విశాఖపట్నం

గుర్తుండిపోయేలా విశాఖ ఉత్సవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 31: ప్రజలు, సందర్శకులకు కలకాలం గుర్తుండిపోయేలా విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తామని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి మూడు రోజుల పాటు ఆర్కె బీచ్ వేదికగా జరిగే విశాఖ ఉత్సవాల ఏర్పాటుపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇతర అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉత్సవ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఆర్కె బీచ్ ప్రధాన వేదికగా, పార్క్ హోటల్ వరకూ విశాఖ ఉత్సవ్‌కు ముస్తాబవుతున్నాయన్నారు. విశాఖ ఉత్సవ్‌కు అతిధులుగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, వై సుజనా చౌదరి, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారన్నారు. విశాఖ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉత్సవాల నిర్వహణ జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు పాప్ సింగర్ బాబా సెహగల్ సంగీత కార్యక్రమం, చివరి రోజున సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉత్సవాలను ఓకే చోట సందర్శించే విధంగా అన్ని వేదికలను ఆర్కె బీచ్ నుంచి పార్క్ హోటల్ మధ్య ప్రాంతంలోనే ఏర్పాటు చేశామన్నారు. ఈ సారి విశాఖ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా కార్నివాల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బ్రెజిల్‌లో ప్రతియేటా జరిగే విధంగా కార్నివాల్ నిర్వహిస్తున్నామన్నారు. అలాగే గతేడాది మాదిరి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన విధంగా ఫ్లవర్ షో నిర్వహిస్తున్నామన్నారు. ఆర్కె బీచ్ వేదికగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నమూనా దేవాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవాల మూడు రోజులు పండుగ వాతావరణం నెలకొల్పేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఆర్కె బీచ్ ప్రాంతానే్న కాకుండా కూడళ్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించినట్టు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.2.75 కోట్లు కేటాయించిందని నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేందుకు ఖర్చుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. విశాఖ ఉత్సవ్‌లో స్థానిక కళాకారులకు ప్రోత్సాహం ఉంటుందని, వారి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వుడా విసి బాబూరావు నాయుడు, సంయుక్త పోలీసు కమిషనర్ నవీన్ గులాఠి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, పర్యాటక సంస్థ ఇడి శ్రీరాములు నాయుడు, సమాచార శాఖ డిడి ఎ బాబ్జి, జివిఎంసి అదనపు కమిషనర్ జివివిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.