విశాఖపట్నం

జ్ఞానోదయం ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొబైల్ రింగవడంతో ఒక్కసారిగా తెలివి వచ్చింది నాకు.
లేచి టైం చేసుకుంటే తెల్లవారు జాము రెండున్నరగా చూపిస్తుంది సమయం.
ఈ సమయంలో ఎవరబ్బా? అని నా మనసు కీడు శంకించింది.
ఫోన్ లిఫ్ట్ చేశాను.
అట్నుంచి ‘‘అన్నయ్యా నాన్న నాన్న అన్నయ్యా’’ అంటూ తమ్ముడి దీనాలాపన వినిపించింది.
‘‘ ఏమయిందిరా చెప్పు’’ అన్నాను.
‘‘నాన్న నాన్న మనకిక లేరు అన్నయ్యా’’ ఫోన్‌లోనే ఏడుస్తూ చెప్పాడు తమ్ముడు.
తమ్ముడి గొంతు విని ఏడాదిన్నర అయింది. నాన్న గొంతు విని కూడా అంతే కాలం అయుంటుంది.
నాన్న వాళ్లు ఉంటున్నది నేనున్న పట్టణానికి రెండున్నర గంటల దూరంలో ఉండే పల్లె.
ఉక్కు గుండెలాంటి నాన్న మరణించడమా?
అలా జరగడానికి కారణం తను కాదూ? నా మనసు నన్ను దోషివని అంటోంది.
బలవంతంగా మనసును మళ్లించుకుని ఉక్క ఉదుటున మంచం మీద నుండి గెంతి బాబు పక్కన నిద్రిస్తున్న నా భార్యని లేపి విషయం క్లుప్తంగా వివరించాను.
‘‘బట్టలు సర్దు’’ బయలుదేరాలి’’ అంటూ బాత్‌రూంలోకి దూరాను.
నేను తిరిగి వచ్చేసరికి నా భార్య రెడీ ఉంది.
అంతా కలసి బస్టాండ్‌కి బయలుదేరాము.
అప్పటికి సమయం నాలుగున్నర అయింది.
అరగంటలో మావూరి బస్సు ఉందని ఎంక్వైరీలో తెలిసింది.
దాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం.
నా మనస్సు ఒక్కసారిగా గతంలోకి జారుకుంది.
మా నాన్న రఘురామయ్య పదెకరాల భూమికి సొంతదారు. ఆయనకి నేను, తమ్ముడు, చెల్లెలు సంతానం. చెల్లి గుర్తుకు రాగానే మనస్సంతా చేదు మాత్ర మింగినట్లు అదోలా అయిపోయింది.
అర్ధంతరంగా భర్తని కోల్పోయి పుట్టెడు దు:ఖంతో నాన్న దగ్గరకి వచ్చి చేరిన తనను నేను కనీసం పలకరించిన పాపాన కూడా పోలేదు.
ఎక్కడ తన బరువు బాధ్యతలు నా మీద పడతాయోనని నేను ఆమె వైపు కూడా చూడలేదు. అంతటి దుర్మార్గుడిని నేను.
నా చెల్లెలి పట్ల నేను ప్రవర్తించిన తీరు నాకే అసహ్యంగా అనిపిస్తోంది.
ఇంతలో బస్సు వచ్చింది.
ముగ్గురం ఎక్కాం. సీట్లలో కూర్చుని, టిక్కెట్లు తీసుకున్నాం. మళ్లీ నా ఆలోచనలు వెనక్కి పరిగెత్తాయి.
నాన్న పేరుకు తగ్గట్లే రఘురాముడి అంతటి ధర్మాత్ముడు.
ఊరందరికీ తలలో నాలుక. పెద్ద మనిషి అన్న పేరుకు తగ్గ మనిషి. నన్నూ, తమ్ముడిని రామలక్ష్మణులు అని అంతా చెప్పుకునేవారు. నాన్న మమ్మల్నిద్దరినీ ఊరిలోనే ఉన్న అప్పర్ ప్రైమరీ పాఠశాలలో చేర్చించాడు. నేను చదువులోను, ఆటల్లోను తమ్ముడి కంటే కాస్త చురుగ్గా ఉంటూ తరగతిలోని సార్లందరి చేత సెహభాష్ అనిపించుకునేవాడిని. తమ్ముడు మాత్రం నాన్నతో పాటు పొలానికి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుండేవాడు. నేను ఏడవ తరగతికి వచ్చేసరికి మా పొలంలోని కేవలం మూడు ఎకరాలు మాత్రమే మిగిలింది. దీనికి కారణం నాన్న దనధర్మాలు. వర్షాలు కురవని సమయంలో వచ్చిన కరువు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో