విజయవాడ

అవును.. ‘పోలీసుపని’ చేస్తున్నారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 19: అవును.. ఇప్పుడు పోలీసులు తమ పని చేసుకోగలుగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జనాన్ని చైతన్యవంతులను చేసే దిశగా భాగస్వామ్యమైన నగర పోలీసుశాఖ గత కొద్దిరోజులుగా ‘ఈవెంట్స్’ నిర్వహణలో బిజీగా గడిపేసింది. దీంతో నగర పోలీసుశాఖ దైనందిన విధులు మాత్రం మందకొడిగానే సాగుతూ వచ్చాయి. స్టేషన్ల వారీగా సైతం రొటీన్ పనులు అటకెక్కాయి. ఇక బాస్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు తమ పని చేసుకోలేక అవిశ్రాంతంగా బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యేవారు. ఇందుకు కారణం వివిఐపిల తాకిడి. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరంతరం నగరంలో ఎదొక కార్యక్రమాలకు హాజరవుతూ ఉండటం, మరోవైపు ముఖ్యమంత్రి స్ధాయి నుంచి ప్రభుత్వంలోని ముఖ్య అధికారుల వరకు పాల్గొనే ప్రభుత్వ సమీక్షా సమావేశాలకు సైతం నగరమే విడిదిగా ఉంది. వందల సంఖ్యలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధుల రాకపోకల వాహన కాన్వాయ్‌లతో రహదారులు ట్రాఫిక్ పరంగా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండేవి. దీంతో విఐపిల భధ్రత, బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి విధుల భారం నగర పోలీసుశాఖపైనే ఉండేది. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది తమ రోజువారి విధులు నిర్వహించుకోలేని పరిస్ధితి నెలకొంది. అయితే గత నాలుగైదు రోజుల నుంచి ఈ పరిస్ధితికి వెసులుబాటు లభించిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉండటంతోపాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల తాకిడి లేకపోవడంతో ఇప్పుడు కాస్తంత ఊరట లభించింది. దీంతో బందోబస్తు, భద్రతా, ట్రాఫిక్ విధుల నుంచి దృష్టి మార్చుకున్న నగర పోలీసులు తమ శాఖాపరమైన విధులపై పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. దీనిలో భాగంగా కమిషనరేట్ పరిధిలో ‘కార్డన్ సెర్చ్’ నిరంతరాయంగా కొనసాగుతోంది. మరోవైపు వాహన తనిఖీలు నగరంలో ముమ్మరమయ్యాయి. ప్రజాభద్రతా చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అసాంఘిక శక్తుల కదలికలను పసిగట్టేందుకు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో కమిషనరేట్ మొత్తం అప్రమత్తమైంది. గత రెండురోజులుగా కంకిపాడు, పునాదిపాడు, గన్నవరం, కొత్తపేట, కృష్ణలంక తదితర పోలీస్టేషన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టిన అధికారులు ఇదే పంధాను కొనసాగిస్తున్నారు. తాజాగా గురువారం కూడా కార్డన్ సెర్చ్ కొనసాగింది. కొత్తపేట పోలీస్టేషన్ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో రెండో దఫా తనిఖీలు షురూ చేశారు. దీంతోపాటు భవానీపురం, పటమట, పెనమలూరు తదితర పోలీస్టేషన్ల పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీలు కూడా చేపట్టారు. రోడ్ల వెంబడి వాహనాలు ఆపి పత్రాలు పరిశీలించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లోని రహదారుల వెంబడి అక్రమంగా వ్యాపారం సాగించేవారిని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. ఇదే ఒరవడి మున్ముందు కూడా కొనసాగుతుందని, కార్డన్ సెర్చ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్పష్టం చేశారు. దీనిపట్ల నగర ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది.