విశాఖపట్నం

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే లక్ష్యంతో నేవీ చిల్డ్రన్స్ స్కూల్ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్‌ను నౌసేనాభాగ్ నేవీ స్కూల్‌లో శనివారం నిర్వహించారు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం ద్వారా దేశానికి సేవ చేయాలన్న కాంక్షను విద్యార్థి దశ నుంచే యువతలో కల్గించేందుకు నేవీ అధికారులు ఈ ప్రయత్నం చేశారు. నగరంలోని నాలుగు పాఠశాలలతో పాటు మూడు కేంద్రీయ విద్యాలయాలు, నేవీ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ బిల్లుపై విస్తృత చర్చను చేపట్టారు. చట్టసభలో ప్రజోపయోగ బిల్లులపై చర్చ నిర్వహించడం ద్వారా వాటి ప్రయోజనాలు, అనర్ధాలను కళ్లకు కట్టినట్టు వివరిస్తూ విద్యార్థుల హావభావాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సభలో అర్ధవంతమైన చర్చ జరిపిన ముగ్గురు విద్యార్థులకు నేవీ అధికారులు బహుమతులు అందజేశారు. విశాఖ వేలీ పాఠశాలకు చెందిన కె శేషసాయి, నేవీ స్కూల్‌కు చెందిన తుషార్ నీలేకర్, విశాఖ విద్యానికేతన్‌కు చెందిన ఆయుష్ మహంతి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. పార్లమెంట్ సభ్యులు ధరించే దుస్తులు సైతం వారి మనోభావాలను ప్రతిబింబిస్తాయని చాటి చెప్పిన ఎస్‌విఎన్ స్కూల్‌కు చెందిన అమన్ మీనన్‌కు బెస్ట్ డ్రెస్డ్ పార్లమెంటేరియన్ బహుమతిని అందజేశారు. తూర్పు ప్రాంత నేవీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీమా వర్మ ముఖ్యఅతిధిగా పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

విశాఖలో క్రీడా వసతుల కల్పనపై సవతి ప్రేమ

విశాఖపట్నం, నవంబర్ 21: వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు అధికారంలో ఉన్న వారు, సంబంధిత శాఖ మంత్రులు తమ ప్రాంతాలకే ప్రాధాన్యతలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అవసరం, అర్హతలున్నప్పటికీ ఇతర ఇతర ప్రాంతాలపై సవతిప్రేమను చూపుతున్నారు. విశాఖలో క్రీడా వసతుల కల్పనపై ప్రభుత్వం తీరు దీన్ని స్పష్టం చేస్తోంది. సుమారు 20 లక్షల పైచిలుకు జనాభా కలిగి, నవ్యాంధ్రలోనే అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న విశాఖలో క్రీడా వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీన వైఖరిని అవలంభిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా సదుపాయాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే నెలకొల్పిన ప్రభుత్వాలు ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదు. విశాఖను అంతర్జాతీయ స్థాయిలో క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతామని విశాఖ వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు పదేపదే హామీలు ఇవ్వడం మినహా చేసిందేమీ లేదు. విశాఖ పరిధిలో జాతీయ స్థాయి క్రీడాకారులకు కొదవ లేనప్పటికీ వారికి సరైన ప్రోత్సాహం, వౌలిక సదుపాయాల కల్పన మాత్రం కన్పించట్లేదు. నగర పరిధిలో ఇద్దరు శాసనసభ్యులు క్రీడాకారులుగా చిరపరిచితులు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పిజివిఆర్ నాయుడు (గణబాబు) జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు, ఇక ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు కూడా ఒకప్పటి క్రీడాకారుడే. విశాఖపట్నం పోర్టుట్రస్టు ఆధ్వర్యంలో ఒక స్టేడియం ఉండగా, జివిఎంసి ఆధ్వర్యంలో ఒక ఇండోర్ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులో ఉంది. ఎసిఎ, విడిసిఎ స్టేడియం కేవలం క్రికెట్ బోర్డు ఆధీనంలో ఉంది. ఇక జివిఎంసి పరిధిలోని మున్సిపల్ స్టేడియం గత దశాబ్ధ కాలంగా ఎందుకూ పనికిరాకుండా పోయింది. కొనే్నళ్ల పాటు ఈ స్టేడియంను కేంద్ర భద్రతా బలగాలు స్థావరంగా మార్చుకుని విడిది చేశాయి. యంత్రాంగం వత్తిడి మేరకు బలగాలు ఈ స్థావరాన్ని ఖాళీ చేసినప్పటికీ శిధిలావస్థకు చేరిన స్టేడియంలో ఎటువంటి క్రీడా కార్యకలాపాలు సాగే పరిస్థితి లేదు. క్రీడలకు సంబంధించి నగరంలో ఏ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా పోర్టు అధికారులను ప్రాధేయపడాల్సిందే. అయితే నగరంలో అత్యున్నత ప్రమాణాలతో భీమునిపట్నం నియోజకవర్గ పరిధిలో స్టేడియం నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. ఇప్పటికీ ఇది కార్యరూపం దాల్చలేదు.
విశాఖ మున్సిపల్ స్టేడియం మరమ్మతులకు నిధుల లేమి
ఇదిలా ఉండగా విశాఖలో శిధిలావస్థకు చేరుకున్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి తిరిగి క్రీడా పోటీలకు అనుకూలంగా తీర్చిదిద్దే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ విమర్శించారు. విశాఖలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి లేదన్న సమాధానం వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు స్టేడియంల మరమ్మతులకు నిధులు కేటాయించడంతో పాటు మరో రెండు కొత్త స్టేడియంల నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్టు సాక్షాత్తు క్రీడలశాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. క్రీడా మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలో స్టేడియం మరమ్మతులకు రూ.1.5 కోట్లు, విజయవాడ దండమూడి స్టేడియం మరమ్మతులకు మరో 1.5 కోట్లు కేటాయించారని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నూతనంగా స్టేడియం నిర్మాణానికి రూ.2.3 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నూతన స్టేడియం నిర్మాణానికి రూ.2.38 కోట్లు కేటాయించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు రాత పూర్వకంగా తెలిపారన్నారు. ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి జిల్లాలో స్టేడియాల మరమ్మతులకు ప్రాధాన్యత ఇచ్చిన నేతలు విశాఖపై మాత్రం చిన్నచూపు చూస్తున్నారని, ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విశాఖలో క్రీడా సదుపాయాల మెరుగు, వసతుల కల్పనకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.