విజయవాడ

పీపీపీ పద్ధతి వద్దే వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీఎంసీ ఆస్తులు కాపాడుకుందాం
* శ్మాశానవాటిలపై ఆలోచించాలి
* నత్తనడకన అభివృద్ధి పనులు
* కార్పొరేషన్ పరువు తీస్తున్న కాంట్రాక్టర్లు
* ముక్తకంఠంతో సభ్యుల ఆక్రోశం
* వాడివేడిగా కౌన్సిల్ సమావేశం
బెంజిసర్కిల్, డిసెంబర్ 13: అత్యంత విలువైన కార్పొరేషన్ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు పీపీపీ పద్ధతి ద్వారా అప్పగించటం సరికాదని, కార్పొరేషన్ ఆస్తులను కాపాడుకునేందుకు సభ్యులంతా ఒక్కతాటిపైనే ఉండాలని కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ముక్తకంఠంతో పిలుపిచ్చారు. అవసరమైతే కార్పొరేషన్ ఇంజనీర్లతో డిజైన్లు వేయించి, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని స్థలాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సున్నితమైన శ్మాశానవాటికల అంశానికి సంబంధించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. నగరంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, కాంట్రాక్టర్ల అలసత్వంతో నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లు కార్పొరేషన్ పరువు తీసేలా బిల్లుల విషయంలో నగరంలో దుష్ప్రచారం చేస్తున్నారని సభ్యులు కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది. ముందుగా పీపీపీ పద్ధతిపై కార్పొరేషన్ ఆస్తుల అభివృద్ధికి సంబంధించిన చర్చలో వైకాపా ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ ఇప్పటికే బృందావన్ కాలనీకి సంబంధించి పీపీపీ పద్ధతి ద్వారా అనుభవం ఎదురైన నేపథ్యంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఈ విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. స్థలంపై వీఎంసీకి హక్కు ఉన్నప్పటికీ కాల పరిమితి అనంతరం కోర్టుకు వెళ్లే పరిస్థితులు ఎదురవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఈ పద్ధతి ప్రయోజనం చేకూర్చుతుందన్న ఆమె, కార్పొరేషన్‌కు ఆదాయం కోసం మరికొన్ని మార్గాలను అనే్వషించాలని సూచించారు. టీడీపీ సీనియర్ సభ్యుడు చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ మన ఆస్తులను మనం అభివృద్ధి చేసుకునే క్రమంలో కార్పొరేషన్ తరఫున బ్యాంకులో రుణం తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని కమిషనర్ నివాస్‌కు సూచించారు. దీనిపై స్పందించిన కమిషనర్ పీపీపీ పద్ధతిలో నిర్దిష్టమైన కాలపరిమితితో పాటు నియమ నిబంధనలు కచ్చితంగా అమలవుతాయని సమాధానమిచ్చారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన చర్చలో భాగంగా కమిషనర్ మట్లాడుతూ ఇప్పటివరకూ నగరానికి 28,152 గృహాలు మంజూరయ్యాయని, 12వేల ఇళ్లకు సంబంధించి టెండర్లు పిలిచామని చెప్పారు. జక్కంపూడితో పాటు నగరంలోని రెండు ప్రాంతాల్లో స్థలాలు సేకరించినట్టు తెలిపిన ఆయన మిగిలిన గృహ నిర్మాణాల కోసం కలెక్టర్‌తో చర్చించి స్థలం సేకరిస్తామన్నారు. ఈవిషయంపై వైకాపా ఫ్లోర్ లీడర్ పుణ్యశీల డీపీఆర్‌లకు సంబంధించి కన్సల్టెన్సీలకు ఇవ్వకుండా మన ఇంజినీర్లతోనే వాటికి రూపకల్పన చేయించాలని కోరారు. నగరంలో అభివృద్ధి పనులు నత్తనడకగా సాగుతున్నాయని పుణ్యశీల సభ దృష్టికి తెచ్చారు. అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి కార్పొరేటర్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకోవాల్సి వస్తోందన్నారు. కార్పొరేషన్ బిల్లుల చెల్లింపుల్లో అలసత్వం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నట్టు పేర్కొన్నారు. దీనీపై స్పందించిన మేయర్ శ్రీ్ధర్ మట్లాడుతూ ఇప్పటికే రూ. 80కోట్ల బకాయిలకు గాను రూ. 