విజయవాడ

వైసీపీకి కార్పొరేటర్ల ఝలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: నగర కౌన్సిల్లో ప్రతిపక్ష వైకాపాకు ఆరుగురు కార్పొరేటర్లు రాజీనామా చేసి గట్టి ఝలక్ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 19 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందగా గతంలోనే నలుగురు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వైకాపా బలం 15కి పడిపోయింది. వైకాపాకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు అత్యంత సన్నిహతంగా ఉండే ఆరుగురు కార్పొరేటర్లు వైకాపాకు రాజీనామా చేయటంతో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం కార్పొరేటర్ల సంఖ్య 9కి పడిపోయింది. 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేష్, 17వ డివిజన్ కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత, 15వ డివిజన్ కార్పొరేటర్ కావటి దామోదర్, 16వ డివిజన్ కార్పొరేటర్ మద్దా శివశంకర్, 18వ డివిజన్ కార్పొరేటర్ పాలా ఝాన్సీ, 22వ డివిజన్ కార్పొరేటర్ పల్లెం రవికుమార్ తదితరులు పార్టీకి రాజీమానా చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఆదివారం పార్టీకి రాజీనామా చేసిన విషయం నగరంలో సంచలనం సృష్టించగా, ఆయనకు మద్దతుగా కార్పొరేటర్లు కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం తో వీఎంసీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం రాజీమానా చేసిన ఆరుగురు కార్పొరేటర్లు మంగళవారం జరగబోయే బడ్జెట్ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరు అవుతున్నట్టు సమాచారం కాగా, తమను ఏ పార్టీకి సంబంధం లేని వారిగా గుర్తించాలని కోరుతున్నారు. మంగళవారం జరుగబోయే బడ్జెట్ కౌన్సిల్‌కు హాజరుకాకపోయినా, ఈనెల 25వ తేదీన జరుగబోయే సాధారణ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. వంగవీటి రాధాకృష్ణ ఏ పార్టీలో చేరితే ఈ ఆరుగురు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హైకోర్టు ఆవరణలో అన్న క్యాంటీన్ ప్రారంభం
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: నగరంలోని హైకోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. సోమవారం జరిగిన ఈకార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కన్నబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ హైకోర్టుకు విచ్చేసే వారికి తక్కువ ఖర్చుతో ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను సరఫరా చేసే అన్న క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకుచ్చినట్టు తెలిపారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ క్యాంటీన్‌ను సద్వినియోగం చేసుకుని భోజన సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అందరితో కలిసి క్యాంటీన్‌లోనే భోజనం చేసి ఆహార పదార్ధాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, పలువురు న్యాయమూర్తులు, న్యాయ వాదులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

జక్కంపూడి ఇళ్ల పట్టాల పంపిణీ
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: జక్కంపూడి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో నిర్మించిన జీ ప్లస్ త్రీ పక్కాగృహాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈకార్యక్రమంలో సుమారు 75 ఇళ్లకు పట్టాలను పంపిణీ చేసిన మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేర్చడమే కాకుండా వారి ఇంటికి హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ రిజిస్ట్రేషన్ పట్టాతో లబ్ధిదారులు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చన్నారు. పునరావాసుల సౌకర్యార్థం అనేక వౌలిక సదుపాయాలను కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ పాలనలోనే విస్తృత అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్, ఎన్‌వీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిందరవందర, అపరిశుభ్రతలపై ఏసీజీ అసహనం
* వీఎంసీ ఆఫీస్‌లో ఆకస్మిక తనిఖీలు
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: ఊరంతా పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతలను పర్యవేక్షించే వీఎంసీ ఆఫీస్‌లోనే అపరిశుభ్రత తాండవిస్తున్న వైనంపై అదనపు కమిషనర్ ఆఫ్ జనరల్ డీ చంద్రశేఖర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, పార్కు, హెల్త్, యూసీడీ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ల స్థితిగతులను వీఎంసీ మేనేజర్ సీ వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించిన ఏసీజీ ఆఫీస్ పరిసరాల అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెక్షన్‌లో చిందర వందరగా ఫైళ్లు, గోడలకు బూజు, దుమ్ము, పనికిరాని వస్తువుల తిష్ట, అపరిశుభ్రంగా ఉన్న బీరువాలు తదితరాలను తక్షణమే సరిచేయాలని, ఆఫీస్ ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా ఆఫీస్‌లోని పలు మరుగుదొడ్లను పరిశీలించిన వారు నిర్వహణాలోపాలను గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వీఎంసీ ఆఫీస్‌లోనే లోపభూయిష్ట పారిశుద్ధ్యం నెలకొనడంపై అధికారుల తీరును తప్పుబట్టారు.

