విశాఖ

ఉద్యోగుల భర్తీలో నిరుద్యోగులను మోసగిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో ఖాళీల భర్తీకై రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక మాటమారుస్తూ నిరుద్యోగులను మోసగిస్తుంది తప్ప ఉద్యోగాల భర్తీకి మాత్రం చర్యలు తీసుకోవడం లేదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య విమర్సించింది. శనివారం స్థానిక కార్మిక కర్షక భవనంలో జరిగిన సమావేశంలో డివైఎఫ్‌వై రాష్ట్ర ఉపాధ్యక్షులు వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకై 18వేల 454పోస్టులకు క్యాబినెట్ ఆమోదించినట్లు ప్రకటించడం వాస్తవానికి విరుద్దంగా ఉందని అన్నారు. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్సీవో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం 46వేల 20పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మంత్రి సమాధానం చెప్పారన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం 18వేల పోస్టులను మాత్రమే ప్రకటించడం నిరుద్యోగులను నిరాశ పరుస్తుందన్నారు. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో నిరుద్యోగులను మోసగించి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క పోస్టు కూడా భర్తీచేయలేని పరిస్థితి ఉందన్నారు. వాస్తవంగా కమలనాథన్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా 75వేల పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని, 2014 నుండి ఇప్పటివరకు 37వేల రిటైర్మెంట్లు జరిగాయని, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఖాళీలు రెండులక్షల 12వేలు ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో ప్రకటించిన 46వేల పోస్టులకైనా నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులు కొంత ఊరట చెందేవారని ఆయన అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో యువతను మచ్చిక చేసుకునేందుకు నిరుద్యోగ భృతి ప్రకటించిందని దీనికి కూడా అనేక నిబంధనలు పెట్టిందన్నారు. ఈ నిబంధలతో అర్హులైన నిరుద్యోగులకు కూడా ఈ భృతి అందలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్‌వై నాయకులు కె. సోమునాయుడు, రాజేష్, నర్సింహమూర్తి, ఎస్‌వి నాయుడు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

చెరకు కనీస మద్ధతు ధర రూ. 3500 చెల్లించాలి
చోడవరం, సెప్టెంబర్ 22: చెరకు కనీస మద్ధతు ధర టన్నుకు 3500 రూపాయలుగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. శనివారం రైతుసంఘ ప్రతినిధులు, గోవాడ సుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కెఆర్ విక్టర్ రాజును కలిసి తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ చెరకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యన్నంశెట్టి సీతారామ్, కార్యదర్శి కర్రి అప్పారావు, సహాయ కార్యదర్శి జి. నాయినిబాబు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మహాజన సభలో పాలకవర్గం ప్రకటించిన తీర్మానం ప్రకారం టన్నుకు 2700 రూపాయలు చెల్లించాల్సివుండగా కేవలం 2500రూపాయలు మాత్రమే చెల్లించారని, బకాయిలతోపాటు రికవరీ, చెరకు రవాణా చార్జీలు, ఎరువుల సబ్సిడీ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. అలాగే ఈ ఏడాది మహాజన సభలో ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహక ధర టన్నుకు 200రూపాయలు ప్రకటించారని వారు కోరారు. అలాగే ఫ్యాక్టరీ పరిధిలో ప్రస్తుత సీజన్‌కు కనీస మద్ధతు ధర 3500 రూపాయలు తక్కువ కాకుండా చెల్లించాలని వారు కోరారు. ఫ్యాక్టరీకి ప్రభుత్వం అందించిన సహాయంపై శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. చెరకు కటింగ్ ఆర్డర్లు పారదర్శకంగా అందించాలన్నారు. ప్యాక్టరీ రవాణాలో గాయపడ్డ రైతులకు, పశువులకు అందజేస్తున్న నష్టపరిహారం రెట్టింపుచేయాలని వారు డిమాండ్ చేసారు. అలాగే తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి డి. వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రాజు, సంఘ మాడుగుల డివిజన్ కార్యదర్శి ఆర్. దేముడునాయుడు, శిలపరశెట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఏకధాటిగా కురిసిన వర్షానికి స్తంభించిన జనజీవనం
పల్లపుప్రాంతాలు జలమయం
చోడవరం, సెప్టెంబర్ 22: ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఏకధాటిగా గంటన్నరపాటు వర్షబీభత్సం సృష్టించింది. పల్లపుప్రాంతాలన్నీ జలమయం కాగా రహదారులపై కూడా వర్షపునీరు ప్రవహించింది. గత మూడురోజులుగా సాయంత్రం వేళల్లో కురుస్తున్న వర్షానికి భిన్నంగా శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి 5.30గంటల వరకు ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి తహశీల్దార్ కార్యాలయం, రెల్లివీధి, ఆర్టీసి కాంప్లెక్స్, రైతుబజార్ రోడ్డు తదితర పల్లపుప్రాంతాలన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. దీంతో వాహనచోదకులే కాకుండా పాదచారులు కూడా ప్రయాణాలు సాగించేందుకు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా అదే సమయంలో పాఠశాల విడిచిపెట్టడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. ఒకవైపు బోరున కురుస్తున్న వర్షానికి గాలి కూడా తోడవటంతో రక్షణగా తెచ్చుకున్న గొడుగులు కూడా విరిగిపోయాయి. అయితే విద్యార్థులు కవర్లు కప్పుకుని ఇళ్లకు తరలివెళ్లారు.