విశాఖపట్నం

నీ సుఖమే నే కోరుకున్నా...! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలై నెల 15వ తేదీ. రోజులానే ఈరోజు కూడా మళ్లీ బస్ మిస్ అయింది. తర్వాత వచ్చిన బస్సు ఎక్కి ఒక ఖాళీ సీట్లో కూర్చున్నాను. ఇంతలో ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ’’ అని ఓ తీయటి గొంతు వినిపించి తిరిగి చూశాను.
పసుపు చుడీదార్‌లో ఉన్న ఒక అమ్మాయి నిలబడి ఉంది.
విండో సీటు చూపిస్తూ ‘‘కెన్ ఐ...’’ అంది. ‘‘యా’’ అని నేను పక్కకి కూర్చున్నాను. తను నన్ను దాటుకుంటూ వెళ్లి కూర్చుంది.
ఆమె నుండి వచ్చిన పరిమళం గమ్మత్తుగా అనిపించింది.
గాలి వల్ల ఆమె జుట్టు నా మొహం మీద పడింది.
‘‘సారీ’’ అని సర్దుకుని కూర్చుంది.
నాకు ఆ అనుభవం గమ్మత్తుగా అనిపించింది.
నా చూపులు ఆమెపైన అతుక్కుపోయాయి.
తనతో ఎలాగైనా స్నేహం చేయాలి అనిపిస్తోంది.
అంతలో ఆమె మాట్లాడుతూ ‘‘నా మొబైల్‌లో బ్యాటరీ వీకయిపోయింది. ఒక్కసారి మీ సెల్ ఇస్తారా?’’ అంది.
నాకు చాలా సంతోషం అనిపించింది.
నా మొబైల్ తీసి ఆమెకి అందించాను.
మాట్లాడి ఇచ్చేసింది.
ఇస్తూ ‘‘ఏమిటీ స్క్రీన్ మీద మీ అమ్మానాన్నల ఫొటో ఉంది. మామూలుగా అయితే ఏ హీరోయిన్ ఫొటోనో, లవర్ ఫొటోనో పెట్టుకుంటారు కదా’’ అంది.
‘‘అదా! ఎవరికైనా అమ్మానాన్నలే కదండీ తొలి దైవాలు. అనుక్షణం మన కోసం తపన పడుతూ, ఎక్కడో ఉద్యోగం చేస్తున్న పిల్లల గురించి ఆరాట పడుతూ ఫోనులో యోగక్షేమాలు విచారిస్తూ గడుపుతారు. వాళ్లతో కలసి జీవించలేకపోతున్నా కనీసం వాళ్లని కావలసినప్పుడలా చూసుకోవడానికైనా వీలవుతుందని ఇలా పెట్టుకున్నాను’’ చెప్పాను.
‘‘ఇప్పుడు కూడా మీలాంటి వాళ్లు ఉన్నారంటే గ్రేట్’’ అంది.
‘‘అయ్యో నేను గాలిలో తేలిపోతున్నాను’’ అన్నాను.
‘‘అదేమిటి?’’ ఆశ్చర్యంగా అంది.
‘‘మీరు నన్ను పొగుడుతుంటే నాకు అలాగే అనిపిస్తోంది మరి’’
‘‘మీరు భలే మాట్లాడుతారు’’
‘‘మీ పేరు తెలుసుకవచ్చా?’’
‘‘హాసిని! మరి మీ పేరు’’
‘‘సిద్ధార్థ’’
తను దిగాల్సిన చోటు వచ్చింది.
నా మనసు బాధగా మూలిగింది.
‘‘బై’’ అని చెప్పి ఆమె దిగిపోయింది.
నాకింక ఆ బస్సులో ఉండాలని అనిపించలేదు.
వెంటనే దిగిపోయాను.
‘‘హాసినిగారూ!’’ అని పిలిచాను.
‘ ఏమిటి?’’ అన్నట్లు చూసింది.
‘‘వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ’’ అన్నాను.