చివరి బడ్జెట్‌లో కూడా అంకెల గారడేనా?
* సీపీఎం నేత సీహెచ్ బాబూరావు
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: ఉట్టికెక్కలేనోళ్లు స్వర్గానికి ఎక్కబోయారనే సామెత చందంగా వీఎంసీ బడ్జెట్ ఉందని, నగర పాలక పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ తన చివరి బడ్జెట్‌లోనూ నగర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన వైనం గర్హనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు పేర్కొన్నారు. మంగళవారం వీఎంసీ బడ్జెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో సోమవారం నగర సీపీఎం కార్యాలయం శ్రీశ్రీ భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ టీడీపీ పాలనలో తొలి బడ్జెట్‌లో 500 కోట్ల మేర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా ఇప్పుడు సుమారు 2వేల కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ చూపించారని, బడ్జెట్ అంశాలను పరిశీలిస్తే కేవలం అంకెల గారడీ కనిపిస్తుందే కానీ ప్రజా సంక్షేమ, అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని ధ్వజమెత్తారు. సంఖ్యా బలంగా ఈ బడ్జెట్‌ను అమోదించుకున్నా సీపీఎం తరఫున ఇటు కౌన్సిల్‌లోనూ, బయటా ప్రజల్లోకి తీసుకెళ్ళి పాలకుల దుష్ట చర్యలను వివరిస్తామన్నారు. టీడీపీ పాలనా కాలం ముగుస్తున్న తరుణంలో ప్రలోభాలు, అబద్ధాలతో కూడిన బడ్జెట్‌ను తీసుకురావడం హేయమన్నారు. బడ్జెట్‌ను చూస్తే విజయవాడ నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని అద్దం పడుతోందన్నారు. 010 జీతాలపై గత నాలుగేళ్లుగా హామీ ఇస్తున్నా ఇప్పటికీ కార్యరూపానికి నోచుకోకపోవడంతో ఇప్పటికీ 750 కోట్ల రూపాయలు వీఎంసీ ఖజానాపై భారం పడిందన్నారు. దిశా నిర్దేశం లేని బడ్జెట్ కారణంగా ఇంకా 300 కోట్ల అప్పుల భారానికి తోడు మరో 100 కోట్ల అప్పు వీఎంసీపై పడబోతోందన్నారు. మైనార్టీ సంక్షేమానికి 82 కోట్లుగా చూపగా, ఏ విధంగా ఆ నిధులు వస్తాయో పాలకులకే తెలియాలన్నారు. వీఎంసీకి సంబంధం లేని జక్కంపూడి ఎకనామిక్ సిటీ టౌన్ షిప్ కోసం 120 కోట్ల కేటాయించడం గమనార్హమన్నారు. గతంలో నగరంలోని బ్రిడ్జీల నిర్మాణం కోసం 291 కోట్లు చూపించగా, ఇప్పుడు కేవలం 91 కోట్లు మాత్రమే చూపించారన్నారు. ఎస్‌బీఐ నుంచి తీసుకొస్తున్న 100 కోట్ల అప్పును బడ్జెట్‌లో గ్రాంటుగా చూపడం తెలుగుదేశం పార్టీ పాలకులకే చెల్లిందని, ఇలా అనేక అనైతిక అంశాలతో వీఎంసీ బడ్జెట్‌ను రూపొందించడం మేయర్ కోనేరు శ్రీ్ధర్ విజ్ఞతకు నిదర్శనంగా నిలుస్తుందని, ఇటువంటి అప్రజాస్వామిక బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ దోనేపూడి కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు.