60 కోట్లు చెల్లించామని, ఉద్యోగుల జీతాలను సైతం పక్కన పెట్టి కమిషనర్ బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. అయినా మంగళవారం కాంట్రాక్టర్లు సమ్మె నోటీసులివ్వడం దారుణమన్నారు. మరో చర్చలో భాగంగా 279 జీవో అమలుతో ఏ ఒక్క కార్మికుని ఉద్యోగానికీ అన్యాయం జరగదని కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రతకే శరాఘాతంగా ఈ జీవోను రూపొందించారని విమర్శించారు. వైకాపా సభ్యులు కూడా ఇదే ఆందోళన వ్యక్తపర్చారు. మేయర్ కలుగజేసుకుంటూ వీఎంసీ పరిధిలో ఏ ఒక్క కార్మికుని ఉద్యోగమూ తొలగించమని, దీనిపై అపోహలను నమ్మవద్దన్నారు. అలాగే వీఎంసీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని, అయినా కాస్త ఆలోచించి పనులను నిలుపుదల చేసినట్టు చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి దీనిపై పూర్తి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శ్మశానవాటికలకు సంబంధించి చర్చలో అన్ని వర్గాల మనోభావాలు, సంప్రదాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని వైకాపా సభ్యులు సూచించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా దృష్ట్యా శ్మశానవాటికల్లో సమాధుల నిర్మాణాలకు అనుమతులు నిరాకరించినట్టు మేయర్ తెలిపారు. దీన్ని సుహృద్భావంతో అర్థం చేసుకోవాలని సభ్యులకు సూచించారు. డస్ట్‌బిన్లపై జరిగిన చర్చలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నగరంలో అమలు చేస్తున్న తడి-పొడి చెత్త సేకరణ విధానానికి కార్పొరేటర్లు సహకరించాలని కమిషనర్ నివాస్ కోరారు. దేశవ్యాప్తంగా జరిగిన స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్‌లో 19వ ర్యాంకు సాధించిన వీఎంసీ రాబోయే సర్వేలో టాప్ టెన్ జాబితాలో నిలిచేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. స్ట్రీట్ వెండర్స్‌కు అమలు చేయబోతున్న రెడ్, ఆరెంజ్ జోన్ల ఎంపికలో త్వరలోనే నగర ట్రాఫిక్ డెప్యూటీ పోలీస్ కమిషనర్‌తో చర్చించనున్నట్టు ఆయన వివరించారు.

ననే్న శాసిస్తారా..!
* కౌన్సిల్ నియమాలు తెలుసుకోండి
* సభ్యుల ప్రవర్తన తీరు సరికాదు
* అవగాహన కోసం ప్రత్యేక సమావేశం
* కౌన్సిల్‌లో మేయర్ శ్రీ్ధర్ అసహనం
బెంజిసర్కిల్, డిసెంబర్ 13: నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను చూపే ఉన్నతమైన వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు కార్పొరేషన్‌కు చెడ్డపేరు తెస్తోందని నగర మేయర్ కోనేర శ్రీ్ధర్ అన్నారు. సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు పూర్తి సమాచారం తెలుసుకొని, సమస్యలను కౌన్సిల్ దృష్టికి తేవడంతో పాటు అధికారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. కౌన్సిల్ సమావేశంలో నియమ నిబంధనలను కూడా అవగాహన చేసుకుని దానికి అనుగుణంగానే సభ్యులు ప్రవర్తించాలని, మేయర్ చెబుతున్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలని కోరారు. ఇప్పటికి మూడున్నరేళ్లు పూర్తయినప్పటికీ కార్పొరేటర్లకు కౌన్సిల్ నియమ నిబంధనలు తెలియకపోవడం విచారకరమన్నారు. త్వరలోనే కార్యదర్శి ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బుధవారం నాటి కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చ సందర్భంలో సభ్యులు ఒక్కసారిగా మాట్లాడేందుకు లేస్తుండటంతో మేయర్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చర్చ సందర్భంలో కేవలం ముగ్గురికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుందని, అదేపనిగా సభ్యులంతా మాట్లాడితే సమయం సరిపోదన్నారు. నియమ నిబంధనల ప్రకారం ఫ్లోర్ లీడర్‌కు అవకాశం కల్పిస్తున్నామని, అంశాలపై మరొకరికి అవకాశం ఉంటుందేతప్ప అందరూ మాట్లాడతామంటే ఎలా అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఆస్తులకు సంబంధించిన అంశంపై జరిగిన చర్చలో వైకాపా ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడిన అనంతరం మరో సభ్యురాలు బీజాన్ బీ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో