విశాఖపట్నం

ఇంటింటి రామాయణం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కొడుకుని కని పెంచి పెద్ద చేసి, ఆలనాపాలనా చూసుకుంటూ, చదివించి, ఉద్యోగస్తుడుని చేసి ప్రయోజకుడిగా మార్చి కోడలు పిల్లకు అప్పగించే సరికి ఆ తిప్పులాడి నా కొడుకుని చవటని చేసి దాని కొంగుకి ముడేసుకుంది వదినా’’ అంది అప్పలనరసమ్మ అనసూయమ్మతో.
‘‘మరేం నా కొడుకూ ఉన్నాడు కదా. ఆ వెధవా అంతే ఇంజనీరింగ్ చదివించాము. అమెరికా పంపాము. మా కోడలూ తెలుసు కదా జిత్తులమారి నక్క. అభం శుభం తెలియని నా కొడుకుని వెర్రిబాగులాడిని చేసి దాని వెనకే కుక్కలా తిప్పుకుంటుంది అమెరికాలో’’ మరి కొంచెం డోసు పెంచి అంది అనసూయమ్మ.
‘‘ముదనష్టపు సంబంధాలు చేశాము. లక్షలకు లక్షలు కట్నాలు, బంగారం తెచ్చామని పొగరు ఆ పిల్ల ముండలకి’’ కోపంతో ఊగిపోతూ అంది అప్పలనరసమ్మ.
‘‘మా బాగా చెప్పావు తల్లీ. నా కోడలయితే భూమి చూడ్డంలేదు. మిడిసిపడిపోతుంది. పాతిక లక్షలు తెచ్చిందన్న గర్వం దానికి’’ అంటూ మూతి తిప్పింది అనసూయమ్మ.
‘‘మంచిగా అన్నావే అమ్మా. నా కోడలేం తక్కువ తిన్నాదా. ముప్పై లక్షల కట్నం, ముప్పై తులాల బంగారం అంటూ మొగుడిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. పైగా నా కొడుకేమైనా అనామకుడా ఏంటి. నీ కొడుకు ఎక్కడో పరాయి దేశంలో ఇంజనీరు. నా కొడుకు ఇక్కడే ఈ దేశంలోనే ఇంజనీరు’’ అంటూ తన కొడుకే గొప్ప అన్నట్లు అంది అప్పలనరసమ్మ.
‘‘అదేటొదినా అలాగంటావు అమెరికాలో ఇంజనీరంటే అలగా జనంలా కాదు. ఎన్ ఆర్ ఐ అంటారు. బాగా రిచ్చు. మీ వాడిదేముంది ఇక్కడే కదా మామూలు జీతమే’’ నీ కొడుక్కంటే నా కొడుకు పదిరెట్లు గొప్ప అన్నట్లు అంది అనసూయమ్మ.
టాపిక్ డైవర్ట్ అయిపోతుందని ఇద్దరూ గ్రహించారు.
‘‘ ఆ విషయం వదిలెయ్ వదినా. నీ కొడుకూ, నా కొడుకూ ఇంజనీర్లే. కోడల్లే ఇల్లు కదలకుండా ఒళ్లు కందకుండా తింటూ తమన నెత్తి మీద గుదిబండల్లా తయారయ్యారు’’ అంది అప్పలనరసమ్మ.
‘‘నిజం చెప్పావే తల్లీ. నా కోడలైతే మరీను పెళ్లికి ముందు యాభై కిలోలు ఉండే మనిషి ఇప్పుడు అరవై కిలోల కొచ్చిందట. తెగ బలిసిపోయింది’’ ఆడిపోసుకుంది అనసూయమ్మ.
అనసూయమ్మ, అప్పలనరసమ్మ ఇద్దరూ రెచ్చిపోతున్నారు. రోజు రోజంతా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి కోడళ్లను తిట్టడమే పనిగా గడిపేస్తున్నారు. అనసూయమ్మ, అప్పలనరసమ్మ బంధువులు కారు. ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండే పరిచయస్తులు.
