తూర్పుగోదావరి

వాలీబాల్ టోర్నీ విజేతలు విశాఖ, కృష్ణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, నవంబర్ 29: రాజమండ్రిలో జరిగిన రాష్టస్థ్రాయి సీనియర్ వాలీబాల్ పోటీల్లో విశాఖపట్నం, కృష్ణా జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో విశాఖపట్నం, మహిళల విభాగంలో కృష్ణా జట్లు విజయం సాధించాయి. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో గత నాలుగు రోజులుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించిన ఈ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో విశాఖపట్నం జట్టు 3-1 సెట్ల తేడాతో పశ్చిమగోదావరి జట్టుపై విజయం సాధించింది. మహిళల విభాగం ఫైనల్స్‌లో కృష్ణా జట్టు విశాఖపట్నం జట్టుపై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. పురుషుల విభాగంలో నెల్లూరు, మహిళల విభాగంలో కర్నూలు జట్లు తృతీయస్థానంలో, అలాగే పురుషుల విభాగంలో శ్రీకాకుళం, మహిళల విభాగంలో పశ్చిమగోదావరి జట్లు 4వ స్థానంలో నిలిచాయి. పురుషుల విభాగంలో 3వ స్థానం కోసం జరిగిన పోటీలో నెల్లూరు జట్టు 3-1 తేడాతో శ్రీకాకుళంను, మహిళల విభాగంలో కర్నూలు జట్టు 3-0తేడాతో పశ్చిమగోదావరి జట్టును ఓడించాయి. విజేతలకు రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం బహుమతులు, సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు.

చిన్నారితో సహా మహిళ ఆత్మహత్య
కొత్తపేట, నవంబర్ 29: పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుండటం, అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేని ఒక మహిళ తన 11 నెలల చిన్నారితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తపేట మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొత్తపేట బాబులు కాలనీకి చెందిన నక్కా వెంకటరమణ (21), 11 నెలల ప్రసన్న మృతిచెందారు. వెంకటరమణ మృతదేహం లభ్యం కాగా చిన్నారి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సిఐ రమణ తెలియజేశారు. మండల పరిధిలోని కండ్రిగ శివారు అల్లపల్లివారిపాలెంకు చెందిన వెంకటరమణకు వాడపాలెంకు చెందన నక్కా నాగరాజుతో 2014 మార్చి 19 వివాహం అయింది.. వివాహం సందర్భంగా రెండు లక్షల వరకూ కట్నం ఇచ్చారు. 2014 డిసెంబర్ 18న ప్రసన్న జన్మించింది. కొద్ది రోజులు వీరి కాపురం సజావుగా సాగినా అనంతరం అదనపు కట్నం కోసం భర్త నాగరాజుతో పాటు మామ ఆంజనేయులు, అత్త రమణ, ఆడపడుచు దుర్గ, మరిది శ్రీనివాస్ వేధించసాగారు. ఈ నెల 23న కార్తీక పౌర్ణమి నోముల కోసం వెంకటరమణ పుట్టింటికి వచ్చింది. వెంటనే ఆమెను పంపమని, లేదంటే ఇక ఇంటికి రావాల్సిన అవసరం ఉండదని పెదమామ యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, అతని భార్య కాంతమ్మ ఫోన్ ద్వారా హెచ్చరించటంతో శనివారం సాయంత్రం వెంకటరమణను పలివెల వంతెన వద్ద మోటారు సైకిల్‌పై ఆమె బంధువు వదిలి వెళ్లాడు. అయితే అటు అత్తింటికి వెళితే కట్నం కోసం వేధిస్తారని, ఇటు పుట్టింటికి వెళితే వారికి భారమవుతానని భావించిన ఆమె పలివెల లాకుల వద్ద కుమార్తెతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి తన భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేయగా విషయం తెలుసుకున్న పుట్టింటివారు వెంకటరమణ కోసం వెతకగా లాకుల వద్ద ఆమె బ్యాగ్ కనిపించింది. దీంతో అమలాపురం ప్రదాన పంటకాల్వలో వెతకటం ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆమె మృతదేహం పలివెల వంతెన సమీపంలో లభించింది. అయతే చిన్నారి ప్రసన్న మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. దీనిపై మృతురాలి సోదరుడు నలా సీతారాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నాగరాజు, అత్తమామ, రమణ, ఆంజనేయులు, ఆడపడుచు దుర్గ, మరిది శ్రీను, పెదమామ యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, అతని భార్య కాంతమ్మలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ రమణ తెలిపారు. ఈ కేసును అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య విచారణ చేయనున్నట్టు ఆయన తెలిపారు.
సత్యదేవుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
శంఖవరం, నవంబర్ 29: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారిని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి బి శివ శంకరరావు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఇఒ కాకర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత జడ్జి శివశంకరరావుకు పండితులు వేదాశీర్వచనం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనరు ఇవి జగన్నాధరావు, పర్యవేక్షణాధికారి కృష్ణారావు, ప్రొటోకాల్ ఆర్‌ఐ భాస్కరప్రసాద్ పాల్గొన్నారు.
రామచంద్రపురం: కోటిపల్లిలోని శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయాలను హైకోర్టు జడ్జి శివశంకరరావు ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఆలయాల వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారులు కె రామచంద్రరావు, పెండ్యాల వెంకట చలపతిరావు, ఆలయ అనువంశిక అర్చకస్వాములు న్యాయమూర్తి శివశంకరరావుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జస్టిస్ శివశంకరరావు నిర్వహించుకున్నారు. ద్రాక్షారామ బేడా మండపంలో జస్టిస్ శివశంకరరావుకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. రామచంద్రపురం సిఐ పచ్చా కాశీవిశ్వనాధ్ నేతృత్వంలో ఎస్సైలు దుర్గారావు, కోట వంశీధర్ బందోబస్తు నిర్వహించారు.