మేయర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈసందర్భంలో మైక్ కట్ చేయమని మేయర్ ఆదేశించడంతో వైకాపా సభ్యులు, సీపీఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి, తదితరులు పోడియం వద్దకు వచ్చి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. తెదేపా ఫ్లోర్ లీడర్ జి హరిబాబు తీర్మానాలు ప్రవేశపెడుతుంటే వైకాపా సభ్యులు అడ్డుతగలడంతో అసహనానికి గురైన మేయర్ బీజాన్ బీని సస్పెండ్ చేయమని ఆదేశించడంతో హరిబాబు వారిని వారించే ప్రయత్నం చేశారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదని, చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైకాపా సభ్యులు ఆరోపించారు. చివరకు కౌన్సిల్ నియమాలను వివరించిన శ్రీ్ధర్, మేయర్‌పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.

చంద్రన్న విలేజ్ మాల్స్‌లో
తక్కువ ధరకే సరుకులు
* పౌర సరఫరాల శాఖ మంత్రి పుల్లారావు
* విద్యాధరపురం విలేజ్ మాల్ పరిశీలన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 13: వినియోగదారులకు తక్కువ ధరలకే సరుకులు లభించడంతో పాటు డీలర్లకు ఆదాయ వనరులు సమకూర్చేలా చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నగరంలోని విద్యాధరపురం చౌకధరల దుకాణాన్ని చంద్రన్న విలేజ్ మాల్‌గా మార్చిన సందర్భంగా బుధవారం మంత్రి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర కానుకగా మొదటి విడతగా రానున్న ఆరు మాసాల్లో 6500 చౌకధరల దుకాణాలను అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో చంద్రన్న మాల్స్‌గా మార్చాలని భావిస్తున్నట్లు తెలిపారు. రెండో విడతగా మున్సిపాలిటీల్లో కూడా మార్పు చేయటానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చంద్రన్న విలేజ్ మాల్స్‌లో అమ్మే సరుకులు ప్రజలకు మార్కెట్ ధరల కంటే తక్కువగా అందుబాటులో ఉండేలా రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ సంస్థలతో అనుసంధానం చేశామన్నారు. చంద్రన్న మాల్స్‌లో అమ్మకాలు నిర్వహించే వస్తువులు రిలయన్స్ కంపెనీకి సంబంధించినవి 20శాతం మాత్రమే ఉంటాయని, మిగిలినవి ఇతర బ్రాండ్ సరుకులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. చంద్రన్న విలేజ్ మాల్‌ను ఆధునీకరించేందుకు ప్రభుత్వం అందించే 2.5 లక్షలతో పాటు రిలయన్స్ కంపెనీ 2.5 లక్షలు డీలర్లకు సమకూర్చుతారని మంత్రి తెలిపారు. చంద్రన్న మాల్స్‌లో లభించే వస్తువులు అన్నీ ప్యాకెట్ రూపంలోనే వినియోగదారులకు విక్రయిస్తారన్నారు. వినియోగదారులకు అనువుగా ఉండేలా బియ్యాన్ని 5, 10 కిలోల ప్యాకెట్లలో విక్రయిస్తారని తెలిపారు. అనంతరం మంత్రి పుల్లారావు వినియోగదారులతో మాట్లాడుతూ చంద్రన్న విలేజ్ మాల్స్‌లో లభించే వస్తువుల నాణ్యత గురించి, ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శాసన మండలిలో విప్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ చంద్రన్న విలేజ్ మాల్ ద్వారా వినియోగదారులు 30శాతం వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. మంత్రి పుల్లారావు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ధరలు అదుపులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి రవిబాబు మాట్లాడుతూ చంద్రన్న విలేజ్ మాల్స్ ద్వారా గృహావసర, కిరాణా, ఇతర ఉపకరణాలు ఎంఆర్‌పీపై 4 నుండి 35 శాతం వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, సివిల్ సప్లైస్ డీఎం వరకుమార్, డీఎస్‌వో పీ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

కళాతపస్వి విశ్వనాథ్‌కు
రోటరీ జీవిత సాఫల్య పురస్కారం
* 17న ప్రదానోత్సవం