నాన్న నిల్చోవడం వల్ల ఎదురయిన ఖర్చులు. ఈ కారణాల వల్ల మా పొలం చాలా వరకు అమ్ముడైపోయింది. తమ్ముడు పూర్తిగా చదువు వదిలేశాడు. వ్యవసాయానికే అలవాటు పడిపోయాడు. పట్నం పోయి నేను చదువుకోవడానికి నాన్నతో కలసి సాయం పడ్డాడు. ఉన్న పొలానే్న సాగు చేస్తూ ఇల్లు గడపడంతో పాటు నేను డిగ్రీ వరకు చదివేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆదుకున్నారు. డిగ్రీ అయిన తర్వాత నేను బ్యాంక్ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాను.
ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ట్రైనింగ్‌కి వెళితే నాన్న ఊరిలోని వారందరికీ సంతోషంతో మిఠాయిలు పంచి పెట్టాడట.
ఆ సమయంలోనే చెల్లెలికి మంచి సంబంధం వచ్చిందని మరొక ఎకరం అమ్మేసి ఘనంగా దాని పెళ్లి జరిపించాడు నాన్న.
అమ్మ నాన్న మాట జవదాటని ఉత్తమ ఇల్లాలు.
అందరి బాగోగులు చూడడం, వేళకి అన్నీ అమర్చిపెట్టడమే ఆమెకి తెలుసు. పొలాలు పోయి, ఆస్తులు కరిగిపోతున్నా ఆమె మాత్రం వంటింటికే పరిమితం అయి ఉండేది.
నా ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ పక్క ఊరిలోనే ఇచ్చారు. దాంతో నాన్న నా పెళ్లి కూడా చేసేయాలని అనుకున్నాడు. తన ప్రాణస్నేహితుడు పరంధామయ్య కూతుర్ని చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపి పెళ్లిచూపులకు రమ్మన్నాడు.
అయితే నేను నాన్న మాట వినలేదు. ట్రైనింగ్‌లో నాకు పరిచయం అయిన రమణిని రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకుని తనతో పాటు మా ఊరికి
వెళ్లాను.
మమ్మల్ని చూసి నాన్న ముఖం నెత్తురు చుక్క లేక పాలిపోయింది.
అయినా తొణకలేదు. నా ముద్దుపేరు కన్నా అంటూ సంబోధించాడు.
‘‘కన్నా వచ్చాడు. అమ్మని దిష్టి తీసుకుని రమ్మను’’ అంటూ తమ్ముడికి చెప్పాడు.
నేను చేసిన పనికి పల్లెత్తుమాట అనకుండా నా కన్నవారిని వదిలేసి పట్నంలో కాపురం వెలగబెట్టాను. ఒక బిడ్డని తండ్రయ్యాను.
ఒక్క కుదుపుతో బస్సు ఆగింది. నా ఆలోచనలు తెగిపోయాయి.
భార్యాబిడ్డలను తీసుకుని బస్సు దిగాను.
మేము బస్సు దిగేసరికి మా పాలేరు సుబ్బడు మా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు.
మా లగేజీ అందుకుని ముందుకు దారి తీశాడు.
అతన్ని అనుసరించాము మేము.
ఇంటికి చేరగానే పెద్ద గుంపు కనిపించింది. పల్లెలోని వాళ్లంతా అక్కడే ఉన్నారు. మమ్మల్ని చూడగానే దారిచ్చి పక్కకి తప్పుకున్నారు.
వాకిట్లో అంపశయ్యపై భీష్ముడిలా నాన్న ప్రశాంతంగా కనిపించాడు.
ఆయన ముఖంలో అంతులేని శాంతి కనిపిస్తోంది. ఆయన ముఖం చిరునవ్వుతోనే ఉంది. ‘కన్నా ఇప్పటికైనా వచ్చావురా?’ అని నాన్న నన్ను ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. ఆ నవ్వు నేను మరిచిపోలేను. ఆ పెదాలు ననే్న ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి.
