విశాఖపట్నం

స్మార్ట్‌గా కబ్జాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 29: భూ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. విలువైన భూములు కోట్లు పలకడంతో వాటికి రెక్కలొచ్చేస్తున్నాయి. రాత్రికి రాత్రే నిర్మాణాలు జరిగిపోతున్నాయి. విశాఖ నగరం స్మార్ట్‌సిటీగా ప్రకటించిన తరువాత ఆక్రమణలు మరింత అందుకుంది. దీనికి ఆక్రమణలు శాపంగా మారుతున్నాయి. ఇష్టానుసారంగా వెలుస్తోన్న ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేక వుడా, జివిఎంసిలు చేతులెత్తెస్తున్నాయి. ఫిర్యాదులను సైతం బుట్టదాఖలు చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటికి రక్షణ కల్పించే క్రమంలోను రెవెన్యూ కనీస చర్యలు తీసుకోవడంలేదు. దీంతో వీటికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నగర శివారు ప్రాంతాలైన మధురవాడ, కొమ్మాది, కాపులుప్పాడ, మారికవలస, బోయిపాలెం, రేవళ్ళపాలెం, బక్కన్నపాలెం, పోతినమల్లయపాలెం, వాంబేకాలనీ, అంబేద్కర్‌నగర్, ఎండాడ తదితర ప్రాంతాల్లో కోట్ల విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నాయి. యదేచ్ఛగా జరుగుతోన్న ఆక్రమణ భూములు అసలు ప్రభుత్వ రెవెన్యూ భూములా? వుడాకు చెందినవా? లేదంటే జివిఎంసి పరిధిలోకి వస్తాయా? పేదల పట్ట్భాములా? అనే అంశాలపై స్పష్టత లేకుండాపోతోంది. ఇందులో ఏ ఒక్కరూ తమకు చెందిన భూములుగా తేల్చుకోలేకపోతున్నారు. ఇది కూడా ఆక్రమణల జోరుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించి మాస్టర్ ప్లాన్ కలిగి ఉండే భూములు సైతం కబ్జాలకు గురవుతున్నాయి. ఈ విధంగా క్రికెట్ స్టేడియం సమీపానున్న పిఎంపాలెం ఆర్‌హెచ్ కాలనీ వద్ద 60 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో ఉన్నా దీనిని ఆక్రమించేశారు. ఇక్కడ అనేక నిర్మాణాలు జరిగిపోతున్నాయి. యంత్రాలతో చదునుచేసే కార్యక్రమం వేగవంతమైంది. అయినా జివిఎంసి, రెవెన్యూ తరపున ఏ ఒక్కరూ దీనిపై చర్య తీసుకోపోవడం వెనుక అధికార పార్టీ నేతల వత్తిళ్ళు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అదే పేదలు పాకలు వేసుకుంటే పోలీసు బంద్‌బస్త్‌తో క్షణాల్లో తొలగించే యంత్రాంగం ఇపుడు ఏమైందంటూ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పోలీసు కేసుల్లో ఇరుకున్న నేత ఒకరు దీనికి సూత్రదారునిగా వ్యవహరిస్తున్నందునే రెవెన్యూ, జివిఎంసి అధికారులే ఒక్కరూ ఈ ఆక్రమణల జోలికి రావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేడియం పక్కగా పిఎంపాలెం మీదుగా గిరిజన ప్రాంతమైన శంభువానపాలెం, దబ్బందల ప్రాంతాల ద్వారా సింహాచలంనకు 60 అడుగుల రోడ్డు నిర్మాణం మాస్టర్ ప్లాన్‌లో ఉంది. అయితే ఈ మార్గంలో ఒకటి, రెండుచోట్ల ఆక్రమణలు వెలిసాయి. 2014 అక్టోబర్ 12వ తేదీన హుదూద్ తుపాన్‌తో నిరాశ్రయులైన స్థానిక కాలనీవాసులు తాత్కాలికంగా అప్పట్లో పాకలు వేసుకుని తలదాచుకున్నారు. వీటికి ఎటువంటి అధికారిక ఆదేశాల్లేవు. వీటిని అడ్డం పెట్టుకుని ఒకరిద్దరు నేతలు ఆక్రమణలకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. ఇదే తరహాలో పరిసర ప్రాంతాల్లో అనేకచోట్ల ఆక్రమణలు జోరందుకుంటున్నాయి. కాగా స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతోన్న విశాఖ నగర శివారు ప్రాంతాల్లో వెలుస్తోన్న కబ్జాలు, కోట్ల విలువైన భూముల ఆక్రమణల సంఘటనల్లో ఆయా శాఖల అధికారులు, నేతల అండ ఉన్నందునే వీటిపై చర్యలుండటంలేదని స్థానికులు అంటున్నారు.