ఏమనుకుంటుందో అని చిన్న భయం.
‘‘రేపు సాయంత్రం నాలుగు గంటలకి కాఫీ డే’’ అంది.
నా మనసు ఆకాశంలో గంతులేసింది.
‘‘సరే నేను ఎదురుచూస్తూ ఉంటా’’ అని రన్నింగ్ బస్సు ఎక్కి అరిచాను.
రోజంతా నా మనసు మనసులో లేదు.
మర్నాడు శనివారం!
ఎప్పుడూ లేనిది ఉదయం అయిదు గంటలకి నిద్ర లేచాను. కాలకృత్యాలు ముగించుకుని మంచి టీషర్టు వేసుకుని బయలుదేరాను.
‘ఏం మాట్లాడాలి... ఎలా మాట్లాడాలి?’ అని రిహార్సల్ వేసుకున్నాను.
మూడు గంటలకే కాఫీడేకి వెళ్లిపోయాను. వెయిటర్ నన్ను విచిత్రంగా చూస్తున్నాడు.
కొద్దిసేపటి తర్వాత ‘‘ఆర్డర్ సార్’’ అంటూ వచ్చాడు.
‘‘నేను ఒకరి కోసం ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పగానే వెళ్లిపోయాడు.
సరిగ్గా నాలుగు గంటలకి తను వచ్చింది. వైట్ చుడీదార్‌లో అందంగా ఉంది.
‘‘స్వర్గంలో ఉండాల్సిన అప్సరస వచ్చినట్లు ఉన్నారు’’ అన్నాను.
గట్టిగా నవ్వింది. ‘‘మీ మాటలు భలే చమత్కారంగా ఉంటాయి’’ అంది.
నేను నవ్వేశాను.
‘‘మీరు బస్సులో ఎవరితోనూ మాట్లాడినట్లు చూడలేదు’’ అంది.
‘‘అదేంటి మనం బస్సులో కలిసింది నిన్ననే కదా’’ అన్నాను.
‘‘కాని నేను మిమ్మల్ని రోజూ చూస్తూనే ఉన్నాను. ఎప్పడూ దిగులుగా ఎక్కుతారు. ఆఫీసుకి లేట్ అయిపోతాననే టెన్షన్ అనుకుంటాను. మీ ఆఫీసులోనే పనిచేసే మా ఫ్రెండ్ రేవతి మీ గురించి చెప్పింది. మీరు ఎవరితోనూ మాట్లాడరట కదా’’ అంది.
‘‘అలా ఏమీ లేదు. ఎక్కువగా ఎవరితోనూ కలవను’’ అన్నాను.
ఇద్దరం కాఫీ తాగి బీచ్‌కి వెళ్లాం.
అక్కడ ఒకచోట కూర్చున్నాం.
‘‘మీరు ఎవరినైనా ప్రేమించారా?’’ అడిగాను.
‘‘ఏమిటి అలా అడిగారు?’’ అంది.
‘‘మామూలుగానే’’
‘‘నాకు ఇంకా అతను దొరకలేదు’’
‘‘మీకు ఎలాంటి వాడు కావాలి?’’ అన్నాను.
‘‘నేను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించేవాడు కావాలి. అతను నా దగ్గరకి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటానని నిజాయితీగా చెప్పాలి. అలాంటి వాడు వచ్చి ఐలవ్‌యు అని చెబితే వెంటనే నేను కూడా ఐలవ్‌యు అని అతనికి చెప్పేస్తాను’’ అంది.
నాకు వెంటనే ఐలవ్‌యు హాసిని అని చెప్పేయాలని అనిపించింది.
‘‘ఐ.......’’ అని తన కళ్లు చూస్తూ ఆగిపోయాను.
‘‘ఏమయింది?’’ అంది.
ఆ మాట చెప్పడం అంత తేలిక కాదని నాకు అనిపించింది.
‘‘ ఐస్‌క్రీం ఐస్‌క్రీం కావాలా?’’ అనేసాను.
‘‘ఓకే’’ అంది.
