విశాఖ

జివిఎంసి ‘ప్రత్యేక’ పాలనకు ఐదేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగి ఐదేళ్లయింది. 2012 ఫిబ్రవరి 24వ తేదీన నాటి పాలవర్గం కాలపరిమితి పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పాలకవర్గం లేకుండా, ప్రత్యేక అధికారి పాలనలోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. గత పాలకవర్గం కాలపరిమితి పూర్తయిన వెంటనే ఎన్నికలు జరిపి ఉంటే, నేటికి మరో పాకవర్గం కూడా తన కాలపరిమితిని పూర్తి చేసుకుని ఉండేది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉండబట్టే ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం భయపడుతోందని విపక్షాలు అంటున్నాయి. ఏదియేమైనప్పటికీ పాలకవర్గం లేకుండా ఐదేళ్లు గడచిపోయాయి. పాలకవర్గం లేకపోవడం వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
గతంలోకి వెళితే..
పులుసు జనార్థనరావు మేయర్‌గా అప్పటి పాలకవర్గం కొనసాగింది. గడచిన ఎన్నికల్లో టిడిపికి 32 సీట్లు వచ్చాయి. అత్యధిక సీట్లు వచ్చిన ఏకైక పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో టిడిపి, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 72 వార్డుల్లో వామపక్షాలకు 15 వార్డులను టిడిపి కేటాయించింది. ఇందులో రెండు వార్డుల్లో సిపిఎం, ఒక వార్డులో సిపిఐ గెలుపొందాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ మెజార్టీ సీట్లను దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికలో 11 మంది ఇండిపెండెంట్‌లను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ జివిఎంసిలో అధికారాన్ని కైవసం చేసుకుంది. మేయర్ పదవికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా బిసి సామాజికవర్గానికి చెందిన పులుసు జనార్థనరావు ఆ పదవిలో కూర్చున్నారు. టిడిపికి మెజార్టీ సీట్లు వచ్చినప్పటికీ, చంద్రబాబు నాయుడు ఆదేశాల టిడిపి ప్రతిపక్షంలోనే కూర్చోవలసి వచ్చింది.
పాకవర్గం పూర్తయ్యాక..
2012లో పాలకవర్గం పూర్తయ్యే సమయానికి రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం లేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతోంది. దీంతో రాజకీయ పక్షాలేవీ జివిఎంసి ఎన్నికలపై దృష్టిపెట్టలేకపోయాయి. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా, జివిఎంసి ఎన్నికల గురించి ఆలోచించలేకపోయాయి. ఇందుకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డొచ్చాయి. అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలను జివిఎంసిలో విలీనం చేస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విలీనంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ, స్థానిక నేతలు మాత్రం విలీనానికే సై అన్నారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గానికి చెందిన కొంతమంది కోర్టుకెక్కారు. దీంతో జివిఎంసి ఎన్నికలు మూలనపడ్డాయి. కోర్టు కేసులను ఏదో విధంగా పరిష్కరించి, ఎన్నికలకు వెళ్లాలనుకున్నా, పంచ గ్రామాల భూ సమస్య, గాజువాక భూ సమస్యలు కొలిక్కి రాకపోవడం, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ పూర్తిగా జరగకపోవడంతో జివిఎంసి ఎన్నికల నిర్వహణకు ఎమ్మెల్యేలు ససేమిరా అన్నారు. అలా..అలా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం మాత్రం మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పుకుంటూ వస్తోంది. పార్టీ క్యాడర్‌ను, ఔత్సాహిక నాయకులను సంతృప్తి పరచడానికి మాత్రమే ప్రభుత్వ పెద్దలు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారన్నది నిజం.
ఆర్నెల్లలోపు ఎన్నికలు అసాధ్యం!
జివిఎంసికి ఎన్నికలు జరపాలంటే, కనీసం ఆరు నెలల వ్యవధి కావాలంటున్నారు అధికారపక్ష నాయకులే. కోర్టులో కేసులు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. దాని తరువాత అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలను కలుపుతూ ఎన్నికలకు వెళ్లాలంటే, వార్డుల పునర్విభజన జరగాలి. ఇందుకు కనీసం రెండు నెలల వ్యవధి పడుతుంది. ఆ తరువాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. గాజువాక, సింహాచలం భూముల సమస్య పరిష్కారంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి. ఇదంతా పూర్తవడానికి కనీసం ఆరు నెలల వ్యవధి పడుతుందని చెపుతున్నారు. విలీన మున్సిపాలిటీలను పక్కన పెట్టేసి, ఇప్పటి 72 వార్డులతో ఎన్నికలకు వెళ్లిపోతే బాగుంటుందని అధికార పక్ష నాయకులు అభిప్రాయపడుతున్నారు.
పాలనలో తేడా!
ఐదు సంవత్సరాలుగా జివిఎంసికి ఎన్నికలు లేకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో పనులు జరగడం లేదు. జివిఎంసి పాలకవర్గం ఉన్నప్పుడు, ప్రజలు తమకు ఏ సమస్య వచ్చినా, కార్పొరేటర్లను కలిసి, గోడు వెళ్లపుచ్చుకునేవారు. ఇప్పుడు కార్పొరేటర్లు లేకపోవడంతో నేరుగా జివిఎంసి, లేదా జోనల్ కమిషనర్లను సంప్రదించాల్సి వస్తోంది. వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారో, ఎప్పుడు ఉండరో తెలియని పరిస్థితి ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే, వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరన్న భయంతో కార్పొరేటర్లు పనిచేసేవారు. అధికారులకు ఆ భయం ఉండదు కనుక, ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. ఎమ్మెల్యేలు ఉన్నా, వార్డు స్థాయి సమస్యలను వారు పరిష్కరించలేరు. నగరంలో ఎక్కడ చూసినా, మురికి కూపాలు దర్శనమిస్తున్నాయి. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గెడ్డల్లో పూడికలు తొలగించే పరిస్థితి కనిపించడం లేదు. పలుచోట్ల కనీసం కాలువలను కూడా శుభ్రం చేయని దాఖలాలు ఉన్నాయి. అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. గతంలో జివిఎంసిలో విలీనమైన 32 ప్రాంతాలకు తాగునీరు కూడా అందే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పోగొడుతున్నాయి. గడచిన ఐదు సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నాయి.
ఐదేళ్లుగా ఎన్నికలు లేకపోవడం దురదృష్టకరం
ఐదేళ్లుగా జివిఎంసికి ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు తామే పాలించుకునేందుకే స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. అటువటప్పుడు పాలకవర్గాలే లేకుండా అధికారులతో పాలించడం సమంజసం కాదు. కౌన్సిల్ ఉన్నప్పుడు కార్పొరేటర్లకు ప్రజలు సమస్యలు తెలియచేసేవారు. వారు కౌన్సిల్‌కు వచ్చి అధికారులను నిలదీసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం నిజంగా దురదృష్టకరం.
- పులుసు జనార్థనరావు, మాజీ మేయర్