ఆరిలోవ స్టేషన్ వద్ద హైడ్రామా!

విశాఖపట్నం (క్రైం), మార్చి 29: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న పార్థసారథి వ్యవహారంలో మంగళవారం హైడ్రామా కొనసాగింది. పార్థసారథి ఆత్మహత్యకు కారణమైన యువతిపై చర్యలు తీసుకోవాలంటూ అతని బంధువులు, స్థానికులు నగరంలోని ఆరిలోవ పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. పార్థసారథి మృతదేహాన్ని స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. మంగళవారం పార్థసారథి పుట్టినరోజు కావడంతో అక్కడే కేక్ కోసి స్టేషన్‌పైకి విసిరేసి నిరసన తెలిపారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఈస్టు ఎసిపి ఆర్.రమణ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవలోని పాండురంగపురానికి చెందిన వి.పార్థసారధి
ఉషొదయ జంక్షన్‌లోని చాకలిగెడ్డ ప్రాంతంలోని యువతిని ప్రేమించాడు. ప్రేమవ్యవహారం బెడిసి కొట్టడంతో అతనిపై యువతి 3వ పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పార్థసారథి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన మృతికి యువతే కారణమని, ఆమెను ఎవరూ నమ్మవద్దని, తన మృతదేహానికి ఆమె ఎదురుగానే దహన సంస్కరాలు నిర్వహించాలని పార్థసారథి సూసైడ్ నోట్టులో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా పార్థసారథి మృతదేహానికి సోమవారం ఉదయం కెజిహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు, పాండురంగపురం వాసులు సుమారు రెండు వేల మంది ఉరేగింపుగా మృతదేహంతో మధ్యాహ్నం ఆరిలోవ పోలీసుస్టేషన్ ముట్టడించారు. మృతదేహాన్ని స్టేషన్ ముందు ఉంచి ఆందోళనకు దిగారు. కేక్ కోసి స్టేషన్‌పైకి విసిరేశారు. పార్థసారధి మృతికి కారణమైన యువతిని శ్మశాన వాటికకు పిలిపిస్తే ఆమె ఎదురుగా దహన సంస్కారాలు నిర్వహిస్తామని, అంతవరకు కదిలేది లేదని వారు పట్టుబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సిఐ ధనుంజయనాయుడు, స్టేషన్ సిబ్బంది రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఈస్టు ఎసిపి ఆర్.రమణ, పిఎంపాలెం సిఐ అప్పలరాజు స్టేషన్‌కు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్థసారధి ఆత్మహత్యకు కారణమైన యువతిని అదుపులోకి తీసుకున్నామని, శ్మశానవాటికకు పంపించడం కుదరదని సర్దిచెప్పారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందేలా చూస్తామని ఎసిపి రమణ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించి అక్కడ నుండి మృతదేహంతో వెనుదిరిగారు. దీంతో పరిస్థితి సర్దుమణిగింది. కాగా బుధవారం ఉదయం పార్థసారథి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తుఏర్పాటు చేశారు.

