విశాఖ

ఇతర జిల్లాలకు తరలిపోతున్న చెరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, నవంబర్ 22: గోవాడ షుగర్స్ పరిధిలోని చెరకును లారీలపై ఇతర జిల్లాలకు తీసుకెళుతుండగా ఫ్యాక్టరీ సిబ్బంది ఆ లారీలను అడ్డుకున్న సంఘటన మంగళవారం స్థానిక గోవాడ షుగర్స్ కేన్‌యార్డు వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. గోవాడ సహకార చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు గత కొన్నిరోజులుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండకు తరలిపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై యాజమాన్య సిబ్బంది స్పందించి మంగళవారం లక్కవరం గ్రామం నుండి రెండు లారీలతో పాలకొండకు రవాణాచేస్తున్న చెరకు లారీలను అడ్డుకుని నిలుపుదల చేసారు. దీంతో సంబంధిత రైతులు ఒబలరెడ్డి సింహాద్రప్పడు, కూర్మదాసు ఈశ్వరరావు తదితరులు కేన్ యార్డు వద్ద చేరుకుని ఫ్యాక్టరీ సిడివో మల్లిఖార్జునరావు, ఎవో మదు, డిప్యూటీ సిడివోలతో వాదనకు దిగారు. అమ్మ పెట్టాపెట్టదు అడుక్కుని తిననివ్వదు అన్న చందంగా ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించకుండా, బకాయిలు చెల్లించకుండా ఎంతకాలం ఇబ్బందులకు గురిచేస్తారని నిలదీసారు. ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియకపోవడమే కాకుండా చెరకు కటింగ్ ఆర్డర్లను కూడా సీజన్ ముగింపుదశలో తమకు ఇస్తుండటం వలన చెరకులో రసనాణ్యత తగ్గిపోయి తమకు నష్టాలు వాటిల్లుతున్నాయని, అలాగే సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వలన రుణగ్రస్తులుగా మారుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా తమకు కటింగ్ ఆర్డర్లు ముగింపు చివరి దశలో ఇవ్వడం వలన అగ్రిమెంట్ ప్రాప్తికి కూడా చెరకు సరఫరా చేయలేకపోయామని ఇటువంటి ఇబ్బందులున్నందునే ఇతర కర్మాగారాలకు చెరకును తరలిస్తున్నామని వారు అన్నారు. దీనిపై యాజమాన్య సిబ్బంది మాట్లాడుతూ ఈ ఏరియా పరిధిలోని చెరకును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా చెరకును తరలించడం తగదన్నారు. దీనిపై సంబంధిత పాలకొండ ఫ్యాక్టరీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే క్రషింగ్ సీజన్ ప్రారంభిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సినవసరం లేదని వారు తెలియజేసారు. ఏ జోన్ పరిధిలోని చెరకు ఆ జోన్‌లోనే క్రషింగ్ జరపాలని ఆయా ఫ్యాక్టరీలకు షుగర్ కేన్ కమీషనర్ ఉత్తర్వులు జారీచేసిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తుచేసారు. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్య సిబ్బంది పాలకొండ ఫ్యాక్టరీ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు తలారి సత్యనారాయణ, పిఎస్ నాయుడు, కె. ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.