విశాఖపట్నం

ఉపాధి పథకం అమలు తీరుపై నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డుంబ్రిగుడ, సెప్టెంబర్ 22: ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో గిరిజనులు వలస బాట పడుతున్నారని ప్రజాప్రతినిధులు వాపోయారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉపాధి పథకం అమలు తీరుపై పలువురు సభ్యులు నిరసన వ్యక్తం చేసారు. మండలంలో ఉపాధి హామీ పథకం గిరిజనులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని వారు అన్నారు. గిరిజనులకు సక్రమంగా పనిదినాలు కల్పించకపోవడంతో అనేక మంది పనుల కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెప్పారు. ఉపాధి కూలీలకు క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండడం లేదని వారు అన్నారు. ఉపాధి పథకంలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లకు బిల్లులు కూడా చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. గ్రామాలలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు అన్నారు. గత సంవత్సరం మండల పరిషత్ నిధులు కేటాయించడంలో ఏకపక్షంగా వ్యవహరించారని, తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఎం.పి.టి.సి.లు వాపోయారు. గతంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలలో తాము ఎన్నో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నా వాటిని పరిష్కరించడం లేదని వారు ఆరోపించారు. సమస్యలు పరిష్కరించని సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని వారు నిలదీసారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఎం.పి.పి. వి.జమున, ఎం.పి.డి.ఒ. మీనాకుమారి, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మెనూ అమలు చేయాలని ర్యాలీ
హుకుంపేట, సెప్టెంబర్ 22: ఆశ్రమ పాఠశాలల్లో నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం హుకుంపేట వారపు సంతలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో మెనూ అమలులో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ. నాయకుడు కె.నర్సయ్య మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమాల్లో నూతన మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన వార్డెన్లు అక్రమాలకు పాల్పడుతూ చాలీ చాలని ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై అధికారులు దృష్టి సారించి మెనూ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

నాటుసారాను అరికట్టాలి
హుకుంపేట, సెప్టెంబర్ 22: తమ గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న నాటు సారా తయారీని అధికారులు అరికట్టాలని మండలంలోని దుర్గం పంచాయతీ బంగారంగరువు గ్రామ గిరిజనులు కోరుతున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో కొందరు అడ్డూఅదుపు లేకుండా సారా తయారీ, విక్రయాలను సాగిస్తున్నారని వారు చెప్పారు. దీంతో సారాకు బానిసలైన వారు అనేక అల్లర్లను సృష్టించి గ్రామంలో అశాంతిని కలిగిస్తున్నారని వారు వాపోయారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి నాటుసారాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

పాఠశాలల అభివృద్దికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలి
కోటవురట్ల, సెప్టెంబర్ 22: పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాలల అభివృద్దికి ముందుకు రావాలని స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌కు చెందిన 95 మంది విద్యార్థులకు స్టీల్ కంచాలు, నోట్ పుస్తకాలను 1985 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సౌజన్యంతో వెంకటేశ్వరరావు అందజేసారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో శనివారం పూర్వ విద్యార్థులు సమావేశమై ప్రతీ ఏటా ఈహైస్కూల్‌కు చెందిన విద్యార్థినీవిద్యార్థులకు సహాయ సహకారాలు అందజేయాలని తీర్మానించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు స్టీల్ కంచాలను అందజేసారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులను వెంకటేశ్వరరావును పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ముందుగా పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థుల అసోషియేషన్ ప్రతినిధులు అనురాధ, ఎం.రాజు, బాబాసాహెబ్, అప్పలరాజు, రాజేష్, లక్ష్మణమూర్తి, ఎస్.కృష్ణ, గోపీ తదితరులు పాల్గొన్నారు.