విజయవాడ

మంత్రి పదవి దక్కక నిరాశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర రాజకీయ రాజధాని కృష్ణాలో ప్రధానంగా అధికారపక్ష తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టించింది. మంత్రివర్గం నుంచి కొల్లు రవీంద్రకు ఉద్వాసన అంటూ ఆఖరి క్షణం వరకు జరిగిన ప్రచారం మటుమాయం కావటంతో ఆయన వర్గీయుల్లో ఆనందోత్సాహాలు.. ఇక కొల్లు రవీంద్రస్థానంలో బిసి వర్గానికే చెందిన సీనియర్ నేత కాగిత వెంకట్రావు పేరు బలంగా వినవచ్చింది. ఆఖరి క్షణంలో తాను అదృశ్యం కావటాన్ని కాగిత ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగోసారి ఎన్నికైన కాగిత తొలిదశలోనే ఎంతో ఆశించి మానసిక క్షోభతో గుండెపోటుకు గురయ్యారు. భవిష్యత్‌లో మంచి గుర్తింపు లభిస్తుందంటూ సిఎం స్వయంగా ఊరట కల్గించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత రాత్రి వరకు కూడా ఎంతో ఆశపడ్డారు. పైగా సిఎం కార్యాలయం నుంచి సంకేతాలు కూడా అందాయంటున్నారు. మంత్రి పదవి రాకపోవటంపై తీవ్ర మనస్థానానికి గురైన కాగిత రాజీనామాకు సిద్ధపడ్డారు. రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావించారు. ప్రస్తుత 11 మంది కొత్త ఎమ్మెల్యేల కంటే తాను సీనియర్ అయినప్పటికీ అవమానపర్చారంటూ కాగిత బాధపడుతున్నారు. ఇదిలావుండగా యువ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఓ దశలో సిఎంపైనే నిప్పులు చెరిగారు. విజయవాడ చరిత్రలో తొలిసారిగా తెదేకు గుర్తింపు తెచ్చానని తాను భారీ మెజార్టీతో గెలువటమే గాక 20 డివిజన్లలో 18 మంది కార్పోరేటర్లను గెలిపించానని అలాంటి వ్యక్తికి కేవలం రౌడీయిజం పేరుతో మంత్రి పదవి ఇవ్వలేదంటూ తన స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసారని తెలిసింది. ప్రతిపక్షాలపై తానెంతగానో విరుచుకుపడ్డా తీరా తనను వాడుకుని వదిలేసారు.. జనసేన నుంచి ఆహ్వానం ఉన్నా తెదేను వదలలేదన్నారు. మరికొద్దిసేపట్లో బొండా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారని ప్రచారంలో ఎంపిలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, నగర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇతర నేతలు హుటాహుటిన ఆయన నివాస గృహానికి తరలివచ్చి ఏకాంతంగా చర్చించి శాంతింప చేసారు. ఇదే సమయంలో 18 మంది కార్పోరేటర్లు, 18 డివిజన్ల అధ్యక్షులు ఇంటి వద్ద బైఠాయించి తాము కూడా రాజీనామాకు సిద్ధమంటూ నినాదాలు చేసారు. ఇక బొండా తీవ్ర అసహనంతో బాబు కాపుల గొంతులు కోసారు. కాపులను వాడుకుని వదిలేస్తున్నారు.. తనకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారంటూ వాపోయారు. ఓ దశలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్లు జరుగవు. కాపులకు అన్యాయం జరుగడం తొలిసారి కాదు అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపిలు బొండాను తమ వెంట బెట్టుకుని నేరుగా సిఎం నివాస గృహానికి తీసుకెళ్లారు. ఇక సిఎం నివాస గృహంలో రసవత్తర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సిఎం ఎంతో అసహనంతో బొండాపై ఆగ్రహం చెందినట్లు తెలుస్తున్నది. మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. గన్‌మెన్‌పై దాడి జరిగినా కేసు పెట్టలేదని గుర్తుచేస్తూ క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎందరో సీనియర్‌లకే పదవులు దక్కలేదు. అందరూ ఇలాగే చేస్తున్నారా అంటూ నిలదీసారు. అందరి చిట్టాలు తనవద్ద ఉన్నాయంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అనంతరం ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం బొండా ఎంతో కష్టపడి పనిచేసారంటూ అభినందించారని అయితే కొన్ని రాజకీయ సమీకరణలు, కుల సమీకరణల మూలంగా న్యాయం చేయలేకపోయినట్లు చెప్పారని అన్నారు. అయితే 10 రోజుల్లో సరైన పదవితో బొండాకు న్యాయం చేస్తానని సిఎం హామీ నిచ్చినట్లు కేశినేని చెప్పారు. ఇక బొండా మాత్రం తన వాట్సాప్ గ్రూప్ ద్వారా సంచలన ప్రకటన చేశారు. ఇక సోమవారం నుంచి ఎలాంటి చర్చా కార్యక్రమాలకు గాని, ఇంటర్వ్యూలకు గాని పిలవవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లుగా ఎంతో సహకరించారంటూ ధన్యవాదాలు తెలిపారు.
జలీల్‌ఖాన్ తీవ్ర అసంతృప్తి
ఇక తెలుగుదేశం తరపున ఒక ఎమ్మెల్యే కూడా గెలువలేదు.. ఆ తర్వాత వైకాపా నుంచి పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్ ఆ లోటు భర్తీ చేసారు. ముస్లింలందరూ ఎంతో కాలంగా తమకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. వైకాపా నుంచి వచ్చి ముగ్గురు ముస్లింలతో పోటీపడిన జలీల్‌ఖాన్ మాత్రం ఎంతగానో ఆశించారు. తీరా పదవి రాకపోవటంతో తీవ్ర అసంతృప్తి చెందారు. సిఎం చంద్రబాబు తలచుకుంటే తనకు ఇచ్చేవారని అన్నారు. రాష్ట్ర జనాభాలో 12 శాతంగా ఉన్న మైనార్టీలను సిఎం విస్మరించారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. తన తదుపరి కార్యాచరణపై మైనార్టీ సంఘాలు, అనుచరులతో జలీల్‌ఖాన్ సమావేశమయ్యారు.