విజయవాడ

కృష్ణారావు క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 20: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలిగించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆయన ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన మనిషి ఐవైఆర్ కృష్ణారావు అని తూర్పారబట్టారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం నీచమైన చర్య అని అన్నారు. కృష్ణారావు అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐవైఆర్ సీఎం చంద్రబాబుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.

ర్యాగింగ్‌ను అరికడదాం
* అవగాహన సదస్సులో ప్రముఖుల పిలుపు
విజయవాడ (క్రైం), జూన్ 20: నగరంలోని అన్ని కళాశాలలు, విద్యాసంస్థల నిర్వహకులతో నగర పోలీసు శాఖ ర్యాగింగ్ నియంత్రపై అవగాహన సదస్సు నిర్వహించింది. ఏ ప్లస్ కనె్వన్షన్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి, జిల్లా కలెక్టర్, లక్ష్మీకాంతం, నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడి కేసులు నమోదైన పక్షంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కొలువులు కూడా రావని, విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టులు, వీసాలు రాకపోవడం తదితర కారణాల రిత్యా భవిష్యత్తు అంధకారంలో పడుతుందన్నారు. ఈ దిశగా విద్యార్థులను అవగాహన తీసుకురావాలని, ర్యాగింగ్‌కు పాల్పడే వారి పట్ల యాజమాన్యాలు అధ్యాపకులు వ్యవహరించాల్సిన తీరు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను వివరించారు. రాగింగ్ చేస్తే వెంటనే సస్పెండ్ చేయాలని, అంతటి భయాన్ని వారికి కలుగుచేయడం ద్వారా నియంత్రించవచ్చన్నారు. సమావేశంలో కృష్ణా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విసి రామకృష్ణారావు, వాసవి మహిలా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి విద్య, డిసిపిలు జి పాలరాజు, కాంతి రానా టాటా, జివిజి అశోక్‌కుమార్, ఎంసి దాసు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

అభివృద్ధిపైనే దృష్టి
* త్వరలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు
* ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించటమే ధ్యేయం
* విజయవాడ పార్లమెంటరీ నేతల సమావేశంలో మంత్రి లోకేష్
విజయవాడ (క్రైం), జూన్ 20: నియోజకవర్గాల వారీగా త్వరలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారా లోకేష్ సూచించారు. నగరంలోని అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేశినేని భవన్‌లో మంగళవారం ఆయన పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, అర్బన్ పార్టీ నేతలు, ఇన్‌ఛార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ప్రతి నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరిగా స్థానిక పరిస్ధితులు, పార్టీ స్ధితిగతులపై ఆరాతీశారు. ప్రభుత్వపరంగా ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా నెలకొన్న సమస్యలను కొందరు ఆయనకు వివరించారు. ఇక ప్రభుత్వంపరంగా ప్రజలకు వెళ్ళే సంక్షేమ కార్యక్రమాల పట్ల పార్టీ వారికి అవగాహన కలిగించేందుకు కృషి చేయాలని సూచించారు. నియోజవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్టీ బలోపేతం, నాయకుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే నియోజకవర్గాల వారీగా విస్తత్ర స్థాయి సమావేశాలు నిర్వహించాలని అన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తత్ర స్థాయి సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించాలని సూచించారు. పార్టీలో మిగిలిన కమిటీల ఏర్పాటును నాయకులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. నియోజకవర్గాల వారీగా తమకున్న సమస్యలను ప్రజా ప్రతినిధులు, నేతలు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఆలయ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని కోరారు. నిధుల కొరత ఉన్నందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా నగర కార్పొరేషన్‌లో నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు అమలులో ఆలస్యం అవుతోందని వివరించారు. దీంతో మున్సిపల్ మంత్రి, అధికారులతో, మున్సిపల్ కమిషనర్‌తో నగర పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరిస్తానని లోకేష్ చెప్పారు. సమావేశంలో ఏంపి కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఇతర నేతలు పాల్గొన్నారు.

