విశాఖపట్నం

విశాఖ ప్రజానీకం అంటే అభిమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 17: ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తట్టుకుని నిలబడే ధైర్యవంతులు విశాఖ ప్రజానీకం అంటే తనకు ఎంతో అభిమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్కే బీచ్‌లో ప్రభుత్వం తరపున తొలిసారిగా నిర్వహించిన ఆనంద దీపావళి కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుదూద్ తుపాను ప్రళయం సృష్టించి, తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టినా తట్టుకుని నిలబడ్డారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి విశాఖ నగర వీధుల్లో ప్రయాణిస్తుంటే విక్టరీ సింబల్ చూపిస్తూ సహాయ చర్యల్లో విజయం సాధించాలంటూ ధైర్యం చెప్పారన్నారు. అటువంటి వారి కోసం ఎనిమిది రోజుల పాటు నగరంలోనే ఉండి, నగరంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ నిరంతరం శ్రమించానని గుర్తు చేశారు. హుదూద్ తుపాను తరువాత నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుకున్నామని, విద్యుత్ సరఫరా నిలిచిపోతే భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసుకుంటున్నామని, అధిక విద్యుత్ వినియోగించే దీపాల స్థానే ఎల్‌ఇడి లైట్లు వేసుకున్నామన్నారు. ప్రస్తుతం దేశంలోనే విశాఖ తరహా విద్యుత్ దీపాల అమరిక ఆదర్శవంతమైందన్నారు. విశాఖను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా తాను అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం ఆనంద దీపావళిలో భాగంగా ఆకాశ దీపాలను గాలిలోకి వదిలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణ మూర్తి, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లిపోగా, మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం దేశ చరిత్రలోనే మొదటి సారిగా చూస్తున్నానన్నారు. అనంతరం సాగరతీరంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ఆకట్టుకున్నాయి.
పర్యాటకానికి పెద్ద పీట
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బీచ్ రోడ్డులో టియు-142 యుద్ధ విమానం మ్యూజియం పనులకు మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుందన్నారు. సువిశాల సాగరతీరం కలిగిన ఏకైన నగరం విశాఖ మాత్రమేనని, తీరం పొడవునా పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్‌లు, ఇతర సందర్శన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. సాగరతీరంలో ఒక పక్క కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, మరో పక్క యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుతో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీపావళి కానుకగా యుద్ధ విమాన మ్యూజియంను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే డిసెంబర్ నాటకి మ్యూజియంను సందర్శకులకోసం సిద్ధం చేస్తామన్నారు. విశాఖలో టియు-142 యుద్ధ విమానం మ్యూజియం ఏర్పాటు చేయడం వెనుక తూర్పునౌకాదళ ప్రధానాధికారి బిస్త్ సహకారం మరువలేనిదని అన్నారు. నౌకాదళంలో సేవల అనంతరం విమానాన్ని విశాఖ తీసుకువచ్చి, సందర్శనకు అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేయడం వరకూ ఆయన తీసుకున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన ద్వారానే మ్యూజియం పనులకు శంకుస్థాపన చేయిస్తున్నామన్నారు.
తూర్పునౌకాదళం ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ మాట్లాడుతూ 1988 నుంచి 29 సంవత్సరాల పాటు టియు-142 రక్షణ రంగంలో సేవలందించిందన్నారు. సుమారు 30వేల కిలోమీటర్ల మేర పయనించిన యుద్ధ విమానం ఇప్పుడు మ్యూజియంగా మారి దేశ రక్షణపై సందర్శకులకు అవగాహన కల్పించనుందన్నారు. యుద్ధ విమానం, సబ్‌మెరైన్ ఒకే ప్రాంతంలో ఉండి, మ్యూజియంలుగా అవగాహన కల్పించడం ఎక్కడా లేదన్నారు. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ సబ్‌మెరైన్ మ్యూజియం, యుద్ధ విమాన మ్యూజియం, విక్టరీ ఎట్ సీ, ఎయు కనె్వన్షన్ సెంటర్‌లను టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకర రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఎంతో ముందుచూపు కలిగిన ముఖ్యమంత్రి విశాఖను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుతు శ్రమిస్తున్నారన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టియు-142 అంతర్భాగాన్ని సందర్శించారు. అనంతరం టియు-142ని నెలకొల్పేందుకు సహకరించిన తూర్పునౌకాదళ ప్రధానాధికారి బిస్త్, మ్యూజియం ఏర్పాటు స్థలాన్నిచ్చిన ఎయు విసి నాగేశ్వరరావును చంద్రబాబు నాయుడు ఘనంగా సత్కరించారు.