విజయవాడ

ముసుగు ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యాహ్నం 12 గంటలు. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ వేడికి తట్టుకోలేని జనం జ్యూస్ షాపులు, కూల్‌డ్రింక్ షాపుల్లోనూ కూర్చుని శీతల పానీయాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఒంటిపూట బడులు కావటం వల్ల వెంకట్రావుగారు స్కూలు నుండి ఇంటికి వెళుతూ చల్లగా ఏదన్నా తాగుదామని కూల్‌డ్రింక్ షాపుకొచ్చారు. అక్కడున్న కుర్చీలో కూర్చొని ఫ్రూట్ సలాడ్‌కి ఆర్డరిచ్చారు. టేబుల్‌పై ఉన్న న్యూస్‌పేపర్ తిరగేస్తూ యథాలాపంగా పక్కకి చూశారు. అక్కడ ఒక అబ్బాయి, అమ్మాయి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి ముసుగులో ఉంది. అబ్బాయిని చూడగానే ఎక్కడో చూసిన మొహంలా అనిపించింది. రెండు నిముషాల తర్వాత అతన్ని తన స్నేహితుడు రాజారావు కొడుకుగా గుర్తించారు. వాడి గురించి వాడి నాన్న రాజారావు చాలా బాధపడుతుంటాడు. వ్యసనాలకి బానిసై అమ్మాయిలతో తిరుగుతూ చదువును నిర్లక్ష్యం చేస్తుంటాడని ఆవేదన చెందేవాడు. ఈమధ్యనే ఒక అమ్మాయి కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిసింది. మళ్లీ ఎవరిని ట్రాప్‌లో పడేశాడో తెలుసుకుందామని వాళ్ల దగ్గరికి వెళ్లారు వెంకట్రావుగారు.
‘ఏమోయ్ ! నువ్వు రాజారావుగారి అబ్బాయి శేఖర్‌వి కదూ!’ అన్నారు. శేఖర్ కంగారుపడి ‘నేను కాదు.. నేను కాదు.. మీరు పొరబడినట్లున్నారు’ అన్నాడు.
‘అదేంటోయ్! నేను చాలాసార్లు మీ ఇంట్లో చూశాను. నువు ‘అంకుల్’ అంటూ పలకించేవాడివి. అవునూ! ఆమధ్య పోలీసు కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చావుకదా. ఎవరో అమ్మాయిని మోసం చేశావని అరెస్ట్ చేశారు’ అన్నారాయన.
‘ఇంతకీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు?’ అంటూ నిశితంగా ఆ అమ్మాయిని చూశారు. ముసుగులో ఉండటం వల్ల పోల్చుకోలేకపోతున్నారు. కానీ, ఆ కళ్లు బాగా పరిచయమున్నట్లుగా కనిపిస్తున్నాయి. కొంతసేపటికి ఆయనకు గుర్తుకొచ్చింది.
‘ఏమ్మా! నువు సుబ్బారావు కూతురు శ్రావణివి కదా! ఎందుకుమ్మా.. అందమైన మొహాన్ని ఆ ముసుగులో దాచేస్తావు. మీనాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తున్నాడు. నీ మీద ఎంతో నమ్మకం వాడికి. నువు తప్పు చేయవని, వాడిని మోసం చేయవని ఒక పిచ్చి నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నావుగదమ్మా! ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నీ మొహాన ఏ ముసుగూ ఉండదు. అలాంటిది ఇలాంటి నయవంచకులను నమ్మి బలవుతున్నారు. ముసుగులో మీ మొహాలను కప్పిపెడుతూ, కన్న తల్లిదండ్రులను మోసం చేస్తూ మిమ్మల్ని మీరు వంచించుకుంటున్నారు. అయినా కాలేజీలో ఉండాల్సిన సమయంలో ఇలా రోడ్లమీద తిరుగుళ్లు ఏంటమ్మా! మీనానే్నమో నువు కాలేజీకి వెళ్లి చదువుకొని ర్యాంక్ తెచ్చుకుంటావని ఆశపడుతున్నాడు. వాడొక్కడే కాదమ్మా! అందరి తల్లిదండ్రులు పిల్లల మీద అలాగే ఆశలు పెంచుకుంటున్నారు. ఉదయం నుండి రాత్రి పడుకోబోయేవరకు మీ సుఖసంతోషాల కోసమే రెక్కలుముక్కలు చేసుకుంటున్నారు. మీరేమో ప్రేమ పేరుతో దగాపడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. తప్పు మీది కూడా కాదులే! ఇప్పుడొస్తున్న సినిమాలు, టివి షోలు, సీరియల్స్, ఇంటర్నెట్‌ల మాయలో పడి నిర్వీర్యమైపోతున్నారు’ ఆవేదనగా అన్నారు వెంకట్రావుగారు.
‘అంకుల్! నన్ను క్షమించండి. నేను చాలా తప్పు చేశాను. వీడు ప్రేమించానని చెపితే నిజమని నమ్మాను. వీడు మోసగాడని నాకు తెలీదు. మీరు నా కళ్లు తెరిపించారు’ అంది.