వాళ్ల రెండిళ్ల మధ్యలో మరో ఇల్లు ఉంది. అందులో నాయుడుబావ ఉంటాడు. నాయుడుబావకు నా అన్న వాళ్లు లేరు. భార్య రేవతి పెళ్లయిన మూడేళ్లకే చనిపోయింది. వాళ్లకి ఒక కొడుకు ఉండేవాడు. అతడిని డాక్టర్ చేశాడు నాయుడుబావ. కోడలూ డాక్టరయితే బాగుంటుందని కొడుక్కి పైసా కట్నం తీసుకోకుండా డాక్టర్ కోర్స్ చదివిన అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశాడు. దురదృష్టం వెంటాడగా కొడుకు కోడలూ హనీమూన్‌కి కాశ్మీర్ విమానంలో వెళుతూ ప్రమాదంలో చనిపోయార. నాయుడుబావకి దూరపు బంధువులే ఉన్నారు. అతను ఒంటరివాడైపోయాడు. ఉన్న బంధువులు కూడా చూడడానికి కూడా రారు. నాయుడుబావ జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా చేసి రిటైర్ అయ్యాడు. వచ్చిన డబ్బంతా అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. నెలనెలా వస్తున్న పెన్షన్‌తో కాలం గడుపుతున్నాడు.
రెండు మూడు రోజులకొకసారి అనసూయమ్మా, అప్పలనరసమ్మ కలసి కోడళ్లన ఆడిపోసుకోవడం, అతడు విని వైరాగ్య ధోరణిలో నవ్వుకోవడం పరిపాటే. కానీ ఏదో ఒక రోజు మీ ఇద్దరికి అర్ధమయ్యేటట్లు క్లాస్ పీకాలి. కుటుంబ విలువలు, సర్దుకుపోవడాలు, సానుకూల దృక్పథంతో ఆలోచించడం, నెగెటివ్ ధోరణి విడనాడటం వంటి అంశాలను కూలంకషంగా మాట్లాడాలని అనుకుంటాడు. కానీ ఇద్దరు ఆడవాళ్ల మాటల్లో దూరితే ఇద్దరూ ఒకటైపోయి తన మీదే తిరగబడతారని ఊరుకుంటున్నాడు.
* * *
ఒకరోజు అనసూయమ్మ మొగుడు, అప్పలనరసమ్మ మొగుడు కలసి మిత్రులతో కలసి తిరుపతి వెళ్లారు. నాయుడుబావనూ రమ్మన్నారు.
‘‘నాకు గుళ్లుగోపురాలకు పోయే అలవాటు లేదండి. ప్రేమసమాజాలు, అనాథ శరణాలయాలను పరిశీలిద్దాం పదండి’’ అన్నాడు నవ్వుతూ.
‘‘అమ్మో అదో టైప్‌లా ఉన్నాడు. వీడితో మనకెందుకు’’ అనుకుంటూ తిరుపతి వెళ్లిపోయారు ఆ పెద్ద మనుషులు. వంటలు అయిపోయాక తీరుబడిగా అనసూయమ్మ, అప్పలనరసమ్మ నాయుడుబావ ఇంటి ముందే కూర్చుని కోడళ్లను తిట్టసాగారు.
‘‘అన్నయ్యగారూ మీరు అదృష్టవంతులు. మాలా కోడలు బాధలు లేవు’’ అన్నారు ఇద్దరూ.
నాయుడుబావ మనసు చివుక్కుమంది.
ఈ ఆడాళ్లకి తమ సోదే తప్ప ఎదుటి వాళ్ల బాధ అర్ధం కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అందరినీ కోల్పోయి నేను కుమిలిపోతుంటే నాతో ఇలాగేనా మాట్లాడేది’ అనుకున్నాడు.
‘‘నిజమేనమ్మా నేనే అదృష్టవంతుడిని. మీలా కోడళ్లను ఆడిపోసుకునే భార్య లేదు. అత్త చేత తిట్టుంచుకోవడానికి కోడలు లేదు. అమ్మ చేత చవట, వెధవా అనిపించుకోవడానికి కొడుకు లేడు. అయినా నాకు తెలియక అడుగుతాను నేను చాలా సంవత్సరాల నుండి గమనిస్తున్నాను మీకు మరేం పనులు ఉండవా? నిత్యం కోడళ్లని ఆడిపోసుకోవడమే మీ దినచర్యా? నిజానికి పెళ్లయిన పదిరోజుల్లోనే మీ కొడుకులు కోడళ్లను వాళ్ల వెంట తీసుకుపోయారు. అప్పటి నుండి వాళ్ల సంసారాలు వాళ్లు