లోపల అమ్మా చెల్లి రోదనలు, బయట తమ్ముడి దీనాలాపనలు. నా ప్రమేయం లేకుండా గ్రామపెద్దలంతా జరగాల్సిన తంతంతా నా చేత చేయించారు. నాన్న అంతమ యాత్రకు ఊరి జనం అంతా తరలి వచ్చారు.
నా సంపాదనతో నాన్న ఒక్క పూట ఇంత అన్నం తినపించని నేను నాన్న కార్యాన్ని మాత్రం భారీగా చేశాను. నాన్న మాట పొల్లుపోకుండా తమ్ముడు నాన్న స్నేహితుడు పరంధామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకుంటున్నాడు.
దినవారాలు పూర్తయి ఇక బయలుదేరాల్సిన నాకు ఈ ఇంటి పరిస్థితి, నాన్న చావు అంతర్మథనానికి లోను చేశాయి.
ఏడాదిన్నర క్రితం నాన్న నా దగ్గరకి వచ్చాడు. భర్తని కోల్పోయి పుట్టింటికి చేరిన కూతురు, ఆస్తి పోయి, ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాకపోయినా కుటుంబ భారం మోస్తున్న కొడుకు పడుతున్న కష్టం చూసిన నాన్న మనసు చంపుకుని నా దగ్గరకి సాయం కోసం వచ్చాడు.
ఇంటికి పెద్దవాడిగా ఆదుకోవాలని కోరాడు.
అయితే ధనమదంతో ఉన్న నాకు నాన్న మాటలు రుచించలేదు.
‘‘తమ్ముడిని చదువుకోవద్దని నేను చెప్పానా? వాడిని బాగుపడవద్దని అన్నానా?’’ అంటూ అరిచాను.
‘‘అది కాదురా కన్నా ’’ అంటూ నాన్న సర్ది చెప్పబోయాడు.
నేను నాన్న మాటలు వినలేదు. పైగా నాన్నని చీదరించుకున్నాను.
అది జరిగి ఏడాదిన్నర అయిపోయింది.
తర్వాత నాన్న ఆ బాధతోనే కుంగిపోయాడు.
మంచం కూడా పట్టాడు. ఆ విషయం తెలిసినా నేను నాన్నని చూడడానికి కూడా వెళ్లలేదు.
ఈ పరిస్థితులన్నీ నాన్న ధైర్యాన్ని కుంగదీశాయి. ఆయన అనారోగ్యం పాలయ్యాడు.
అయినా బాధ్యతల నుండి పారిపోయే నేను నాన్న దగ్గరకి వెళ్లలేదు.
చివరికి నాన్న ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించాడు.
ముందు హాల్లో నా కొడుకుని గుండెలపై వేసుకుని వాడు ఎగిరి గుండెలపై కాలితో తంతూ ఉంటే పుత్రాలింగన స్పర్శతో పరవశిస్తున్న నాకు ఎదురుగా ఫొటోలో ఉన్న నాన్న ‘కన్నా నిన్ను కూడా నా గుండెలపై వేసుకుని ఎన్నో ఆశలతో పెంచానురా. నిన్ను వాడు అదే గుండెలపై కాలితో నీలానే తంతే...’ అని అడుగుతున్నట్లు అనిపించింది. నా కాలి కింద భూమి కదిలినట్లు అనిపించింది. నా మెదడులో పెద్ద విస్ఫోటం. నా కన్నులు రక్తశ్రువులు చిందిస్తున్నాయి. నా మనసు మమతల గది తెరవబడింది. నా పాపానికి, ద్రోహానికి నిష్కృతి ఉందా? నాన్నా నన్ను క్షమించగలవా? కన్నా అని ఒక్కసారి పిలవరా ఎలుగెత్తి అరవాలని అనిపిస్తోంది. ‘ ఈ జీవితం క్షణభంగురంరా కన్నా. నీవు మా ఆశల మమతల పందిరివి. మనిషి పోయాక గానీ విలువ తెలియదురా అని వేదాంతాన్ని చెబుతున్నట్లు నాన్న ఫొటో కనిపిస్తోంది. ఈ మమతల పందిరిని ఎన్నటికీ వీడను నాన్నా. వీడితే నాకు నిష్కృతి లేదు అనుకుంటూ అమ్మ, చెల్లి, తమ్ముడిని దగ్గరకు తీసుకున్నాయి. వీరు నావారు. నీవు నాకు జ్ఞానోదయం కలిగించావు నాన్నా. ఇక ఈ మమతల పందిరిని ఎవరూ వేరు చేయలేరు నాన్నా అని మనసులోనే నాన్నకు మాట ఇచ్చాను.
అదే చిరునవ్వు, అవే చల్లని చూపులతో నాన్న మా వైపు చూస్తున్నట్లుగా అనిపించింది.

