విశాఖ

సొంతింటి కష్టాలు మళ్లీ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 19: మొదటి దానికి కాలేదు కడదానికి కల్యాణం అన్నట్టుంది మహావిశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) తీరు. ఇళ్ల కోసం మూడు నెలల కిందట స్వీకరించిన దరఖాస్తులను పక్కనపెట్టి అర్హులెవరైనా మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకోండంటూ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని జివిఎంసి ఈ నెల 30 వరకూ పొడిగించామని, ఇంకా మిగిలిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండంటూ బాకా ఊదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా విశాఖ నగరానికి 20,183 ఇళ్లను కేటాయించారు. దేశంలో ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యం విశాఖ నగరానికి ఇచ్చామని, వచ్చే ఐదేళ్లలో నగరంలోని సొంతిల్లులేని వారందరికీ ఇళ్లను ఇచ్చేస్తామంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అట్టహాసంగా ప్రకటించారు. దీంతో సొంతింటి కలను నిజం చేసుకుందామని నగర పరిధిలోని 72 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో లబ్దిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఎగబడ్డారు. వందలు, వేలు దాటి లక్షలకు చేరుకుంది దరఖాస్తు దారుల సంఖ్య. గతేడాది డిసెంబర్ 31 నాటికి జివిఎంసికి కేంద్ర పథకంలో ఇళ్ల కోసం 1.84 వేల దరఖాస్తులు అందాయి. వీటిలో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర కొర్రీలతో ప్రాధమిక దశలోనే 54 వేల దరఖాస్తులను అధికారులు తొలగించేశారు. మిగిలిన 1.34 లక్షల దరఖాస్తులను పరిశీలించేందుకు జివిఎంసి వార్డుల వారీగా బృందాలను నియమించింది. క్షేత్ర పర్యటనలో భాగంగా జివిఎంసి బృందాల పరిశీలనలో మరో 50 వేల దరఖాస్తులు చిరునామాలు సక్రమంగా లేవని పక్కనపెట్టేశారు. అయితే రేషన్‌కార్డులో చిరునామా ఆధారంగా క్షేత్ర పర్యటన జరిపిన సర్వే బృందాలు దరఖాస్తుదారు లేకపోవడంతో జాబితా నుంచి తొలగించాయి. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తు దారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడంతో చిరునామా నిబంధనను తొలగించారు. దీంతో లక్షకు పైగా దరఖాస్తులు ఇళ్లను పొందేందుకు అర్హులుగా గుర్తించారు. అయితే విశాఖ నగరానికి కేంద్రం కేటాయించింది కేవలం 20వేల పైచిలుకు ఇళ్లను మాత్రమే. ఇక్కడ కూడా అధికార పార్టీ నాయకుల జోక్యంతో వీటిని మురికివాడలకు మాత్రమే పరిమితం చేశారు. తాజాగా కేంద్రం ప్రకటించిన పథకంలో ఇళ్లకోసం మరోసారి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటికే గడువు ముగిసిపోగా, ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోసారి అవకాశం దక్కడంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు మరికొంతమంది మీ సేవ, సౌకర్యం కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. గతంలో తొలగించిన వారు సైతం ఇప్పుడు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తేలడంతో మరోసారి ఇళ్ల దరఖాస్తులు రికార్డు స్థాయిలో రానున్నాయని, జివిఎంసి వర్గాలు భావిస్తున్నాయి.