ఐస్‌క్రీం తీసుకుని ఒకచోట కూర్చుని తింటున్నాం.
‘‘మీరు ఎవరినైనా ప్రేమించారా?’’ అంది.
అవును కాదు అని తెలియకుండా తలూపాను.
ఆమెకి మాత్రం అవుననే అనిపించింది కాబోలు ‘‘ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది?’’ అని ఆత్రుతగా అడిగింది.
కళ్లు మూసుకుని ‘‘ప్రపంచమంతా నీ చూపుతో ఆనందాలతో నిండినట్టు, సూర్యుడికే నువ్వు వెలుగువేమో నీవైపు ఆకర్షింపబడే మనసులే ఉండనట్టు, పుష్పానికే నీవు పరిమళమేమో, నీ పలుకుతో చుట్టూ హాయిని నింపినట్టు, కోకిలకే మధుర గీతానివేమో’’ అన్నాను.
‘‘చాలా బాగుంది సిద్ధుగారు. మీ కవిత ఆమెపై మీకెంత ప్రేమ ఉందో చెబుతుంది’’ అంది.
నేను మరేం మాట్లాడలేకపోయాను.
వెళుతూ ‘‘రేపు నా బర్త్‌డే. మీరు రావాలి’’ అని చెప్పింది.
నేను సరేనని తలూపాను.
మర్నాడు ఆదివారం!
నేను హాసిని వాళ్లింటికి వెళ్లాను. హాసిని నుదుట బొట్టు పెట్టుకుని, చెవులకి బుట్టలు వేసుకుని, జుట్టు చక్కగా అల్లుకుని నిండా మల్లెపూలు పెట్టుకుని గోల్డ్ అండ్ మెరూన్ లంగా ఓణీలో అందంగా ఉంది.
‘‘హాయి సిద్ధూ’’ అంది.
‘‘విష్‌యు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’’ అని బొకే అందించాను.
‘‘్థంక్యూ సోమచ్’’ అంది.
నేను జేబులో నుండి రింగ్ తీసి మోకాళ్ల మీద కూర్చున్నాను.
అంతా నిశ్శబ్దం అయిపోయింది.
ఆమె చేయి పట్టుకుని ‘‘నిన్ను సింహాసనంపై కూర్చోబెట్టే స్థోమత నాకు లేకపోయినా నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేంత ప్రేమ ఉంది. నీ జీవిత భాగస్వామిని అయ్యే భాగ్యము నాకు కలిగిస్తావా?’’ అన్నాను.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. హాసిని కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. తను సరేనన్నట్లు తలూపింది. నేను రింగు తన చేతికి తొడిగాను. చుట్టూ ఉన్నవారంతా చప్పట్లు చరిచారు. వెనక్కి తిరిగి చూసాను నేను. హాసిని వాళ్ల అమ్మానాన్న కనిపించారు. ‘‘మేము ఎంత వెతికినా నీ అంత ప్రేమించే వాడిని మా అమ్మాయికి తీసుకురాలేం. మీ అమ్మానాన్నలతో మాట్లాడి సంబంధం మాట్లాడతాం’’ అన్నారు. నాకు ఎగిరి గంతేయాలని అనిపించింది.
చటుక్కున లేచాను.
అంతా గోలగోలగా వినిపించింది. ఇందాకటి ఆహ్లాకర వాతావరణం లేదు. హాసిని ఎక్కడో దూరంగా ఉంది. ఇప్పుడు నా అనుభవంలోకి వచ్చిందంతా కల అని అర్ధమయింది.
హాల్లో కనిపించిన హాసిని మేడపైకి వెళ్లింది. తిరిగి వచ్చిన ఆమె పక్కన ఎవరో యువకుడు కనిపించాడు.
స్టైల్‌గా, అందంగా ఉన్నాడా యువకుడు.
అప్పుడు తను గట్టిగా అనౌన్స్ చేసింది.
