విశాఖపట్నం

గురివెంద! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్ఛఛీ వ్యవస్థ నాశనమైపోతోంది. ఎక్కడ చూసినా మోసమే. ఎవ్వడిలోనూ నిజాయితీ లేదు. యువత మరీ చెడిపోయింది. ఎవరికీ క్రమశిక్షణ లేదు’’ ఈ సమాజం తీరు తెన్నులను ఏవగించుకుని రోజుకు ఓ పది పదిహేనుసార్లు అనుకోవడం భుజంగరావు మాస్టారుకి అలవాటు. ‘‘జనాల మనస్తత్వాలు బాగుపడతాయనుకోవడం, మంచి రోజులొస్తాయనుకోవడం ఉత్తభ్రమ’’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు క్యూలో తన వెనుక నించున్న వ్యక్తితో. అంత స్పష్టంగా చెప్పాక మాస్టారుకి ఎదురు చెప్పేదేముంది?
‘‘అంతే సార్ చూడండి మనం చచ్చీ చెడీ క్యూలో నిల్చుంటే ఆ యిద్దరూ ఎంచక్కా వచ్చి బిల్ కలెక్టర్‌కి మస్కాకొట్టి ఎంత తొందరగా పని పూర్తి చేసుకున్నారో’’ అన్నాడు వెనుకనున్న పెద్దమనిషి. మాస్టారు క్యూలో పదవవాడు. చిరాకేసి సరాసరి బిల్‌కలెక్టర్ దగ్గరికి వెళ్లి దబాయించాడు. ‘‘మాస్టారు! కోప్పడకండి. ఇలా ఇవ్వండి డబ్బులు, బిల్లూ’’ అంటూ పని అవ్వగొట్టాడు బిల్ కలెక్టర్. అటు నుండి మాస్టారు ఆటో స్టాండ్ వైపు నడుచుకుంటూ దారి పొడుగునా తెలిసిన వాళ్లందరిని పలకరిస్తు అడగకపోయినా అందరికి ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ ఆటో స్టాండ్‌కు చేరుకున్నాడు. ఈయన పని చేసే పాఠశాల పాచిపెంటలో ఉంది. ఆ సమయంలో ఆ ఊరు వెళ్లాలంటే ఆటోయే దిక్కు. కనీసం ఎనిమిది మంది ఎక్కనిదే ఆటో బయలుదేరదు. కనుక మాస్టారు ఆల్రెడీ నలుగురు కూర్చున్న ఆటోలోకి ఎక్కాడు. అప్పటికే సమయం పావుతక్కువ పది గంటలయింది. మాస్టారికి సీటు బాగానే ఉంది. ఆటో డ్రైవర్‌కి సంతృప్తిగా ఎనిమిది టిక్కెట్లు అయ్యాయి. ఇక ఆటో బయలుదేరింది. ఆటోలో అందరూ ఒక మోస్తరు పల్లెటూరు జనాలే. ఒకాయన మాత్రం నీట్‌గా చదువుకున్న వాడిలా ఉన్నాడు. మాస్టారు చేతిలో పేపర్ తీసి వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ‘‘్ఛఛీ పేపర్ నిండా మోసాలు, కుంభకోణాలు, దారుణాలే. అసలు మన నాయకులు మహా మాయగాళ్లు’’ అంటూ తనదైన తీరులో ఉపన్యాసం ఇస్తున్నాడు. అందరూ మాస్టారి మాటల్లి చక్కగా వింటున్నారు. అక్కడున్న చదువుకున్న వ్యక్తి చిన్న చిర్నవ్వు నవ్వాడు. మాస్టారు మాట్లాడుతూ ఉంటే స్కూల్ వచ్చేసింది. వాచ్ చూసుకున్నాడు సమయం పదిన్నరయింది. తను లేట్‌గా వచ్చినా ప్రశ్నించే ధైర్యం స్కూల్లో ఎవరికీ లేదు. వచ్చీ రావడంతోనే పదవ తరగతిలోకి వెళ్లి పాఠం మొదలుపెట్టాడు. ‘‘మాస్టారు! అటెండెన్స్ వేయలేదు’’ అంటూ వెనుక బెంచీ నుండి ఒక పిల్లాడు అరిచాడు. ‘‘సరే.. సరే’’ అంటూ అటెండెన్స్ పిలవడం పూర్తయ్యేసరికి ఆ పీరియడ్ బెల్ మ్రోగింది. ‘‘ఒరేయ్ అబ్బాయిలూ! మిగిలిన పాఠం రేపు చెప్పుకుందాంరా’’ అంటూ బయటికి కదిలాడు. ‘ఇవాళ ఏం చెప్పారని మిగిలింది రేపు చెపుతానంటున్నారు?’ అన్నట్టుగా మొదటి బెంచీలో పిల్లలు ఒకర్నొకరు చూసుకున్నారు. మాస్టారు క్లాస్ బయటికి రాగానే ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఈయనో యూనియన్ లీడర్ కదా మరి చక్కగా వివరణ ఇచ్చాడు. అర్థగంట సేపు సాగింది ఆ వివరణ. ఫోన్ జేబులో సర్దుకుంటూ ఎదురు భవనం వరండాలో ఇందాక తనతో ఆటోలో వచ్చిన వ్యక్తి అటూ ఇటూ తిరగడం చూసి.... ‘‘హలో! ఏం పనిమీద వచ్చారు మీరు?’’ అని గట్టిగా అడిగాడు. ‘‘ఏం లేదు సార్ ఆఫీస్ పని మీద వచ్చాను’’ అన్నాడు. ‘‘సరే అదిగో ఆ రూమ్‌లో హెడ్ మాస్టారుంటారు కలవండి’’ అని సలహా ఇచ్చారు మాస్టారు. మళ్లా మాస్టారికి మరొక ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడుతూ ఉండగా అటెండర్ గబగబా వచ్చి ‘‘మాస్టారూ! మీరు టీచర్స్ రిజిష్టర్‌లో సంతకం పెట్టలేదట. హెడ్‌మాస్టారు రమ్మంటున్నారు’’ అన్నాడు. ‘వెధవది, డ్యూటీలో పడితే ఇలాంటి స్వవిషయాలు మరచిపోతాను’ అనుకుంటూ హెడ్మాస్టర్ రూమ్‌వైపు నడిచాడు.
హెడ్మాస్టర్, ఇందాక తనతో వచ్చిన వ్యక్తిని తన కర్చీలో కూర్చోపెట్టి చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. భుజంగరావు మాస్టారు ‘ఎవరీయన’ అనే సందేహించే లోపు హెడ్‌మాస్టర్ ‘‘్భంజగరావు మాస్టారూ! ఈయన మన జిల్లాకి కొత్తగా వచ్చిన డిప్యూటీ డియిఒగారు’’ అని పరిచయం చేశారు. వెంటనే డిప్యూటీ డిఇఒగారు ‘‘నేను మాస్టారు ఆటోలో గమనించాను. ఈ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల పట్ల చాలా చక్కగా మాట్లాడారు. అవినీతి అంటే మీకు అస్సలు కిట్టదు కాబోలు’’ అన్నాడు.
అతని మాటలకి మాస్టారు ఏం మాట్లాడాలో తోచక వౌనంగా ఉండిపోయారు.
‘‘మాస్టారూ! నాకు తెలియక అడుగుతున్నాను, తమరు పాఠశాలకు వచ్చే సమయం న్యాయంగా ఉందా? పిల్లలకు పాఠాలు చెప్పడం మాని ఫోన్‌లో ముచ్చట్లు చెప్పుకోవడం ధర్మంగా ఉందా? మీరు గురువులు. గురువులుగా ఉండండి - గురివెంద గింజలాకాదు. అంటూ వ్యంగ్యంగా చురక పెట్టాడు డిప్యూటీ డిఇఒ.

***

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- చావలి శేషాద్రి సోమయాజులు పాచిపెంట చరవాణి: 9032496575.