విజయవాడ

దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: పెదగొట్టిపాడు దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పీ మధు, కే రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జల్లి విల్సన్‌తో కలిసి వారు మాట్లాడారు. జనవరి ఒకటో తేదీన దళితులపై పెత్తందారులు దాడి చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు సాంఘిక బహిష్కరణ అమలు చేస్తున్నారని తెలిపారు. దళిత యువకులు విద్యుత్, సైకిల్ షాప్‌లు నడుపుకునేందుకు అద్దెకు ఇచ్చిన షాపులను వెనక్కి తీసుకుంటున్నారని, కౌలు పొలాలు ఇవ్వబోమని చెప్పారని, గతంలో తీసుకున్న అప్పులను వెంటనే చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. అలాగే దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని తెలిపారు. గాయపడిన వారిలో ఒకరికి కాలు తొలగించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారన్నారు. అయినా దాడి చేసిన వారిపై ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయలేదని, ప్రభుత్వమే వారికి రక్షణ కల్పిస్తోందని తెలిపారు. పైగా గ్రామంలో ఉన్న యువతీ, యువకులను ఆందోళనలో పాల్గొంటున్నారనే పేరుతో అదుపులోకి తీసుకుంటున్నారని చెప్పారు. సుమారు 200 నుండి 300 మంది పోలీసులు గ్రామంలో ఇప్పటికీ పహరా కాస్తున్నారని, దాడి చేసిన వారి కంటే బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ ఎవరినీ నోరెత్తనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి వెళ్లిన వారిని అరెస్ట్ చేస్తూ పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా, దళితులకు సంఘీభావంగా 24న ‘చలో పెదగొట్టిపాడు’ నిర్వహిస్తున్నామని, అడ్డుకోవాలని చూస్తే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.