విశాఖ

రాష్ట్ర కమిటీలో పెరిగిన ప్రాతినిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: తెలుగుదేశం పార్టీ జాతీయ, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీల ప్రకటన జిల్లా పార్టీ నేతలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. జాతీయ కమిటీలో జిల్లాకు ప్రాతినిధ్యం లేనప్పటికీ రాష్ట్ర కమిటీలో మాత్రం కొత్తగా ముగ్గురికి స్థానం దక్కింది. ఇదే సందర్భంలో పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి సీనియర్ నాయకుణ్ణి తప్పించడం చర్చనీయాంశమైంది. పార్టీలో అత్యున్నత నిర్ణయ కమిటీ పొలిట్‌బ్యూరోలో సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనసాగనున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరు సీనియర్ నేతలు పార్టీని వీడగా, వారి స్థానే ఆప్రాంతానికే చెందిన నాయకులను నియమించిన అధినేత చంద్రబాబు, పొలిట్‌బ్యూరోలో ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో పొలిట్‌బ్యూరోలో అయ్యన్న స్థానం పదిలమైంది. ఇక రాష్ట్ర కమిటీలో ముగ్గురికి కీలక పదవులు దక్కాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చోటు కల్పించగా, ఇప్పటి వరకూ జిల్లా నుంచి ఈ పదవిలో కొనసాగుతున్న సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని తప్పించారు. అయితే బండారు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించిన కారణంగానే ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్టు సమాచారం. దీనికి తోడు కాపు సామాజిక వర్గం నుంచి పార్టీలో ఒకరికి కీలక పదవి కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే అవంతికి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అవకాశం కల్పించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మహిళా కోటాలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్ష వైపాకాకు చెందిన ఎమ్మెల్యే రోజా విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టిన నేపథ్యంలో అనిత అధికార ప్రతినిధిగా రాణిస్తారని అధినేత భావించి ఉండవచ్చు. ఇక పార్టీ కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శుల పదవుల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. గత కార్యవర్గం మాదిరి మైనార్టీ వర్గాల నుంచి ఎండి నజీర్ తిరిగి రాష్టప్రార్టీ కార్యదర్శిగా కొనసాగనున్నారు. గతంలో పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన పీలా శ్రీనివాసరావు, పాత కార్యవర్గంలో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించగా, తిరిగి అదే పదవిలో కొనసాగించాలని నిర్ణయించారు. మరో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కాకి గోవిందరెడ్డి కూడా కొనసాగనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ నియామకంపై గుంభనంగా ఉందనే చెప్పాలి.

గీతం వర్శిటీని సందర్శించిన బార్క్ శాస్తవ్రేత్త

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: బాబా అణుశక్తి పరిశోధన సంస్థ (బార్క్) శాస్తవ్రేత్త, ఎనలిటికల్ కెమిస్ట్రీ విభాగం మాజీ అధిపతి, భారత శాస్త్ర సాంకేతిక విభాగం సలహా సంఘ సభ్యుడు డాక్టర్ ఎవిఆర్ రెడ్డి గీతం విశ్వవిద్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు బోధనతో పాటు పరిశోధనలపై కూడా సమాన దృష్టి నిలపాలని సూచించారు. నాణ్యతతో కూడిన పరిశోధన పత్రాలను అంతర్జాతీయ జర్నల్స్‌కు పంపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పరిశోధన సంస్థల ద్వారా యువ పరిశోధకులను ప్రోత్సహిస్తోందన్నారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ద్వారా జరుగుతున్న పరిశోధనలను వివరాలను తెలుసుకుని అభినందించారు. గీం వర్శిటీలోని పరిశోధన, ప్రయోగశాలలను సందర్శించారు. గీతం విశ్వవిద్యాలయం యుజిసి వ్యవహారాల డైరెక్టర్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ 150కి పైగా పరిశోధన ప్రాజెక్టులు నిర్వహణలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం గీతం విశ్వవిద్యాలయాన్ని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా బయోటెక్నాలజీ అధ్యయనాలకు గుర్తించిందన్నారు. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాల్లో గీతం వర్శిటీ పరిశోధకులు ముందంజలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎవిఆర్ రెడ్డిని గీతం విశ్వవిద్యాలయం తరపున ఘనంగా సత్కరించారు.

నాలుగు మాసాల్లో 2.4లక్షల మరుగుదొడ్లు
* కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
విశాఖపట్నం, సెప్టెంబర్ 23: రానున్న నాలుగు మాసాల్లో రెండు లక్షల నలభై వేల వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను పటిష్టంగా రూపొందించి అమలుపర్చాలని అధికారులకు ఆయన సూచించారు. శనివారం తన ఛాంబర్‌లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, జిల్లా ప్రజాపరిషత్, డ్వామా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మునిసిపల్, పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతంలోని కొన్ని గామ పంచాయితీలను ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దడమైందన్నారు. మిగిలిన గ్రామ పంచాయితీలు అన్నింటినీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే ఇంకా రెండు లక్షల నలభే వేల వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉందన్నారు. రోజుకి రెండు మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేస్తే కానీ రానున్న నాలుగు మాసాల్లో పూర్తవుతాయన్నారు. అయితే ఇందుకు ప్రతి మాసం రూ.90 కోట్ల వంతున మొత్తం నాలుగు మాసాలకు రొ.360 కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు. ఇంత మొత్తంలో ఒకేసారి ప్రభుత్వం నుండి నిధులు వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, జిల్లాప్రజాపరిషత్, డ్వామా తదితర శాఖలవద్దనున్న నిధఉలను రీయంబర్స్‌మెంట్ ప్రాతిపదికన వీటి నిర్మాణాలకు మళ్ళించాలని అధికారులకు ఆయన సూచించారు. వీటి నిర్మాణాలను సకాలంలో పూర్తిచేసేందుకు మండల, గ్రామ స్థాయిలోని అన్ని శాఖల అధికారులను ఇందులో భాగస్వాములను చేసి శాఖలు, అధికారుల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తూ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్మాణాలకు అవసరమైన ఇటుకలు, సిమెంట్, సిమెంట్ రంగ్‌లు, తాపీమెస్ర్తిలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే నిర్మించిన మరుగుదొడ్లకు జియో ట్యాగింగ్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసి రానున్న రెండు,మూడు రోజుల్లో పూర్తిచేయించాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు సత్యసాయి శ్రీనివాస్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యంశాఖ ఎస్‌ఇ మెహర్‌ప్రసాద్, డ్వామా పిడి కళ్యాణ చక్రవర్తి, జిల్లాప్రజాపరిషత్ సిఇఓ జయప్రకాష్ నారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.