విశాఖపట్నం

విశ్వమానవుడు (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిలువునా చీలిపోయినా ఆ కుటుంబం మళ్లీ కలుస్తుందనే నమ్మకం పోయింది. అయినా మీసాల రాయుడు ఉన్నప్పుడు మన ఊరిలో వాళ్లదే పెద్ద కుటుంబం. జమీందారీ దర్జా వెలగబెట్టిన రాయుడు పోయిన తరువాత ఈ పిల్లకాయలు పంతాలకు, పట్టింపులకు పోయి కుటుంబం గుట్టు రట్టు చేసుకుంటూ రచ్చకెక్కారు. ఆ కుటుంబం ఒక్కటిగా కలిస్తే చూడాలని ఉంది’’ రామాపురం రచ్చబండ దగ్గర పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న మూడు కాళ్ల ముసలి వాళ్లందరిలోనూ పెద్ద ముసలివాడు అన్నాడు.
‘‘అయినా ఆ రోజులే వేరు. ఇప్పుడంతా డబ్బుడబ్బు. రాయుడుగారైతే డబ్బు కన్నా మనుషులకి మనసులకి విలువిచ్చే వారట’’ ఓ చిన్న ముసలివాడు ధ్రువపత్రం ఇచ్చాడు.
రాయుడు కుటుంబమే రామాపురానికి మోతుబరి కుటుంబం. ఆయన బతికి ఉన్నంత కాలం దర్జా వెలగబెట్టాడు. ఆయన కొడుకులు పరశురామునాయుడు, వల్లభరాయుడు మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. దానికి తోడు వాళ్ల ఒక్కగానొక్క తోబుట్టువు, రాయుడు ముద్దుల కూతురు రాణికాశులమ్మ మొగుడు, పిల్లాపాపలతో ఆ ఇంట్లోనే తిష్ట వేసింది ఆస్తి వాటా కోసం. రాయుడు మీద భయంతో ఎవరూ మాట్లాడలేదు. ఇలా గందరగోళంగా, గొడవ గొడవగా తయారైన ఆ కుటుంబంలో శకుని లాంటి దూరపు బంధువు ఒకడు వచ్చి చేరి వారి మధ్య అగాథం సృష్టించాడు. ఇప్పుడు ఆ ఇల్లు మూడు ముక్కలవ్వడమే కాకుండా ఆ వూరూ మూడు వర్గాల పోరుతో అతలాకుతలం అవుతోంది.
ఇదిలా ఉండగా ఎక్కడి నుండి వచ్చాడో కానీ సూర్యారావు అనే కుర్రాడు ఆ ఊరికి దేవుడిలా వచ్చాడు. వచ్చీ రాగానే రాయుడు కొడుకుల్ని, కూతుర్ని కలుసుకున్నాడు. ‘‘రాయుడుగారంటే మా తాతకీ, మా నాయనమ్మకి చాలా అభిమానం. మీ తండ్రిగారి దయవల్లే వాళ్లు అమెరికాలో సెటిలయ్యి వందల కోట్లు సంపాదించారు. ఈ మధ్యనే చనిపోయారు. చివరి కోరికగా నన్ను ఇండియాకి పోయి రాయుడు కలలు గన్న గ్రామంగా రామాపురాన్ని మార్చమన్నారు’’ అని వాళ్లకి చెప్పి గ్రామ అభివృద్ధి కార్యక్రమానికి నాందిగా శ్రీరామనవమి రోజు ఘనంగా సీతారాముల కల్యాణం జరిపించి గ్రామస్తుందరికీ ‘రాయుడు అన్నదానం’ అన్న కార్యక్రమం ఏర్పాటు చేశాడు. పాడుబడిపోయిన రామాలయం అతని దయ వల్లే మరమ్మతులకి నోచుకుంది. తండ్రి పేరుతో సాగుతున్న తంతు కాబట్టి రాయుడు కొడుకులు, కూతురు కుటుంబాలతో హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి రెండవ విడతగా రాయుడు స్వచ్ఛ్భారత్ పేరుతో గ్రామాన్ని పరిశుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తండ్రి పేరు ఉంది కాబట్టి కాస్త అయిష్టంగానైనా తమ వంతు సాయం చేశారు రాయుడు కొడుకులు, కూతురు. తర్వాత రాయుడు ఆరోగ్యశ్రీ పేరున ఆసుపత్రి నిర్మాణం, రాయుడు సుజలాం సుఫలాం పేరిట మంచినీటి బావుల తవ్వకం, బోర్ల ఏర్పాటు వంటివి చేపడితే తప్పనిసరై రాయుడు పిల్లలు తలో కొంత సొమ్ముతో సాయపడ్డారు. తర్వాత రాయుడు విద్యాలయాల పేరుతో ఊరిలో ఉన్న గ్రంథాలయం, అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలను ఆధునీకరించాడు. విద్యాలయాలకు రాయుడు పేరు పెట్టడానికి అవసరమైన విరాళాలు ఇచ్చి, ప్రభుత్వ అధికారులను ఒప్పించి విజయం సాధించాడు. అంతే కాదు ఆ గ్రామానికి ఉన్నత పాఠశాలను తెప్పించి దానికి రాయుడు పేరు పెట్టి పుణ్యం కట్టుకున్నాడు. తండ్రి సెంటిమెంటు వల్ల కదలకపోతే చుట్టాలు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తుల ముందు చులకనైపోతామని ఆ కార్యక్రమానికి సహకరించారు రాయుడు పిల్లలు.
ఇలా ఆ ఊరుని సర్వతోముఖాభివృద్ధిగావించి దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు సూర్యారావు. తన కృషికిగాను రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నాడు.
తన ప్రమేయం లేకుండానే తమ తండ్రి పేరుతోనే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిపోవడం రాముడు కుటుంబాన్ని కొంత ఆశ్చర్యపరచినా రామాపురం రామరాయుడుపురంగా మారిపోవడం, తండ్రి పేరు చిరస్థాయిగా ఉండిపోవడం అన్న సెంటిమెంట్ రాముడు కుటుంబంలో మంచి మార్చు తెచ్చింది. కుటుంబాల మధ్య ఐక్యత పెరిగింది. ప్రేమాభిమానాలు పెరిగాయి.
ఓ ఉగాది రోజు సూర్యారావుని భోజనానికి పిలిపించి పెద్ద విందు ఇచ్చింది రాయుడు కుటుంబం, రాయుడు వారసులందరూ హాజరైన ఆ విందులో సూర్యారావుని పొగడ్తలతో ముంచెత్తారు. అందరు ‘‘నీకు అభ్యంతరం లేకపోతే నీకు మా యింటి ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తాం’’ అని ఆఫర్ కూడా ఇచ్చింది రాయుడు కుటుంబం. సరే అన్నాడు సూర్యారావు. అతనికి తన కూతరునిచ్చి పెళ్లి చేశాడు పరశురాముడు. తన వంతుగా తనకున్న పంచాయతీ ప్రెసిడెంట్ గిరీకి రాజీనామా ఇచ్చి అది తమ ఇంటి అల్లుడైన సూర్యారావు ఉరఫ్ సూరిరాయుడుకి అందించాలని చూశాడు వల్లభరాయుడు. అయితే ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి ‘‘పదవి ముఖ్యం కాదు పని ముఖ్యం. మీరే పదవిలో ఉండండి. పని నేను చేస్తాను’’అని ఆ గ్రామ పరిపాలనా భారాన్ని కూడా తన మీద వేసుకున్నాడు సూరిరాయుడుగా మారిపోయిన సూర్యారావు
***
ఆ రోజు రాత్రి సూర్యారావుకి నిద్రపట్టలేదు. దేశం కాని దేశంలో తన ఒక్క అబద్ధం ఎంత మంచి మార్పు తెచ్చిందో అనుకుంటూ మురిసిపోయాడు. చూడటానికి అచ్చం ఇండియన్‌లా ఉండే సూర్యారావు నిజానికి ఇండియన్ కాదు. సూర్యారావు కుటుంబానిది ఇండియా కాదు. అతని కుటుంబానికి ఇండియన్ మూలాలు లేవు. అతని తాతది ఆఫ్రికా, నాన్మమ్మది ఇండోనేషియా. తండ్రిది ఇరాన్, తల్లిది శ్రీలంక ఆ కుటుంబం స్థిరపడింది అమెరికాలో. రాయుడెవరో అతనికి తెలీదు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం అతడు వేల కోట్ల ఆస్తిపరుడు. అమెరికాలో అతనికున్న మిత్రుల్లో చాలా మంది ఇండియన్ సంతతి వారే. అందులోను తెలుగు వాళ్లే ఎక్కువ. చిన్నప్పటి నుంచి తెలుగు మూలాలు గల మిత్రులతో కలసిమెలసి ఉండటంతో సూర్యారావుకి తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం బాగా వచ్చాయి. నిజానికి అతని పేరు సూర్యారావు కాదు స్టీఫెన్‌సన్. ఒక తెలుగు మిత్రుడు తండ్రి భారతదేశ గొప్పతనం చెబుతూ అందులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల విశిష్టతని పొగుడుతూ కొంత మంది పెత్తందార్ల స్వార్థం వల్ల కొన్ని గ్రామాలు ఎలా పాడైపోయాయో చెప్పి అందుకు ఉదాహరణగా రామాపురాన్ని వివరించడంతో స్టీఫెన్‌సన్‌కి రామాపురం మీద ఆసక్తి కలిగి ఎలాగైనా ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. రామాపురం గురించి నెట్ ద్వారా కొంత సమాచారం సేకరించి కొన్ని వివరాలను ఫ్రెండ్స్, వాళ్ల పేరెంట్స్ నుంచి తెలుసుకొని ఆ గ్రామాన్ని దత్తత తీసుకోడానికి కావాల్సిన విధి విధానాలను పూర్తి చేయడానికి భారత ప్రభుత్వ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారం అనుమతి తీసుకుంటూ ఎలాగైనా రామాపురాన్ని సర్వతోముఖాభివృద్ధిగావిస్తానని తన మిత్రుల దగ్గర ప్రమాణం చేస్తూ రామాపురం చేరుకున్నాడు. రాయుడు చిన్ననాటి మిత్రుడు మనవడని రాయుడు కుటుంబాన్ని నమ్మించి రాయుడు కుటుంబానికి బంధువని గ్రామస్తులను నమ్మించి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించి సర్వత్రా విజయం సాధించాడు స్టీఫెన్‌సన్ ఉరఫ్ సూర్యారావు ఉరఫ్ సూరిరాయుడు. అంతేకాదు ఒక అందమైన ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రామాపురం రాయుడు ఇంటి అల్లుడిగా సెటిలయ్యాడు. ఇక కాలమే నిర్ణయించాలి స్టీఫెన్‌సన్ భవిష్యత్తుని తన జన్మభూమి అంటూ అమెరికా వెళ్లిపోతాడో, విశ్వమానవునిగా వసుదైక కుటుంబ స్ఫూర్తిని నింపుతూ మంచి లక్ష్యంతో పుణ్యభూమి అన్పించుకున్న ఇండియాలోనే ఉండిపోతాడో...