‘చూడమ్మా! పేపర్లలో, టివిల లోనూ ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా ఈ మోసగాళ్ల గురించి వార్తలు వస్తున్నా అమ్మాయిలు మాత్రం వీళ్ల మాయమాటలకి పడిపోతూనే ఉన్నారు. ఎవ్వడి మొహానా వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని రాసి వుండదు. కానీ అందరూ ఇలాంటి వాళ్లే ఉండరు. మంచివాళ్లు కూడా ఉంటారు. ఆడపిల్లకు పెళ్లి చెయ్యాలంటేనే అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు చూడాలని చెపుతుంటారు. తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఒక్కోసారి వాళ్లు మోసపోతూనే ఉంటారు. అన్నిటికన్నా పాశ్చాత్య వికృత పోకడలతో యువత చెడుమార్గాన పయనిస్తోంది. కానీ విదేశీయులేమో మన సంస్కృతిని, నాగరికతని ఇష్టపడుతూ భారతీయ నాగరికత గొప్పదంటూ మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. మనమేమో సంప్రదాయాల్ని వదిలేసి అరకొర డ్రస్సులు వేసుకుంటూ, పైపై పూతలు పూసుకుంటూ లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాం. ఈ ముసుగులు ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వయసుతో పనిలేకుండా అందరూ ముసుగుల్లో తిరుగుతూ ఇలా నీతితప్పిన పనులకు దాన్ని వాడుకుంటున్నారు. దీనివల్ల ఆరోగ్యాన్నీ పాడుచేసుకుంటున్నారు. అనేక రకాల రోగాలను కొని తెచ్చుకుంటున్నారు’ అన్నారు వెంకట్రావుగారు.
‘అవునంకుల్! ముసుగుల వల్ల మేము చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాము. కానీ ఆకతాయిల నుంచి తప్పించుకోడానికి, యాసిడ్ దాడుల నుంచి కాపాడుకోవడానికి తప్పటం లేదు’ అంది శ్రావణి.
‘చూడమ్మా! ఆత్మవంచన చేసుకునే మాటలు మాట్లాడకండి. ముసుగులు వేసుకున్నంత మాత్రాన దాడులు ఆగిపోతాయని చెప్పటం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటమే! ఎన్నితరాలు మారినా మీరు అబలలుగానే వుండిపోవడానికి ఇష్టపడుతున్నారు. పురుషాధిక్య సమాజంలో సమిధలు కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ విష సంస్కృతి నుండి బయటపడండి. మిమ్మల్ని మీరు ధీశాలురుగా నిరూపించుకునే ప్రయత్నం చేయండి. ఆడది తలచుకుంటే అరాచకవాదులను, కలియుగ కీచకులను అంతమొందించగలదు. దీనికి ఆయుధం ముసుగులు కాదు. మిమ్మల్ని మీరు రక్షించుకోటానికి కొన్ని విద్యలు నేర్చుకోండి. బిడ్డను వీపున మోస్తూ శత్రుసైన్యాన్ని తుత్తునియలు చేసిన ఝాన్సీలక్ష్మీబాయిని గుర్తుకు తెచ్చుకోండి. యుద్ధతంత్రంతో శత్రువులను మట్టికరిపించిన నాయకురాలు నాగమ్మ, నరకాసురుని చంపిన సత్యభామ, పోలీసు శాఖలో పనిచేస్తూ దుర్మార్గాల్ని అణచివేసిన కిరణ్ బేడీ, ఇంకా ధైర్యసాహసాలతో అంతరిక్షంలోకి వెళ్లి అమరత్వం పొందిన కల్పనాచావ్లా, నిత్యం సమస్యలపై పోరాడుతున్న మహిళలని ఆదర్శంగా తీసుకోండి. ముందుకు సాగండి. అంతేగాని ఇలా ముసుగులు వేసుకున్నంత మాత్రాన ఏ ప్రయోజనమూ ఉండదు. ఇలాంటి మోసగాళ్లను, నయవంచకులను నమ్మినంతకాలం అరాచకాలు సాగుతూనే వుంటాయి’ అన్నారు.
‘అంకుల్! మీరు చెప్పినట్లే చేస్తాము. మమ్మల్ని మేం రక్షించుకోటానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి అరాచకవాదులను, కలియుగ కీచకులను అంతం చేస్తాము. మా తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తాము’ అంటూ మొహానికి ఉన్న ముసుగుని తీసి పారేసింది శ్రావణి.
‘అంకుల్! మీ మాటల వల్ల నా తప్పు కూడా తెలుసుకున్నాను. ఇక నుండి ఆడపిల్లలను నా చెల్లెల్లా చూస్తాను. ఏ ఆడపిల్లనూ మోసం చేయను. నన్ను క్షమించండి’ అన్నాడు శేఖర్.
‘చాలా సంతోషం బాబూ! మీలాంటి యువత ప్రయోజకులై దేశానికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఉపయోగపడాలి కాని, వాళ్లకి భారం కాకూడదు. మీరు గొప్పవాళ్లయితే మొదట సంతోషించేది మీ తల్లిదండ్రులే. అది గుర్తుపెట్టుకోండి’ అని హితవు చెప్పారు వెంకట్రావుగారు.

- సిహెచ్‌విఎస్ బ్రహ్మానందరావు,
విజయవాడ.
చరవాణి : 95731 47109
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

సిహెచ్‌విఎస్ బ్రహ్మానందరావు, విజయవాడ. చరవాణి : 95731 47109