అక్రమ కట్టడాలు కూల్చివేత

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 29: ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు చేపట్టేసినా జివిఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం చూస్తూ ఉండిపోయింది. స్థలం ఎవరిదైనా తన పరిధిలో అనుమతుల్లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని నిలపాల్సిన టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు ఉన్నతాధికారుల వౌఖిక ఆదేశాలతో వౌనం వహించారు. అనధికార నిర్మాణం కూల్చివేసే యంత్రాగం తమ వద్దలేదు కాస్త సహకరించమన్నా పట్టించుకోనట్టే నటించారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు పరస్పరం మాట్లాడుకుని అక్రమణ దారుల ఆటకట్టించారు. ఇక చేసేదేమీ లేక జివిఎంసి టౌన్‌ప్లానింగ్ విభాగం కూల్చివేతలో తనూ ఉన్నానంటూ ఒక చేయివేసింది. కొద్ది రోజల కిందట ‘అనుమతులా అక్కర్లేదు’ శీర్షికన ఆంధ్రభూమిలో కథనం ప్రచురితమైంది. దీనిపై వారం రోజుల పాటు అధికారుల మధ్య వాదనలు నడిచిన తర్వాత తీరిగ్గా స్పందించి, మంగళవారం నిర్మాణాన్ని నేలమట్టం చేశారు.
అసలు విషయం పరిశీలిస్తే జివిఎంసి జోన్ 6 పరిధి 72వ వార్డు పరిధిలో కొద్ది రోజులుగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న భవనాన్ని వుడా అధికారుల పర్యవేక్షణలో జివిఎంసి సిబ్బంది మంగళవారం కూల్చివేశారు. మూడు దశాబ్ధాల కిందట విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) సేకరించిన స్థలం రైతులు, దేవస్థానం మధ్య వివాదం కారణంగా ఖాళీగా ఉంది. సింహాచలం గోశాల నుంచి వేపగుంట జంక్షన్‌కు వెళ్లే రహదారిని ఆనుకుని వుడా సేకరించిన స్థలంపై కబ్జాదార్ల కన్నుపడింది. ఇంకేముంది నిర్మాణానికి శ్రీకారం చుట్టేశారు. సుమారు 300 చదరపు గజాల స్థలంలో నిర్మాణం చేపట్టిన ఆక్రమణ దార్లు జివిఎంసి టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ఆవైపు కనె్నత్తి చూడకుండా కట్టడి చేయగలిగారు. జోన్‌ల్ స్థాయి ఉన్నతాధికారి హామీతో నిర్భీతిగా నిర్మాణం పూర్తి చేస్తున్న తరుణంలో కొంతమంది జివిఎంసి కమిషనర్, చీఫ్ సిటీప్లానర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటి నిర్మాణం జరుగుతున్న భూమి తమ పరిధిలోది కాదని, వుడా సేకరించిన స్థలంగా పేర్కొంటూ జోన్ పరిధిలోని టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమనిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఇదే సందర్భంలో స్థానికులు వుడా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. వుడా సేకరించిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవాలని వుడా అధికారులు కోరినప్పటికీ జోన్ ఉన్నతాధికారి జోక్యం కారణంగా టౌన్‌ప్లానింగ్ అధికారులు తప్పించుకున్నారు. చివరకు పెద్ద స్థాయిలో అధికారులు చర్చించిన మీదట వుడా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో టౌన్ ప్లానింగ్ వార్డు బిల్డింగ్ ఇనస్పెక్టర్, బిల్డింగ్ డిమాలిషింగ్ స్క్వాడ్ సహకారంతో కూల్చివేశారు. అనధికార నిర్మాణం ఏ కోణంలో జరిగినా అడ్డుకోవాల్సిన జివిఎంసి యంత్రాంగం ఈ విషయంలో ఆక్రమణదార్లకు సహకరించేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వుడా అధికారులు మాత్రం పట్టువిడవ కుండా జివిఎంసి కమిషనర్ తదితరులతో చర్చించి, స్థానికంగా జివిఎంసి టౌన్‌ప్లానింగ్ సిబ్బందిని కూల్చివేతలో భాగస్వామ్యం చేశారు.