- మండా శ్రీధర్,
శ్రీ రాజరాజేశ్వరి ఆలయం దగ్గర,
గోవిందనగర్‌కాలనీ కాలనీ ఎక్స్‌టెన్షన్,
శ్రీకాకుళం-530021.
సెల్ : 9493309030.

చిన్నకథ

తాడిని తనే్నవాడు...

వెంకట్రావు మెడికల్ షాపుకి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో ఒకడు బైక్ మీద నుండి దిగి వెంకట్రావును ‘‘జేబులో డబ్బులు తియ్’’ అంటూ గద్దించాడు.
‘‘నా దగ్గర డబ్బులు లేవు’’ అన్నాడు వెంకట్రావు.
‘‘ ఇస్తావా చెయ్యి విరిచేయమంటావా?’’ అంటూ వాడు వెంకట్రావు చెయ్యి మెలేశాడు.
వెంకట్రావు బాధతో ‘‘అమ్మా’’ అని గట్టిగా అరిచాడు.
కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి.
అప్రయత్నంగానే కూతురికి జ్వరం వస్తే మందులు కొనడానికి తెచ్చిన డబ్బులను వాడికిచ్చేశాడు.
డబ్బులు అందగానే ఆ రౌడీ బౌక్ మీద తుర్రుమన్నాడు.
వెంకట్రావు బాధతోను, నొప్పితోను మెల్లగా కాళ్లీడ్చుకుంటూ జంక్షన్ వైపు నడిచాడు.
అతను వెళ్లే సరికి జంక్షన్‌లో తనను దోచుకున్న రౌడీకి, పోలీసుకీ వాగ్వివాదం జరగడం గమనించాడు.
రెడ్‌సిగ్నల్ ఉండగా రౌడీ తన బైక్‌తో జీబ్రాలైన్లను దాటి ముందుకెళ్లిపోయాడట.
దాంతో కోపంగా ఊగిపోతూ కానిస్టేబుల్ రౌడీని నిలదీశాడు.
‘‘ఏదీ నీ సీబుక్, లైసెన్స్, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్ట్ఫికెట్’’ అంటూ గదమాయించాడు.
దానికి రౌడీ ‘‘సీ బుక్ ఒక్కటే ఉందండి. మిగిలినవి ఇంట్లో ఉన్నాయి. మీరు టైమిస్తే ఇంటికెళ్లి తెచ్చి చూపిస్తాను’’ అంటూ చెప్పాడు.
‘‘ ఇంటికెళ్లి తెచ్చి చూపిస్తావా? అవన్నీ కుదరవు. తియ్ పదిహేను వందలు’’ అంటూ కళ్లెర్రజేశాడు పోలీసు.
‘‘అంత లేవు సార్. ఎనిమిది వందలే ఉన్నాయి’’ అంటూ కాస్త రెక్లెస్‌గా చెప్పాడు రౌడీ.
దాంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసు రౌడీ ఫిల్టు పట్టుకుని, అతని జేబులో చెయ్యి పెట్టి డబ్బులు బయటికి తీసి దొరికిన ఎనిమిది వందలకే రశీదు రాసిచ్చాడు.
ఇదంతా వెంకట్రావు చూడడం గమనించాడు రౌడీ.
తాడిని తనే్న వాడుంటే వాడి తల దనే్న వాడుంటాడు అని పెద్దలు ఊరకే అనలేదు అనుకున్నాడు వెంకట్రావు.
వెంకట్రావు ఇదంతా చూసినట్లు తెలుసుకున్న రౌడీ చేసేదిలేక సిగ్గుతో తల వంచుకుని పోలీసు ఇచ్చిన రశీదు తీసుకుని అక్కడి నుండి తుర్రుమన్నాడు.