- ఎం.వి. స్వామి,
చోడవరం.

శైలి-శిల్పం

సుజాతారెడ్డి కథల్లో శిల్ప సౌందర్యం
పిల్లలంటే ఆడదానికి ఒక్కదానికే కాదు. భర్తకూ పిల్లలే. ఆడది పెంచినట్లుగా మొగోడెందుకు పంచగూడదు’ ( ఆఖరికి మగ మహారాజు కథలో సావిత్రి)
‘నిశ్శబ్దం ఒంటరితనం! రాత్రి, చీకటి అమెరికా పోతే ఇంకా భయంకరం! ఒంటి స్తంభం మేడలో నుండి ఏ రాకుమారుడు వచ్చి రక్షిస్తాడు తనను (నిశ్శబ్దం! నిశ్శబ్దంలో సుకన్య)
పితృస్వామ్య సంస్కృతిని సాహసంతో ప్రశ్నిస్తున్న సావిత్రి ఆ సంస్కృతీ వలయంలో చిక్కుకుపోయి బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సుకన్య- ఈ రెండు పాత్రలు ముదిగంటి సుజాతారెడ్డి కథల్లో ఊపిరి పోసుకున్న పాత్రలు.
ముదిగంటి సుజాతారెడ్డి ప్రాచీన, ఆధునిక సాహిత్యాల సారమెరిగిన విదుషీమణి. పరిశోధన, సృజన రెండు కళ్లుగా సాహితీప్రస్థానాన్ని సాగిస్తున్న అరుదైన రచయిత్రి. ఆమె నవలలు, కథలు తెలంగాణ జనజీవన చిత్రణకు నిలువుటద్దాలు. ఆమె మొదటి కథా సంపుటి విసుర్రాయి 1998లో వచ్చింది. తరువాత వరుసగా ‘మింగుతున్న పట్నం’, ‘వ్యాపార మృగం’, ‘మరో మార్క్స్ పుట్టాలె’ కథా సంపుటాలు వెలువరించారు. రచనకి సంబంధించిన ముఖ్యాంశాలు ఎలా రాయాలి, ఏది రాయాలి, ఎందుకు రాయాలి మూడింటిని దృష్టిలో పెట్టుకుని, బాధ్యతతో రచన సాగిస్తున్నట్లు సహృదయ పాఠకుడికి అర్ధమవుతుంది.
సుజాతారెడ్డి కథల్లో వస్తువు సమకాలీనం. స్ర్తిల పట్ల సమాజం చూపుతున్న వివక్ష, నగరీకరణ వల్ల అభివృద్ధి పేరుతో ప్రభుత్వ విధానాల మూలంగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్న వైనం, ప్రపంచీకరణ వల్ల సమాజంలో డబ్బు ప్రధానమై మానవ సంబంధాలలో వచ్చిన విధ్వంసకరమైన మార్పులు తదితర సామాజిక సమస్యలు వీరు కథల్లో చిత్రిస్తున్నారు.
సుజాతారెడ్డి కథలు శిల్పశోభితాలు. ఈమె కథల్లో వాతావరణ చిత్రణ, పాత్ర పోషణ, సన్నివేశ కల్పన అన్నీ ప్రతిపాదిత సత్యాన్ని సమర్ధించేటట్లు ప్రారంభం నుండి ముగింపు వరకు సాగుతాయి. పాత్రలలో కృత్రిమత్వం అన్నది కనిపించదు. ఆశా నిరాశలతో బలహీనతలతో మన మధ్య మెసిలే మామూలు మనుషులే మనల్ని పలకరిస్తూ ఉంటారు. స్ర్తిలు, పురుషులు జీవన యాత్రలో పరుగులు పెడుతూ సందర్భాన్ని అనుసరించి సాహసాన్ని ప్రదర్శిస్తారు. పఠితను ఆశ్చర్య చకితులని చేస్తారు. ఒక్కోసారి పరిస్థితులకి నిస్సహాయులై తల వంచుతారు.