వికటించిన ఆన్‌లైన్ ప్రక్రియ
* వీఎంసీ కమిషనర్ చాంబర్ ఎదుట లబ్ధిదారుల ఆందోళన * చెదరగొట్టిన పోలీసులు
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: పీఎంఏవై ఎన్‌టీఆర్ నగర్ పక్కాగృహాల కేటాయింపు ప్రక్రియ వికటించింది. ఎంతో పారదర్శకతతో ఆన్‌లైన్ ద్వారా కేటాయింపులు జరిపామని చెప్పుకొచ్చిన నగర పాలకులకు ఇప్పుడు ఆ విధానమే ఇరుకునపెట్టింది. సోమవారం లబ్ధిదారులు వీఎంసీ కమిషనర్ ఛాంబర్‌ను ముట్టడించడం వీఎంసీలో కలకలం రేపింది. ఆందోళనకారులకు అండగా సీపీఎం నేతలు వీఎంసీకి చేరుకుని వారి ఆందోళనకు మద్దతివ్వడంతో ముట్టడి మరింత ఉద్రిక్తంగా మారింది. రెండు గంటలకు పైగా ఆందోళనకారుల నినాదాలతో అట్టుడికిన వీఎంసీ ఆఫీస్‌లోకి పోలీసులు రంగ ప్రవేశం చేసి వీఎంసీ అధికారులతో లబ్ధిదారులకు నచ్చ చెప్పించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా, పోలీసులకు లబ్ధిదారులకు, సీపీఎం నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు 25వేల రూపాయల డిపాజిట్ చెల్లించిన వారికి కూడా సింగిల్ బెడ్‌రూమ్ కేటాయింపు జరగడం ఈ రగడకు ప్రధాన కారణంగా ఉంది. సోమవారం ఉదయం ఆఫీస్ ప్రారంభం కాగానే వందలాది మంది లబ్ధిదారులు తమకు కేటాయించిన పక్కాగృహాలపై అధికారులను వివరణ అడిగే ప్రయత్నం చేయగా, అధికారులెవ్వరూ సరైన రీతిలో సమాధానం చెప్పకపోవడం లబ్ధిదారుల అసహనానికి గురై, కమిషనర్‌తోనే తేల్చుకుందామంటూ ఆయన ఛాంబర్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో కమిషనర్ జే నివాస్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటామంటూ ఛాంబర్ వద్దే భీష్మించుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న సీపీఎం నేతలు సీహెచ్ బాబూరావు, సత్తిబాబు, డేవిడ్‌లు లబ్ధిదారులకు మద్దతిస్తూ వారితోపాటు ఆందోళనకు దిగారు. అధికారుల సమాచారంతో వీఎంసీకి చేరుకున్న పోలీసులు వీఎంసీ అదనపు కమిషనర్ డీ చంద్రశేఖర్‌తో చర్చించి ఆందోళనకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. వారి వివరణకు సంతృప్తి చెందని లబ్ధిదారులు తాము చెల్లించిన డిపాజిట్ ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ గృహాలను చెల్లించాల్సిందేనని పట్టుపట్టడంతో పరిస్థితి మరింత ఆందోళనకరం కాకుండా పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో సీపీఎం నేతలను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుచ్చారు.

బడుగు వర్గాల అభివృద్ధితోనే సామాజికాభ్యున్నతి సాధ్యం
* కలెక్టర్ లక్ష్మీకాంతం * ఘనంగా సత్కారం

విజయవాడ, జనవరి 21: ప్రజాస్వామ్యంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరంగా చెందాల్సిన ఫలాలు చేరే విధంగా కృషి చేయడం వల్ల సమాజాభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌కు దళిత మిత్ర అవార్డు వచ్చిన సందర్భంగా జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో పేరిన్నికగన్న దళిత మిత్ర అవార్డును గతంలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్‌దాస్‌లు పొందిన అవార్డు దక్కడం సంతోషదాయకమన్నారు. సమాజంలో ప్రభుత్వపరంగా అందించాల్సిన ఫలాలు నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందే విధంగా చేయడంలో ఎంతో ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ 2 పీ బాబూరావు మాట్లాడుతూ దళితుల ఆర్థిక స్థితిగతులను మార్చడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేసినందుకు కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ దళిత మిత్ర అవార్డును ఇచ్చిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు అందరిలో కలెక్టర్ ప్రముఖ వ్యక్తి అని అన్నారు. ముడా వీసీ విల్సన్ బాబు మాట్లాడుతూ పరిపాలనలో జిల్లా కలెక్టర్ అధికారులకు ఆత్మస్ధైర్యం ఇవ్వడం గొప్ప విజయమన్నారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ను గజమాలతో జిల్లా అధికారులు ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ మీరా ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, డీఎం అండ్ హెచ్‌వో డా రమేష్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఈశ్వరరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి యుగంధర్, టిడ్కో అధికారి చిన్నోడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