చక్కగా నడుపుకుంటున్నారు. వాళ్ల మధ్య సమస్యలు లేవు. పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు. మీకా ఆ కొడుకులు తప్ప మరెవరూ లేరు. లంకంత కొంపలు, రెండు మూడు తరాలకు సరిపడా ఆస్తులు. అయినా నెలనెలా కొడుకులు డబ్బులు పంపుతారు. అయినా మీకు కోడళ్లు అన్యాయం చేసేస్తున్నారు, కొడుకుల్ని కొంగుకి ముడేసుకుంటున్నారు అని తిట్ల పురాణం వల్లిస్తుంటారు. అసలు ఏమిటి మీ బాధ? మిమ్మల్ని మీ కోడళ్లు నిర్లక్ష్యం చేసిన సందర్భాలు లేవు. అయినా మీ సహజధోరణితో వాళ్లను తిడుతుంటారు’’ అంటూ కాస్త ఘాటుగా అంటించాడు.
‘‘అయ్యో అన్నయ్యగారూ మీరు అపార్ధం చేసుకుంటున్నారు. మేము చాలా నయం. అదే మా అత్తలయితే మమ్మల్ని రాచి రంపాన పెట్టేవారు. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు అనేవారు. మాకు నిత్యం నరకం చూపేవారు. మేము అలా కాదు కదా’’ అంది అప్పలనరసమ్మ.
‘‘అదేనండీ బాబూ నాయుడుగారు మా అత్త అయితే నా మొగుడితో మాట్లాడితే గుర్రుగా నా వైపు చూసేది. ఆమె కొడుకు భయంతో వణికిపోయేవాడు. నేను కొడుకుని, కోడలిని అలా చూడ్డంలేదు కదా’’ అంది అనసూయమ్మ.
‘‘మిమ్మల్ని ఎప్పుడో మీ అత్తలు బాధలు పెట్టారని మీరు మీ కోడళ్లపై పెత్తనం చెలాయించాలని తెగ ఆశ పడిపోతున్నారు. అలా చెయ్యడానికి వాళ్లు అందుబాటులో లేరన్నదే మీ బాధ. మీ కొడుకు అమెరికాలో, మీ కొడుకు బెంగళూరులో ఉన్నారు. అదే మీ బాధంతా. అలాగని ఇళ్లల్లోనే ఉంటే వాళ్లకి గడుస్తుందా? అయినా మీకు కూతుళ్లు లేరు. కోడళ్లలోనే కూతుళ్లను చూసుకుని వాళ్లతో మంచిగా ఉండకుండా ఎందుకండీ మీకీ అసూయలు, ఈర్ష్య, కోపాలు. అయినా అత్తా ఒకప్పటి కోడలే అన్న విషయం మరిచిపోతుంటారు మీలాంటి వాళ్లు. మీలాంటి వాళ్ల వల్లే అత్తలు, కోడళ్లు సమాజ విరోధులు అన్న భావన సమాజంలో ఉంది’’ అంటూ ఈసడించుకున్నాడు నాయుడుబావ.
‘‘అయినా అన్నయ్యగారూ మా బాధలు మీకు తెలియవు లెండి. మీరు ఒంటరి కదా’’ అన్నారు ఇద్దరు అమ్మలక్కలు.
‘‘అవునులెండి నేను ఒంటరినే. అయినా భార్య జ్ఞాపకం నా వెంటే ఉంటుంది. నా పిల్లల ప్రేమ, వాత్సల్యం, ఆనవాళ్లు నాతోనే ఉంటాయి. మీరూ ఉన్నారు మీ వేధింపులు భరించలేక భర్తల తీర్థయాత్రలకు పోతుంటారు మూడు నెలలకు ఒకసారి. ఇకనైనా ఆలోచించండి’’ అన్నాడు అతను ఘాటుగా.
ఆ మాటలకి ఎవరింటికి వాళ్లు పోయారు అనసూయమ్మ, అప్పలనరసమ్మ.
వీళ్లలో మార్పు వచ్చినట్లే ఉంది’ అనుకున్నాడు నాయుడుబావ.
ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్న నాయుడుబావకి తమ అరుగు మీద కూర్చుని కోడళ్లని తిడుతున్న అనసూయమ్మ, అప్పలనరసమ్మల మాటలు వినిపించి ‘వీళ్లిక మారరు’ అనుకున్నాడు నాయుడుబావ.