సింహాచలానికి

రాత్రి సర్వీసులు లేక భక్తుల ఇక్కట్లు
విశాఖపట్నం, మార్చి 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలానికి రాత్రి ఎనిమిది గంటలు దాటితే ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరగడం లేదు. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, అన్నవరం దేవస్థానాలను దర్శించుకుని నేరుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులంతా తరలివస్తుంటారు. రైళ్ళు, బస్సుల ద్వారా వచ్చే భక్తులు ఆర్టీసీకాంప్లెక్స్, విశాఖ రైల్వేస్టేషన్ నుంచి నేరుగా సింహాచలం కొండపైకి వెళ్ళేందుకు నిరీక్షిస్తుంటారు. వీరందరికీ పగలు కొంతవరకు బస్సుల సౌకర్యం ఉంటుంది. రాత్రిళ్ళు మాత్రం సిటీ సర్వీసులు నడపటం లేదు. దీనివల్ల రేయింబవళ్ళు అనే తేడా లేకుండా బస్సులు ఉంటాయనే ఆలోచనతో వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆటోలను ఆశ్రయించే భక్తులు దోపిడికి గురవుతున్నారు. దైవ దర్శనానికి ముందే జేబులకు చిల్లు పడుతున్నాయి. భక్తులతోపాటు, పర్యాటకులకు ఇదే సమస్యలు. ప్రపంచ పటంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన విశాఖ నగరానికి చేరుకునే భక్తులకు రాత్రిళ్ళు సింహాచలం వెళ్ళేందుకు సరైన సిటీ సర్వీసులు లేకపోవడంతో భక్తులకు రవాణాపరంగా సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే మధ్యాహ్న సమయంలోను కొన్ని బస్సులు డిపోలకు సరెండర్ చేస్తున్నందున భక్తులు సింహాచలం కొండపైకి ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తోంది. గత కొంతకాలంగా ఎంవిపి కాలనీ-సింహాచలం మధ్య నడుస్తోన్న 540నెంబర్ సిటీ సర్వీసులు తగ్గిపోయాయి. ఈ విధంగా సింహాచలంనకు వెళ్ళే బస్సులు సరిగా నిర్వహించకపోవడంతో ప్రయాణికులు, భక్తులకు నిత్యం అవస్థలు తప్పడంలేదు. మర్రిపాలెం పిఎఫ్ కార్యాలయం వద్దనే ఇఎస్‌ఐ, పాస్‌పోర్టు, పిఎఫ్, జిల్లాకేంద్రసహకారబ్యాంకు, రైతుబజార్ అన్నీ ఒకేచోట ఉన్నాయి. అటువంటిది ఇక్కడ ఆర్టీసీ కేవలం రిక్వెస్ట్ స్టాప్‌ను మాత్రమే ఏర్పాటు చేసింది. అయినా ఇక్కడ ఏ సిటీ సర్వీసులు నిలుపడంలేదు. దీనివల్ల కూడా ప్రయాణికులు ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద దిగి అర కిలోమీటర్ మేర మండుటెండలో నడవాల్సి వస్తోంది. ఇటువంటి సమస్యలపై ఆర్టీసీ అధికారులు దృష్టిపెట్టాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.

కలసి పోరాడుదాం... రైల్వేజోన్ సాధిద్దాం...

ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 29: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు కలిసి పోరాటం చేసేందుకు విపక్షాలన్ని సన్నద్ధమవుతున్నాయి. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసాయి. సమైక్యంగా ఉద్యమిస్తే తప్ప దీనిని సాధించలేమన్న నిర్ణయానికొచ్చాయి. దీనిలోభాగంగా కాంగ్రెస్, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నాయకులు మంగళవారం ఒక్కటయ్యారు. దీని గురించి సుదీర్ఘ చర్చ జరిపారు. కొనే్నళ్ళ నుంచి ఉత్తరాంధ్ర ప్రజల కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ మంగళవారం కాంగ్రెస్‌పార్టీ, సీపీఎం కార్యాలయాలకు వెళ్ళి రైల్వేజోన్ కోసం కలిసి పోరాడదామంటూ ఆహ్వానించారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు సంఘటితంగా పోరాడి ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని పార్టీల నాయకులు కలసిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖకు రైల్వేజోన్‌ను కేటాయించాల్సిందేనని స్పష్టంచేశారు. రైల్వేజోన్‌ను కేటాయించకపోతే వచ్చే నెల 14వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్షను చేపడతామన్నారు. దానికి ముందుగా అన్ని రాజకీయపార్టీల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే తానే స్వయంగా అన్ని విపక్షాల పార్టీల కార్యాలయాలకు వెళ్ళి మద్దతును కోరుతున్నానన్నారు. రైల్వేజోన్ అంశాన్ని సాధారణ బడ్జెట్‌లో రైల్వేబడ్జెట్‌లోను కేంద్రం ప్రస్తావించకపోవడంతో తమపార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14న డిఆర్‌ఎం కార్యాలయం వద్ద నిరసన తెలిపి డిఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశామన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు అనేది పూర్తిగా రాజకీయ నిర్ణయంగా ఆమె పేర్కొన్నట్టు గుర్తుచేశారు. దానికి విరుద్ధంగా ఎంపి హరిబాబు రైల్వేజోన్ ఏర్పాటుకు టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి కుట్రలు తిప్పికొట్టేందుకు కలిసి పోరాటం చేయాల్సి ఉందన్నారు. పిపిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల కలగా పేర్కొన్నారు. దానిని సాధించే వరకు పోరాడతీరుతామన్నారు. పలువురు పాల్గొన్నారు.