హృదయ విదారకం
* బాలుని ఉసురు తీసిన వృక్షం
* తల్లిదండ్రులకు కడుపుకోత
* విషాదంలోనూ కళ్లు దానం
* పరామర్శించిన సీపి సవాంగ్
విజయవాడ (క్రైం), జూన్ 20: సత్యనారాయణపురంలో వృక్షం కూలి మృత్యువాత పడిన బాలుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. ఆడుతూపాడుతూ చదువుకుంటున్న బాలుడికి అదే చివరిరోజైంది. తెల్లవారుజామునే నిద్ర లేచి స్కూలుకు వెళ్ళేందుకు సిద్ధపడుతున్న క్రమంలో భాగంగా పాలప్యాకెట్ కోసం వెళ్లిన తమ బిడ్డ ఇక తిరిగి రాని లోకాలకు చేరుకున్న వైనం కలిచివేసింది. మరణంపాలైన తీరు.. హృదయ విదారకమైన ఆ దృశ్యం స్థానికుల గుండె పిండేసింది. నడిరోడ్డుపై నిస్సహాయ స్థితిలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసి రక్తం మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తిచేందుకు అరగంటే పట్టింది. ఇంకా వస్తాడని నిరీక్షిస్తున్న తల్లిదండ్రులకు చేదు సమాచారం అందగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బాలుని ఉసురు తీసిన వృక్షం ఉదంతానికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. సత్యనారాయణపురం తిరుమలరాజు వీధిలో నివాసముంటున్న ఫ్యాన్సీ షాపు నిర్వహకుడు చావలి శ్రీనివాసచక్రవర్తి రెండో కుమారుడు శ్రీహర్ష (12) చిన్నవాడు కావడంతో ముద్దుగా చూసుకుంటున్నారు. స్థానిక విఙ్ఞన విహార్ స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. స్కూలుకు వెళ్ళే క్రమంలో పాల ప్యాకెట్ కోసమే మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. సమీపంలోని పాల బూత్‌కు వెళ్లి పాలప్యాకెట్ తీసుకుని సైకిల్‌పై తిరిగి వస్తూ మృత్యువాత పడ్డాడు. స్థానిక శిశు విహార్ స్కూలు వద్దకు వచ్చే సరికి రోడ్డు వైపు పరుచుకున్న స్కూలు ఆవరణలోని భారీ జామాయిల్ వృక్షం ఒక్కసారికి సైకిల్‌పై వెళ్తున్న బాలునిపై కుప్పకూలింది. దీంతో నెలకొరిగిన బాలుడు తలకు గాయమై రక్తం మడుగులో పడి ప్రాణాలు వదిలేశాడు. చెట్టు కూలిన బట్టి చూస్తే సుమారు అర గంట వరకు ఎవరూ గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు చూసిన స్థానికుల సమాచారం మేరకు హుటా హుటిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పరుగున వచ్చి దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయారు. బోరున విలపిస్తూ గుండెలు బాదుకున్నారు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి చక్రవర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* సీపీ సవాంగ్ పరామర్శ
బాలుని అకాల మరణంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. శోక సముద్రంలో ఉండిపోయిన తల్లిదండ్రులను నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఓదార్చారు. బాలుని మృతి వార్త తెలియగానే సీపి హుటాహుటిన బయలుదేరి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్పు కలుగచేశారు. కాగా.. ఇంతటి విషాదంలోనూ బాలుని కళ్ళను దానం చేసేందుకు ముందుకు వచ్చిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. వారి సామాజిక స్ప్రహకు సెల్యూట్ చేశారు. బాలుని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి సానుభూతి తెలియచేశారు.

కొత్తూరు తాడేపల్లి చెరువు పరిశీలన
* ఎరువులు, విత్తనాలపై రైతులతో కలెక్టర్ మాటామంతి