క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు!
జివిఎంసికి పాలకవర్గం లేకపోవడం వలన క్షేత్ర స్థాయిలో పనులు జరగడం లేదు. కార్పొరేటర్ల లేని లోటును ఎమ్మెల్యేలు, ఎంపిలు భర్తీ చేయలేరు. గతంలో గెడ్లను ఆధునీకరించాం. ఇప్పుడు మళ్లీ అవి యథాస్థితికి చేరుకుంటున్నాయి. మలేరియాతో జనం బాధపడుతున్నారు. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. స్మార్ట్ సిటీకి నిధులు తీసుకురావాలి. ఇది అధికారుల వలన సాధ్యం కాదు. పాలకవర్గం ఉండి ఉంటే, ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేది. ప్రభుత్వానికి అభద్రతా భావం ఉండడం వలనే ఎన్నికలు నిర్వహించలేకపోతోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే, 2019 నాటి ఎన్నికలపై దీని ప్రభావం పడుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. జివిఎంసిలో అనకాపల్లి, భీమిలిని విలీనం చేశారు. వాటిని కొనసాగిస్తారా? లేదా? అన్నది ప్రజల్లో స్పష్టత లేదు. ఎప్పుడు ఎన్నికలు జరుపుతారో కూడా తెలియని దుస్థితి నెలకొంది.
- ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే (కాంగ్రెస్)

కుంటుపడిన అభివృద్ధి
రాష్ట్రంలోని కార్పొరేషన్లంటికీ చంద్రబాబే నాయకత్వం వహించాలనుకుంటున్నారు. వుడాకు, జివిఎంసికి ఆయనే బాస్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని మహా నాయకులు నమ్మిన సిద్ధాంతం. దాన్ని చంద్రబాబు విస్మరించారు. జన్మభూమి కమిటీలు వేయడం వలన సర్పంచ్‌లు ఎంత ఇబ్బందిపడుతున్నారో తెలిసిందే. 2007-12 మధ్య నగరంలో జరిగిన అభివృద్ధి, 2012 నుంచి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుంటూ అప్పటి కన్నా ఇప్పుడు 30 శాతం కూడా వృద్ధి లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండరు. ప్రజాప్రతినిధులే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. అందుకే పాలకవర్గం అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 27 జివిఎంసి వద్ద ధర్నా కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం.
- గుడివాడ అమర్‌నాథ్
వైకాపా జిల్లా అధ్యక్షుడు

ఎన్నికల గురించి పట్టించుకుంటేనా?
రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్ జివిఎంసి. దీనికి పాలకవర్గం ఉంటే, ప్రజా సమస్యల పరిష్కారానికి అస్కారం ఉంటుంది. ప్రత్యేక అధికారుల పాలన వలన, వాళ్లు ప్రభుత్వం ఎలా చెపితే, అలా నడుచుకోవలసి వస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం అన్నది ప్రత్యేక అధికారుల నుంచి ఆశించలేం. అమరావతిని అభివృద్ధి చేసి, విశాఖను గాలికొదిలేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నది జివిఎంసికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్నిబట్టి అర్థమవుతోంది.
-జెవి సత్యనారాయణ మూర్తి, సిపిఐ రాష్ట్ర నాయకులు

ఎన్నికలకు మేం సిద్ధం
జివిఎంసి ఎన్నికలు నిర్వహించడానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డు వస్తున్నాయి. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ఎన్నికలకు వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు జరిగితే, టిడిపి విజయం కూడా ఖాయం.
- చోడే వెంకట పట్ట్భారాం
జివిఎంసి మాజీ ప్రతిపక్ష నాయకుడు (టిడిపి)