విజయవాడ, డిసెంబర్ 13: చరిత్ర కలిగిన సేవా సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రతి సంవత్సరం విశిష్ట వ్యక్తులకు అందిస్తున్న జీవిత సాఫల్య పురస్కారాన్ని 2016-17 సంవత్సరానికి రోటరీ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి డా. కాశీనాథుని విశ్వనాథ్‌కు ఈ నెల 17న ఆదివారం ఉదయం 10 గంటలకు గాంధీనగర్‌లోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్‌లో అందిస్తున్నట్లు రోటరీ జీవిత సాఫల్య పురస్కార కమిటీ చైర్మన్ డా. ఎంసీ దాస్, రోటరీ పౌర సంబంధాల శాఖ చైర్మన్ పులిపాక కృష్ణాజీ ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం ఈ పురస్కారాన్ని గాన గంధర్వుడు డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు, అంతకుముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి లాంటి సంగీత విద్వాంసులకు అందజేసినట్లు తెలిపారు. సభకు ముందు విశ్వనాథ్ చిత్రాలలోని కొన్ని నృత్య సన్నివేశాలు, పాటలను ప్రదర్శిస్తారు. జీవిత సాఫల్య పురస్కార ఎంపిక కమిటీలో రోటరీ పీడీజీలు డా. కామినేని పట్ట్భారామయ్య, డా. ఎంసీ దాస్, డా. జీవీ మోహన్‌ప్రసాద్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షుడు సీ భగవంతరావు, కార్యదర్శి డీ నవీన్‌కుమార్, ఒకేషనల్ డైరెక్టర్లు వై కొండారెడ్డి, టీ శ్రీ్ధర్, నగేష్, కె సుబ్బారావు నాయుడు ఉన్నారు.

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
పాతబస్తీ, డిసెంబర్ 13: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పేద మహిళలకు 135 ఉచిత కుట్టు మిషన్లను ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, మహిళలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పేద మహిళలకు జీవనోపాధి కల్పించడానికి ఈ మిషన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున వారి సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నారని, రాజకీయంగా అన్ని పదవుల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారన్నారు. మహిళలే తెలుగుదేశం పార్టీకి కొండంత అండ అని వివరించారు. కార్యక్రమంలో స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, డైరెక్టర్ మొహిద్దీన్, కోఆప్టెడ్ సభ్యుడు ఫతావుల్లా, అర్బన్ తెలుగుదేశం నాయకులు పట్ట్భా, రియాజ్, మైనార్టీ నాయకులు, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
ఓల్గా ఆర్చర్ల పతకాల పంట
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 13: నవంబర్, డిసెంబర్‌లో జరిగిన 63వ జాతీయ స్కూల్ గేమ్స్, జాతీయ సీబీఎస్‌ఈ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో నగరంలోని చెరుకూరి లెనిన్ - ఓల్గా ఆర్చరీ అకాడమీ ఆర్చర్లు పతకాల పంట పండించారు. అండర్-19, 17 విభాగాల్లో పతకాలు సాధించడంతో పాటు అంతర్జాతీయంగా యూత్ ఒలింపిక్స్ కాంటినెంటల్ సెలెక్షన్స్‌లో భారత తరపున పాల్గొన్న అకాడమీ రికర్వు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రజత పతకం సాధించాడు. భారత జట్టును యూత్ ఒలింపిక్స్‌లో క్వాలిఫై చేయడంలో కీలక భూమిక పోషించాడు. తిరిగి 2018 మేలో నిర్వహించనున్న భారత జట్టు సెలెక్షన్స్‌కు అర్హత సాధించాడు. గుజరాత్‌లో జరిగిన జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 విభాగంలో ధీరజ్ మొత్తం నాలుగు స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు బెస్ట్ ఆర్చర్‌గా రికార్డు సృష్టించాడు. కాంపౌండ్ విభాగంలో మైనేని సాయిచరిత్ మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. ధీరజ్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గత నెల 3నుంచి 5 వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జాతీయ సీబీఎస్‌ఈ అండర్-17 స్కూల్ గేమ్స్ ఆర్చరీలో గుణదల సెయింట్ జాన్స్ హైస్కూల్ విద్యార్థి ఓల్గా అకాడమీ ఆర్చర్ కొడాలి వెంకటాద్రి 4 పతకాలు పొందడంతో పాటు ఖేలో ఇండియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. ఈ నెల 4,5 తేదీల్లో బ్యాంకాక్ (్థయిలాండ్)లో జరిగిన ఏషియా యూత్ కప్ అండర్-13 విభాగంలోనూ ఓల్గా ఆర్చర్లు దేవినేని అశ్వంత్ మైత్రి చౌదరి (మ్యాట్‌మన్ స్కూల్), చెరుకూరి డాలీశివానీ (కెకెఆర్ గౌతమ్), తోటకూర శ్రీరాములు (శ్రీచైతన్య) చక్కటి ప్రతిభ కనబరిచారు. ఈసందర్భంగా బుధవారం చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆర్చర్లను అభినందించారు. ముఖ్యఅతిథిగా రీజినల్ ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐవో సి శివసత్యనారాయణరెడ్డి, అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, ఆర్చర్లు, తల్లిదండ్రులు బి శ్రావణ్‌కుమార్, రేవతి, దేవినేని స్మిత, కోచ్‌లు నవీన్‌కుమార్, అకాడమీ ఆర్చర్లు పాల్గొన్నారు.

అధికారులకు ప్రొటోకాల్ పట్టదా?
* కౌన్సిల్ తీర్మానాలు అమలుచేయరా?
* కార్పొరేటర్లకు కనీస సమాచారమివ్వరా?
* కౌన్సిల్‌లో సభ్యుల మూకుమ్మడి ప్రశ్నలు
* సమాధానం ఇవ్వలేకపోయిన మేయర్ శ్రీ్ధర్
బెంజిసర్కిల్, డిసెంబర్ 13: ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులంటే అధికారులకు ఎందుకంత చులకన అంటూ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరావు అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ పాటించడంలో వీఎంసీ అధికారులు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని, అంతేకాకుండా ఇప్పటివరకూ జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో ఆమోదం పొందిన వివిధ అంశాలకు సంబంధించి వాటి అమలు, తీసుకున్న చర్యలపై కనీస సమాచారం ఎందుకు ఇవ్వటం లేదని సభా ముఖంగా ప్రశ్నించారు. కౌన్సిల్ తీర్మానాలను అమలు చేయని అధికారులు, కనీసం సమాచారం కూడా అందించడంలేదని ఆరోపించారు. విపక్ష, అధికార పక్ష కార్పొరేటర్లు మూకుమ్మడిగా ప్రశ్నించేసరికి ఏమిచెప్పాలో తెలియక తికమకపడిన మేయర్ కోనేరు శ్రీ్ధర్ అసహనానికి గురై అధికారులను మందలించారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అధికారుల నుండి సరైన సమాధానం రాకపోవటంతో వైకాపా, తెదేపా కార్పొరేటర్ల తమ గోడు వెళ్లబోసుకున్నారు. కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ప్రశ్నలపై అధికారులు సరైన సమాచారం అందించడం లేదని, పూర్తిస్థాయి సమాచారం ఇవ్వకుండా చేతులు దులుపుకుంటున్నారని సభలో ఏకరవు పెట్టారు. గత కౌన్సిల్ సమావేశంలో అమోదించిన అంశాలకు సంబంధించి పురోగతిపై కూడా సరైన వివరణ రావడం లేదన్నారు. దీనికితోడు గతంలో కౌన్సిల్ ఆమోదించిన వాటిని కూడా తిరిగి మరోసారి కౌన్సిల్ అజెండాలో పెడుతున్నారంటూ పలు అంశాలను ప్రస్తావించారు. అన్ని విభాగాల్లోని అధికారుల పనితీరు కూడా ఇలానే ఉందన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ అజిత్‌సింగ్‌నగర్‌లో జరిగిన మంత్రి లోకేష్ కార్యక్రమం 4 గంటలకు కాగా తనకు 5.15 నిముషాలకు సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం వచ్చిందని, ఇలాంటి చర్యలు అధికారుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఆయనకు తెదేపా కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, ఇతర సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు. కార్పొరేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల సమాచారం కూడా సకాలంలో తెలపడం లేదన్నారు. దీనిపై మేయర్ శ్రీ్ధర్ స్పందిస్తూ తప్పనిసరిగా కార్పొరేషన్ సమాచారాన్ని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లకు విధిగా వ్యక్తిగతంగా కలిసి అందించాలన్నారు. ఇదే సమయంలో కార్పొరేటర్లు కూడా వీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ నెలలో నిర్వహించిన చిత్ర ప్రదర్శనతో పాటు బాలల దినోత్సవాలకు కార్పొరేటర్లు సరిగా హాజరుకాలేదని ప్రస్తావించిన ఆయన బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇదిలావుండగా ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా నగరంలో వివిధ అభివృద్ధి పనుల విషయాల్లో అధికారులే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకపక్షం ఉన్నప్పటికీ కోట్లాది రూపాయల వ్యయంతో రూపొందించిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమాచారం కూడా అందించకపోవడం అధికారుల నియంతృత్వ ధోరణికి నిదర్శనమని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