- ఎవిఆర్ మూర్తి,
విశాలాక్షినగర్, విశాఖపట్నం-530044.
సెల్ : 96524 88342.

పోటీ సమాచారం

బలివాడ కాంతారావు
రచనలపై సమీక్ష, వ్యాసరచన పోటీ
రచయిత బలివాడ కాంతారావు సాహిత్యమంతా మానవతావాదాన్ని, వాస్తవ జగత్తును ప్రతిబింబిస్తుంది. తన తరం కోసం రచయత రాస్తే నేను నా కలాన్ని విరిచి పారేస్తాను అన్న దృఢమైన ఆకాంక్ష గల సాహితీ స్ఫూర్తిదాత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బలివాడ కాంతారావు.
ఆయన 90వ జయంతి సభ 3 జూలై 2017న జరగనున్న సందర్భంగా విశాఖపట్నంలో భారతనిధి ఫౌండేషన్ ఛైర్మన్ డి. ఎస్.వి. గోపీకృష్ణ, విశాఖ రచయితల సంఘ, విశాఖ సంస్కృతి మాసపత్రిక సంయుక్తంగా బలివాడ కాంతారావు రచించిన కథలు, నవలలు, నాటకాల సాహిత్యంపై విడివిడిగా సమీక్ష, వ్యాసరచన పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి అడపా రామకృష్ణ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
సమీక్ష, వ్యాసరచన పోటీలు విడివిడిగా ఎంపికైన మూడింటికి రూ. 15 వేలు చొప్పున నగదు బహుమతి ఉంటుంది. రచనలో ఏదో ఒక ప్రక్రియనే ఎంచుకోవాలి. 8 పేజీలు మించకుండా తెలుగులో డిటిపి చేసి పంపాలి. రచయిత పేరు, చిరునామా విడిగా రాసి జతపరచాలి. ఫలితాలు తుది నిర్ణయం న్యాయ నిర్ణేతలదే. పోటీలో విజేతలు స్వయంగా సభలో బహుమతి స్వీకరించాలి. రచనలను అడపా రామకృష్ణ, విశాఖ రచయితల సంఘ, డోర్ నెంబర్ 43-21-21, వరుణ్ షోరూం ఎదురుగా, దొండపర్తి జంక్షన్, విశాఖపట్నం-530016 అనే చిరునామాకు పంపాలి. రచనలు 10 మే 2017 నాటికి చిరునామాలో అందాలి.