విజయవాడ, జూన్ 20: నీరు ప్రగతిలో చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులు సత్ఫలితాలనిచ్చి రైతులకు ప్రయోజనాలు చేకూరుతున్నాయని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి సమీపంలో 11 ఎకరాల విస్తీర్ణం కలిగిన తుంగ చెరువును నీరు ప్రగతిలో అభివృద్ధి చేశారు. జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం మంగళవారం చెరువు పనులను పరిశీలించి రైతులు పొందుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. తుంగ చెరువు ఆయకట్టు కింద సుమారు 100 ఎకరాల సాగు భూమి ఉందని, చెరువు పూడిక వలన అవసరమైన నీటిని నిలువ చేసే సామర్ధ్యం లేక పోవడం వలన రైతులకు సాగుకు సరిపడా నీరు అందడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో నీరు ప్రగతి పథకం ద్వారా చెరువును అభివృద్ధి చేసేందుకు జలవనరుల శాఖ అనుమతించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రూ. 9.55 లక్షల వ్యయంతో 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టి పూడిక తీయడం జరిగిందని, దీనితోపాటు చెరువులో 9.5 చ.మీ విస్తీర్ణంలో జంగిల్ క్లియరెన్స్ చేయడం వలన చెరువులో పుష్కలంగా నీరు నిలువ ఉండే సామర్ధ్యం పెరిగిందన్నారు. దీంతో రైతులకు వ్యవసాయానికి సరిపడా నీరు అందుతోందని, భూగర్భజల మట్టం కూడా పెరిగిందని కలెక్టర్ తెలిపారు. పూడిక తీసిన మట్టిని గ్రామంలోని పాఠశాల ఆట స్థలం, స్మశానవాటికల్లో మెరక చేసేందుకు వినియోగించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. చెరువును పరిశీలించిన కలెక్టర్ ఆయకట్టు రైతులతో ముచ్చటించారు. ఆయకట్టు రైతులు మాట్లాడుతూ తమ భూములకు సరైన నీటి వసతి లేక ఇబ్బందులు పడేవారమని నీరు ప్రగతి పథకం ద్వారా చెరువు పూడిక తీయడం వలన ప్రస్తుతం పుష్కలంగా సాగుకు సరిపడా నీరు లభిస్తుందని రైతులు తెలిపారు. భూములు సారవంతమైనవి కావడం వల్ల వ్యవసాయంలో అధిక దిగుబడులు పెరుగుతాయని రైతులు కలెక్టర్‌కు వివరించారు. రుతుపవనాలు ప్రారంభమై జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు ముఖ్యంగా యూరియా కొరత లేకుండా అందుతున్నాయని అని కలెక్టర్ ప్రశ్నించగా కొరత లేకుండా సొసైటీలు, ఇ-పోస్ విధానం ద్వారా ఎరువులు, విత్తనాలు అందుతున్నాయని రైతులు వివరించారు. పంట రుణాలలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకర్లను ఆదేశిస్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు.
అమ్మా.. పెన్షన్లు అందుతున్నాయా?
ముఖ్యమంత్రి అందిస్తున్న పెన్షన్లు అందుతున్నాయా అని కలెక్టర్ అడుగగా నెల మొదటి వారం 3 లేద 4 తేదీల్లో పెన్షన్లు తమ ఇంటి వద్దనే అందిస్తున్నారని కలెక్టర్‌కు పెన్షన్‌దారులు తెలిపారు. చంద్రబాబు దయ వల్ల రూ. 1000 తమ ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారని ఇది తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పెన్షన్‌దారులు నాగేశ్వరరావు, రమణమ్మలు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ పర్యటనలో వ్యవసాయ శాఖ జెడి నరసింహరావు, ఇరిగేషన్ ఎస్‌ఇ కె శ్రీనివాసరావు, రూరల్ తహశీల్దార్ మధనమోహనరావు తదితరులు పాల్గొన్నారు.

మానసిక, శారీరక ఉల్లాసాన్ని కల్గించేది యోగా ఒక్కటే
* ఘనంగా యోగా దినోత్సవం
విజయవాడ (కల్చరల్), జూన్ 20: యోగాభ్యాసం ప్రతి ఒక్కరికీ మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగించి ఆరోగ్యాన్ని అందిస్తుందని యోగా శిక్షకురాలు సూర్యకుమారి అన్నారు. స్థానిక మధుమాలక్ష్మి ఛాంబర్స్‌లోని కల్చరల్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ, కల్చరల్ సెంటర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన యోగాభ్యాస శిక్షణ శిబిరంలో నగర బిజెపి సాంస్కృతిక విభాగం కన్వీనర్, సత్యనారాయణపురం శివాలయం ధర్మకర్త దూపాటి శ్రీదేవి ప్రారంభించారు. దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన యోగాసనాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని ఆమె అన్నారు. భారత ప్రభుత్వ ఆయుష్ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం మొగల్రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ స్కూలుకు చెందిన యోగ శిక్షకులుగా తర్ఫీదు పొందుతున్న కోచ్‌లకు సూర్యకుమారి అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ సెంటర్ సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి, మాలక్ష్మి ప్రాపర్టీస్ సీఈవో సందీప్ మండవ, చింపిరయ్య పాల్గొన్నారు. వచ్చే ఆగస్టు 7 నుంచి 11 వరకు శ్రీలంకలోని కొలంబోలో జరిగే అంతర్జాతీయ సాంస్కృతిక (యోగా) ప్రదర్శనలో పాల్గొనటానికి శివరామకృష్ణయ్య మున్సిపల్ స్కూల్ నుంచి అమృత జాహ్నవి, హర్షవర్థని అనే విద్యార్థినులు ఎంపికయ్యారని యోగ శిక్షకురాలు సూర్యకుమారి తెలిపారు.

