విశాఖ

మన్యంలో చలి... చలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, నవంబర్ 20: విశాఖ ఏజన్సీలో చలి తీవ్రత అధికమైంది. గత కొద్ది రోజుల నుండి మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ నెలలోనే చలితీవ్రత పెరిగిపోవడంతో మన్యం వాసులు చలిపులితో వణుకుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండే చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది. ఆదివారం ఉదయం చింతపల్లిలో 8 డిగ్రీలు, పర్యాటక కేంద్రమైన లంబసింగిలో ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజన్సీ వ్యాప్తంగా అన్ని మండలాల్లో చలి తీవ్రత ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల నుండే చలి గాలులు దట్టంగా వ్యాపిస్తుండడంతో చింతపల్లి, జి.కె.వీధి, సీలేరు, లంబసింగి, రంపుల ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ద్విచక్ర వాహన చోదకులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి సమయం నుండి చలి మరింత అధికం కావడంతో చిన్నారులు, వృద్ధులు చలిని తాళలేకపోతున్నారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో ఏజన్సీ రహదారులపై లైట్లు వేసుకునే వాహనాలను నడుపుతున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు తెరలు వీడలేదు. పాఠశాలలకు వెళ్ళే చిన్నారులు కూడా పొగ మంచుతో అవస్థలు పడ్డారు. వారపు సంతలకు కాయకూరలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువెళ్ళే గిరిజనులు కూడా చలితో వణికిపోతున్నారు. మన్యంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతుండడంతో గత ఏడాది కంటే ఈ ఏడాది చలితీవ్రత అధికంగా ఉంటుందని మన్యం వాసులు ఆందోళన చెందుతున్నారు. మన్యంలోని అనేక గ్రామాల్లో గిరిజనులు చలిమంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
* మైదానంలోనూ పెరిగిన చలి
ఏజన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. ఏజన్సీని ఆనుకుని ఉన్న నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గత వారం రోజుల నుండి చలి తీవ్రత అధికమైంది. ఒక్కసారిగా చలి పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఆరు గంటల నుండే చలి అధికం కావడంతో జనం ఇళ్ళకే పరిమితమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. రహదారులపై మంచు కురుస్తుండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మైదాన ప్రాంతంలో గతంలో డిసెంబర్ ప్రారంభం నుండి చలి పెరిగేది. ఈ ఏడాది నవంబర్ రెండవ వారం నుండే చలి పెరగడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.