భారీ స్థాయిలో ఆబ్కారీ శాఖ ఉద్యోగుల రక్త దానం

ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 28: అబ్కారీ శాఖ ఉద్యోగులు అత్యధిక మొత్తంలో 282 యూనిట్ల రక్తాన్ని దానం చేసి సమాజసేవలో తాము ఏమాత్రం తీసుపోమని చాటుకున్నారు. ప్రతి ఏడాది వేసవిలో ఉత్పన్నమయ్యే రక్త సమస్యను అధిగమించేందుకు అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు రక్తదానం తప్పక చేయాలనే కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ పిలుపు మేరకు అబ్కారీశాఖ ఉద్యోగులు సోమవారం పెద్దఎత్తున రక్తదానం చేశారు. స్థానిక గోషాసుపత్రిలో ఏర్పాటుచేసిన ఈ రక్తదాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్-2 డివి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 365 మంది అబ్కారీ శాఖ ఉద్యోగులు ఈ శిబిరంలో పాల్గొన్నప్పటికీ పలు రకాల పరీక్ష తదుపరి 282 మాత్రమే రక్తదానం చేసేందుకు అర్హులుగా గుర్తిండమైందన్నారు.
అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ మొదలు కానిస్టేబుల్ వరకు ఈ శిబిరంలో రక్తదానం చేశారన్నారు. ఇప్పటి వరకు పలు శాఖల ఉద్యోగులు రక్తదానం చేసినప్పటికి ఇంత మొత్తంలో ఏ శాఖ కూడా రక్తదానం చేయలేదనే విషయం గమనార్హమన్నారు. డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కలెక్టర్ పిలుపును పురస్కరించుకుని తమశాఖ ఉద్యోగులు పెద్దఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకువచ్చి, సమాజసేవలో తాము ఏమాత్రం తీసుపోమని నిరూపించారన్నారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బాబ్జీరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు శ్రీరామచంద్రమూర్తి, సుధాకర్, సుభాష్ తదితరులతోపాటు సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, సిఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ళు తదితరులు పాల్గొన్నారు.
రోడ్లు, భవనాలశాఖ ఉద్యోగుల రక్తదానం
అలాగే రోడ్లు, భవనాల శాఖ విశాఖపట్నం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.రామచంద్రన్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది ఉద్యోగుల వరకు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా కె.రామచంద్రన్ మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలోని యలమంచిలి, నాబార్డు అనకాపల్లి, విశాఖపట్నం, విశాఖ బిల్డింగ్, ఎస్.కోట తదితర సబ్ డివిజన్లకు చెందిన ఉద్యోగులతో పాటు తమ కార్యాలయం సిబ్బంది ఈ శిబిరంలో పెద్దఎత్తున పాల్గొన్నారన్నారు. ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్‌బ్యాంక్ వైద్యురాలు డాక్టర్ రాధారాణి నేతృత్వంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో మేనేజర్ డి.రవిశంకర్, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిర్ణీత నమూనాలో
దరఖాస్తు చేయండి

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 29: నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేయకపోవడం వలనే చాలా మంది అర్చకులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఇక్కడి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇవి పుష్ప వర్ధన్ అభిప్రాయపడ్డారు. నిధుల కొరత లేదని, నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేయాలని సూచించారు. జిల్లాలోని చాలా దేవాలయాల్లో అర్చకులకు వేతనాలు చెల్లించకపోవడంపై అర్చక సంఘాలు ఆందోళన చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అర్చక అండ్ అదర్ ఎంప్లారుూస్ రెమ్యునరేషన్ స్కీమ్ కింద నెలకు ఆరు వేల రూపాయల వరకూ వేతనం చెల్లించే వీలు ఉందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 16 మందికి వేతనాలు మంజూరు చేశామని తెలిపారు. మరో 8 మందికి శనివారం ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. మరో 36 మందికి వేతనాలు చెల్లించాలని కోరుతున్నా, వారు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేయలేదని గుర్తు చేశారు. నియామకపు ఉత్తర్వులు, ఆధార్ కార్డు, ఆంధ్రాబ్యాంక్ ఖాతా తదితర వివరాలతో దరఖాస్తును సంబంధిత ప్రాంత దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్‌కు అందచేయాలని తెలిపారు. దాని ప్రతిని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి కూడా పంపాలని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు కేవలం అంధ్రాబ్యాంక్‌కు చెందినవి అయి ఉండాలని స్పష్టం చేశారు. నిధుల కొరత లేదని తెలిపారు. జిల్లాలో 976 దేవాలాయాలు ఉన్నా, తమ పరిధిలో 146 మాత్రమే ఉన్నాయని తెలిపారు. కొన్ని ఆలయాలకు ఆదాయం లేకపోయినా భూములు ఉన్నాయని తెలిపారు. కనీస ఆదాయం లభించని దేవాలయాలకు సంబంధించి ముఖ్యమైన పర్వదినాల్లో దర్శన్ టికెట్ వంటివి ప్రవేశపెట్టాలని సూచించారు. దీని వల్ల ఆదాయం లభించి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది ఉండదన్న అభిప్రాయ వ్యక్తం చేశారు. దేవాదాయ భూముల నుంచి ఆదాయంపై త్వరలో దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రస్తుతం భూముల వివరాల సేకరణ పని దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు.

