విజయవాడ

రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ‘పెట్టుబడులు - పరిశ్రమలు - ఉపాధి కల్పన’ అనే అంశంపై 344 సెక్షన్ కింద మంగళవారం చర్చ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, మరిన్ని పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గతంలో పరిశ్రమలు విద్యుత్ సమస్యను ఎదుర్కొనేవని, బకాయిలు పేరుకునేవని, రాయితీలు అందేవి కాదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు నాయుడు 2068 కోట్ల రూపాయల మేర పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను విడుదల చేశారని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 10 రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, 9 విధానాలను తీసుకొచ్చామని తెలిపారు. దాదాపు రెండు బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రంలోకి కియా మోటార్స్ వల్ల వచ్చాయని తెలిపారు. ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈల ప్రాధాన్యత గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 96 పార్కుల ఏర్పాటుకు 8926 ఎకరాలను సేకరించామని తెలిపారు. గత నాలుగేళ్లలో పారిశ్రామిక రాయితీల కింద 3265 కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. పరిశ్రమలకు సంబంధించి వృద్ధిరేటు ఏపీలో 2016-17లో 10.16 శాతం ఉండగా, 2017-18లో 8.39 శాతం ఉందన్నారు. ఇది దేశ వృద్ధిరేట్ల కంటే ఎక్కువన్నారు. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి కల్పించారన్నారు. మన్నవరం విద్యుత్ ప్రాజెక్టును 6వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదించిందని తెలిపారు. దాదాపు 130కోట్ల రూపాయల మేర పనులు చేసిన తరువాత ఆ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను కూడా గుజరాత్‌కు తరలించడం సరికాదన్నారు. కడప ఉక్కు కర్మాగారం రాయలసీమ వాసుల హక్కు అని, దాన్ని రానీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలిస్తూ ఏపీకి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై అంతకుముందు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి, తదితరులు ప్రసంగించారు.

అన్నాప్రగడ చిరస్మరణీయుడు
* శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్
విజయవాడ, సెప్టెంబర్ 18: స్వాతంత్య్ర సమరంలో తానొక్కడే నూరు తుపాకులై గర్జించి, బ్రిటీషు వారిని గడగడలాడించిన విప్లవయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు చిరస్మరణీయుడని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అమరావతి ఆధ్వర్యంలో గోపరాజు నాగేశ్వరరావు రచించిన ‘సమరయోగి అన్నాప్రగడ కామేశ్వరరావు విప్లవ జీవిత దర్పణము’ పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మండలి మాట్లాడుతూ బ్రిటీషు సైన్యంలో చేరి యుద్ధ విద్యలు నేర్చుకొని, భగత్‌సింగ్‌కు సైనిక శిక్షణ ఇచ్చి, ఉరిశిక్షకు గురైన భారతమాత ముద్దుబిడ్డ అన్నాప్రగడ అని, ఇతర దేశాల్లో వచ్చిన తిరుగుబాటు వల్ల బ్రిటీషు ప్రభుత్వం ఆయన శిక్షను రద్దు చేయక తప్పలేదన్నారు. స్వాతంత్య్ర అనంతరం కూడా ఆయన అకుంఠిత దీక్షతో దేశసేవకే అంకితమైన అరుదైన త్యాగమూర్తి అన్నారు. నేషనల్ ట్రస్ట్ సభ్యుడు దుగ్గిరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రిటీషు వారికి ఎదురొడ్డిన తెలుగు సమమరయోధుడు అన్నాప్రగడ అని, అంతటి త్యాగమూర్తి మరుగున పడటం తెలుగువారి దురదృష్టకరమని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత అతితక్కువ సమయంలో రాజకీయ విలువల పతనాన్ని చూసి, ఆంధ్రదేశాన్ని విడిచి పూణే వెళ్లిన దేశభక్తుడు అన్నారు. ఎపీ పంజాబ్ సిక్కు సమాజం అధ్యక్షులు మొహిందర్‌సింగ్ మాట్లాడుతూ అన్నాప్రగడ, భగత్‌సింగ్‌తో కలసి బ్రిటీషు వారితో పోరాటం చేసిన విషయం తెలుగువారికి గానీ, సిక్కుల గానీ తెలియకపోవటం శోచనీయమన్నారు. సభకు డాక్టర్ గుమ్మా సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, నరసరావుపేట కళావేదిక అధ్యక్షులు పొన్నపాటి ఈశ్వరరెడ్డి. కల్చరల్ సెంటర్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి, పీవీఎస్ ప్రసాద్‌రావు, అన్నాప్రగడ రోశయ్య, శర్మ, ఇందిరాశాస్ర్తీ, వల్లభరావు, దాసు పాల్గొన్నారు.

అసైన్‌మెంట్ కమిటీలు వేయండి
* శాసనసభలో సభ్యుల వినతి
విజయవాడ, సెప్టెంబర్ 18: గతంలో 30 ఏళ్లపాటు నియోజకవర్గాల్లో శాసనసభ్యుడు చైర్మన్‌గా అసైన్‌మెంట్ కమిటీలు ఉండేవని, సాగు చేసుకుంటున్న రైతులకు తరచూ భూపంపిణీ జరుగుతుండేదని శాసనసభలో పలువురు సభ్యులు గుర్తుచేశారు. అయితే గత నాలుగున్నరేళ్లుగా కమిటీలు లేక, భూపంపిణీ జరగక అవమానాలకు గురువుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. చాంద్‌బాషా మాట్లాడుతూ కనీసం ఈ నాలుగు మాసాల్లో అయినా తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ సభ్యుడు పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను నిర్ణీత ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసేలా జారీ అయిన జీవోలను తాడేపల్లిగూడంలో రెవెన్యూ అధికారులు బేఖాతరు చేస్తున్నారన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తక్షణం కమిటీలు వేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బదులిస్తూ ఐదు మాసాల క్రితమే తాను కమిటీలు వేయమంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశానని బదులిచ్చారు. మీకెవరికీ తెలియదా? అని అడగ్గా తెలియదని సభ్యులు ముక్తకంఠంతో బదులిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయం కోసం భూమిలేని 19,21,855 మంది పేదలకు 33.30 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,08,617 ఎకరాలు, తక్కువగా ప.గోదావరిలో 71.365 ఎకరాల భూమిని పంపిణీ చేశామని మంత్రి వివరించారు.