‘ఆఖరికి మగ మహారాజు’ కథలో కథనం ఉత్తమ పురుషలో సాగుతుంది. రచయిత్రి ప్రధానంగా ఇందులో రెండు పాత్రలని సృష్టించారు. కథా గమనంలో కల్పించిన ఇతర పాత్రల వల్ల అనేక విషయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కథ చెప్పే పాత్ర ‘నేను’. చాలా భయస్తురాలు. ఆమె పేరు కథలో లేదు. పెళ్లి కాక ముందు పుట్టింట్లో ఆమె సినిమా కూడా చూడలేదు. ఆమె నాయనమ్మ కొడుకుతో ‘పిల్లల్ని సినిమాలు చూడనీ! లోకం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అది మెట్రిక్ ఫెయిలయి ఇంట్లో కూర్చుంది. ఒక అయ్య చేతిలో పెడితే వెళ్లిపోతుంది. అదేదో వాడు కట్టడి చేసుకుంటాడు. నువ్వెందుకు దాని మనస్సుని చిన్నబుచ్చుతావు’ అన్నా ఆమె తండ్రి వినిపించుకోలేదు. పెళ్లయ్యాక ఎదురు తిరిగే తెలివి ఇసుమంతైనా లేకపోవడంతో ఆమె భర్త చేతిలో దెబ్బలు తింటూనే ఉన్నది. ‘నేను’కి సావిత్రి వ్యక్తిత్వం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. సావిత్రిని గమనిస్తూ ఉంటుంది. రెండవ పాత్ర సావిత్రి ముందు నుండీ ధైర్యం కలిది. ఎదుటి వారిని లెక్క చేయని స్వభావం. భర్త సంసారం నడపడానికి డబ్బులు ఇవ్వడం లేదని, రోజూ పీకమొయ్యా తాగి వస్తున్నాడని, పిల్లల్నీ, భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చింది. తల్లి ఏడ్చి మొత్తుకుంటుంటే ‘‘వాడి పిల్లల్ని వాడు ఏమైనా చేసుకోనీ, నేనైతే వాడి తాగుడిని భరించలేను. వాడి చేతగాని తనాన్ని సహించలేను’ అంటూ జవాబు చెబుతుంది. పుస్తెలమ్మి కూరగాయల అమ్మకంతో వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా డిపార్ట్‌మెంటల్ స్టోర్ నడిపే స్థాయికి ఎదిగింది సావిత్రి. ఆమెని టివి ఛానల్స్‌వారు, మహిళా సంఘాలు ప్రశంసిస్తారు. సన్మానసభలో సావిత్రిని చూసి ‘నేను’కి ఒళ్లు పులకరిస్తుంది. కతలో కొసమెరుపు ఏమిటంటే సావిత్రి భర్త పిల్లల్ని వదిలేసి పారిపోతాడు.
‘‘పిల్లలు ఆఖరికి సావిత్రి మెడకే పడ్డారు. ఆఖరికి మగమహారాజు! ఏం చేసినా చెల్లుతుంది! అని నిట్టూర్పు విడిచాను నేను’’
కథ ముగిసింది.
రెండు విరుద్ధ స్వభావాలున్న పాత్రలతో కథను నడపడం ద్వారా రచయిత్రి కథను పఠిత మనసుకి హత్తుకునేటట్లు చెప్పగలిగారు. ‘నిట్టూర్పు విడుస్తూ ఆఖరికి మగమహారాజు’ అంటున్న నేను మన కళ్ల ముందు కనిపిస్తుంది.
నిశ్శబ్దం నిశ్శబ్దం కథకుని అధికారిక పద్ధతిలో ప్రారంభమై ఆలోచనా స్రవంతి పద్ధతిలో నడుస్తుంది. మధ్యమధ్యలో కథకుడు ప్రవేశించి కథాగమనాన్ని అవసరమైన సన్నివేశాలను ప్రవేశపెట్టడం, నిష్క్రమించడం జరుగుతుంది. ప్రధాన పాత్ర సుకన్య మనోగత భావాలు ఇందులో ఆవిష్కరించబడ్డాయి. కథ ఒక రోజు ఉదయం మొదలై రాత్రి సుకన్య ఆలోచనలతో ముగుస్తుంది.