గణిత పరీక్షకు
430 మంది విద్యార్థుల గైర్హాజరు
ఆరిలోవ, మార్చి 29: జిల్లాలో 268 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన పదవ తరగతి గణితం-1 పరీక్షకు 430 మంది గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. పరీక్షకు 61,540 మంది హాజరు కావాల్సిన ఉండడా 61,110 మంది విద్యార్ధుల పరీక్షకు హాజరైనట్టు వివరించారు. కృష్ణాపురంలో 10143 సెంటర్ సిహెచ్ పాఠశాలలో రెండు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు.
జిల్లా పరిపాలనాధికారి కె.ప్రభాకరరావు నగరంలో ఆర్‌ఆర్‌వి పురంలోని ఎస్‌వివి ఉన్నత పాఠశాల, గోపాలపట్నం బాలాజీ ఉన్నతపాఠశాల, గోపాలపట్నం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, జిల్లాపరిషత్ బాలికల ఉన్నతపాఠశాల, వేపగుంటలోని జెడ్‌పి ఉన్నతపాఠశాలను సందర్శించారు. జిల్లావిద్యాశాఖాధికారి ఎంవి కృష్ణారెడ్డి వాల్తేరులోని కెడిపిఎం ఉన్నత పాఠశాల ఎంవిపి కాలనీలోని భాష్యం ఉన్నత పాఠశాల సెక్టార్-1లోని శ్రీ చైతన్య ఏ సెంటర్, శ్రీ చైతన్య బిసెంటర్‌లను సందర్శించారు. 13 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు 73 పరీక్షా కేంద్రాలు, మండల విద్యాశాఖాధికారులు 65 మొత్తం 149 పరీక్షా కేంద్రాలను సందర్శించినట్టు ఆయన పేర్కొన్నారు.

ఎయును సందర్శించిన యుజిసి నిపుణుల బృందం

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 29: వివిధ కళాశాలల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించిన ఎపిసెట్ నిర్వహణ విషయమై ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని యుజిసి నిపుణుల బృందం మంగళవారం సందర్శించింది. ఎపిసెట్ నిర్వహణపై నిపుణుల బృందం ఎయు అధికారులతో చర్చించారు. ఎయు వీసీ ఆచార్య ఇఎ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య ఉమా మహేశ్వరరావులతో యుజిసి కమిటీ చైర్మన్ ఇంద్రమోహన్ కపాయ్, సభ్యులు కె.మహాపాత్రో, రణ్‌వీర్ సింగ్, యుజిసి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్ర సింగ్ చర్చించారు. ఈ సందర్భంగా ఎయు వీసీ మాట్లాడుతూ తమకు ఎపిసెట్ నిర్వహణకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీ పరీక్షలను నిర్వహించిందని గుర్తు చేశారు. సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ స్వంతంగా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఎపిసెట్) నిర్వహిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 14 విశ్వవిద్యాలయాల పరిధిలోని నియామకాలకు అవసరమైన విధంగా ఈ సెట్ నిర్వహిస్తామని తెలిపారు. డిగ్రీ, విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలకు ఈ సెట్‌ను పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. సెట్ కార్యాలయం త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య ఉమామాహేశ్వరరావు మాట్లాడుతూ సెట్ నిర్వహణకు అవసరమైన వసతులు, వనరులను ఎయు సమకూర్చుకుంటుందని తెలిపారు. వర్సీటీలో ప్రశ్నపత్రాల తయారీ విధానం, నిపుణుల జాబితా వంటి అంశాలను యుజిసి కమిటీ చైర్మన్ కపాయ్ అడిగి తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమంలో ఎపిఐసెట్ కన్వీనర్ ఆచార్య రామమోహనరావు, ప్రిన్సిపాల్స్ ఎం.సుందరరావు, ఎ.సుబ్రహ్మణ్యం, సిహెచ్‌వి రామచంద్రమూర్తి, ఎపిసెట్ సలహాదారు రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.