విజయవాడ

స్కీం వర్కర్ల సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ఈ నెల 23న తమ సమస్యల పరిష్కారం కోసం స్కీం వర్కర్లు తలపెట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం అధికారుల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, తక్షణమే ఈ ప్రయత్నాలు విరమించుకుని స్కీం వర్కర్లపై వేధింపులు ఆపాలని ఏఐటీయుసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐసీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి ద్వారా సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేసి అంగన్‌వాడీ కార్యకర్తలను తీవ్రంగా బెదిరింపులకు గురిచేస్తున్నారని, కొందరు సీడీపీఓలు అత్యుత్సాహం చూపి సమ్మెలో పాల్గొన్న కార్యకర్తలు మరునాడు ఆఫీసులకు కూడా రావాల్సిన అవసరం లేదని బెదిరిస్తున్నారని అనేక కేంద్రాల నుండి తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేసే కార్యకర్తలకు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేశారని ఆయనన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగానే 23న ఏపీలో అన్ని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారుల బెదిరింపులకు స్కీం వర్కర్లు ఎవరూ భయపడబోరని, నూటికి నూరు శాతం సమ్మెలోకి వెళ్తామని ఆయనన్నారు. స్కీం వర్కర్లు ఎవరూ ప్రభుత్వ బెదిరింపులకు లొంగవద్దని, కార్యకర్తలకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే తరువాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని రవీంద్రనాథ్ హెచ్చరించారు.

అధికారుల ఏకపక్ష నిర్ణయంతో..
రోడ్డునపడ్డ పుష్కర టాయిలెట్ల నిర్వాహకులు!
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 22: వీఎంసీ అధికారుల ఏకపక్ష నిర్ణయంతో పలువురు మరుగుదొడ్ల నిర్వాహక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎస్టీ కుటుంబాలకు చెందిన వారు 15ఏళ్లుగా మరుగుదొడ్ల శుభ్రం, నిర్వహణతోనే జీవనం సాగిస్తున్న సుమారు 13 కుటుంబాల వారిని తొలగించారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను మరొక ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిన నిర్వహణ చేస్తున్న వీరికి ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండానే వీరి నిర్వహణా బాధ్యతలను తొలగించడం వెనుక కారణాలేమిటన్నది అంతుపట్టడం లేదు. ఏలూరు లాకులు, హనుమంతరాయ చేపల మార్కెట్, సర్కిల్ -3 కార్యాలయం, యనమలకుదురు కెనాల్ బండ్, పటమట రైతు బజార్, తారకరామా నగర్ డొంకరోడ్డు, రాజీవ్‌గాంధీ మార్కెట్, రాణిగారితోట, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, సివిల్ కోర్టులు, లెనిన్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ వద్దగల టాక్సీ స్టాండ్, భవానీపురం లారీ స్టాండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న పుష్కర టాయిలెట్ల నిర్వాహకుల మార్పిడిలో చోటుచేసుకున్న అధికారిక చర్యలపై పునరాలోచన చేయాలని బాధిత నిర్వాహుకులు కోరుతున్నారు. గతంలో తమకు కాంట్రాక్ట్ అప్పగించిన విధంగా కాకుండా ఎటువంటి టెండర్ ప్రకటన లేకుండా వేరొక పద్ధతుల్లో ప్రైవేటు సంస్థకు మరుగుదొడ్ల నిర్వహణ అప్పగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వారు, అధికారుల చర్యలతో తమ కుటుంబాల వారు జీవనాధారం కోల్పోయి రోడ్డుపడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొలువైన వీఎంసీ ప్రత్యేక కమిటీలు
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 22: వీఎంసీ ప్రత్యేక కమిటీలకు సభ్యుల ఎన్నిక నియామకాలు సోమవారం జరిగాయి. మొత్తం 11 కమిటీలకు గాను ఇంతకు ముందు 2కమిటీలకు సభ్యులను ఎన్నిక చేయగా సోమవారం మరో 5 కమిటీలకు సభ్యులను నియమించారు. విద్యా సాంస్కృతిక కమిటీ చైర్మన్‌గా మహమ్మద్ నజీర్ హుస్సేన్, డెప్యూటీ చైర్మన్‌గా గుర్రం కనకదుర్గ, రోడ్లు, డ్రైన్లు ఫ్లై ఓవర్ భవనాల ప్రత్యేక కమిటీ చైర్మన్‌గా దాసరి మల్లేశ్వరి, డెప్యూటీ చైర్మన్‌గా కాకు మల్లికార్జున యాదవ్, ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌గా నాగోతి నాగమణి, డెప్యూటీ చైర్మన్‌గా ఆత్కూరి రవికుమార్, లైటింగ్, పార్కుల ప్రత్యేక కమిటీ చైర్మన్‌గా వెణుతురుమల్లి హరనాధ స్వామి, డెప్యూటీ చైర్మన్‌గా ఎరుబోతు శ్రావణి, మహిళాభ్యుదయ ప్రత్యేక కమిటీ చైర్మన్‌గా వీరంకి కృష్ణకుమారి, డెప్యూటీ చైర్మన్‌గా కాకు మల్లికార్జున యాదవ్ ఎన్నికయినారు. ఇదిలావుండగా విద్యా, సాంస్కృతిక కమిటీ చైర్మన్‌గా నజీర్ హుస్సేన్ 2వ సారి నియామకం కాగా కాకు మల్లికార్జున యాదవ్ ఒకే టర్మ్‌లో రోడ్లు, డ్రైన్లు, ఫ్లై ఓవర్ భవనాల కమిటీ, మహిళాభ్యుదయ కమిటీలు రెండింటికీ డెప్యూటీ చైర్మన్‌గా నియామకం కావడం గమనార్హం.
నేడు మరో 4 కమిటీలకు ఎన్నిక
వీఎంసీ ప్రత్యేక కమిటీలలో మరో 4 కమిటీలకు మంగళవారం ఎన్నిక జరుగనున్నది. మంచినీటి సరఫరా, భూగర్భ మరుగునీటి పారుదల కమిటీ, మురికి వాడల అభివృద్ధి కమిటీ, పారిశుద్ధ్యం, ప్రజారోగ్య ప్రత్యేక కమిటీ, క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీల ఎన్నికకు వీఎంసీ సెక్రటరీ షెడ్యూల్ ఖరారు చేశారు.