విశాఖపట్నం

బామ్మ పెళ్లి ముచ్చట్లు (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బామ్మకు ఆరోగ్యం బాగు లేదని ఫోన్ వచ్చింది. మూడు రోజులు సెలవు పెట్టుకుని శని, ఆదివారాలు కలసి వచ్చేటట్లు బయలుదేరాను. ఇంటికి చేరేసరికి ఒక్కొక్కళ్లే దిగుతున్నారు. బామ్మ దగ్గరకు వెళ్లి పలకరించాను. చిన్నగా నవ్వింది. బాగా నీరసంగా అయిపోయింది. నా చెయ్యి పట్టుకుని వదలలేదు. బామ్మకు ఆరుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, మనవలు మునిమనవలు బోలెడుమంది. బామ్మ వయసు 90 సంవత్సరాలు. ఇల్లు పాతకాలందే కానీ పెద్దది. చక్కగా ఉంచుతుంది అమ్మ. నాన్న పోయి నాలుగు సంవత్సరాలయింది. నేనూ, అన్నయ్య జీవితంలో స్థిరపడినట్టే. అమ్మకు మా గురించి ఎప్పుడూ బెంగ లేదు. అన్నీ బామ్మనే చూసుకునేది. అమ్మ ఇంటి పని వంట పని చేసుకోవడం, అన్నీ చక్కగా అమర్చటం వరకే. అమ్మతో కన్నా మాకు బామ్మతోనే అనుబంధం ఎక్కువ. బామ్మ దగ్గర పడుకోవడం, బామ్మ చేతి ముద్దలు తినడం ఇప్పటికీ మాకు అలవాటు. మా బాబాయ్ క్రితం సంవత్సరం పోయారు. బామ్మ కళ్లముందు ఇద్దరు కొడుకులు, ఇంకా అల్లుడు కూడా పోయేసరికి ఆ ముసలి గుండె తట్టుకోలేకపోయింది. నాన్న, బాబాయ్ కలసి తీయించుకున్న ఫొటో చూసి ఈ మధ్య అస్తమాను కన్నీళ్లు పెట్టుకుంటోందిట. అత్తయ్యలందరూ వచ్చారు. అత్తయ్యల పిల్లలు, బాబాయ్‌ల పిల్లలతో ఇల్లు పెళ్లివారి ఇల్లులా ఉంది. అందరినీ చూసేసరికి బామ్మకు బాగానే ఓపిక వచ్చింది. సాయంకాలం అయినాక డాక్టర్ చూడడానికి వచ్చాడు బామ్మని. అతనికి మా కుటుంబం అంటే చాలా గౌరవం. అతను డాక్టర్ చదివేటప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాడు. అప్పుడు తాతగారు ఫీజులు కట్టి, బామ్మ వరండాలో ఉండడానికి స్థలం ఇచ్చి భోజనం పెట్టేది. అలా సహాయం చేసేవారు. అవన్నీ మరచిపోలేదు ఆయన. ఇపుడు అతను చాలా పెద్ద హార్ట్ స్పెషలిస్టు. అతన్ని కలవాలంటే మూడు నెలల ముందు పేరు నమోదు చేసుకుని తరువాత మూడు రోజుల ముందు అపాయింట్‌మెంటు తీసుకోవాలి. అయినా పాత అభిమానం మరచిపోలేదు. బామ్మకు ఎప్పుడు అవసరం పడినా చూసి వెళతాడు. బామ్మను చెక్ చెయ్యడం అయినాక ఆయన మమ్మల్ని బయటికి పిలిచి చెప్పాడు. ‘‘ఆవిడకు అనారోగ్యం ఏమీ లేదు. వయసు పెద్దదవడం, మానసికంగా ఒంటరితనం అంతే. బలానికి మందులు ఇచ్చాను. ఆవిడను మాత్రం దగ్గర దగ్గరగా వచ్చి చూసి వెళుతూ ఉండండి. ఇంకా ఆవిడతో సరదాగా గడపండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