25న జిల్లా వ్యాప్తంగా ఓటర్ల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు
* వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ లక్ష్మీకాంతం

విజయవాడ, జనవరి 21: ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుండి సోమవారం కలెక్టర్ మండల, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25వ తేదీ నగరంలోనిని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దీనికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారన్నారు. నియోజకవర్గం, జిల్లా స్థాయిలో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత, కొత్త ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించే విధంగా 2కే, 5 కే రన్‌లు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నమోదైన యువ ఓటర్లను సన్మానించాలన్నారు. జిల్లాలో 33.30 లక్షల ఓటర్లు నమోదు కాబడ్డారని వీరిలో కొత్తగా 2.52 లక్షల మంది ఓటర్లు నమోదు కాబడి కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే అత్యధిక నూతన ఓటర్లు నిమోదుకాబడి ప్రథమ స్థానంలో ఉందన్నారు. జాబితాలో అనర్హుల ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియగా ఉండాలన్నారు. జాబితాలో మార్పులు, చేర్పులు, ఫొటోల అప్‌డేషన్, డూప్లికేట్‌ల తొలగింపు జరుగుతుండాలన్నారు. ఈ నెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఈలోగా పోర్టుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న కొమరవోలు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న దృష్ట్యా ప్రభుత్వ శాఖల కార్యక్రమాలపై వినూత్న రీతిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ 2 పీ బాబూరావు, సీపీవో, తదితరులు పాల్గొన్నారు.

‘జిల్లా కబడ్డీ సంఘం ఎన్నిక చెల్లదు’
విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 21: కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక చెల్లదని, జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికలకు హాజరైన పట్ట్భారామ్ టీడీపీ జెండా ముసుగులో రాజకీయం చేస్తున్నారని ఆంధ్ర కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేపీ రావు విమర్శించారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా ఒలింపిక్ సంఘాలకు ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గుర్తింపు లేదని, ఒలింపిక్ సంఘం తరపున ఎవరు పదవులను ప్రకటించినా నమ్మవద్దన్నారు. తనకు కూడా ఒలింపిక్ అసోసియేషన్‌లో ఎలాంటి పదవులు లేవని, ఒలింపిక్ సంఘం అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. స్పోర్ట్స్ కోడ్ పాటించకుండా పట్ట్భారామ్ ప్రకటించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక చెల్లదని, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) నుండి పరిశీలకులు రాకుండా ఎన్నిక చెల్లదన్నారు. జిల్లా కబడ్డీ సంఘానికి గుర్తింపు రాదని, పట్ట్భారామ్ బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. పట్ట్భారామ్ ప్రకటించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్‌కు గుర్తింపు తెస్తే క్రీడారంగ జీవితం నుండి తప్పుకుంటానని, లేనిపక్షంలో ఆయన రాజకీయ జీవితం నుండి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహించే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎన్నికల్లో కేపీ రావ్ ప్యానల్ పోటీ చేస్తుందని, స్పోర్ట్స్ కోడ్ ప్రకారం ఎన్నిక జరగాలని, తమ ప్యానల్ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోండి
* వెంటనే సిబ్బంది వేతనాలు సవరించండి * చైర్మన్, ఎండీకి జేఏసీ నేతల వినతి
విజయవాడ (సిటీ), జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఆర్టీసీ హౌస్‌లో సోమవారం ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబును కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆర్టీసీలో రోజురోజుకూ పెరుగుతున్న నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే ఈ నష్టాన్ని భరించి ఆర్టీసీని ఆదుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఎన్‌జీవోల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా రిటైర్‌మెంట్ వయస్సును 60ఏళ్లకు పెంచాలన్నారు. వేతనాల సవరణ గడువు దాటి 21నెలలు అయినందున వెంటనే 50శాతం ఫిట్‌మెంటు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు, జిలానీ బాషా, వీ వరహాలనాయుడు, సీబీఎస్ రెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.