విశాఖ

ట్యాంక్ బండ్ తరహాలో పెద్ద చెరువు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జనవరి 19: నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నం పెద్ద చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కోటి 35 లక్షల రూ.లు మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం తన నివాసంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చెరువు చుట్టూ ప్రహారీ నిర్మించి, పార్కును అభివృద్ధి చేస్తామన్నారు.
రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ డెవలప్‌మెంట్ నిధుల నుండి సంబంధిత శాఖ మంత్రి నిధులు మంజూరు చేశారన్నారు. నాలుగు మండలాల్లోని 22 శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు. ఒక్కొక్క శ్మశాన వాటికకు 10 లక్షలు వంతున కేటాయించామని చెప్పారు. బలిఘట్టం నుండి జోగునాథునిపాలెం మీదుగా వెళ్ళే ఆర్ అండ్ బి రోడ్డు అభివృద్ధికి మూడు కోట్లు కేటాయించారన్నారు. పట్టణంలో వెంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తవీధి మీదుగా చెరువు పక్క నుండి పెదబొడ్డేపల్లి రోడ్డు అభివృద్ధికి పురపాలక శాఖకు ప్రతిపాదనలు పంపించామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంజూరు చేసిన రెండు కోట్ల నిధులతో 31 సిమ్మెంట్ రోడ్లును నిర్మిస్తామని తెలిపారు.
రెండు కోట్లతో క్రీడా ప్రాంగణం
పట్టణంలో ఆధునాత క్రీడా ప్రాంగణాన్ని నిర్మించేందుకు క్రీడలు, కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు మంత్రి అయ్యన్న తెలిపారు. స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తున్నామన్నారు. పట్టణ శివార్లలోని నెలిమెట్ట, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతాల వద్ద ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, బ్యాట్మింటన్, జిమ్, అవుట్‌డోర్ స్టేడియంలో కబాడీ, పుట్‌బాల్ తదితర ఆటల సౌకర్యం కలుగజేస్తామని తెలిపారు.

వరి కుప్పలు దగ్ధం
గూడెంకొత్తవీధి, జనవరి 19: మండలంలోని కొత్తవెదురుపల్లి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆరు వరి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే గ్రామానికి నాలుగు కుటుంబాలకు చెందిన ఆరు వరి కుప్పలు దగ్ధం కావడంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వరి కుప్పలకు నిప్పంటుకుందన్న సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు నీళ్ళతో మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఒకే ఒక్క గిరిజనుడికి చెందిన వరి కుప్పను మాత్రమే గ్రామస్తులు కాపాడారు. సుమారు ఈవరి కుప్పలు నూర్చితే 150 బస్తాలకు పైగా వస్తుందని, ఏడాది పొడవునా కష్టించి పండించినా తిండి గింజలు లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
ముగ్గురు జూదరుల అరెస్టు
దేవరాపల్లి, జనవరి 19: మండలంలోని కలిగొట్ల గ్రామంలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని ఎస్‌ఐ డి.ఈశ్వరరావు బుధవారం రాత్రి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,700 నగదుని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని గురువారం కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు ఆయన తెలిపారు.
22న క్యాన్సర్‌పై అవగాహన సదస్సు
దేవరాపల్లి, జనవరి 19: సమాజానికి ప్రాణాంతకంగా తయారవుతున్న క్యాన్సర్ వ్యాధిపై ఈనెల 22న విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో అవగాహన సదస్సుని మహాత్మాగాంధీ కేన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తుందని మారేపల్లి సర్పంచ్ అవుగడ్డ కోటిపల్లినాయుడు గురువారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. క్యాన్సర్ లక్షణాలున్న వారికి ఉచిత వైద్య చికిత్సలు చేస్తారని, ఈ సదవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.