విజయవాడ

వివాదాస్పదం హెల్మెట్ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: నగరంలో హెల్మెట్ ప్రచారం వివాదాస్పదమవుతోంది. వినాయకుని, రావణుడి ఫొటోలతో పోలీసులు పలుచోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బ్రహ్మాణ సంఘాలు వినూత్న ప్రచారం పేరుతో దేవుళ్ళ ఫొటోలను ఇలా వినియోగించడం అపచారమంటున్నారు. హెల్మెట్ వినియోగంపై వినూత్న ప్రచారంతో ముందుకెళ్తున్న నగర పోలీసులు విమర్శలపాలవుతున్నారు. నగరంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ప్రచారం ఫ్లెక్సీలపై వినాయకుడు, రావణుడి ఫొటోలు వేశారు. హెల్మెట్ పట్ల జనాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ విధంగా ఏర్పాటు చేయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని గుర్తించిన అధికారులు నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. సుప్రీం కోర్టు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు, రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కేసుల నమోదుతో పాటు జనంలో అవగాహన పెంచేందుకు వినాయకుడి తల మార్పిడి చేశారు. అది మీకు సాధ్యం కాదు.. రావణుడికి పది తలలు ఉన్నాయి.. మీకున్నది ఒకటే తల అందుకే హెల్మెట్ వినియోగించండి, సురక్షితంగా ఉండండి అంటూ నగర పోలీసులు పలుచోట్ల ఏర్పాటు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రచారం నిర్వహించడం మంచిదే కాని ఇలా దేవుళ్ళ ఫొటోలు వినియోగించడం అపచారం అంటూ బ్రాహ్మణ సంఘాలు ఎలుగెత్తాయి. హోర్డింగ్‌లు వెంటనే తొలిగించాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండు చేస్తున్నారు.

కాల్వలో యువకుని గల్లంతు
*గాలిస్తున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: స్నేహితులతో కలిసి వెళ్ళిన ఓ యువకుడు కాల్వలో దూకి గల్లంతయ్యాడు. దీంతో రంగప్రవేశం చేసిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కాగా అదృశ్యంపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన అనిఫ్ నగరంలోని ఆటోనగర్‌లోని స్టీల్ కంపెనీలో పని చేస్తుంటాడు. ఇతని స్నేహితులైన కామేశ్వరశర్మ, సురేష్, సోమేశ్వరరావులతో కలిసి సోమవారం రాత్రి సినిమాకి వెళ్ళి వస్తూ గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డులోని డి మార్ట్ సమీపంలో రైవస్ కాల్వ వద్దకు చేరుకున్నారు. స్నేహితుడు ఒకరు సరదాగా కాల్వలో దూకాడు. ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో వెనకే దూకిన అనీఫ్ ఈత రాకపోవడంతో నీటి మునిగి కనిపించకుండాపోయాడు. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకున్నారు. మరోవైపు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈక్రమంలోనే మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ గాలింపు చర్యలు కొనసాగించినా ఆచూకీ లభించలేదు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.