విశాఖ

చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: టిడిపి, బిజెపి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మంత్రి అయ్యన్నపాత్రుడు పార్టీ శ్రేణులకు సూచించారు. బిజెపి, టిడిపి సమన్వయం సమావేశం, టిడిపి సర్వసభ్య సమావేశం స్థానిక అంకోసా హాలులో గురువారం జరిగింది. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ టిడిపి, బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత విభజన నేపథ్యంలో ఏపికి జరిగిన లోటును భర్తీ చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. ఆ బాధ్యతను రెండు పార్టీలు నిర్వర్తిస్తున్నాయని చెప్పారు. మోదీ, చంద్రబాబు సమన్వయంతో పనిచేయడం వలనే భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చిందని అన్నారు. విశాఖ స్మార్ట్ సిటీకి వీరే ప్రధాన కారకులని అన్నారు. 13,14 ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇన్ని కార్యక్రమాలు చేపట్టాయా? అని అయ్యన్న ప్రశ్నించారు. గాజువాక, సింహాచలం భూములకు సంబంధించి పట్టాలు కూడా త్వరలోనే ఇస్తామని ఆయన చెప్పారు. టిడిపి మ్యానిఫెస్టోని అమలు చేయమని వైకాపా నేత జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఐదేళ్ల కాలంలో అంచెలంచెలుగా దాన్ని అమలు చేస్తామని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ అంతా చురుకుగా పాల్గొని అభ్యర్థి మాధవ్ విజయానికి సహకరించాలని అన్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడిపికి మిత్రపక్షమైన బిజెపికి ఈ ఎమ్మెల్సీ సీటు కేటాయించాం. అభ్యర్థి బిజెపికి చెందినవాడైనా, మన అభ్యర్థిగా భావించి పనిచేయాలని అన్నారు. సమయం తక్కువున్నా, సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టిడిపి, బిజెపిలకు సంస్థాగత నిర్మాణం ఉండడం వలన విజయం సునాయాసమవుతుందని గంటా చెప్పారు. రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించాలని అన్నారు. ఈ ఎన్నికను టిడిపి శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ బిజెపి, టిడిపి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చి, రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. రైల్వే జోన్ విషయంలో సానుకూల ప్రకటనే వస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎంవిఎస్ మూర్తి మాట్లాడుతూ కమ్యూనిస్ట్‌లు అభివృద్ధి నిరోధకులని అన్నారు. బూజు పట్టిన సిద్ధాంతాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటే, జివిఎంసి ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే అవుతుందని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కమ్యూనిస్ట్ నాయకులు క్యాప్టలిస్ట్‌లుగా మారారని విమర్శించారు.
అభ్యర్థి మాధవ్ మాట్లాడుతూ ప్రచారానికి సమయం పెద్దగా లేదని, వీలైంత త్వరగా ఓటర్లను కలుసుకునేందుకు ఈ రెండు పార్టీల శ్రేణులు కృషి చేయాలని అన్నారు. హోదా అన్న మాట తప్ప, హోదా కింద రావల్సిన అన్ని ప్రయోజనాలు రాష్ట్రానికి తీసుకువస్తామని అన్నారు. రైల్వే జోన్ విషయంలో కూడా వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. తనను ఎన్నుకుంటే, రాష్ట్రానికి, విశాఖకు రావల్సిన ప్రాజెక్ట్‌లను కేంద్రాన్ని అడిగి తీసుకువస్తానని మాధవ్ చెప్పారు.
టిడిపి ప్రధాన కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ టిడిపికి ప్రాణం, బాణం కార్యకర్తలేనని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చాలా అవసరమని అన్నారు. టిడిపి మరో 20 సంవత్సరాలు ఏకధాటిగా అధికారంలో ఉంటేనే గ్రామ స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాని దేశం గురించి పట్టించుకోలేదని, ఇప్పుడున్న ప్రధాని, ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఇళ్లపట్టాలు, రేషన్ కార్డులు, పించన్లు ఇచ్చినన్ని, వేరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని ఆయన అన్నారు. ప్రజల సంతృప్తి స్థాయినిబట్టి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనీయులని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగురవేసి జివిఎంసి ఎన్నికలకు ఆక్సిజన్‌గా ఉపయోగపడుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేయాలని అన్నారు. టిడిపి రూరల్ జిల్లా అధ్యక్షుడు పప్పల చలపతిరావు మాట్లాడుతూ బిజెపి అభ్యర్థిని గెలిపించకపోతే, టిడిపి నాయకులు తలెత్తుకోలేరని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, కెఎస్‌ఎన్ రాజు తదితరులు ప్రసంగించారు. అలాగే ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యే పీలా గోవింద్, పీలా శ్రీను, మాజీ ఎమ్మెల్యే రెహమాన్, మణికుమారి, పార్టీ నాయకులు పట్ట్భా, వాణి తదితరులు పాల్గొన్నారు. టిడిపి నాయకుడు ఎర్రన్నాయుడు జయంతిని పురస్కరించుకుని ఈ సమావేశంలో ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి టిడిపి అర్బన్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అధ్యక్షత వహించారు.