విశాఖపట్నం

జివిఎంసి ఎన్నికలకు మేం రెడీ మరి మీరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 30: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థకు పాలకవర్గం లేకుండా పోయి ఐదేళ్లు కావస్తోంది. సమయానికి ఎన్నికలు జరిగి ఉంటే, జివిఎంసి ఒక పాలకవర్గం తన కాలపరిమితిని పూర్తి చేసుకునేది. ఎన్నికలు జరపడానికి అధికార తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వైకాపా ఎదురు చూస్తోంది. ఎన్నికలకు తాము సర్వ సన్నద్ధంగా ఉన్నామని వైకాపా అధికార పార్టీపై కాలు దువ్వుతోంది. ఎన్నికలను కావాలని ఎందుకు వాయిదా వేస్తున్నారో తెలియక అధికార పార్టీ తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జివిఎంసికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుండడంతో ప్రభుత్వం అందుకు సాహసించలేదు. అలా.. అలా నెలలు, సంవత్సరాలను ప్రభుత్వాలు నెట్టుకొచ్చాయి. ఎప్పటికైనా జివిఎంసికి ఎన్నికలు జరుగుతాయా? అని అధికార, ప్రతిపక్ష పార్టీల ఔత్సాహిక నాయకులు ఎదురు చూస్తున్నారు. జివిఎంసి గత పాలకవర్గ కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలు జరపాల్సి ఉంది. అదే సమయంలో జివిఎంసిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలను విలీనం చేశారు. ఈ విలీనాన్ని చాలా మంది వ్యతిరేకించినా, విశాఖను మెట్రో నగరంగా మార్చేందుకు జిల్లా మంత్రులు ఈ ప్రక్రియను కొనసాగించారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ భీమిలి, విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రాంతాలకు చెందిన వారు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు మూలనపడ్డాయి. కోర్టులో కేసులను త్వరితగతిన పరిష్కరించి ఎన్నికలకు వెళతామని అధికార పార్టీ బయటకు చెపుతున్నా, లోపల మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు గుబులు ఉంది. అధికార పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు ఎలాగూ నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదు. కనీసం ఎన్నికలు నిర్వహిస్తే, కొంతమందికైనా పదవులు దక్కుతాయని ఆశపడుతున్నారు. ఎన్నికలు నిర్వహించడానికి సాంకేతిక కారణాలను చూపుతూ క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తోంది తెలుగుదేశం అధిష్ఠానం. ఇక వైకాపా మాత్రం గుంభనంగా ఉంది. అధికార పార్టీ చేసే తప్పులు తమకు వరాలుగా మారుతాయని వైకాపా భావిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన జగన్ తల్లి విజయమ్మను ఇక్కడి ప్రజలు ఓడించారు. ఎక్కడైతే పరాజయంపాలయ్యామో, అక్కడే విజయాన్ని సిద్ధించుకోవాలని వైకాపా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా స్థానిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆందోళనకు దిగుతున్నాయి. కొద్ది రోజుల కిందట హోదాపై జగన్ చేసిన హైడ్రామా ప్రజల్లోకి కొంత వరకూ వెళ్లింది. దాన్ని పాజిటివ్‌గా మలుచుకోవాలని పార్టీ అధినేత క్యాడర్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ చర్యలను తూర్పారబెట్టలని కూడా ఆదేశించారు.
అనుకుంటే...సాధ్యమే!
జివిఎంసికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే, ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులన్నీ ఇట్టే తొలగిపోతాయి. విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించే సత్తా జిల్లాలోని ప్రజానాయకులకు లేకపోలేదు. కానీ ఎన్నికలే జరిగితే, ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పటికే పసిగట్టిన జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దలు కేసుల ఉపసంహరణ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు కూడా జివిఎంసి ఎన్నికల అంటే పెదవి విరుస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే, చేతి చమురు వదిలించుకోవడంతోపాటు, ఫలితాలు తారుమారైతే, వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం తమపై పడుతుందని ఎమ్మెల్యేలు మిన్నకుంటున్నారు.
తురుపు ముక్క..విశాఖ రైల్వే జోన్
ఇదిలా ఉండగా జివిఎంసి ఎన్నికల్లో జయాపజయాలను విశాఖ రైల్వే జోన్ నిర్ణయించబోతోంది. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని టిడిపి భావిస్తోంది. జోన్ టిడిపి, బిజెపి వలన సాధ్యం కాకపోతే, దాన్ని ఆయుధంగా ఉపయోగించి ఎన్నికల బరిలోకి దిగాలని వైకాపా వేచి చూస్తోంది. అలాగే, పంచ గ్రామాల సమస్యను కూడా ఎన్నికల సమయంలో తెరమీదకు తీసుకురావాలన్నది వైకాపా ఆలోచన.