‘‘ఈరోజు నాకు చాలా మంది గిఫ్టులు తెచ్చారు. కాని మా అమ్మానాన్నలు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా? రాహుల్’’ అని గట్టిగా అరిచింది.
అంతా అటు చూశారు.
‘‘హీ ఈజ్ మై ఫియాన్సీ’’ అంది.
నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను. అంతా చప్పట్లు కొడుతున్నారు. హాసిని కేక్ కట్ చేసింది. వాళ్లు ఒకరికొకరు తినిపించుకున్నారు. తను చాలా సంతోషంగా కనిపించింది.
నేను ఓ మూల కూర్చున్నాను. జేబులోంచి రింగుని తీసి చూసుకున్నాను. ఆ రింగు మీద ఓ చుక్క కన్నీరు పడింది నాది.
‘‘ఇక్కడేం చేస్తున్నారు సిద్ధూగారు’’ అంటూ వచ్చింది హాసిని.
నా చేతిలోని రింగుని చూసి ‘‘వావ్ చాలా బాగుంది. ఆ అమ్మాయి కోసమా?’’ అని అడిగింది.
‘‘తనకి పెళ్లి నిశ్చయం అయిపోయింది హాసినిగారూ. నేను ఆలస్యం చేశాను’’ అన్నాను.
‘‘అయ్యో సో సారీ! ఐనా బాధపడకండి. మీకు తనకన్నా మంచి అమ్మాయి వస్తుంది’’ అని ఓదార్చింది.
‘‘అది సరే కానీ మీరేమిటి సడన్‌గా రాహుల్‌ని’’
‘‘ఏం చెప్పను... రాహుల్ వాళ్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేమిద్దం చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్. నా మీద ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ అమ్మానాన్నలతో పెళ్లి గురించి మాట్లాడారంట. మా అమ్మానాన్నలు నా ఇష్టానికే వదిలేశారు. నిన్న రాత్రి పనె్నండు గంటలకి బీచ్‌కి రమ్మని ప్రపోజ్ చేశాడు. వెళితే ఏం చెప్పాడో తెలుసా? నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నువ్వంటే నాకు చాలా ప్రేమ. ఏ ప్రమాదమూ నిన్ను తాకకుండా చూసుకుంటాను. నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు. ఇంకేమంటాను నేను సరేనన్నాను. ఐయాం సో హ్యాపీ’’ అంది.
నాకింక మాటలు రాలేదు. హాసిని అంత ఆనందంగా చూడడానికంటే నాకు కావలసిందేముంది? నా ప్రేమ ఓ తీయటి అనుభవం అయింది. ప్రేమంటే తనను పొందడం కాదు. తన సంతోషం కోసం ప్రేమనే త్యాగం చేయడం అని అర్ధమయింది.

- చౌదరి స్పర్శ,
ఫ్లాట్ నెంబర్ 201,
సముద్రమహల్ అపార్ట్‌మెంట్స్,
కిర్లంపూడి లేఅవుట్, విశాఖపట్నం-530017.
సెల్ : 9490562999.

పుస్తక సమీక్ష

మానవీయ కోణాల ఆవిష్కరణే పరమావధి

కథలెప్పుడూ సమాజం చుట్టూ తిరుగాడుతుంటాయి. వ్యవస్థలో నెలకొన్న లోతుపాతుల్ని అధ్యయనం చెయ్యడానికి మానవ జీవితాలే కేంద్రబిందువు. మనుషుల కథలు వ్యథలుగా చుట్టుముడుతుంటే సమాజాన్ని అధ్యయనం చెయ్యడం మరింత సమస్యాత్మకంగా మారుతుంది. ఈ సంఘర్షణలని, తపనని, ఆవేదనలని అక్షరీకరించడం వర్తమాన రచయితల లక్షణం. అలాంటి సంఘటనలకి జీవం పోసి వాస్తవికతకు రూపకల్పన చెయ్యడంలో ఇతివృత్తం ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈకోవకు చెందిన కథా రచయితే గూడూరు గోపాల కృష్ణమూర్తి. ఇటీవల ఆవిష్కరించిన విధివంచితుడు కథల సంపుటి ప్రముఖుల ప్రశంసలు పొందింది.
