా ఉంటారు. తను ఎప్పడూ ముక్కును వేలుతో యిలా యిలా అంటూ ఉంటారు అంటూ యాక్షన్ చేస్తూ చూపించాడు.
మావయ్య! ఇదిగో పేపర్ అంటూ ఇంట్లోకి వచ్చాడు గణేష్. ఓకే. వెరీగుడ్ ఒరేయ్ రాజేష్! మేడమీద నాబట్టలు ఆరేయేమో చూసి తీసుకురా అని రాజేని అక్కడ నుండి పంపి ఒరేయ్ గణేష్! మీ లెక్కల మాష్టారు బాగా చెప్పరట కదరా? లేదు మావయ్య ! చాలా బాగా చెబుతారు. నిన్న ఆల్జీబ్రా లెక్కలు చెప్పి హోంవర్క్ కూడా ఇచ్చారు అన్నాడు. మరి సైన్స్ మాష్టారు? అని అడిగాడు ఆయన డౌట్స్ అడిగితే చక్కగా చెబుతారు అన్నాడు.
ఇపుడు మావయ్యకి ఇద్దరి మార్కులతో తేడాకి కారణం అర్థం అయ్యింది. రాజేష్‌ను మావయ్య దగ్గర కూర్చుండబెట్టుకొని ద్రోణాచార్యుడు తన శిష్యులను పరీక్షించేందుకు చెట్టుపై పక్షిని గురిచూసి కొట్టేందుకు అందరినీ ఎలా ప్రశ్నించాడు, అర్జునుడు ఏ విధంగా కేవలం లక్ష్యం మీదనే ఏకాగ్రత నిలిపాడు అనే విషయాన్ని అర్థమయ్యేలా చ్పెడు.
విద్యార్థి అనేవాడు మాష్టారు చెప్పాడు.
విద్యార్థి అనేవాడు మాష్టారు చెప్పే పాఠం మీద, ఆ పాఠం కు సంబంధించిన అంశము మీదనే ఏకాగ్రత నిలపాలి తప్ప అనవసరమైన విషయాల పట్ల దృష్టి మళ్లిస్తే అవసరమైన విషయం నేర్చుకోలేడు. విద్యార్థి అనేవాడు ఉపాధ్యాయుడు పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు పట్ల తక్కువ భావం వలన విద్యార్థిలో నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది. తరువాత క్రమశిక్షణ కూడా తగ్గిపోతుంది.
మావయ్య సున్నితంగా రాజేష్‌కు అర్థమయ్యే విధంగా చెప్పాడు. రాజేష్, గణేష్‌లు మావయ్య చెప్పిన మాటల్లో వాస్తవాన్ని గ్రహించారు.
- చావలి శేషాద్రిసోమయాజులు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
పాచిపెంట, విజయనగరం జిల్లా
సెల్ : 9032496575.

పుస్తక సమీక్ష
స్మృతి కవిత్వం - జ్ఞాపకాలే ఊపిరిగా...