కాపులను బిసిల్లో చేర్చేందుకు త్వరలో కమిషన్
సామర్లకోట, నవంబర్ 29: ఎన్నికల హమీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో కాల పరిమితితో కూడిన బిసి కమిషన్‌ను ఏర్పాటు చేసి నివేదిక వచ్చిన తరువాత కాపులను బిసిల్లో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో పట్టణ కాపు యువజన సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ కార్మిక నాయకుడు దవులూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి చినరాజప్ప, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జగ్గంపేట ఎమ్మెల్యే, జిల్లా వైసిపి అధ్యక్షుడు జ్యోతుల నెహ్రు, వైసిపి పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తోట సుబ్బారావునాయుడు, మాజీ ఎమ్మెల్యే పంతం వెంకట గాంధీమోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాపులను బిసిల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. బిసి వర్గాల రిజర్వేషన్లకు ఎటువంటి ఆటంకం లేకుండా రిజర్వేషన్ శాతం పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. తొలుత ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడుతూ ఎన్నికల ముందు టిడిపి, వైసిపిలు సంయుక్తంగా కాపులను బిసిల్లో చేర్పిస్తామని హమీలు ఇచ్చిన దృష్ట్యా, ప్రస్తుతం ఆ మాటకు కట్టుబడి అధికార, విపక్షాలు త్రికరణ శుద్ధితో బిసి రిజర్వేషన్ సాధనకు కృషిచేయాలన్నారు. దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ సామర్లకోటలో కాపుల కల్యాణ మండప నిర్మాణానికి స్థలం కేటాయించాలని మంత్రి రాజప్పను కోరగా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా దవులూరి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఏడాది 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన పది మంది కాపు విద్యార్థులకు రూ.1000 చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పంతం వెంకట గాంధీమోహన్, మంత్రి చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్, కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, కాపు యువజన సేవా సమితి అధ్యక్షుడు డోలంకి వీరభద్రరావు, నాయకులు దూది రాజుబాబు, ఆకుల పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

క్షుద్రపూజలు అపోహ మాత్రమే
అనపర్తి, నవంబర్ 29: అనపర్తి మండలం కుతుకులూరులో క్షుద్రపూజల కలకలం కేవలం అపోహగానే మిగిలింది. కుతుకులూరు దళితపేట శివారు గరువును చేర్చివున్న వ్యవసాయ క్షేత్రం వద్ద క్షుద్రపూజలు జరిగాయని గ్రామంలో కొనసాగిన ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. గరువును చేర్చివున్న క్షేత్రం వద్ద క్షుద్రపూజలు చేసి బాలుడిని బలి ఇచ్చారనే ఆ ప్రాంతవాసుల భయాందోళన నేపథ్యంలో ఆదివారం అనపర్తి తహసీల్దారు రియాజ్ హుస్సేన్, ఎస్సై కిశోర్‌బాబు పర్యవేక్షణలో జెసిబితో తవ్వకాలు జరిపారు. అయితే గొయ్యి తీసిన ప్రాంతంలో ఏ విధమైన ఆధారాలు లభించలేదు. ఈ సమయంలో సంఘటనా స్థలికి చేరుకుని సిఐ రాంబాబు ఫిర్యాదుదారులను పిలిచి ఇంకా మీకు అనుమానాలున్నాయా అని ప్రశ్నించారు. దీనికి సమాధానం లేకపోయింది. అనంతరం సిఐ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల అనుమానాలు తీర్చేందుకే తవ్వకాలు జరిపామన్నారు. ఇదిలావుండగా సిఐ రాంబాబు స్థల యజమాని కె వెంకటరెడ్డిని గోతులు తీసిన వ్యవహారంపై ప్రశ్నించగా ప్రభుత్వం మంజూరు చేసే మరుగుదొడ్డి నిర్మాణానికి వాస్తు రీత్యా గోతులు తీశానన్నారు. అయితే పన్ను రశీదు లేకపోవడంతో మరుగుదొడ్డి మంజూరు చేయలేమని అధికారులు చెప్పడంతో గొయ్యి తిరిగి పూడ్చివేశానన్నారు.

