విజయవాడ

ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: రాష్ట్రంలో ఇక పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఐదుకోట్ల మంది ప్రజానీకానికి నాణ్యమైన కార్పోరేట్ వైద్యం అందబోతున్నది. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏర్పాటుచేసిన డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవలే ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం, పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇక తెల్లకార్డుదారులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఎటూ డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ లభిస్తూనే వుంది. ఈ మూడు పథకాల్లోనూ లబ్దిపొందలేని వారి కోసం చంద్రబాబు నూతన సంవత్సరం ఆరంభంలో ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి కుటుంబంలోని పిల్లల నుంచి పెద్దల వరకు ఒక్కొక్కరికి కేవలం రూ.1200లు చెల్లించి దరఖాస్తు చేసుకోటం ద్వారా హెల్త్‌కార్డు పొందవచ్చు.
ఈ సరికొత్త పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఆన్‌లైన్‌లో తమ ఆధార్ నెంబర్లతో రిజిస్టర్ చేసుకోగా ప్రారంభోత్సవ వేదికపై ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్వయంగా సిఎంకు హెల్త్‌కార్డు అందజేసారు. దరఖాస్తు, ఇతర వివరాల కోసం టోల్‌ఫ్రీ 104 లేదా 833817469 ఫోన్ నెంబరు ద్వారా అన్ని రకాల వివరాలు తెలుసుకోవచ్చు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎన్‌టిఆర్ వైద్యసేవ డాట్ ఎపి డాట్ జివోవి డాట్ ఇన్ వెబ్‌సైట్ లేదా సమీపంలోని మీసేవ కార్యాలయాల ద్వారా ఫిబ్రవరి 28 తేదీలోపు ప్రీమియం చెల్లించవచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఫిబ్రవరి 28తర్వాత కొత్తగా పెళ్లైన భార్య లేదా భర్తను మరియు పుట్టిన పిల్లలను మాత్రమే కుటుంబం కింద చేర్చుకోటానికి అవకాశం వుంది. పుట్టిన పిల్లలను పథకంలో చేర్చే నెల నుంచి బీమా గడువు ముగిసే చివరి నెల వరకు నెలకు రూ.100లు చొప్పున మొత్తం చెల్లించాల్సి వుంటుంది.
ఇక ఈ ఆరోగ్యరక్ష కార్డు ద్వారా ఏప్రిల్ 1వ తేదీ నుంచి డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవలో అనుమతి పొంది ఉన్న ఆసుపత్రుల్లో 1044 వ్యాధులకు సెమీ ప్రైవేట్ వార్డు ‘ఏసి’లో వైద్యం పొందవచ్చు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రూ.2లక్షల వరకు వైద్య సహాయం పొందవచ్చు వైద్యం పొందుతున్న సమయంలో ఎలాంటి డబ్బు చెల్లించనవసరం లేకుండా డాక్టర్‌ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, వైద్యంతో పాటు భోజనం, అలాగే డిశ్చార్జి అయ్యేటప్పుడు 11 రోజుల పాటు సరిపడా మందులు లభిస్తాయి. డిశ్చార్జ్ అయిన తర్వాత నిర్ధారించబడిన 138 రకాల వ్యాధులకు ఏడాదిపాటు మందులు లభిస్తాయి.
ప్రకాశం బ్యారేజి వద్ద వ్యాయామంతో పాటు మ్యూజిక్
ప్రజారోగ్యం కోసం రాబోయే కాలంలో ప్రకాశం బ్యారేజి వద్ద వ్యాయామంతోపాటు మ్యూజిక్ కూడా అందుబాటులోకి తెస్తామని సిఎం చంద్రబాబు చెప్పారు. అక్కడ ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక గంటపాటు వ్యాయామం చేయాలన్నారు. ఎవరికి వారు తమ కోసం తమ ఆరోగ్యం కోసం కూడా ఆలోచించాలన్నారు. గతంలో ఎక్కువ పండుగలు వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అందరూ భావించారు. అయితే ఎన్ని ఎక్కువ పండుగలు ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యం కోసం అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖను సిఎం అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపి కేశినేని నాని, ఎపి స్వచ్ఛ ఉపాధ్యాయ డాక్టర్ సిఎల్ వెంకట్రావు, ఎన్‌టిఆర్ వైద్యసేవ ట్రస్ట్ సిఇవో రవిశంకర్, మేయర్ కోనేరు, కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.