పుస్తక సమీక్ష

గురజాడపై ‘చిన్న’ ప్రయత్నం

‘విద్యార్థుల్లోని సృజన వెలికితీసే ప్రయత్నాలు వర్తమాన విద్యా విధానంలో దాదాపుగా మృగ్యమైపోతున్నాయి. ఒకటి, అర ప్రయత్నాలు జరిపేవారిని అభినందించవలిసిందే’ అనే ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాటలు.. ర్యాంకులు, సీట్ల పరుగు పందెంలో పరుగుగెడుతున్న విద్యార్థిలోకానికి, విద్యాసంస్థలకు చురకలు! వర్తమాన విద్యావిధానం వ్యాపారమైపోయిందని బాధపడుతూ కూర్చోకుండా విద్యార్థుల్లోని ప్రతిభను, సాహితీ వాసనలను కనిపెట్టి, వారి చేత కలం పట్టించే ప్రయత్నమే ‘విద్యార్థి దృక్పథంలో గురజాడ’.
గురజాడ వారు రాసింది రెండు వందల ఏభై పేజీలైతే ఆయన మీద దాదాపు ఇరవై అయిదు వేల పేజీల పరిశోధనాంశ కథనాలు వెలువడ్డాయి. మరో లక్ష కథనాలు వచ్చే అవకాశం కూడా ఉందని ఈ పుస్తకం ‘ఆశ’ను రేపుతుంది. డిగ్రీ విద్యార్థులకు ‘గురజాడ’ ఎవరు అని ప్రశ్నించడం కన్నా.. అసలు జవాబు ఆశించకపోవడమే మంచిదనే అభిప్రాయం ఉంది. లక్షాలాది మంది విద్యార్థులు డిగ్రీ చదువుతుంటే వారిలో ఎంతమందికి గురజాడ గురించి తెలుసు అనేది ఓ భేతాళ ప్రశ్న. ఆ ప్రశ్నకు సూటిగానే సమాధానం చెప్పారు గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన 19 మంది విద్యార్థులు. వీరంతా గురజాడపైన చక్కని వ్యాసాలు రాశారు. తన మిత్రులకు తెలియజేసేందుకు, వ్యవహారికా భాషా అందం తెలిపేందుకు రెండు కథలను కూడా వేసుకున్నారు. అందుకు మన్ననలు, కృతజ్ఞతలు కూడా కోరారు(‘మా మనవి’లో). విద్యార్థులను ముందుండి నడిపించిన కళాశాల తెలుగు విభాగంను-పుస్తకంగా విద్యార్థుల వ్యాసాలను తీసుకువచ్చిన వారి శ్రమను నిజంగా అభినందించాల్సిందే!
గురజాడ వారిపైన ప్రాథమికాంశాలు తెలుగుకోవాలనే వారికి ఓ చక్కని కరదీపికగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. విద్యార్థులంతా శ్రమ కోర్చి రాశారనే విషయం అవగతమవుతుంది. వాక్యనిర్మాణంలో తెలుగు విభాగం మార్గదర్శనం కనబడుతుంది. 19 వ్యాసాలున్న పుస్తకమిది. కొన్ని వాక్యాలు, పేరాలు పునరావృతమయ్యాయి. సంపాదకవర్గం ఈ విషయాన్ని ఇంకొంత శ్రద్ధతో ఎడిట్ చేయాల్సింది. అక్కడక్కడా ముద్రారాక్షసులున్నాయి. గురజాడ వారి జీవిత విశేషాలను క్రమంలో తీసుకురావడటం బాగుంది. ఆత్మకథలోని ఓ సంఘటన, మీ పేరేమిటి? దిద్దుబాటు వంటి కథలను సేకరించిన విద్యార్థులకు ఒకసారి వాటిని చదివే అవకాశం వచ్చిందనుకోవాలి. ‘గురజాడ జీవితం-సాహిత్యం’ అనే విస్తృత పరిధి గల అంశాన్ని రేఖామంత్రంగా విద్యార్థులు స్పృశియించారని పుస్తకం చదివితే అర్థమవుతుంది. ‘మాతృభాష మృతభాష’గా మారుతున్నదనే ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులు తెలుగులో చక్కగా వ్యాసాలు రాయటం మలయమారుతంలా అనిపించిందనే కళాశాల ప్రిన్సిపాల్ వ్యాఖ్యానం అక్షరసత్యం. డిగ్రీస్థాయిలో తెలుగు భాషపైన జరిగిన(జరుగుతున్న) కృషి ఎన్నదగినది. కనీసం సగం కళాశాల లైనా ఈ దిశగా కృషి చేస్తే మాతృభాష గురించి చింతన తగ్గుతుంది.
విద్యార్థుల చిత్రాలును చివరి అట్టన ముద్రించి- వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం అభినందనీయం. ప్రశ్నించడం నేర్పిన గురజాడ, మహిళలను మార్గదర్శిగా తీర్చిదిద్దిన గురజాడ వంటి వ్యాస శీర్షికల ద్వారానే ‘లోపలి అంశం’ను చెప్పే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు పుస్తకావిష్కరణ జరపడం గురజాడ ఆశయాలకు, ఆయన రచనలు స్ఫూర్తి మంత్రమనే ఆలోచనకు వేదికగా భావించడం గొప్ప ప్రయత్నం. వ్యాసాలు రాసిన 19మంది విద్యార్థుల్లో 18 మంది విద్యార్థినులే కావటం విశేషం.
ఒకటి, అరా లోపాలున్నా- విద్యార్థులకు భాషపట్ల అభిమానంతో చేసిన కృషిలో వాటిని పరగణలోకి తీసుకోకపోవడమే మంచిది. కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం విద్యార్థుల నుంచి మరిన్ని మంచి రచనలకు ప్రోత్సాహం ఇవ్వాల్సివుంది.

