విశాఖపట్నం

మాధవ్‌కే పట్టం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 21: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో 5,044 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్న టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి పివిఎన్ మాధవ్ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాలు అంచనావేస్తున్నాయి. పోలింగ్ జరిగిన తీరు, అభ్యర్థులకు లభించిన ఓట్ల ఆధారంగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో మాధవ్ విజయానికి చేరువగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రహసనంగా కొనసాగుతూ వచ్చింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగుతునే ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మంగళవారం సాయంత్రానికి పూర్తికాగా విజయానికి అవసరమైన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను నిర్ణయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి పివిఎన్ మాధవ్‌కు 42,863 ఓట్లు లభించగా, పిడిఎఫ్ అభ్యర్థి ఎ అజశర్మకు 37,818 ఓట్లు దక్కాయి. విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్48,499 ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును సాయంత్రం 4 గంటల సమయంలో ప్రారంభించారు. అయితే ఎలిమినేషన్ రౌండ్స్ పూర్తయినప్పటికీ ప్రధాన పోటీదారులు మాధవ్, శర్మల మధ్య ఓట్లలో పెద్దగా తేడా రాలేదు. దీంతో ఎలిమినేషన్ రౌండ్స్‌ను పెంచుతూ వచ్చారు. అర్ధరాత్రి సమయానికి 18 మంది ఎలిమినేషన్ రౌండ్స్‌లో తీసేయగా బిజెపి అభ్యర్థి మాధవ్‌కు 43,216 ఓట్లు రాగా, శర్మకు 38,127 ఓట్లు లభించాయి.
ఇదిలా ఉండగా తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు 5,399 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలవగా, స్వతంత్ర అభ్యర్థులు వివి రమణమూర్తి 3,786 ఓట్లు, కె రవి కుమార్ 3,169 ఓట్లతో నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు. మిగిలిన అభ్యర్థులు ఎలిమినేషన్ రౌండ్స్‌లో పోటీ నుంచి నిష్క్రమించారు. అర్ధరాత్రి 11.30 గంటల సమయానికి కూడా లెక్కింపు కొనసాగుతుండటంతో అటు అన్యర్థుల్లోను, ఇటు కౌంటింగ్ అధికారులు, ఏజెంట్లలో తీవ్ర అసహనం చోటుచేసుకోవడం కన్పించింది.
ఇదిలా ఉండగా, ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్వతంత్ర అభ్యర్థులు రమణమూర్తి, రవికుమార్‌ల నిష్క్రమణ ద్వారా ఫలితం తేలే అవకాశం ఉందని ఇరు పార్టీల ప్రతినిధులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా రమణమూర్తి, రవికుమార్‌లకు వచ్చిన ప్రధమ ప్రాధాన్యత ఓట్లు దాదాపు 6,900 ఉన్నాయి. వీరిద్దరూ స్వతంత్రంగా ఇన్ని ఓట్లు తెచ్చుకోగా, వీరు ఎవరి ఓట్లను చీల్చారన్నది ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ద్వారా తేలనుంది. ఇద్దరు స్వతంత్రులు చీల్చిన ఓట్లు పిడిఎఫ్ అభ్యర్థికి చెందినవే అయితే ద్వితీయ ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. వీరి నిష్క్రమణతోనే ఎమ్మెల్సీ విజేత ఖరారవుతుందని భావిస్తున్నారు.

పిడిఎఫ్ హ్యాట్రిక్ మిస్!

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమొక్రెటివ్ ఫ్రంట్ (పిడిఎఫ్) హ్యాట్రిక్ మిస్సయింది. 2007, 2011 ఎన్నికల్లో వరుసగా విజయాలను దక్కించుకున్న పిడిఎఫ్, ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆరాటపడింది. ఇది సాధ్యమేనని చాలా మంది ముందు అనుకున్నా, చివరకు ఫలితాలు తారుమారయ్యాయి.
గత ఎన్నికలను ఓసారి పరిశీలిస్తే.. 2007లో ఇదే ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,79,000 ఓట్లు పోలవగా పిడిఎఫ్ అభ్యర్థి ఎంవిఎస్ శర్మ 36,030 ఓట్ల లభించాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన సూరన్నాయుడుకి 18,951 ఓట్లు వచ్చాయి. అలాగే బిజెపి అభ్యర్థి ఫృధ్వీరాజ్‌కు 10,675 ఓట్లు వచ్చాయి. దీంతో ఎంవిఎస్ శర్మ సునాయాసంగా గెలుపొందారు. 2011 ఎన్నికల్లో 1,61,374 ఓట్లు పోలవగా, ఎంవిఎస్ శర్మకు 31,439 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి తూముల భాస్కరరావుకు 21,057 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజుకు 11,761 ఓట్లు లభించాయి. అప్పటి బిజెపి అభ్యర్థి చెరువు రామకోటయ్యకు కేవలం మూడు వేల ఓట్లు లభించాయి. ఈసారి ఎన్నికల్లో కూడా అజ శర్మదే విజయం అని ముందు భావించారు. ఎప్పుడైతే టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మాధవ్‌ను బరిలోకి దించడం, రెండు పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పనిచేయడంతో మాధవ్ గెలుపు పట్టాలు ఎక్కారు. పిడిఎఫ్ అభ్యర్థి శర్మ విజయం కోసం ఆయా పార్టీల శ్రేణులు గట్టిగానే పనిచేసినా, మంత్రుల ధాటికి వారు నిలవలేకపోయారు.
అజ శర్మ అనూహ్యంగా ఓటమిపాలవడానికి కారణాలను విశే్లషిస్తే, గత రెండు పర్యాయాలు ఎంవిఎస్ శర్మ ఎమ్మెల్సీగా పనిచేసినా, విశాఖకు ఏమీ చేయలేకపోయారని అభ్యర్థులు ప్రచారంలోకి తీసుకువచ్చారు. అలాగే, సామాజికవర్గ పరంగా వేరొకరికి ఈ సీటు ఇవ్వాల్సిందన్న వాదన కూడా వినిపించింది. వీటిని పక్కన పెడితే, తమదే గెలుపు అన్న అతి ధీమా కూడా పిడిఎఫ్ అభ్యర్థి ఓటమికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. అందరికన్నా ముందుగానే ప్రచారాన్ని మొదలుపెట్టామని, ప్రతి ఒక్క ఓటరును కలిశామని పిడిఎఫ్ శ్రేణులు చెప్పుకుంటూ వచ్చాయి. కేవలం 10 రోజుల ముందే మాధవ్ అభ్యర్థిత్వం ఖరారవడడం వలన ఆయనకు విజయావకాశాలు పెద్దగా ఉండకపోవచ్చని శ్రేణులు ధీమాపడడం ఫలితంపై ప్రభావం చూపిందన్న భావన చాలా మందిలో ఉంది.