మాష్టారు నాకుముందు, నా వెనుక అంతులేని ధైర్యం, ప్రసంగ కావ్యాలు పాతవే. ప్రసంగించిన అంశాలు కొత్తవి. అద్దేపల్లి వారి స్మృతికి ఈ కవిత్వం జ్ఞాపకాలే ఊపిరిగా అంటున్న ఎస్.ఆర్.పృధ్వీ హృదయ లోతుల్లోంచి ఆత్మీయంగా వెలువడి, అంతరంగాన్ని అక్షరాలలో ఆవ్ష్కిరిస్తాయి.
ఇరువురి మధ్య సాగిన సాహితీసభలు, పలువేదికలపై సాగిన సాహిత్యోపన్యాసాలు, ప్తుకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, ప్రముఖుల సన్మానములు, అన్నీ కళ్లముందు సాక్షాత్కరింపజేస్తూ వారికే ఈ కావ్యాన్ని అంకితం చేసిన సహృదయ సంస్కారం వారిమధ్య సాగిన అంతరంగ సాహితీ నేపథ్య ఆత్మీయ బంధాన్ని తీపి గుర్తుగా నిలుస్తూ ఎందరో యువకవులకు ఆదర్శ మార్గాన్ని అవలోకింపజేస్తుంది.
అద్దేపల్లివారిని కవిగా, వక్తగా విమర్శకునిగా, వినయశీలిగా, సాహితీవేత్తగా, సామాజిక విజ్ఞాన రచయితగా వారి సుదీర్ఘసేవలను శ్లాఘిస్తూ సాగిందీకావ్యం, ఆయన ఒకమానవతావాది, సాహితీ బృందావనం, రాయలనాటి భువన విజయంలో పెద్దనలా వెలుగొందిన విజ్ఞాన విపంచి విలువల వెలుగు.
కవితా ప్రపంచంలో అక్షరాల అడుగులు వేసేందుకు నడకనేర్పిన మార్గదర్శి ఎవరికవితాశక్తి ఎంతుందో నిక్కచ్చిగా కొలతగల అత్యాధునిక తునిక యంత్రం. వారి పలుకుల కుసుమాల్లోంచి తేనెచుక్కలు చిందుతాయన్న వాస్తవాన్ని వెల్లడిస్తారు పృద్వీ.
ఆయనతో గడిపిన కాలం మధురాతి మధురం, అదిమరపురానివైనం, మరువలేనియానం, గడియారంలో ముళ్లు ఎక్కడివక్కడే ఆగిపోతాయి. ఆయనతో మాట్లాడువేళ, ఆయన చూపు పడినవాడు కవియై కాలాన్ని నిలదీస్తాడు, విమర్శకుడై వ్యవస్థని వెలువరిస్తాడు. ఆయనో అక్షర కర్మాగారం, హృదయానికి హత్తుకునేతత్వం. సభ ఏదైనా కావచ్చు. అందులో నవ్యతను నింపడం అద్దేపల్లికే సాధ్యం. అన్నింటికీ కేంద్రబిందువు. విశ్వనాధ ప్రేరణలో వారికి సంప్రదాయం తొలి అడుగులైనాయి. అవి నిత్యం సాహితీ సౌరభాలను వెదజల్లుతూనే ఉంటాయి. ఆయన్ని తల్చుకున్నప్పుడల్లా వేదన కంచుగంటై మ్రోగుతుంది యెదలో పదిలంగా అంటారు పృధ్వి.
వారి సాహచర్యంలో గుణసౌందర్యంతో పాటు, కవితామాధుర్యం తోడై నిల్పుకున్న పృధ్విని ఓదార్చి సానుభూతినందిద్దాం. అద్దేపల్లి ఆశయాన్ని కవిత్వ దిశలో కొనసాగించాలని కోరుదాం.

-చెళ్లపిళ్ల సన్యాసిరావు
సెల్: 9293327394.

మనోగీతికలు

నువ్వు నా చెంతుంటే...
ఆకసాన తారలన్ని ఏకమై మెరిసినట్లు
కొలనులోన కలువభామ ఒళ్లు విరిసినట్లు
గున్నమామి కొమ్మలోన గండుకోకిల కూసినట్ల అందమైన సరసులో హంసలు జలకాలాడినట్లు నింగిలోన చందమామ తొంగి చూసినట్లు నందన వనాన నవపారిజాతాలు నవ్వినట్లు పూవు పూవును ముద్దాడి
భ్రమరం ఝంకారం చేసినట్లు
మనసైన జతకాడు విరితూపులు విసిరినట్లు
మనసంతా నిండి వున్న
నువ్వెదురుగవుంటే
ఈ జగమంతా జయించినట్లు...
- శివాని, శృంగవరపుకోట
ఫోన్ : 08966266384.
జాతిపితకు వందనం
భరతమాత దాంస్య శృంఖలాలను తెంచడానికి
జాతిపిత అయ్యాడొక యోధుడు
కొత్త యుద్ధతంత్రాన్ని నేర్పించి
శాంతి సమరం సాగించాడు
తుపాకీ తూటాలు, చెరసాల బందిఖానాలు
ఆయనని ఏనాడూ భయపెట్టలేదు
అందుకే ఆయన భారతావనికే కాదు
సమస్త లోకానికీ స్ఫూర్తిప్రదాత
హింసతో కాదు శాంతి సహనాలతో
ప్రేమతత్వంతో సాధించుకోవాలని
మానవాళికి బోధించిన బోధకుడాయన
ప్రశ్నించే హక్కు, పోరాడే తత్వంతో
ప్రతి ఒక్కరిలో ఉండాలని ఉద్బోధ చేసాడు
బానిసత్వానికి చరమగీతం పాడాడు
మంచిని పెంచు, చెడును తుంచు, అవినీతిని హరించు, బాలకార్మికులను హరించు,
ప్రేమ, సౌభ్రాతృత్వాలను పంచు అని సందేశమిచ్చాడు మన జాతిపిత బాపూజీ!