సుకన్య భర్త కంప్యూటర్ ఇంజనీరు. ఉదయం వెళ్లి, రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుతుంటాడు. మితిమీరిన ధనవ్యామోహంతో అమెరికా వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. ఆ ఏర్పాట్లలో పెళ్లాడిన భార్య సుకన్య ఆలోచనలని అసలు పట్టించుకోడు. ‘అనగా అనగా ఒక రాకుమారి! ఆమెను రాక్షసుడు ఎత్తుకుని పోయి ఒక ఎత్తయిన ఒంటి స్తంభం మేడలో బందీ చేసి ఉంచాడు. రాజకుమారుడు వచ్చి రాక్షసుడిని చంపి విడిపిస్తాడు’. ఈ మాటలతో కథ ప్రారంభమవుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ సుకన్య ఆలోచనా స్రవంతి ద్వారా, సన్నివేశాల ద్వారా పఠితకు రాకుమారి ఎవరో? రాక్షసుడు ఎవరో అర్ధమవుతుంది. సుకన్య పాత్ర పట్ల జాలి కలుగుతుంది. సుకన్య చిన్నప్పుడు ఎగరలేని స్థితిలో ఉన్న ఒక చిలుకని పట్టి పంజరంలో బంధిస్తుంది. అప్పుడు ఆమె నాయనమ్మ ‘చిలుకని పంజరంలో పెడితేనే రామదాసుకి జైలు అయింది. ఒద్దు తల్లీ దానిని విడిచిపెట్టు’ అంటుంది.
చిలుకను పంజరంలో పెట్టిన పాపానికేనా తనకీ శిక్ష! రామదాసును రామలక్ష్మణులు వచ్చి విడిపించారట! ననె్నవరు విడిపిస్తారు? అల్లావుద్దీన్ ల్యాంపా... పాతభైరవి బొమ్మా! నిజంగా అవే అయితే నన్ను ఇక్కడి నుండి తీసుకుపొమ్మని కోరుకునేదాన్ని’.
ఒంటరితనం, నిశ్శబ్దం... ప్రేమించేవారు లేక వేదనలో ఉన్న సుకన్యని ఓదార్చేవారు లేరు. పని మనిషి రాజమ్మ పనులు చేస్తూ మెషీన్‌లా మారింది. ఆమెకు ముచ్చట్లు పెట్టుకునే టైమ్ లేదు. చుట్టం చూపుగా వచ్చి వెళ్లిన తల్లిదండ్రులు ఆమెకు ఏ ఆత్మీయతనూ అందించలేకపోయారు. ఆదిత్య అతడితో వచ్చిన గెస్తులు, మర్యాదలు అన్నీ అయ్యాక అంతా మామూలే! రాత్రి భయంకర నిశ్శబ్దం.
‘ఒంటి స్తంభం మేడలో నుండి ఏ రాజకుమారుడు వచ్చి రక్షిస్తాడు తనను! సుకన్య ఆలోచనలు...’
కథ ముగిసింది.
హైటెక్ సంస్కతిలో అపార్ట్‌మెంట్ కల్చర్‌లో మానవీయ బంధాలు విధ్వంసం అవుతున్న తీరుని విశిష్టంగా చెప్పిన కథ ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’. తక్కువ మాటలతో, తెలుగు నుడికారంతో శిల్ప సౌందర్య విలసితాలు సుజాతారెడ్డి కథలు.
- డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి,
బ్రిట్ కాలనీ, బెర్హంపూర్-760 002. ఒడిశా.
సెల్ : 08093520819.

