విశాఖ

మేం బడుగుల పక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన వర్గాల పక్షపాతని, వారి ఆదరణతోనే టిడిపి మనుగడ ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 191వ జయంతిని పురస్కరించుకుని ఎయు కాన్వొకేషన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడున్నర దశాబ్ధాల కాలంలో వెనుక బడిన తరగతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తమదేనన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు చేసిన అన్యాయాన్ని వడ్డీతో సహా తీరుస్తానని ఈ సందర్భంగా భరోసానిచ్చారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ద్వారా వారి అభ్యున్నతి సాధ్యమని గుర్తించామని, అందుకే చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి టిడిపి విశేష ప్రాధాన్యత కల్పించిందన్నారు. అట్టడుగు వర్గాల్లో ప్రజానీకం అభివృద్ధి సాధించాలంటే విద్య,విజ్ఞానం అవసరమని, మహాత్మా జ్యోతిబా పూలే దంపతులు అందుకు తమ జీవితాలను అంకితం చేశారన్నారు. ముఖ్యంగా మహిళా విద్యకు ప్రాధాన్యతను గుర్తించారన్నారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన పూలే జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా చేపడుతున్నామన్నారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బిసిలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని, వారికి చేసింది శూన్యమని ఆరోపించారు. బిసిలో 139 కులాలు ఉన్నాయని, జిల్లాలు, ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి, వారి అభ్యున్నతి ఇంకా ఎటువంటి పథకాలు రూపొందించాలన్న అంశంపై చర్చిస్తామని, ఆచరణీయమైన సూచనలతో నూతన అంశాలను అమలు చేస్తామన్నారు. ఆర్ అండ్ బి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ బిసిలు అత్యధికంగా ఉండే విశాఖలో బిసి స్టడీ సర్కిల్ అద్దె భవనంలో నడుస్తోంది. బిసి భవన్ కూడా అద్దె భవనంలోనే ఉందన్నారు. ఇటీవల బిసి సంఘాలు చేసిన విజ్ఞప్తికి స్పందించి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఎంవిపి కాలనీలో 2,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారని, బిసి భవన్, స్టడీ సర్కిల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించిందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేసి బిసిలకు భరోసానివ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి పనిచేయడంతో పాటు వారికి ధైర్యం, నమ్మకం కలిగించే నాయకత్వం అవసరమని అన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు బిసి సంక్షేమ పథకాల కోసం మంజూరైన రూ.109 కోట్ల సబ్సిడీ రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే సిఎం దత్తత గ్రామం పెదలబుడు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్‌టిఆర్ గృహనిర్మాణం కింద రూ.6.75 కోట్ల చెక్కును అందజేశారు. అంతకు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన శిలాఫలకాలను సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ఎంపి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, పప్పల చలపతిరావు, పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, పి విష్ణుకుమార్ రాజు, జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇతర అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.