బామ్మకు నేనంటే కొంచెం అభిమానం ఎక్కువే. ఎందుకంటే నా పేరు, తాత పేరు ఒకటే కాబట్టి. నన్ను ‘ఒరే అబ్బిగా, భడవా’ ఇలా ఏవో పేర్లు పెట్టి పిలుస్తుంది కాని అసలు పేరుతో మాత్రం పిలవదు. బామ్మ దగ్గరకు వచ్చా. ‘‘బామ్మా ఈ రోజు అందరికీ ముద్దలు పెట్టవే’’ అని అడిగా. సరేనంది బామ్మ. ఇంకా నేనందరికీ ఈ మాట చెప్పా. బామ్మ ముద్దలు పెడుతుంది అని. ఆ మాట వినంగానే ఆనందంగా అందరూ కేకలు వేస్తున్నారు. అమ్మ, అత్తయ్యలు మాత్రం మమ్మల్ని దెబ్బలాడారు. ‘‘అసలే నీర్సంగా ఉంది. కాస్త తగ్గాక తినిపిస్తుంది లెండి’’ అంటే మేము ఒప్పుకోలేదు. బామ్మ కూడా ‘‘నాకేం కాదులేర్రా నేను బాగానే ఉన్నాను’’ అంది. టైం ఎనిమిదయింది అందరం ఎదురుచూస్తున్నాం బామ్మ చేతి ముద్దల కోసమని. అమ్మ పెద్ద కంచంలో వేడి వేడి అన్నం మీద వెన్నపూస వేసి రాచిప్పలో గోంగూర పచ్చడి, ఇంకా చింతకాయ పచ్చడి తీసుకుని వచ్చి బామ్మకు అన్నం కలపడంలో సాయం చేస్తోంది. బామ్మ మధ్యన కూర్చుంది. అందరం చుట్టూరా కూర్చున్నాం. బామ్మ కమ్మటి గోంగూర పచ్చడి ముద్దలు అందిస్తుంటే అందరం తినడంతో చిన్న పిల్లలం అయిపోయాం. అప్పుడు అడిగాను ‘‘బామ్మా మీ పెళ్లెపుడయిందే?’’ అని. ‘‘మా పెళ్లి స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల ముప్పైలో అయింది. అప్పటికి నేను నాలుగేళ్లదాన్ని. మీ తాత ఆరేళ్లవాడు. డోలు సన్నాయి మేళంతో వచ్చారు. మీ తాత గొప్ప స్టైలుకొడుతున్నాడు. ననే్నమో అందరూ లోపల ఉండు లోపల ఉండూ అంటారు. అయినా నేను అన్నీ తొంగి చూస్తూనే ఉన్నా. మా అమ్మ చేయించిన లడ్డూలన్నీ అందరూ తింటూ ఉంటే నాకు చాలా బాధేసింది. పెళ్లయినాక ముత్యాల పల్లకీ ఎక్కించి ఊరేగింపుకి తీసుకెళుతూ వుంటే అప్పుడు అందరూ దూరంగా ఉన్నారుగా మీ తాతకు నేను సొంటిపిక్క తీశాను. లడ్డూలూ, అరిశలు తిన్నారని కోపంకొద్దీ. అంతే మీ తాత పల్లకీలోంచి ఒక్క గెంతు గెంతి పరుగోపరుగు. ఏమయిందని అందరూ గాభరాపడ్డారు. విషయం తెలుసుకుని అందరూ నవ్వు. మా అమ్మ, నాన్న మాత్రం నన్ను కేకలు వేసారు. తరువాత వసంతాలు పోయించారు. మీ తాతకన్నా ఎక్కువ వసంతం పోశానని నన్ను బలవంతాన కుడితి గోలంలో దించారు. నేను గట్టిగా ఏడుపు. ఇంకా గొడవ ఎక్కువ అవుతుందని మగపెళ్లివారి వద్ద బాగోదు ఈ సిసింద్రీ ఒప్పదని నాన్న నన్ను ఎత్తుకుని తీసుకుపోయి పడుకోబెట్టారు’’
బామ్మ అలసిపోయింది. ఇంక కబుర్లు చెప్పలేకపోతోంది. అత్తయ్య కేక వేసింది ‘‘ఇంక చాల్లెండర్రా. పోయి మజ్జిగ అన్నాలు తినండి’’ అంది. బామ్మకు ఆయాసం వచ్చింది. మెల్లగా ఆవిడకు నేను చేయి కడిగించి మంచం దాకా చేయి పట్టుకుని తీసుకెళ్లి ‘‘బామ్మ మీ ముసలాయన్ని తల్చుకుంటూ పడుకోవే బాగా నిద్ర పడుతుంది’’ అన్నా. ‘‘పోరా భడవా’’ అంటూ నవ్వింది బామ్మ.
ఎండాకాలం అందరూ తలా ఒక తలగడా పెట్టుకుని నడవాలోనే పడుకున్నాం. అప్పటి బాల్య వివాహాలు ఇంకా ఏవేవో మాటలాడుకుంటూ ఎప్పటికో నిద్రపోయాం. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.
‘‘లేవండర్రా లేవండర్రా’’ అంటూ పెద్దత్తయ్య లేపుతోంది. లోపల సన్నగా ఏడుపులు. అందరం ఒక్క ఉదుటున లోపలికి వెళ్లాం. బామ్మ పడుకున్నట్టే ఉంది. ఏ రాత్రో ప్రాణం పోయింది. నాకు మాత్రం బోసినవ్వుల బుజ్జి పెళ్లికూతురే నాకళ్ల ముందు కనిపిస్తోంది.