వీఎంసీ ఆస్తులు అమ్మొద్దు
* కౌన్సిల్ హాల్ ముందు వైకాపా, సీపీఎం సభ్యుల ధర్నా
బెంజిసర్కిల్, డిసెంబర్ 13: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అమలు చేస్తూ వీఎంసీకి చెందిన పలు స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ధారదత్తం చేసే ప్రక్రియకు తెరలేపిన నగర పాలకుల తీరుపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం కౌన్సిల్ సమావేశానికి రానున్న నేపథ్యంలో అంతకుముందే కౌన్సిల్ భవనం వద్ద వైకాపా కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు. హనుమాన్‌పేటలోని జంధ్యాల దక్షిణామూర్తి పాఠశాల, వీఎంసీ గెస్ట్‌హౌస్ పాత భవనం, బృందావన్ కాలనీలోని మున్సిపల్ ఎంప్లారుూస్ కాలనీకి చెందిన స్థలాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో అభివృద్ధిపర్చేందుకు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించే విధానాలను తప్పుపట్టారు. వీఎంసీకి ఆదాయం లేదంటూనే నూతన భవన నిర్మాణానికి రూ. 10కోట్లు ఖర్చుచేసిన టీడీపీ పాలకులు ఆయా స్థలాల్లో ప్రజాప్రయోజనకరమైన నిర్మాణాలను చేపట్టకుండా ప్రైవేట్‌కు కట్టబెట్టడం వారి వైఫల్యాలకు నిదర్శనమని వైకాపా ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల, సీపీఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి విమర్శించారు. అంతేకాకుండా పర్యాటక, వ్యాపార ప్రయోజనాల కోసం వీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని తరలించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, ఆయా చర్యలను నిలువరించాల్సిన నగర పాలకులు ప్రభుత్వం ముందు తలదించుకోవటం శోచనీయమన్నారు. ఇకనైనా ఆయా చర్యలను నిలుపుదల చేయకుంటే నేటి తరం వారే కాకుండా భవిష్యత్ తరాలవారికి కూడా నష్టం చేకూర్చిన వారవుతారన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయ తరలింపు చర్యలను నిలిపివేయడమే కాకుండా ప్రస్తుతం రూ. 32కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన భవన నిర్మాణాన్ని కూడా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంక్షోభాన్ని అధిగమిస్తున్నాం
* పోలవరం రాజీలేదు * టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 13: గత పాలకుల వైఫల్యం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ అన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం బృందావన్ థియేటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన సభలో కళా వెంకట్రావ్ మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ అనైతిక చర్యల వల్ల రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించారన్నారు. ఆర్థిక లోటు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఒక పక్క అర్హులందరికీ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో రూ.24వేల కోట్లు రుణాలను మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నీటి భద్రత కల్పించేందుకు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి డెల్టా భూములు ఎడారి కాకుండా సస్యశ్యామలం చేశామన్నారు. నాడు కాంగ్రెస్ నేతలు జలయజ్ఞానాన్ని ధన యజ్ఞంగా మార్చేశారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరానికి జాతీయ హోదా కల్పించి ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. సభాధ్యక్షత వహించిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ బందరు ఓడరేవు నిర్మాణాన్ని సైతం త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుకు నిలువెత్తు నిదర్శనం పట్టిసీమ అన్నారు. పట్టిసీమ నిర్మాణం జరగకపోతే నేడు డెల్టా రైతులు అధోగతి పాలయ్యేవారన్నారు. శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ శక్తివంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం నేడు అత్యంత శక్తివంతంగా మారుతుందన్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నారన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కాగిత వెంకట్రావ్, మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావు, మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), తెలుగు యువత నాయకులు దేవినేని అవినాష్, దేవినేని చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత మూడు స్తంభాల సెంటరు నుండి బస్టాండ్ సెంటరు వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటరులోని ఎన్టీఆర్ విగ్రహానికి కళా వెంకట్రావ్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా నూతనంగా నిర్మించిన టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు.

పచ్చని పొలాల మధ్య ఇటుక బట్టీని తొలగించాలి
* రెవెన్యూ అధికారులకు టీడీపీ నేతల వినతి

తోట్లవల్లూరు, డిసెంబర్ 13: తోట్లవల్లూరు వద్ద కృష్ణానదీపాయల మధ్య సౌత్‌వల్లూరు పరిధిలోని గౌడఫీల్డు సొసైటీ భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్ అధికారుల అనుమతి లేకుండా అర్ధరాత్రిళ్లు జరుపుతున్న మట్టి తవ్వకాలను నియంత్రించాలని గ్రామ టీడీపీ అధ్యక్షుడు చింతా రాజా, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లుక్కా రేణుకారావు ఆధ్వర్యంలో బుధవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సీనియర్ అసిస్టెంట్ డి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. ఇటుక బట్టీ వద్ద భారీగా మట్టి నిల్వ చేశారని, సదరు వ్యాపారి మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి ఇంత వరకు ఎలాంటి అనుమతి తీసుకోకుండా వందల క్యూబిక్ మీటర్ల మట్టిని రాత్రిళ్లు జేసీబీ, ట్రాక్టర్లతో ఇటుక బట్టీకీ తవ్వుకు వస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. గతంలో రైతులు గొరిపర్తి రమేష్ తదితరులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఇటుక బట్టీ యజమాని నల్లూరి రమేష్‌కి నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోకుండా వదిలి వేశారని చింతా రాజా ఆరోపించారు. పచ్చని పొలాల మధ్య ఇటుక బట్టీలు వెలిగిస్తుండటంతో పంటలకు దుమ్ముధూళీ చేరి రైతులు వేస్తున్న పంటలకు నష్టం కలుగుతోందని తెలిపారు. ఈ విషయమై ఇటీవల జరిగిన గ్రామ టీడీపీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకులు, రైతులు చెప్పటంతో ఇటుక బట్టీపై చర్యలు తీసుకోవాలని తీర్మానం కూడా చేయటం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని రాజా హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ సభ్యుడు ఎండీ రఫీ, టీడీపీ నాయకులు గరికే శివశంకర్, వల్లూరు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

లాజిస్టిక్ హబ్‌గా ‘బందరు’
* భారీ ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
* ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ అండ్ మానిఫ్రాక్చరింగ్ జోన్‌కు గ్రీన్ సిగ్నల్
* సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఒప్పందం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 13: బందరుకు మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. ఓడరేవు నిర్మాణం నేపథ్యంలో ఈ ప్రాంతం లాజిస్టిక్ హబ్‌గా అవతరించబోతోంది. కంటైనర్ పోర్టు నిర్మాణం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో ఆ దిశగా పరిశ్రమల స్థాపనకు కూడా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోర్టు భూముల సమస్య ఒక కొలిక్కి రాకపోయినా బందరు తీరంలో పరిశ్రమల స్థాపనకు పలు సంస్థలు ఉత్సుకత వ్యక్తం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడ) మాష్టర్ ప్లాన్ తయారీ టెండరును అంతర్జాతీయ సంస్థ దక్కించుకున్న నేపథ్యంలో మరో భారీ ప్రాజెక్టును నెలకొల్పేందుకు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. కోన గ్రామంలో ఈ సంస్థ ఇంటిగ్రేడెట్ లాజిస్టిక్ అండ్ మానిఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు వెయ్యి ఎకరాల్లో ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖాధికారులు సంబంధిత భూమిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సదరు సంస్థతో వౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ అధికారులు ఎంఓయు చేసుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమానికి కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఆ సంస్థ సీఎండీ వి కల్యాణ రామా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ చీఫ్ జనరల్ మేనేజర్ అజిత్ సింగ్ పాల్గొన్నారు. ఎంఓయు కుదుర్చుకున్న సంస్థ ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల వద్ద లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు అమరావతి, హైదరాబాద్ నగరాలకు అత్యంత సమీపాన ఉన్న బందరు ఓడరేవు వద్ద లాజిస్టిక్ హబ్‌తో పాటు మానిఫాక్చరింగ్ యూనిట్ కూడా నెలకొల్పేందుకు ఈ సంస్థ ముందుకు రావడం విశేషం. ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తే బందరు భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారనుంది. ఇప్పటికే బందరు ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడ) ద్వారా భూసమీకరణ ప్రక్రియతో పాటు భూ సేకరణ ప్రక్రియను కూడా ముందుకు తీసుకువెళుతోంది. పోర్టు నిర్మాణానికి అవసరమైన 5వేల ఎకరాల్లో సుమారు 3500 ఎకరాలు ప్రభుత్వం సమీకరించింది. మిగిలిన 1500 ఎకరాల భూముల సమీకరణకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ముడ మాష్టర్ ప్లాన్ తయారీకి సంబంధించి అంతర్జాతీయ సంస్థ అయిన రాయల్ హాస్కానింగ్ కంపెనీ టెండరును చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

మార్కెట్ కమిటీల ద్వారానే సుబాబుల్ కొనుగోలుకు నిర్ణయం
నందిగామ, డిసెంబర్ 13: మార్కెట్ కమిటీల ద్వారానే సుబాబుల్ కర్రను కంపెనీలు కొనుగోలు చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని మార్కెట్ కమిటీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు (బుజ్జి) తెలిపారు. బుధవారం సచివాలయంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆదినారాయణరెడ్డి కంపెనీ ప్రతినిధులతో సుబాబుల్ కర్ర కొనుగోలు సమస్యలపై చర్చించారన్నారు. సమావేశంలో 143, 493 జీవోలను రద్దు చేస్తూ 2014 ధరలకు రూ.4400లకు సుబాబుల్ పంటను మార్కెట్ యార్డ్‌ల ద్వారానే కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. అదే విధంగా అటవీశాఖ వారి సుబాబుల్, జామాయిల్ అమ్మకాలను రైతుల పంట కొనుగోలు అయ్యేంతవరకు ఆపెయ్యాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కంచికచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ కోగంటి బాబు, నాలుగు జిల్లాల మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, రైతు నాయకులు పాల్గొన్నారు.
లింక్ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి
నందిగామ మార్కెట్ యార్డ్ పరిధిలోని గ్రామాలకు లింక్ రోడ్లు మంజూరు చేయాలని యార్డ్ చైర్మన్ చిరుమా