- మీగడ వీరభద్రస్వామి, చోడవరం, విశాఖపట్నం-531036. సెల్ : 9441571505.

మనోగీతికలు

రక్తదాత సుఖీభవ
పుణ్యం పురుషార్థాలకు దానాలంటారు
అన్నదానం, కన్యాదానం, గర్భాదానం (సరోగసీ)
అవయవదానం ఇలా దానాలు ఎనె్నన్నో!
అన్నిటికీ మిన్న యైనది రక్తదానం
ఏ దానాన్ని చేయడానికైనా ప్రాణం ఉండాలి
వైద్యవిజ్ఞానం పురోగతి సాధించినా
రక్తానికి మూలమైన ప్లాస్మా అంతు తెలియదు
అది తెలిస్తే మనిషికి మరణం లేదు
ప్రాణం నిలవాలంటే రక్తం కావాలి
రక్తదానానికి కులమత భేదాలు లేవు
రక్తదానంతో మరో ప్రాణం నిలుపుతుంది.

- ఎ. సీతారామారావు.
సెల్ : 8978799864.

అద్దం - ప్రతిబింబం

మనిషి - ఎక్కువ ఇష్టపడేది అద్దంలో
తన రూప లావణ్యాల వీక్షణకు
శరీరమే తాననుకోవడం
మనిషి మొట్టమొదటి భ్రమ
మనిషి తాను నిత్యం చేసే క్రియలకు
తనే కారణమనుకోవడం
శరీరానికై అధిక ప్రాధాన్యమివ్వడం
ఇతరుల్లో అన్నీ లోపాలే చూడడం
మనిషి చేసే పొరపాటు
తన గురించి తాను తెలుసుకోవడానికి
అద్దంకంటె ఇతరులలో
తనను తాను చూసుకుంటే మేలు
మంచీచెడూ అవగతం కాకపోదు
శరీరం పలు మార్పుల నిలయం
ప్రతీది దాని ప్రతిబింబాలే
అంతఃకరణ - ప్రతిబింబం
ఆలోచనలు - కోరికలు
ఎత్తి చూపే - గుణదోషాలు
తన లోపలి ప్రతిబింబాలే!
మానవ నిర్మితం - అద్దం
దైవ నిర్మితం - ప్రకృతి
దైవ ప్రకాశం తోడుంటే
అద్దంలో ప్రతిబింబం - దర్శనం
బాల్యంలో అంతగా అద్దం పని ఉండదు
అమ్మే తన ప్రతిబింబంలా తీర్చిదిద్ది
బిడ్డను తన కళ్లనే అద్దంలా చేసి
చక్కగా అలంకరించి తయారు చేస్తుంది!
యవ్వనంలో సూదంటురాయి అద్దం
ప్రతీక్షణం శరీరాకర్షణకై తపన
అందానికై అనేకానేక ప్రయత్నాలు
అందరు తనను చూస్తారనుకోవడం!
శరీరమే తాననుకున్నంత కాలం
అద్దం ఒక పరికరం, కనీసం నిజాన్ని
వృద్ధాప్యంలోనైనా గ్రహించి
తమ ప్రతిబింబాన్ని
చూసి తనను తాను తెలుసుకోమంటుంది!

- జి. కృష్ణకుమారి, బాబామెట్ట
విజయనగరం. సెల్ : 9441567395

ఓ లాలి
వద్దమ్మ వద్దమ్మ ఈ ఆడజన్మ
నా కడుపున పుట్టడమే నీవు చేసుకున్న ఖర్మ
సృష్టికి మూలం ఆడదేనంటూ
సృష్టిని నాశనం చేస్తున్నారు
వెతలు తప్పవమ్మా స్ర్తి జాతికి ఆజన్మాంతం
పురాణాలేనమ్మా దీనికి ప్రత్యక్ష సాక్ష్యం
ఇది పురుష జాత్యాహంకారం
అడుగడుగునా ఎదురవుతుంది శోకం
అంతులేని శోకం
ప్రతి నిముషం అగచాట్లే ఆడబతుక్కి
జాలే లేదమ్మా ఈ పురుష ప్రపంచానికి
కంటి నిండా నిదుర ఉయ్యాలలోనే
ఆలనా పాలనా తల్లి ఒడిలోనే
అటు తర్వాతి జీవితమంతా
ఆవేదనతోనే ఆక్రోశంతోనే!