- తెలికిచెర్ల విజయలక్ష్మి,
ఫోన్: 0930142-1243.

మినీకథ

ఇల్లు-ఇల్లాలు

‘‘ఏమండీ! ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందట. అద్దెకు ఇస్తారా’’ అని అడిగాడు ఒక చిరుద్యోగి చిరంజీవులు.
‘‘ఉందండీ!’’ అని బయటికి వచ్చాడు యజమాని రామయ్య. చిరంజీవుల వివరాలు, ఇంటి అద్దె మాట్లాడుకున్నారు.
‘‘అమ్మా! కళ్యాణి... ఆ చిన్న ఇల్లు తాళం తేమ్మా’’ అనగానే ఇంటి నుండి రామయ్య పిలుపు విని తాళం తెచ్చింది కూతురు కళ్యాణి. అప్పుడు చిరంజీవులు కళ్యాణి వైపు ఎగాదిగా చూశాడు. అది గమనించి రామయ్య ‘‘నాకు ఒక్కదాయే కూతురు. నా భార్య చనిపోయింది. నేనా పిల్లను చదివించాను, సంబంధాలు వస్తున్నాయి. కాని లక్షల రేట్లు’’ అని తన బాధను చెప్పాడు చిరంజీవులుతో రామయ్య. ‘‘నాకూ ఎవ్వరూ లేరు. ఉన్నా బంధువులు పట్టించుకోరు. నా స్వయం కృషితో ఈ ఉద్యోగం సంపాదించుకున్నాను’’ అని చెప్పాడు.
అలా కొద్ది రోజులు గడిచాయి. ఒక రోజు రామయ్య చిరంజీవులుతో ‘‘బాబూ ఎందుకు హోటల్ భోజనం. మాకు అందులో సగం ఇవ్వు ఇంటిలోనే వండిపెడతాము. అందరమూ కలసి భోంచేద్దాం’’ అని రామయ్య అనగానే చిరంజీవులు సరేనన్నాడు.
ఒకరోజు రామయ్య చిరంజీవులుతో ‘‘బాబూ ఈ రోజు మంచి రోజు. చూడు మన కులాలు వేరైనా మనసులు కలిశాయి. మా అమ్మాయి నీవంటే ఇష్టపడుతోంది. ఇల్లు అదీ మీ ఇద్దరికీ రాసిస్తాను. అదే కట్నం అనుకుని పెళ్ల్లి చేసుకో’’ అని చేతులు పట్టుకున్నాడు.
‘‘్భలే కులాంతర వివాహం. ఇంటి కోసం వచ్చి ఇల్లాలిని పొందుతున్నాను’’ అని చిరంజీవులు కళ్యాణిని పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలిపాడు.