ఇందులో 25 కథల దాకా ఉన్నాయి. వీటిలో కథలన్నీ స్ర్తి పాత్రలను కేంద్రబిందువుగా చేసుకొని నడుస్తున్నాయి. సంఘ సంస్కరణాభిలాషను గుర్తు చేస్తుంటాయి. సమాజంలోని మానవ సంబంధాల్ని అంచనా వెయ్యడంలోనూ, వాటి పాత్రల స్వాభావ చిత్రణలోనూ అందెవేసిన చెయ్యి రచయితది. ఆధునిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులకు ఇవి సజీవ ప్రతిబింబ దృశ్యాలు. తండ్రి ఉంపుడుగత్తెగా తల్లినీడలో పెరిగిన ఇద్దరు అక్కాతమ్ముళ్ళ కథ మోడు బారిన జీవితం. సమాజంలో అక్రమ సంబంధంగా తలెత్తుకోలేని తరుణంలో ఊరి సహాయంతో జీవితంలో స్వయంశక్తితో పైకొచ్చిన కళ్యాణి ఒక శాడిస్టు భర్త బాధలు భరించలేక పుట్టిన కొడుకుతో విడిపోతుంది. తమ్ముడు-మరదలు చేయూతతో కొడుకుని ఆదర్శవంతమైన పౌరుడిగా తీర్చిదిద్దాలనే తపన ఇందులో కనిపిస్తుంది. మానవీయకోణానికి దర్పణం పట్టిన కథ ఇది. అగ్రకులాల్లోని పేదరికాన్ని, దీనస్థితిని, అవమానభారాన్ని ఎత్తి చూపే కథ విధివంచితుడు. ఉన్నత కులంలో పుట్టిన సూర్యం తండ్రి రామశాస్ర్తీ వేధింపులకు తరచుగా గురవుతూ అత్మన్యూనతా భావంతో కుంగిపోయి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. రిజర్వేషన్లు, రికమెండేషన్లు కరువై, జీవితం అన్నిరకాలుగా బరువవుతుంటే తీవ్రంగా కలత చెందుతాడు. ఉద్యోగం కోసం చెయ్యని ప్రయత్నంలేదు. అన్నింటా నిరాశే ఎదురవడంతో ఉరిపోసుకుంటాడు. తీవ్ర పశ్చాత్తాపభావాన్ని మిగిల్చిన కథ. ఇలాంటి కథాంశంతోనే నడిచిన మరో రచన చితికిన బతుకులు కథ పేదరికానికి అద్దం పడుతుంది. సహజీవనం వల్ల వ్యక్తిగతంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకవచ్చునేమో గాని, వివాహ వ్యవస్థ అందించే భద్రత, నైతిక బాధ్యతలూ అందివ్వలేవు. ఈ సూత్రాన్ని సుమిత్ర పాత్ర ద్వారా సూచన ప్రాయంగా చర్చించి జీవితం లోతుని, సంప్రదాయాన్ని, సంస్కృతి, విలువల్ని చాటిచెప్పే కథ సహజీవనం. ప్రపంచీకరణ ఫలితంగా కొత్తపోకడలతో నవనాగరికత వెర్రితలలు వేస్తోంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం సమిథ కథ. పరాయి వ్యక్తి శుక్రకణాన్ని పల్లవి గర్భాయంలో ప్రవేశపెట్టి, ఆ పిండాన్ని నవమోసాలు మోసి, కని మధ్యవర్తికి అందజేసేవైనం దీనిలో గోచరిస్తుంది. భర్త చరణ్ జ్యూట్‌మిల్లు మూతపడి, పొట్టకూటికోసం గత్యంతరంలేని పరిస్థితుల్లో భార్యను బలవంతంగా ఒప్పించి, డబ్బుని ఆర్జించాలనే దుస్థితికి ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది. ఫలితంగా ప్రాణాలను పోగొట్టుకున్న ఓ అభాగ్యురాలు కథనం ఇది. స్వార్థానికి మానసిక వ్యధకి, మధ్య నలిగిన జీవన సంఘర్షణకి అక్షరరూపం. పాఠకులను కంటతడి పెట్టించి, కనువిప్పుకలిగిస్తుంది. సుధాకరణతో సహజీవనం చేసిన ఫలితంగా గర్భవతి అయిన ఒక ఇల్లాలి కథ మజిలి. యుక్తవయసులో తనను ప్రేమించిన సురేష్‌ను బిడ్డతల్లిగా మారిన తర్వాత సుమిత్ర వివాహానికి అంగీకరించడం దీనిలో కొసమెరుపు. సహజీవనం పేరుతో అర్థంపర్థంలేని జీవితాన్ని గడపడం ఆధునిక ప్రపంచంలో ఎలాంటి దుష్పలితాలకు తావిస్తుందో అంతర్లీనంగా చాటిచెప్పిన కథనం ఇందులో రూపుకడుతుంది. గొడ్డుకి మనిషికీ పుట్టుక ఒక్కటే. ప్రసవవేదన ఫలితం కూడా ఒక్కటే. ఆడదూడ పుడితే పాలవ్యాపారి అప్పలస్వామికి ఆనందం. ఆడపల్లి పుడితే వారసుడు పుట్టలేదని వియ్యాలవారికి చిన్నచూపు. ఈ సామాజిక వివక్షని కళ్ళకి కట్టించే దృశ్యరూపకమే ప్రసవవేదన కథ. ఆర్థిక విలువలకు పెద్దపీట వేస్తుందిది. చేతిరాత ఉత్తరాలకూ, ఫోన్లో మాటలకు మధ్య తొంగిచూసిన వ్యత్యాసాన్ని తరాలు-అంతరాలు కథలో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తారు రచయిత. ఈ ఈ మెయిల్, ఎస్.ఎం.ఎస్‌ల కాలంలో ప్రేమాప్యాయతల ఉనికే ప్రశ్నార్థకమైపోతున్న సందర్భాన్ని చిన్నపాటి దృశ్యంగా మలిచి చెబుతారు. కథ క్లుప్తమైన భావసందేశం ఆకట్టుకుంటుంది. సతీ సహగమనం పేరుతో అనాది కాలం నుండి నేటిదాకా స్ర్తిలపై జరుగుతున్న మారణకాండను ఎండగేట్ట కథ ఇది. భర్త చనిపోయాక ముండమోసిన ఆడదాన్ని మరో విధవచేత ఐదోతనాన్ని దూరం చేసి ఆమె వదనాన్ని కళావిహీనంగా మలిచే ధోరణిని నిలదీసి ప్రశ్నించే తత్వాన్ని ఇది నవనాగరికతగా కథ వివరిస్తుంది. స్పాట్‌వేల్యూషన్ కథ పరీక్ష రాసే పిల్లల తండ్రులకీ, శంకరం మాష్టారుకి మధ్య సాగే మాటల సంఘర్షణకి ప్రతిరూపం. ఈ లొసుగులను ఎత్తిచూపడంలో రచయిత కృతకృత్యులయ్యారు. నిబద్ధతకి, నిజాయితీకి మారుపేరుగా నిలుస్తుందిది. ఇన్విజిలేషన్ కథ కూడా ఇలాంటిదే. రామ్మూర్తి మాష్టారు పాత్ర ఈకోవకే చెందుతుంది. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించే ఓ సీతాలు కథ నిప్పులాంటి నిజం. చాలా కాలంగా పిల్లల్లేక సతమతమవుతున్న సీతాలుకి ఉన్నట్టుండి కడుపులో కాయపెరగడంతో గర్భమొచ్చిందని అంతా భావిస్తారు. దీనిని నిజమేనని భ్రమించి భర్త రాముడితోపాటు అత్తపైడమ్మ కూడా నమ్ముతుంది. ఈ అనుమానభారాన్ని సహించలేక సీతాలు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన పోస్టుమార్టమ్ రిపోర్టులో అది అబద్ధమని తేలుతుంది. దీనితో అందరూ పశ్చాత్తాపానికి గురవుతారు. ఇదంతా ఆర్.