విశాఖపట్నం

బాక్సైట్ ఉద్యమాన్ని అణిచివేసేందుకే ఎమ్మెల్యేపై అక్రమ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 12: మన్యంలో బాక్సైట్ ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అక్రమ కేసులు బనాయించారని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. పాడేరులో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాక్సైట్ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఈశ్వరిని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రిపై అనుచిత వాఖ్యలు చేశారంటూ కల్లబొల్లి మాటలతో అక్రమంగా కేసులు పెట్టారని అన్నారు. చింతపల్లిలో తమ నాయకుడు జగన్ నేతృత్వంలో నిర్వహించిన బాక్సైట్ బహిరంగ సభతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని చెప్పారు. ఈ సభకు అశేషమైన గిరిజనం హాజరై బాక్సైట్‌కు వ్యతిరేకంగా గొంతుకలపడంతో ఏమి చేయాలో పాలుపోక సభ నిర్వహణకు పూనుకున్న ఈశ్వరిపై తప్పుడు ఆరోపణలు గుప్పించి టిడిపి నేతలకు పోలీసులకు పిర్యాదు చేసినట్టు అర్థవౌతుందన్నారు. టిడిపి నాయకులు చెబుతున్నట్టుగా ముఖ్యమంత్రిపై ఈశ్వరి అసందర్భ వాఖ్యలు చేసి ఉంటే వీడియో పుటేజ్‌లే సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తల నరుకుతామంటూ ఈశ్వరి వ్యాఖ్యానించినట్టుగా టిడిపి నాయకులు చెబుతుండడం పచ్చి అబద్దమని, టిడిపి నాయకుల దగాకోరుతనానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ఎమ్మెల్యేపై కేసు పెట్టడం ద్వారా బాక్సైట్ ఉద్యమాన్ని అణిచివేయాలనుకోవడం అవివేకమని, గిరిజనుల పక్షాన నిలిచిన తమ పార్టీ బాక్సైట్‌పై ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులకు భయపడి పారిపోయేటంత పిరికితనం టిడిపి నాయకులకే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఈశ్వరిపై బనాయించిన అక్రమ కేసును న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. బాక్సైట్‌పై అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఈశ్వరిపై అక్రమ కేసును పెట్టిన టిడిపి నాయకులు బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉన్నారన్న విషయం కూడా అర్థవౌతుందని ఆయన అన్నారు. ఏజెన్సీలోని టిడిపి నాయకులు తమ ప్రభుత్వానికి తొత్తుగా మారి బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ గిరిజనులకు అన్యాయం చేసేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలలో పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బాక్సైట్‌పై శాసనసభలో చర్చకు తమ పార్టీ పట్టుపడుతుందని, ప్రభుత్వానికి దమ్ముంటే చర్చకు ముందుకు రావాలని ఆయన సవాలు విసిరారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97 తనకు తెలియదంటూ ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి తెలియకుండా వివాదాస్పదమైన జీవో విడుదలయ్యిందంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండేందుకు చంద్రబాబుకు అర్హత లేదన్నారు. తనకు తెలియకుండా బాక్సైట్ జీవో జారీ అయినందుకు తక్షణమే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయాలి
మండల పరిషత్ సమావేశంలో తీర్మానం
పాడేరు, డిసెంబర్ 12: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని పాడేరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపిపి వర్తన ముత్యాలమ్మ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో మండలంలోని పలువురు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు బాక్సైట్ జీవో రద్దు చేయాలని తీర్మానించారు. బాక్సైట్ తవ్వకాల వలన గిరిజనులకు తీరని అన్యాయం జరగనుందని, ఈ ప్రాంతమంతా కలుషితమై విపత్కర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలను ఆదివాసులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని, గిరిజనుల మనోబావాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని బాక్సైట్ తవ్వకాల జిఒతో పాటు ఇందుకు సంబంధించిన ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మండల సర్వసభ్య సమావేశానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను అధికారులకు తెలియచేసేందుకు వేదికగా ఉన్న మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు రాకపోతే ఏలా అంటూ వారు ప్రశ్నించారు. అధికారుల తీరు గిరిజనులను నిర్లక్ష్యం చేసేదిగా ఉందని, సమావేశాలకు గైర్హాజరు కావడం పరిపాటిగా మారిందని ఆక్షేపించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. అధికారుల గైర్హాజర్‌పై కలెక్టర్‌కు పిర్యాదు చేస్తామని ఎంపిపి ముత్యాలమ్మ చెప్పారు. మండలంలోని ఎంపిటిసి సభ్యులకు పాడేరులో మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని, మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేయాలని, మండల పరిషత్ ఆధీనంలో ఉన్న దుకాణ సముదాయాన్ని వేలం ద్వారా గిరిజన లబ్ధిదారులకు మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ గుణలక్ష్మి, పలువురు అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.