- సీరపు మల్లేశ్వరరావు,
కాశీబుగ్గ. సెల్ : 7680812592.

మనోగీతికలు

జీవన పల్లవి
ఏమిటీవేళ
సూర్యాస్తమయాన్ని చూడండి
నా కన్నీరు ఆగడం లేదు!
వెర్రిదానా!
అది అస్తమయం కాదు
నిరంతరం వెలిగే దివ్యజ్యోతి
నువ్వూ అలాగే
నా జీవితనావకు నావికవు
నా జీవన కథా నాయికవు
ఈ సంసార నాటకానికి
నాందివి
నా జీవితపు పాటలో పల్లవివి
బతుకు బంధానివి
నీకా దిగులు?

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి,
సెల్ : 9246666585.

వౌనగీతం
తెల్లమబ్బుల మధ్యనున్న
నీలిమేఘం... వర్షిస్తుందనుకోలేదు
ఎర్రబడ్డ నీ మోము
నన్ను ప్రేమిస్తుందనీ అనుకోలేదు
నీ మొదటి చూపుతో
నే పులకించిపోయాను
మన ప్రథమ వీక్షణాలే
గుర్తుండిపోయే మధుర క్షణాలు
పలవరింతలాగా నిన్ను పలకరించా
ఆ పిలుపు నిన్ను చేరినా కిమ్మనున్నావు
నీ హృదయానికి అది వినిపించింది
నా మనసుతో మాటాడుకుంది
నాలో ఎగసిపడే అస్పష్టత ఊహలకి
ఏకాగ్రతను కుదిర్చింది
ప్రేమగా నా జీవితంలో నడయాడ
ఓ నా సుకుమారీ వయారీ!

- కె.వి. సుబ్రహ్మణ్యం,
గణేష్‌కాలనీ, సింహాచలం, విశాఖపట్నం-530028.

నీకూ నాకూ మధ్య
అమ్మలా లాలిస్తావు
నాన్నలా పాలిస్తావు
అన్నీ నీవై వ్యవహరిస్తావు
చిన్న మాటకి వీగిపోతావు
చింతనిప్పులా మండిపడతావు
నిన్ను గుర్తించలేదంటావు
ఏం చేసినా అందులో
తప్పులు వెదుకుతావు
పనిలో సహకరిస్తే
పబ్లిసిటీ కోసమంటావు
మాటల తూటాలతో
మానసికంగా హింసించి
మానని గాయాన్ని చేస్తావు
నీ ఆవేశం కట్టలు తెంచుకుంటే
వస్తువులకి వస్తుంది
మరో రూపం
అర్ధం కాని నీ నైజం
సర్వానికీ అనర్థం!

- పి. కాశీవిశ్వనాథం, ధర్మవరం,
విజయనగరం జిల్లా, సెల్ : 9494524445.