ఎమ్.పి. డాక్టర్ మోపిన నింద కారణంగా జరుగుతుంది. తనకు లొంగని సీతాలుపై ప్రతీకారంకోసం ఇదంతా చేస్తాడు. కొన్నాల్టికి అతనికి కూడా ఎయిడ్స్ సోకడంతో ఆత్మవిమర్శకు లోనవడంతో కథ ముగుస్తుంది. ఆడదాన్ని ఆటబొమ్మని చేసి లైంగికంగా లొంగదీసుకునే అపవృత్తికల మోహన్ చివరకి పెళ్లి చూపుల్లో వైదేహి రూపంలో ఊహించని విధంగా భంగపాటుకి గురై అభాసుపాలవడంతో కథకు చక్కని పరిష్కారాన్ని అందజేస్తారు గురివింద గింజ కథలో రచయిత. అభ్యుదయ భావజాల మహిళకు ప్రతిరూపంగా వైదేహిపాత్రను చిత్రీకరిస్తారు. మారుటితల్లి ప్రేమను నిర్లక్ష్యం చేసి, ఆమె మరణాంతరం విలువ తెలుసుకొని పశ్చాత్తాప పడిన వైనాన్ని చాలా ఆర్ద్రంగా అక్షరబద్ధం చేస్తారు అమ్మ కథలో రచయిత. ఆవేదన, అంతర్మథనం అంతర్లీనంగా కొట్టొచ్చినట్టు చిత్రిస్తారు. కథాకథనంలో బిగువు ఆద్యంతం గుక్కతిప్పుకోకుండా చదివింపజేస్తుంది. కాబట్టే చాలా మంచి కథగా ముద్ర వేసుకుంది. ఇలా ప్రతికథలోనూ అంతర్లీన సందేశమిస్తూ సాగిపోతాయి. పాత్రలతో పాటు రచయిత కూడా కథానాత్మక స్పృహతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. వర్ణనతో కూడిన విశే్లషణ కథలను చదివింపజేస్తాయి. వానరాకడ ప్రాణం పోకట, నవ్విన ఊళ్లే పట్నాలవుతాయని, తాపట్టిన కుందులుకు మూడే కాళ్ళు, నేతి బీరకాయలో నేతిశాతం, పాతరోత, కొత్తవింత, కరవకమంటే కప్పకికోపం, విడవమంటే పాముకి కోపం, పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి లాంటివి తెలుగుభాషమీద మక్కువని తెలియజేస్తాయి. ఇంత మంచి కథలను పాఠకలోకానికి కానుకగా అందించిన రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తిగారిని అభినందించకుండా ఉండలేం!

- మానాపురం రాజా చంద్రశేఖర్,
సెల్ : 9440593910.

మనోగీతికలు

ఆ నలుగురూ...!
దారి వెంట నడిచిన మనుషులు
అప్రయత్నంగానే ఆ అదృశ్యశక్తి
వచనాలు విన్నారు!
ఒకడు వినీ విననట్టే
దృశ్యంలోంచి
జీవితంలోకి నడిచాడు!
మరొకడు
సాంసారిక బాధ్యతలలో నలుగుతూ
ఊహల్ని పరిచే దారిలో
ఆధ్యాత్మికంగా
జీవనాన్ని మలచుకోలేకపోయాడు!
ఇంకొకడు
బండపై రాలిన విత్తును
చిగురించబోయే ఆశలకు గుర్తుగా
మొలకెత్తించబోయి
కష్టాలకు తాళలేక
భవిష్యత్తును విడిచి పెట్టేశాడు!