రంజాన్ తోఫాను ప్రతి ముస్లిం సద్వినియోగం చేసుకోవాలి
* కలెక్టర్ లక్ష్మీకాంతం

విజయవాడ, జూన్ 20: చంద్రన్న రంజాన్ తోఫాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. నగరంలోని కేదారేశ్వర పేట, ఖుద్దూస్ నగర్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ చంద్రన్న రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్రమాసం రంజాన్ పండుగను ప్రతి పేద ముస్లిం కుటుంబం ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రంజాన్ తోఫాను అందిస్తున్నారన్నారు. ఈ నెల 26వ తేదీ వరకు చంద్రన్న రంజాన్ తోఫాను తెల్లరేషన్ కార్డు కలిగి వున్న ప్రతి ముస్లిం కుటుంబానికి అందించాలని అధికారులను ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసం రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. పవిత్ర మాసంలో ఉపవాసం ఉండటం అనేది దేవునికి దగ్గర కావటం అని వివరించారు. రంజాన్ తోఫా సరుకులలో నాణ్యత, తూకంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోటం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో 84 వేల 669 ముస్లిం కుటుంబాలకు 84 వేల 609 తెల్లరేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో 21,943 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ చౌకధరల దుకాణాలలో ఈ నెల 26వ తేదీ వరకు పంపిణీ చేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుణ్యశీల, డిఎస్‌ఒ నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు అందజేశారు.

ఘనంగా మంత్రి రవీంద్ర జన్మదిన వేడుకలు
విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 20: రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ బేస్‌బాల్ అసోసియేషన్, కృష్ణాజిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంత్రి రవీంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కొల్లు రవీంద్ర కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయం స్వీట్స్ పంచి క్రీడాదుస్తులను అందజేశారు. బేస్‌బాల్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా తయారుచేయించిన కేక్ అందరినీ ఆకట్టుకుంది. కేక్‌పై మంత్రి బేస్‌బాల్ ఆడుతున్న దృశ్యామాలికతో కేక్‌ను తయారుచేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎంవిఎస్ ప్రసాద్, కార్యనిర్వహణ కార్యదర్శి దారం నవీన్‌కుమార్, సంయుక్త కార్యదర్శి ఎంఎన్ శిరీష, టి శ్రీలత, డివి కృష్ణారావు, జిల్లా సంఘ చైర్మన్ కుర్రా నరేంద్ర, అధ్యక్షులు టి తులసీరావు, ఉపాధ్యక్షులు పి మురళి, జాతీయస్ణాయి క్రీడాకారులు ఎంవిఎస్ వేణుగోపాల్, ఎంఎస్‌ఎన్ దుర్గా, తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయంలో మంత్రిచే కేక్ కట్ చేయించి తమ శుభాకాంక్షలను ప్రత్యేకంగా చాటుకున్నారు. ఒఎస్‌డి ప్రభు, వెంకటేష్, తదితర సిబ్బంది రవీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
* ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
* ఎ కనే్వన్షన్‌లో 1500 మందితో యోగా
* పాల్గొననున్న ముఖ్యమంత్రి
విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ఎ కనె్వన్షన్ సెంటర్‌లో 1500 మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, విజయవాడ ఆర్డిఓ ఎస్ హరీష్, జెసి-2 మార్కండెయులు, డిఎస్‌డిఒ బి శ్రీనివాసరావులతో కలిసి ఎ కనె్వన్షన్ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. యోగాలో ఉదయం 6గంటలకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. సుమారు 1500 మంది విద్యార్థులు, యువత పాల్గొంటారని, మంగళవారం ప్రత్యేకంగా రిహర్సల్స్ నిర్వహించినట్లు తెలిపారు. యోగా పాల్గొనే వారందరికీ మంచినీరు, అల్ఫాహరం, తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

వరికి ధర పెంపులో
మరోసారి కేంద్రం విఫలం
* రైతు సంఘం నేతల విమర్శ

విజయవాడ, జూన్ 20: కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరల్లో వరి ధాన్యం రైతులకు అన్యాయం జరిగింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వరి మద్ధతు ధర పెంచడంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి విఫలమయిందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, రైతు సంఘ అధ్యక్షులు పి రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌లు నేడొక ప్రకటన ద్వారా విమర్శించారు. గత ఎన్నికల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని ప్రకటించి ఇప్పటికి కూడా నామమాత్రపు ధరలతోనే రైతాంగాన్ని మోసగిస్తున్నారు. ధాన్యం క్వింటాకు రైతుకు పంట ఉత్పత్తి ఖర్చు సుమారుగా రూ. 2500 అవుతున్నదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3వేలకు పైగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం నామమాత్రంగా ధరలు పెంచడం జరిగిందన్నారు. ఈ ధరలను కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి క్వింటాల్‌కు రూ. 2వేలకు తక్కువ కాకుండా ఉండేలా ధర ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్ధతు ధరకు కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్‌గా ప్రకటించాలని రావుల వెంకయ్య, పి రామచంద్రయ్య, కెవివి ప్రసాద్‌లు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఈ నెల 23వ తేదీ నగరంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.