ఆకతాయిల అడ్డాగా రాయవరం హైస్కూలు
రాయవరం, నవంబర్ 29: రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం ఆకతాయిలకు, మందుబాబులకు నిలయంగా మారింది. పాఠశాల చుట్టూ ప్రహారీ లేకపోవడంతో రాత్రి వేళల్లో మందుబాబులు మైదానంలో బెంచీలపై మద్యం సేవించి, సీసాలను పగలకొట్టి చిందరవందరగా పడేస్తున్నారు. ఆకతాయిలు పాఠశాల తరగతి గదుల తలుపులు, కిటికీలు పగలకొట్టి అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. గ్రామస్థుల సహకారంతో ఇటీవల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో వాకింగ్‌కు ఉపయోగపడేలా ట్రాక్ చుట్టూ లైట్లు ఏర్పాటుచేశారు. అయితే ఆకతాయిలు వారి కార్యకలాపాలకు అనువుగా లైట్ల ఫీజులు పీకేస్తున్నారు. దీంతో వాకర్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణలో పోలీసు నిఘా ఉంచి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

నెల్లిపూడి శివాలయం 12వ శతాబ్దం నాటిది
శంఖవరం, నవంబర్ 29: మండలంలోని నెల్లిపూడి గ్రామంలో గల పూజారి జగ్గమ్మ చెరువు సమీపాన ఉన్న శివాలయం 12వ శతాబ్దం నాటికి చెందినదని, ఇది చారిత్రాత్మకమైనదిగా ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు గ్రహీత మెరపల నారాయణరావు తెలిపారు. నెల్లిపూడి గ్రామస్థులు కొందరు శివాలయం ఆవరణను, దానికి చెందిన భూమిని ఆక్రమించుకోగా, మూడు రోజుల క్రితం గ్రామస్థులు శిధిల స్థితిలో ఉన్న శివాలయాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులకు, గ్రామస్థులకు ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసులు కలుగజేసుకున్నారు. పోలీసుల సహాయంతో సుమారు 50 సెంట్లు భూమిని ఖాళీ చేయించారు. దీంతో మాజీ సర్పంచ్ పిర్ల నాగేశ్వరరావు, చారిత్రక పరిశోధకులు మెరపల నారాయణరావు ఆదివారం శివాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ఉన్న విగ్రహాలను పరిశీలించగా విగ్రహాలకు వెనుక భాగంలో ఉన్న శాసనాలను బట్టి ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. నాటి కాలంలో చోళుల రాజ వంశానికి చెందిన గుణగ విజయాదిత్యుడు 108 శివాలయాలను స్థాపించినట్టు చరిత్ర తేటతెల్లం చేస్తోందన్నారు. వీటిలో కత్తిపూడి, కొడవలి, బెండపూడి, నెల్లిపూడి వంటి గ్రామాల్లోని శివాలయాలు ఆయన ప్రతిష్ఠించినవేనని పేర్కొన్నారు. నాడు నిర్మించిన శివాలయాలకు విశిష్ఠమైన దైవగుణం ఉంటుందని తెలిపారు. శివలింగం సమీపానే్న ఉన్న వేణుగోపాలస్వామి విగ్రహం పురాతనమైనదే అయినప్పటికీ ఒకే గుడిలో ప్రతిష్ఠించినవి కావని స్పష్టంచేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా తవ్వకాలు జరిపినప్పుడు ఏమైనా శిలాశాసనాలు లభ్యమైతే వాటిని శివాలయంలో భద్రపరచాలని సూచించారు. శివాలయం ముఖద్వార నిర్మాణం అమలిక రాయితో నిర్మితమైనదని, 12వ శతాబ్దంలో ఈ రాయినే అధికంగా ఉపయోగించినట్టు తెలిపారు. ఎంతో విశిష్ఠతతో కూడిన ఈ శివాలయంలో నేటి నుండే దీప, ధూప, నైవేద్యాలు జరపడం గ్రామానికి, ప్రజలకు శ్రేయస్కరమన్నారు. పురాతన శివాలయంగా గుర్తించబడడంతో గ్రామస్థులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.