- కాళ్ల గోవిందరావు,
ఆమదాలవలస, సెల్ : 9550443449

వస్త్రాస్త్రాలు
ఖద్దరు వస్త్రం నాయకనేత్రం
కాషాయ వస్త్రం సాధూ పవిత్రం
కాకీ వస్త్రం కార్మిక గాత్రం
ఎర్రని వస్త్రం వీర చరిత్రం
నల్లని వస్త్రం నిరసనపాత్రం
తెల్లని వస్త్రం శాంతికి సూత్రం

- బండారు చిన్న రామారావు (లోగిస)
సెల్ : 9553330545.

సాహితీ సమాలోచన

‘మెరుపు’ ప్రయోగం
ఓ సాహసం!

తెలుగు సాహిత్యాభివృద్ధికి తొలి మెట్టు ఔత్సాహిక రచయతలకు సరైన వేదిక
ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ

ఒక తరానికే పరిమితమైన తెలుగు సాహిత్యాన్ని యువతరానికి స్ఫూర్తి నిచ్చేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రభూమి చేస్తున్న ప్రయోగమే ‘మెరుపు’ ప్రత్యేక శీర్షిక. తెలుగు పత్రికా రంగంలో మెరుపు శీర్షిక నిర్వహణ ఒక పెద్ద సాహసం అని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మెరుపు రచయితలు, కవులు, కాలమిస్టులు, కార్టూనిస్టులతో విశాఖ ఆంధ్రభూమి కార్యాలయంలో గత బుధవారం (మార్చి 1వ తేదీ) ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంవిఆర్ శాస్ర్తి తన అభిప్రాయాలను, మనోభావాలను రచయితలు, కవులతో పంచుకున్నారు. ప్రస్తుతం జనజీవనానికి దూరమైన తెలుగు సాహిత్యాన్ని బతికించు కునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పాతతరం యువతపై నాటి సాహిత్యం కలిగించిన ప్రభావాన్ని ఈ కాలపు యువతపై నేటి తెలుగు సాహిత్యం తీసుకురాలేక పోయిందని అన్నారు. యువతరంలో సాహిత్యాలాభిషను పెంపొందించేందుకు నాటి తరం సాహిత్యాభిమానులు కృషి చేయాలని, అందుకు ఆంధ్రభూమి ‘మెరుపు’ వేదికగా నిలుస్తుందని అన్నారు. ఎన్నో కష్టానష్టాలకోర్చి సాహిత్యాభిమానుల కోసం ‘మెరుపు’ను నిర్వహిస్తున్నామని అన్నారు. రచయితలకు ప్రోత్సాహం ఇచ్చి వారి నుండి కొత్త రచనలు వచ్చే విధంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.
మూస కథలకు, కవితలకు పరిమితం కాకుండా ‘మెరుపు’ను సరికొత్త రీతిలో నిర్వహించేందుకు కూడా ఔత్సాహిక రచయితలు సహకరించాలని ఎంవిఆర్ శాస్ర్తి కోరారు. ముఖ్యంగా రచనల్లో కొత్తదనంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా కథలు, కథానికలు, సమీక్షలు తదితర అంశాలను పంపాలని సూచించారు.
‘మెరుపు’ ద్వారా సాహిత్యం పట్ల మక్కువ పెంపొందించడం, ఔత్సాహిక యువ రచయతలకు అవకాశం కల్పించి వారి ప్రతిభను సానబెట్టడం, వివిధ సాహితీ ప్రక్రియల్లో కొత్తతరం రచయితలను తయారు చేయడం ‘మెరుపు’ లక్ష్యమని శాస్ర్తీ పేర్కొన్నారు. రచయితలు వినూత్న ప్రక్రియలు, పోకడలను ఎంచుకుని తమలోని ప్రతిభా వ్యుత్పత్తులను చూపించాలన్నారు.
స్థానిక రచయతల సాహితీ వ్యాసంగాలు, జిల్లాస్థాయి సాహితీ సంస్థల కార్యకలాపాలకు ప్రాచుర్యం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా, ప్రాంతీయ స్థాయి రచయితలకు సమన్వయ వేదికగా ‘మెరుపు’ పేజీని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ‘మెరుపు’ ప్రయోగం విజయవంతం అయిం దని, ఉత్తరాంధ్ర రచయితల నుండి దీనికి మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ అభిమానులతో ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రొఫెసర్ డి విశే్వశ్వరం మాట్లాడుతూ భాష పట్ల మక్కువ తగ్గుతోందనీ, భాషను బతికించుకోవడం ద్వారా సాహిత్యాన్ని పదిలం చేసుకోవాలని సూచించారు. అందుకు ఆంధ్రభూమి వంటి పత్రికలు తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. కేవలం భాషా దినోత్సవం రోజునో, గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు వేడుకల్లోనో భాష ఔన్నత్యంపై ప్రసంగించి మర్చిపోయే సంప్రదాయం పోవాలన్నారు.
సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ మాట్లాడుతూ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న రీతిలోనే నాటక రచనలకూ ప్రోత్సాహం అందించాలని సూచించారు. బాలల సాహిత్యం, హాస్య రచనలు పాఠకులను ఆకర్షిస్తాయని, వీటికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఈ తరం పిల్లలను సాహిత్యం వైపు మళ్లించవచ్చని సూచించారు.
రచయిత ఎ సీతారామారావు మాట్లాడుతూ రచనా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆంధ్రభూమి మెరుపు శీర్షిక ద్వారా రచనాభిమానులకు ప్రోత్సాహం లభిస్తోందని, ఇది శుభ పరిణామంగా పేర్కొన్నారు. సాహితీ అభిమానులు తరచు సమావేశమై ప్రస్తుత రచనా సరళిపై చర్చిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు.
శేషాద్రి సోమయాజులు మాట్లాడుతూ పాఠకుల అభిరుచులు మారుతున్నాయని, వారి అభిరుచులకు అనుగుణంగా రచనా శైలిని మార్చుకుని చేరువ కావాల్సి ఉందన్నారు.
మాధవీ సనారా (సత్యనారాయణ) మాట్లాడుతూ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధాన్ని టాబ్లాయిడ్ రూపంలో కాకుండా పుస్తక రూపంలో అందిస్తే అపురూపంగా భద్రపరచుకునేందుకు వీలవుతుందని సూచించారు.
రచయిత అనురాధ మాట్లాడుతూ కథలు, కవితలు రాసే ఔత్సాహికులకు మెరుపు ఒక వారధిగా పని చేస్తోందని కొనియాడారు. మిగిలిన పత్రికల్లో సాహితీ అంశాలు కనుమరుగవుతున్న తరుణంలో భాష, సాహిత్యానికి ఆంధ్రభూమి పెద్దపీట వేయడం హర్షించతగ్గ పరిణామమన్నారు.
‘మెరుపు’లో ప్రచుఠణకు స్వీకరించే కవితలు, కథలు, వ్యాసాలకు సంబంధించి ఆయా రచయతలకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలన్న రచయతల విజ్ఞప్తికి ఎంవిఆర్ శాస్ర్తి సానుకూలంగా స్పందించారు.
ఉత్తరాంధ్ర ‘మెరుపు’ సమన్వయకర్తలు బులుసు సరోజినీదేవి, దుర్గాప్రసాద్ సర్కార్ మాట్లాడుతూ రచనల నిడివికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా రచయతలకు కొన్ని సూచనలను అందించారు. కథలు వ్రాతప్రతిలో రెండు ఎ4 సైజు పేజీలకు మించరాదనీ, కవితలు పదిహేను నుండి ఇరవై పంక్తులలోపు ఉండాలని సూచించారు. అనంతరం మెరుపు శీర్షికకు రచనలు పంపే రచయితలు, కవులను ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రభూమి రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు కూడా పాల్గొన్నారు.
- ఆంధ్రభూమి బ్యూరో,
విశాఖపట్టణం

విశాఖపట్టణంలో జరిగిన మెరుపు రచయతల ఆత్మీయ సమావేశం సందర్భంగా రచయిత్రి రాయవరపు సరస్వతితో మాట్లాడుతున్న
ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ. పక్కన వ్యంగ్య చిత్రకారిణి ఉప్పులూరి శ్రీదేవి వేసిన చిత్రాలను పరిశీలిస్తున్న దృశ్యం.

కార్యక్రమానికి హాజరైన ‘మెరుపు’ కవులు, రచయితలు

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- మీగడ వీరభద్రస్వామి