- గున్న కృష్ణమూర్తి,
సెల్ : 9493802010.

మనోగీతికలు

రాని ఉగాది
అమ్మా మన ఇంటికి
ఉగాది పండగ రాదా?
చెట్లు లేవు కోకిలలు రావు
మట్టి ఎక్కడా లేదు
అన్నీ టైల్లే కదా
మొక్కలు లేవు పూలు పూయవు
మా స్కూలే కొంచెం నయం
చెట్లుంటాయి కోకిలలు పాడతాయి
గోలాల్లో పూలమొక్కలు
ఇంచక్కా పూస్తాయి
మెతుకుల కోసం కాకులు వస్తాయి
లిఫ్టుకు భయపడి మన ఇంటికి ఎవరూ రారు మన ఇండికి ఉగాది పండగ రాదు కదా!

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.

యుగాలకే
పునాది ఉగాది
తెలుగు వారి సంవత్సరాది ఉగాది
చైత్రశుద్ధ పాఢ్యమి నవ యుగాది
పంచాంగ శ్రవణాల వేదిక ఉగాది
కోకిల కూతల శ్రవణభరిత ఉగాది
చెట్లు చేమలు చిగురించ
వేపా మామిడి పుష్పించగా
పచ్చదనంతో వనాల నిండి
నవవసంతం తరలిరాగా
ఆరు రుచులతో అలరించ పచ్చడి
ఐకమత్యంతో అంతా ఉండాలని
చాటి చెప్పే ఉగాది
ఇంటికి వచ్చిన బంధుజనాలతో
సందడి మోసుకొచ్చింది ఉగాది

- దివాకర్ల సాయి అభిషేక్,
చినవాల్తేరు, విశాఖపట్నం-530017.
సెల్ : 9505596928.

స్వాగతం హేమలంబ
స్వాగతం స్వాగతం
హేవలంబికి స్వాగతం
దుర్ముఖుల దుర్మార్గుల
దాష్టీకములంతరించ
అవినీతిని లంచాలను
ఆవలకు తరిమేయ
కల్తీలకు, కబ్జాలకు
చరమగీతి ఆలపించ
స్వాగతం స్వాగతం
హేమలంబ నీకు స్వాగతం
అబలల కన్నీటి వెతల
నిర్భతతో అంతరించ
పేదా సాదలకు
ప్రభుత్వాలు అండాదండా
కట్నాలు, కానుకలకు
కాలమిక చెల్లిపోగా
వరకట్నం నిరుద్యోగం
వడివడిగా వదిలిపోగా
ఉగ్రవాద వలస బాధ
మరణాలిక తరలిపోగా
గృహహింసకు ప్రజాహింసకు
చట్టాలిక చెల్లిపోగా
స్వాగతం స్వాగతం
హేమలంబ నీకు స్వాగతం
కర్షకులకు కార్మికులకు
హర్షాతిరేకములు రేగ
బాలలు, వృద్ధులకు
బహుమేళ్లు జరగగా
విధవలకు, వధువులకు
వసంతోదయం రాగా
స్వాగతం స్వాగతం
హేమలంబ నీకు స్వాగతం

- పురిజాల సుధాకర్,
సెల్ : 7702956929.