- నాగాస్త్రం నాగు వడ్లపూడి,
సెల్ : 9966023970.

గిరుల సిరులు
వేకువజాము కిరణాల తాకిడి
ముంగిట కోడికూతల అలికిడి
జీవితం ప్రకృతి స్వరసవ్వడి
జీవనం మాత్రం అందమైన గారడి!
కాలమొక్కటే నిత్యనూతన ఒరవడి!
నీలిమేఘం పలకరింపు
చినుకు చినుకూ పలకరింపు
కొండల్లో కోయిలమ్మ
ఎంచక్కని ముద్దుగుమ్మ!
సెలయేటి గలగలలో
వరిసెపూల సొగసులతో
అలరారే లోయలలో
ఆనందం తూగుటూయల!
అడవితల్లి లాలిపాట
గిరిపుత్రుల పచ్చని ఊసుల బతుకుబాట
జనకోటికి జీవమిచ్చే
అడవుల రక్షణ ధ్యేయంగా
హృదయాంతర స్వరధుని!
లోయల్లో.....
బతుకు లోతుల్లో ప్రతిధ్వని

- మరడాన ధరణి,
సెల్ : 9492853773.

నిజమైన ప్రేమబంధం

స్నేహంలోనైనా, కుటుంబ
బంధంలోనైనా నిలకడైనది,
పెళ్లికి ముందైనా, తర్వాతైనా నిలిచి ఉండేది
ఒకరి స్వేచ్ఛ, వేరొకరికి ఇబ్బంది నివ్వనిది
ఇతరులపై ఏ అదుపు ఆజ్ఞలు పెట్టనిది!
తనను తానుగా ఉండనిచ్చేది
తనేమిటో తాను తెలుసుకొననిచ్చేది
తన యిష్టా యిష్టాలను ఎవరిపై రుద్దనిది
ఇదరులను సమభావంతో చూడనిచ్చేది!
ఎవరి అలవాట్లు ఆహారం,
విహారం, నిద్ర మొదలైనవి
వారివివేకముతో వారిచే తనే చేయించనిచ్చేది
ఒకరికి ఇబ్బంది
కలగకుండా తన అభిప్రాయాన్ని
తెలియజేస్తూ వారి ఉద్దేశాన్ని గౌరవింపచేసేది!
సహాయ సహకారాలను తీసుకోవడమే కాదు
కుటుంబంలో వారికి
ఆర్తులకు అందివ్వడమనేది
సంసారంలో ఎగుడు దిగుడులు
కష్ట-సుఖాలు
సమంగా భావింప చేసేది చక్కగా తీర్చిదిద్దేది!
ప్రేమ బంధం స్వలాభాపేక్షకు అతీతమైనది
సేవ చేయుటలో అలసటలేని
ఆనందాన్నిచ్చేది
కుటుంబపరంగా ప్రతి పని
తనదిగా భావింపచేసేది
సమాజంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తింపచేసేది!
ప్రేమబంధంలో ప్రతి ఒక్కరూ కర్తవ్యోన్ముఖులే!
భగవంతుడు అందరికి కర్తవ్యాలు, కర్మలు
ఎవరికివారే నిర్దేశించి పుట్టింపచేసాడు
అవి గుర్తింపచేసి, నడిపించేది
నిజమైన ప్రేమబంధం!

- జి. కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం.
సెల్ : 9441567395.
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net

- శ్రీనివాసభారతి