అందని ద్రాక్షలు
పసికందుల మీద పచ్చకళ్ల
రాకాసుల కరాళ నృత్యం
సాటి ఉపాధ్యాయులపై
కపట అలౌకిక వివక్షల
విషం చిమ్ముతున్న సర్పాలు
దిష్టి పిడతల డూడూబసవన్నల పాలనలో
కపాలాల కళ్లల్లో పొంచివున్న
రెండుకోరల సూత్రధారులు
సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్లుకాదు విద్యార్థులు
నువ్వు తుంచటానికి..
నీ ఇంటి పెరట్లో
తులసిమొక్కలు కాదు వాళ్లు
సిమెంట్ పూతలు పూయటానికి..
విద్యావనంలో 40 దిక్కులకు విస్తరించే
చిరుతలు, బుడతలు వాళ్లే!
మానవ వనరులు, దేశ భాగ్యసిరులు,
ప్రగతి సౌభాగ్యాలు
వాళ్లూ గువ్వల్లా తుర్రుమంటారు
గవ్వల్లా మెరుస్తారు
కోయిల్లా కూస్తారు కాకుల్లా గోలచేస్తారు
లేడిలా గంతులేస్తారు కూనల్లా కులుకుతారు
రాగాలు తీస్తారు, మారాం చేస్తారు
గారాలు పోతారు ఈ ప్రపంచంలో!
మనకు తెలిసీ
ఒకేఒక్క సౌందర్య తత్వశాస్త్రం పేరే ‘పిల్లలు’
డ్రాప్‌అవుట్ స్టూడెంట్ దయనీయ పరిస్థితులు
బాల్యవివాహాలు ఒకవైపు
కిమ్మనకుండా నిమ్మకునీరెత్తినట్టుగా
టీచర్ల వ్యవస్థ - ఇదీ మన ప్రోగ్రెస్ రిపోర్ట్!
ప్రేక్షక పేరంటాళ్ల ముత్తయిదువుల
మీనమీషాల వేషధారణలు మరోవైపు
చెవిటోడి ముందు శంఖం వూదటం
నటించేవాడ్ని నిద్రలేపటం
‘బెల్‌బాటాల్లా, ‘టైం బాంబుల్లా
ఆటోమాటిక్ వాల్‌క్లాక్’ కిక్కుల్లో
కార్తీక మాసాల కాస్మోపాలిటన్
పులిహోర భోజనాలు
హైజనిక్ ఆడంబర జీవన దబ్బనాలు
మన విద్యాప్రమాణాలు!
విద్యార్థుల జ్ఞాన మీమాంసను
నోటకరుస్తున్న శునకాలు
పిల్లల సహజాత జలాల్ని కొట్టేస్తున్న
హైటెక్ టక్కులమారీలు
బాల్యరేఖకు అడ్డంగా నీ తూనికరాళ్లతో
కార్పొరేట్ పనిష్మెంట్లా!?
పిల్లలకు అర్థమయ్యే భాషలోనే
‘వాచకం’ వుండాలి
వాచకాన్ని మించిన ‘వాక్కు’ వుండాలి
ప్రథమ అమోఘ సూర్యుడిలా
పిల్లల మనసులు గెలవాలి
అందని ద్రాక్షాగుత్తుల్లా కాకుండా!
కసరత్త్తు చేయాలి
పిల్లల హృదయ ద్వారాలకు కట్టిన
పచ్చని తోరణాలుగా వుండాలి టీచర్లు
నదికి తెలీదా నడిచే దారేదో?
తల్లిస్పర్శ లేకుండానే కదులుతాయా
పిల్లకాలువలు ఎక్కడన్నా!?
నాకు చిన్నప్పుడే సముద్ర మనస్తత్వాన్ని
వదిలేసిపోయారు
నేనిప్పుడు సముద్ర గర్భాన్ని..

(ప్రభుత్వ, ప్రైవేట్ విద్యారంగంలో పిల్లల పట్ల
కొందరు ఉపాధ్యాయుల తీరుతెన్నులు చూశాక)