మధురస్మృతులు

సామాజిక, వ్యంగ్య,
హాస్య నిధులు నిష్టల వారి కథలు

అభ్యుదయ రచయితగా, సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతల్ని, బలహీనతల్ని, రాజకీయ అసమానతల్ని ప్రతిబింబించే రచనలు చేసిన నిష్టల వెంకటరావు కథకుడిగా, నవలా రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆయన 1932లో విజయనగరంలో జన్మించారు. విశాఖపట్నంలో 27 జనవరి 2016న తనువు చాలించారు. హాస్య కథకుడిగా, వ్యాసకర్తగా, కవిగా, నాటిక రచయితగా వ్యంగ్యాన్ని అతి సునాయాశంగా చెప్పి మెప్పు పొందినవాడు. ఆనాటి విజయనగరం మహారాజా వారి విద్యా సంస్థల్లో చదువుకున్నారు. రైల్వేలో రెవెన్యూ శాఖలో, విశాఖ ఓడరేవులో బిర్లా ఎగుమతి కంపెనీ మేనేజరుగా, మిల్లర్స్ అసోసియేషన్ మేనేజరుగా పని చేశారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి కావడం వల్లనే తన రచనల్లో వ్యంగ్యం, హాస్యం జోడించి సాగుతూ అందరినీ అలరిస్తుంది. కథన కుతూహలం కదం తొక్కుతూ పదం పాడుతుంది. 1969లో ‘గోడ’ మొదటి కథ జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. 1973లో ట్వంటీయత్ సెంచరీ యూత్ రైటర్స్ సంస్థను స్థాపించి యువ రచయితలను ప్రోత్సహించారు. వీరి సాహితీ సృజన కార్యక్రమాలు విజయనగరం, విశాఖపట్నంలలో సాగాయి. నవలా సాహిత్యంలో చెప్పుకాటుకి కుక్కదెబ్బ, టమాటా వీటు - టెంపరేచర్ హాటు, కలపవృక్షం, అసంపూర్ణ రామాయణం, మీ యాచక మహాసభ, డాక్టర్ మృత్యుంజయగారి మరణం, ఒకేసారా, సోరో కథ, సమర్ధుని మరణయాత్ర అంటూ శీర్షికల్లోనే హాస్య చతురత, వ్యంగ్యాన్ని స్ఫురింపజేసేవారు. విభిన్న సాహిత్య ప్రక్రియల్లో తనదైన ముద్ర వేస్తూ, హాస్యభరిత నవలల్లో వ్యంగ్య ధోరణి మరింత ప్రస్ఫుటింపజేస్తూ పత్రికా సంపాదకులు శివలెంక రాధాకృష్ణ, పురాణం వీరి కథల్ని చదివి, అభినందించి ప్రోత్సహించినట్లు రాసుకున్నారు. నిష్టల వెంకటరావు విశాఖ సారస్వత వేదిక ద్వారా ఒక అరుదైన హాస్య నవల ‘ముఫియాస్కో’ 208లో వెలుగులోకి వచ్చింది. ముఫియాస్కో విశిష్టత ‘్ఫయాస్కా’ అనే ఆంగ్ల పదానికి ప్రయత్నం పూర్తిగా నిష్ప్రయోజనం కావడమని అర్ధం. నాటకాలకు చందా, నాట్యాలకు చందా, కచేరీకి, కళకి చందా అంటూ హాస్యంతో వ్యంగ్యం పండించారు. ముఫియాస్కో హాస్య నవలలో అద్దేపల్లి ముందు మాట రాశారు. ఏ సత్యాన్ని కవి అవహేళన ద్వారా చెప్పదలచుకున్నాడో ఆలోచిస్తే నిష్టల వెంకటరావు సమకాలీనమైన వ్యవస్థల్ని, వైపరీత్యాల్ని ఖండించడం, కల్పనకు హద్దులు లేవన్నట్లు వాస్తవికత కల్పన కంటే ఎంత వింతగా ఉంటుంది అనిపిస్తుందో నవల చదివితే. పీటల కింద పెళ్లి మరో హాస్యనవల. కథల శీర్షికల్లో కూడా ఎంతో వైవిధ్యం, వ్యంగం కనిపిస్తుంది. మొగుడు ఫ్రీ, వల్లకాట్లో పోలీసుస్టేషన్, ఓటర్ల సమ్మె ఇలా ఉంటాయి. నిష్టల వెంకటరావు నిర్మాణాత్మకమైన విమర్శకుడు. కాల్పనిక సాహిత్యంలో అందెవేసిన రచయిత. 83వ ఏట, జీవితపు చివరి అంకంలో ఒంటరిగా వృద్ధాశ్రమంలో కొంత కాలం గడిపారు. అప్పుడే సన్నిహిత మిత్రులు, రచయితలు కలవడం, సాహిత్యం గురించి ముచ్చటించేవారు. అప్పుడప్పుడు కలిసిన వారిలో మంగు, అనంతరావు, ఎవిఆర్ మూర్తి మున్నగువారున్నారు.