వసంతం వచ్చింది
ఇది చైత్రమాసం, వసంత రుతువు
చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం
వేపపూతలతో వాసనలు వెదజల్లేది
తెలుగు వారి ప్రీతిపాత్ర ఉగాది
తమిళనాడులో ఏప్రిల్
14న సౌభాగ్యాల దినం
కేరళవాసుల వొల్లవ వర్షమ్
వీరిది పంటల పండగ
వరుణదేవుడిని ఆరాధిస్తారు
ఒడిశాలో లక్ష్మీ
పండుగాగా భావిస్తారు
రాజస్థాన్‌లో శివపూజలు చేస్తారు
బెంగాల్‌లో కృష్ణుని జ్ఞాపకం
మహారాష్టల్రో
గుడిపదవాగా పిలుస్తారు
అస్సాంలో బిహు అంటారు
బీహార్‌లో వసంతోత్సవం
ఇలా ఎన్ని అవతారాలున్నా
భగవంతుడు ఒక్కడే
వివిధ రకాల పేర్లతో పిలిచినా
ఉగాది ఒక్కటే
జీవరాశి సృష్టి ప్రారంభం ఈనాడే
శ్రీరాముడు రాజ్యలక్ష్మిని చేపట్టింది
ధర్మరాజు సింహాసనాన్ని
అధిష్ఠించినదీ ఈనాడే
చతుర్ముఖుడిని ఈ దినం పూజించి
నవగ్రహాలు, ఇష్టదేవతలు,
ఉమామహేశ్వరులు
వాణి, హిరణ్యగర్భులు,
అరుంధతీ వశిష్టులని
ఉగాదినాడు అర్చించాలి
షడ్రుచుల బెల్లం, చింతపండు
వేపపువ్వు, మామిడి, కొబ్బరి, ఉప్పు
నీటిని సేవించి శరీర రుగ్మతలు నివారించాలి
ఈనాడు నూతన వస్త్రాలు ధరించి
పంచాంగ శ్రవణం, దైవదర్శనం చేసుకోవాలి
మామిడి, అశోక, నేరేడు,
మోదుగ, వేప చిగుళ్లు
సుగంధ చందనం, పుష్పాక్షతలు
నూతన వస్త్రం అలంకరించి
గంగా జలం కల బోండాం గురుతుల్యులకి
దానమిచ్చిన విశేష ఫలం

- జి. ఎస్.కె. సాయిబాబా,
అనకాపల్లి.
సెల్ : 9248173116.

నవ వసంతం
ప్రతి మదిని పలకరించి
ప్రతి హృదిని పులకరించి
వచ్చిందొక వసంతం
పంచెను తన ఆనందం
పెంచెను మన అనుబంధం
లేత చిగుర్లతో
కోకిలమ్మ కూతలతో
వస్తున్నది ఒక వసంతం
ఇక కావాలది మన సొంతం
ప్రతి అణువు వసంత శోభితమై
ప్రకృతి సొగసుకు
స్వాగతం పలికి
అలంకరణతో ఆరంభించి
షడ్రుచుల సోయగమై
పచ్చడి రుచి చూపించి
పంచాంగ శ్రవణం గూర్చి
ముచ్చటపడిన జనం
తిథులు తెలియని
మన అతిథులకు
తెలుగు తియ్యదనం నేనంటూ
కవుల హృదయం కాంతులీనుచూ
ప్రకృతి మోము పులకరించుచూ
వచ్చింది మరొక వయ్యారి ఉగాది

- కుబిరెడ్డి చెల్లారావు,
చోడవరం, విశాఖ జిల్లా.
సెల్ : 9885090752.

కొత్త ఆశల కాలం
కాలం కింద కలలు కరిగినా
కినుక వహించకు ఆశల దారి కాలమేనన్నా
కొత్త ఆశల కాలం ముందుంది లే అన్నా
నిరాశలు కష్టాలు
నీ ఊహలే కన్నా
అయినా ఆగదులే కాలం
మారదులే ఏ కాలం
ఉగాది ఓ ఆశల స్వప్నం
స్వప్నం ఫలిసిద్ధికి
రూపం నీ కార్యం
అదే మరో వత్సరం
నీకిచ్చే సందేశం
గడచిన వత్సరం ఏమివ్వకున్నా
వస్తున్న కాలం
నీకెన్నో ఇచ్చునులే కన్నా
ఇదే దేవుని ఆశన్న
మనిషికదే ఇం‘్ధన’మన్న
ప్రకృతిని వికృతి చేయొద్దు
దేవుని కోపానికి
సమిథవు కావద్దు
ఇది
హేమలంబ కావాలి
కొత్త వత్సరం కొంగొత్త ఆశలివ్వాలి
మనమంతా సుఖశాంతుల
నిలవాలి
ఉగాది బంగారు భవితకు రూపం
అదే కావాలి మన శాంతిధామం

- భమిటిపాటి గౌరీశంకర్,
నరసన్నపేట-532421,
శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 9492858395.
email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- మండా శ్రీధర్,