- సరిశాసి (నీలం సర్వేశ్వరావు),
చరవాణి : 9391996005

పుస్తక సమీక్ష

ద్విభాషా సాహిత్య
సారథి, వ్యాస వారథి

వివిధ ప్రాంతీయ భాషా సాహిత్యాలు పరస్పరం ప్రభావితం చేసుకోవడం సహజం. ఆదాన ప్రదాన వ్యాసాంగాన్ననుసరించి సాహిత్యంపై ఇతర సాహిత్యాల ప్రభావం కూడా పడుతుంది. సమాజ హితం కోసమో, సాహిత్యం మీద ఉన్న అభిలాషతోనో, భాషాభిమానమే ధ్యేయంగా సాహితీ సృజన చేసే రచయితలకు భాషా, ప్రాంతీయ భేదాభిప్రాయాలుండవు. సాహిత్య లోకంలో మనకి ఎరుకపరిచే అనేక అంశాలతో రచయిత్రి డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి సాహిత్య వ్యాసాలు ‘వ్యాస వారథి’ శీర్షికతో సంకలనం వెలువరించారు.
ఈ వ్యాసవారథి తెలుగు వాఙ్మయానికి మరింత వెలుగునిస్తుంది అని సాహిత్య సవ్యసాచి, విమర్శక రత్న డాక్టర్ ద్వానా శాస్ర్తీ పేర్కొన్నారంటే రచయిత్రి రచనకు నిండు గౌరవం లభించినట్లే. రచనలోని నిక్షిప్తమైన అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి నిస్పక్షపాతంగా ఉందని 265 పేజీలు మొత్తం చదివితే ఎవరికైనా అదే అనిపిస్తుంది. రచయిత్రి అటు ఒడిశాకు ఇటు ఆంధ్రాకు వారథిగా రెండు భాషల్ని భుజానె్నత్తుకుని పాఠకులకు పరిచయం చేయడం జరిగింది. ముప్పై అయిదు అంశాలతో ఈ వ్యాస సంకలనం అందించడం ద్వారా రచయిత్రి తెలుగునాట రచయిత్రులకు ఆదర్శంగా నిలిచారు. డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం పొందారు. ఈ వ్యాస గ్రంథంలో తాత్విక, మానవతా గీతాలతో, మునిపల్లెరాజు మ్యాజిక్ రియలిజమ్ కథలతో మొదలు పెట్టి అనేక పేరు ప్రతిష్ఠలున్న సాహితీవేత్తల రచనల్ని పరిచయం చేశారు. గత అయిదారేళ్లుగా విరివిగా పత్రికల్లో వ్యాసాలు ప్రచురించి ప్రశంసలందుకున్నారు. అవన్నీ గుదిగుచ్చి మనకందించారు ఈ సంకలన రూపంగా. వందేళ్ళ తెలుగు కథావనంలో మునిపల్లెరాజు కథలు బోధి వృక్షం లాంటివి అని వారు రాసిన మ్యాజిక్ రియలిజమ్ కథలు, తాత్విక మానవ గీతాల గురించి పరిచయం చేశారు. ఆ కథా సంపుటిలో మూడు కథలు పరిశీలించి వ్యాసంగా రాశారు. మహాభారతంలో కొన్ని అద్భుత ఘట్టాలు, నైమిశారణ్యంలో సత్రయాగం, అదృష్ట దేవత మున్నగునవి ఉన్నాయి. అలాగే ఉప్పల లక్ష్మణరావు కథా సాహిత్యం, 1965-75 నాటి సామాజిక అంశంపై రాసిన కథ ‘తొణికిన స్వప్నం, తొలగిన స్వర్గం’ నేపథ్యాన్ని చెపుతూ కథలోని మూలాన్ని బహు నేర్పుగా ఆవిష్కరించారు. అలాగే కారా మాష్టారు ‘చావు’ కథలోని అట్టడుగు స్ర్తి పాత్రల గురించి, అప్పటి పరిస్థితులు, వాతావరణం, స్ర్తిల సమస్యలు, సామాజిక దృక్పథంతో వివరించడం రచయిత్రిగా స్ర్తిల పట్ల కనపరిచే ఔదార్యం, సానుభూతి కనిపిస్తుంది. ఆధునిక ఒరియా సాహిత్యంలో మనోజ్ దాస్ రచనను అనువదించిన ఉపద్రష్టను పరిచయం చేయడం ఒక పార్శ్వం అయితే