చివరివాడు
సదవగాహనతో
భగవద్సంకల్పం వెంటాడుతుంటే
మహాత్ముడుగా ఎదిగిన క్షణం
కొత్తదారిన పరచిన దీపదారై
చరిత్రలో
సదా కృతార్థుడిగా నిలిచిపోయాడు!

- గునిశెట్టి ప్రసాద్, బాబి ఎన్‌క్లేవ్
విశాఖపట్నం. సెల్ : 7032395074.

ఎడారి ఆనందమే
వేడుకగా...
సూర్యుని తొలికిరణం కాంతికన్నా
నీప్రేమ కాంతి ముందుగా
నాకు తాకి గిలిగింతలు పెడుతుంటే
ఇక సూర్యుడు ఎందుకులే అనిపిస్తోంది
కారుచీకటిలో కూడా ప్రసరించే
అంతులేని నీ ప్రేమకాంతి
తోడుగా వుంది అనుకోగానే
జీవితంలో జనించిన విషాదం
వినమ్రంగా తలవంచి ప్రణమిల్లి సాగిపోతోంది...
హృదయంలో నిండిన నీకాంతి జ్వాలలకు
వెనె్నలకాంతి కూడా వెలవెల పోతోంది
ఆమని లోని వసంతంకన్నా
ఎడారి ఆనందమే వేడకగా ఉందని చెప్పాలని వుంది
తొలకరి చినుకుల జల్లుల్లో తడవటంకన్నా
నీ తలపుల కడలి కెరటాల జోరులో
కొట్టుకుపోవటమే హాయిగా వుందని ఎలా తెలుపను?
- చోడవరపు వెంకటలక్ష్మి
శ్రీకాకుళం. సెల్: 9493435649.

అందమైన బాల్యం
అందమైన బాల్యం
తిరిగి రానిది మరుపు రానిది
తీయనైనది హాయియైన బాల్యం!
కులాలు తెలియనది మతాలు ఎరుగనది
హద్దులు - లేవన్నది సున్నితమైన బాల్యం!
దాపరికాలు లేనిది ద్వేషాలు ఎరుగనిది
మోసాలు తెలియనిది
మధురమైన బాల్యం!
ఏది చెప్పినా వినేది
ఎవరు పిలిచినా పలికేది
ఎక్కడైనా మారనిది
ముచ్చటైనా బాల్యం!
ఆటలలో ఆడేది
పాటలలో కదిలేది
కథలకు ఊకొట్టేది
మాటలకు మైమరచేది
మురిపెమైన - విలువైన బాల్యం!

- రచయిత్రి: జి.కృష్ణకుమారి
బాబామెట్ట, విజయనగరం.
సెల్ : 9441567395.

ఓ భూమాతా క్షమించు!
తల్లి కడుపునుండి
నేలపై పడగానే
నీ ఒడిలో పడి, పాకి, నడచి
ఇంతవాళ్లమయ్యేము
నీగాలి పీల్చి నీ నీరుత్రాగి
నీపైరు పంటలనే తిని
మనుగడ కోసమై
అడవుల నరికేసి
పర్వతాల పెకిలించి
విషపు ప్లాస్టిక్కులను
నీగుండెల్లో - కప్పేసి
రసాయనాల- వెదజల్లి
పండంటి భూమిని
ఎడారిగా మారుస్తున్నాం
గగనాన పొగ కాలుష్యాల నింపి
ఓజోన్-ను- లేపుతున్నాం
మలినాలతో - జలకాలుష్యం చేస్తున్నాం
భూతాపాన్ని పెంచుతున్నాం
కనులు తెరచాము
కాలుష్యాలను నియంత్రించి
నీటిగుంటలు తవ్వి
నీ కోపాన్ని - తాపాన్ని
తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం
ఓ ధరణీలలామా! క్షమామణీ!
ఓ భూమాతా! మమ్ము క్షమించు
మానవాళిని - రక్షించు

- విద్వాన్ ఆండ్రకవి మూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- చౌదరి స్పర్శ