- అడపా రామకృష్ణ,
దొండపర్తి, విశాఖపట్నం-16.
సెల్ : 95052 69091

మనోగీతికలు

వీరసైనిక
వందనము
జోహారు జోహారు వీరుడా
వెన్ను చూపని ధీరుడా
మరువలేములే వీరుడా
నీ సేవ, త్యాగము ధీరుడా
జోహారు వీరుడా
నీకు నా సలాము ధీరుడా
తల్లి రుణము తీర్చు వీరుడా
నీవు జవాను వైనావు ధీరుడా
బతుకు బాటలో వీరుడా
నీవు బలి అయిపోయావు ధీరుడా
జోహారు జోహారు వీరుడా
నీకు నా సలాము ధీరుడా
గుండె నిండుగా వీరుడా
నీవు గుర్తుండిపోతావు ధీరుడా
జన్మభూమి రుణము వీరుడా
నీవు తీర్చుకున్నావయ్యా ధీరుడా
జోహారు జోహారు వీరుడా
నీకు నా సలాము ధీరుడా
కన్నతల్లిని నీవు వీరుడా
కంటి రెప్పగా కాచావు ధీరుడా
పుడమి తల్లికి నీవు వీరుడా
వెలలేని కాన్కవయ్యా ధీరుడా
జోహారు జోహారు వీరుడా
నీకు నా సలాము ధీరుడా

- మండా శ్రీ్ధర్,
శ్రీకాకుళం,
సెల్ : 9493309030.

హైకూలు
పున్నమి వెన్న
వెనె్నలా జారుతొంది
పాలకడలి

గంధపుచెక్క
పున్నమి చందమామ
వెనె్నల ఘుమ

వెన్న పూచిందా
చందురు వెనె్నలలా
వెండిపోగుల్లా

బొమ విల్లుని
సంధించినా కినుకే
చూపుకోపమా

అలకమారి
మబ్బుదాగి శశి
నెలవంకలా

- బోజంకి వెంకటరవి
సెల్ : 9885425145
పద సంపద
మనిషికి కావాలి సంపద
మణు కురవాలి సంపద
తరిగి పోనిదీ సంపద
కరిగి పోనిదీ సంపద
వదలి పోనిదీ సంపద
వదలి పోనిదీ సంపద
ఎవరెత్తుకుపోలేని సంపద
ఎత్తుకు చేర్చేటి సంపద
సర్వం అందించే సంపద
స్వర్గం చూపింపే సంపద
నా పద సంపద
- జె.బి.తిరుమలాచార్యులు,
సాలూరు,
సెల్ : 9966229126

విశ్వశాంతి
విశ్వశాంతి బావుటాల
వినువీధుల ఎగరేద్దాం
విశ్వశాంతి పావురాల వదిలేద్దాం
సరిహద్దుల పోరాటాల్
మానేద్దాం మానేద్దాం
శౌర్యాంజలు లెందుకులే
స్నేహాంజలులు చేకొందాం
సరిహద్దుల వెంటెందుకు
రక్తపుచుక్కల మరకలు
స్నేహభాష్ప ధారలలో
సరిహద్దుల తడిపేద్దాం
పగల సెగల నాపేద్దాం
విశ్వశాంతి వెలయిద్దాం
మానవతను బతికిద్దాం

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
సెల్ : 9246666585.

జై తెలుగు తల్లి
వాడు..
తన మూలాల్ని
వట వృక్షంలా దశ దిశలా
ఆకుల్లా ఆంగ్లక్షరాల్ని
విస్తరింప జేస్తుంటే...
నువ్వు..
నీ మూలాలకు బలమున్న
వాటి మూలాలు పట్టుకు
తిరుగుతున్నావేం?
కిరాయి భాష నేర్చుకుంటూ
పరాయి భాషల్ని
పుణికి పుచ్చుకుంటున్నావేం?
నీవింకా...
దీపపు బుడ్డీలా
మినుకు మినుకు చీకటిలో
మ్రగ్గి మసైపోతున్నావ్!
తమిళ కన్నడిలే నయం
తమ భాషా పరిమళాలన్ని
అక్షరపుదోటలా పూయిస్తున్నారు
ఏం?.. పక్క రాష్ట్రాల
ఐక్యతను గుర్తించవేం?
తెలుగు రాష్ట్రాల
విభజన మాట పక్కనెట్టు
మన జంట రాష్ట్రాల
మాతృమూర్తి
తెలుగుతల్లి సువర్ణ అక్షరాల
వెలుగు కిరణాలను
ఈ అవనిలో
వెలుగులీనునట్టుగా
నీవంతు కృషి చేయి
అదే మాతృభాషకు
నీవు కట్టే పట్టం

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- ఎం.వి. స్వామి, చోడవరం.