ఆ రచనలోని అంతరంగాలు ఆవిష్కరణ, మనో విజ్ఞాన శాస్త్రంలోని విశేషాలన్నీ వివరించారు. ఒడిశా గ్రామీణ జీవనం, రాజకీయ ఒత్తిడులు కథలో ఎలా మలిచారో విశే్లషించారు. అలాగే ఒడిశా సాహిత్యంలో మరో మైలురాయి ప్రతిభారాయ్ సాహిత్య ప్రస్థానంలోని మానవీయ విలువలు, మణిదర్పణం, ఉల్లంఘనలోని కథాంశాలు పాఠకుల్ని సమ్మోహితులను చేస్తాయని చెప్పారు. ‘వ్యాసవారథి’ సంకలనంలో అందరూ చదవవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో రాజు, కవి, కళ, కళింగాంధ్ర చరిత్రలోని అద్భుత ఘట్టం వంటి పరిశోధనాత్మక వ్యాసాలు లెక్కించతగినవి. ఆంగ్ల రచన ఫ్రంట్ గేదరింగ్‌ను తెలుగులోకి అతి సరళంగా అనువదించి అందరి మన్ననలు పొందారు.
అక్షరాల వాన, అద్దేపల్లి కవిత్వమంటూ పొగచూరిన ఆకాశంలోని సాహితీ విలువల్ని, ప్రపంచీకరణ నేపథ్యంలో కవి ఎలా స్వీకరించారో ఈ వ్యాసంలో సూటిగా చెప్పారు రచయిత్రి. ఆ కవిత్వంలోని అంతస్సూత్రం, ఆర్థిక, రాజకీయాల లొంగుబాటు, సాంస్కృతిక పతనానికి దారితీసిన ప్రపంచీకరణ విషయాల్ని విపులీకరించడంలో రచయిత్రి తన మనోక్షేత్రాలలో కవితా కేదారాలు పండించే రీతుల్ని అర్థవంతంగా పేర్కొన్నారు.
దీర్ఘ కవిత రాజూ, ఛాయరాజ్ కవిత్వాన్ని పరిశీలిస్తూ, కవిని కవితాత్మకంగా తీర్చిదిద్దారు. షెర్లీ, కృష్ణశాస్ర్తీ ప్రవచించిన విషాద మాధురిని, కోలరెడ్జ్, వర్డ్స్‌వర్త్ తదితర కాల్పనిక భావ కవుల కవితా రహస్యాలను అందిపుచ్చుకున్న కవయిత్రి ఆదూరి సత్యవతీదేవి, సమకాలీన కవిత్వంలో ఆమె రంగులు, ‘వేయి రంగుల వెలుగు రాగం’ అంటారు. ఆమె తెలుగు కవితా సాహిత్యంలో నవనవోనే్మషంగా పరిఢవిల్లిందని కీర్తించారు తన వ్యాసంలో. తుర్లపాటి రాజేశ్వరి సాహిత్యంలో అన్ని ప్రక్రియల్ని స్పృశిస్తూ అనువాదంలో కూడా తనదైన ముద్రను బలపరచుకున్నారు. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఒడిశాలో తెలుగువారు గుర్తింపు పొందేలా ఒక పుస్తకాన్ని ప్రచురించడం రెండు భాషల నడుమ వారథిగా తెలుగు వ్యాస వాఙ్మయానికెంతో సేవ చేయడం శ్లాఘించవలసినది. ప్రపంచంలో ఎక్కడ అకృత్యం జరిగినా తన కవితా వస్తువుగా మలచిన తుర్లపాటి రాజేశ్వరిని ‘గాయాల చెట్టు’ వ్యాసంలో పలువురు రచయితలు శ్లాఘించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, హైదరాబాద్ వారి తెలుగు వికాసం పురస్కారం, ద్వానా శాస్ర్తీ సాహితీ అవార్డులను అందుకున్నారు. ఒడిశాలో తెలుగు పతాకను ఎగురవేస్తున్న ఏకైక రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి. ఆమె శ్వాస తెలుగు, ఆమె ఆశ తెలుగు, అదే తీరు నిరంతరం కొనసాగాలని అభిలషిద్దాం.

- అడపా రామకృష్ణ,
సెల్: 9505269091.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- తెలికిచెర్ల విజయలక్ష్మి